Gunde Ninda Gudi Gantalu September 30th: ట్రయల్ రూమ్‌లో రవి, శృతి.. కనిపెట్టిన సంజూ.. బాలు ఏం చేశాడంటే!
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగానే కొత్త షోలు వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మనోజ్ ఇంటికి వచ్చి కొత్త కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లడంతో కూపన్లు ఇచ్చాడని చెప్తాడు. దీంతో బాలు వచ్చి నీ ఉద్యోగం పోయిందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఇంట్లో వాళ్లంతా అతడు జాబ్ చేయడం లేదని అడుగుతారు. కానీ, కవర్ చేసుకుని అందరినీ షాపింగ్‌కు తీసుకు వెళ్తానని అంటాడు. ఇక, శృతిని సంజూ షాపింగ్‌కు తీసుకు వెళ్లగా అక్కడకు రవి కూడా వెళ్తాడు. అప్పుడు అతడికి అబద్దం చెప్పి పంపించి శృతితో సీక్రెట్‌గా మాట్లాడతాడు. మనోజ్ తెచ్చిన కూపన్లను వాడుకునేందుకు రవి ఉన్న మాల్‌కే ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్‌కు వస్తారు.

సోమవారం ఎపిసోడ్‌లో... ప్రభావతి ఫ్యామిలీ వాళ్లు షాపింగ్ మాల్‌కు వచ్చే సమయంలోనే శృతి, రవి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో సంజూ.. శృతిని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతడిని చూసిన రవి.. సంజూతో శృతి వేరే ఫ్లోర్‌కు వెళ్లిందని అబద్దం చెప్తాడు. దీంతో అతడు వెళ్లిపోవడంతో రవి, శృతి సరదాగా తిరుగుతుంటారు. అప్పుడు అక్కడకు బాలు వస్తాడు. దీంతో అతడిని కూడా తప్పించుకుని పారిపోతారు. ఇక, ప్రభావతి తక్కువ రేటు చీరలను మీనాను తీసుకోమని అంటుంది. వాళ్లు మాత్రం కాస్ట్లీ చీరల కోసం వేరే ఫ్లోర్‌కు వెళ్లిపోతారు.
మీనాను చూసిన బాలుకు విషయం అర్థం అవుతుంది. దీంతో ఆమెను కూడా ఎక్కువ రేటు ఉన్న చీరలను కొనుక్కోమని అంటాడు. కానీ, ఆమె గొడవలు వద్దని చెప్పినా బాలు వినకుండా ప్రభావతి వాళ్లు ఉన్న ఫ్లోర్‌కు తీసుకు వెళ్తాడు. అప్పుడు రవి, శృతి.. ప్రభావతి వాళ్లను చూసి పారిపోతారు. ఇలా ఎక్కడకు వెళ్లినా ఎవరో ఒకరు ఉండడంతో వేరే వేరేగా షాపింగ్ చేసుకుందాం అనుకుని వెళ్లిపోతారు. అప్పుడు సంజూ వచ్చి శృతిని తీసుకు వెళ్తాడు. అంతలోనే మౌనిక వచ్చి రవితో మాట్లాడుతుంది. అంతేకాదు, అక్కడి నుంచి వాళ్ల అమ్మ దగ్గరకు తీసుకు వెళ్తుంది.
తర్వాత ప్రభావతి వాళ్లు ఖరీదైన పట్టు చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడే మీనాను బాలు తీసుకు వస్తాడు. దీంతో ప్రభావతి 'మీ రేంజ్ చీరల షాపింగ్ అయిపోయిందా' అని అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో బాలు 'నేను ఒకరి మీద ఆధారపడే టైప్ కాదు. నా భార్యకు నా కష్టార్జితంతోనే చీరను కొనుక్కుంటాను. నేనేమీ పెళ్లాం సంపాదన మీద ఆధారపడి బతికేవాడిని కాదు. తీసుకుంటే అందరికీ సమానంగా తీసుకోండి' అంటాడు. అప్పుడు మనోజ్ ఇవి నా సంపాదనతో వచ్చినవి అని అంటాడు. దీంతో బాలు తన భార్యకు సొంత డబ్బుతో తీసుకుంటా అంటాడు.
ప్రభావతి వాళ్ల మాటలతో బాలు 'వాళ్లు ఎంత కాస్ట్‌లీ చీరలు తీసుకుంటే దానికంటే ఎక్కువ రేటు చీరలు చూపించండి' అంటాడు. అప్పుడు ప్రభావతి 'చూపించండి చూపించండి.. అవి కట్టుకుని పూలు కట్టుకుంటుంది' అని అవమానిస్తుంది. దీంతో బాలు 'అవును మరి నీలా ఇల్లు తాకట్టు పెట్టలేదు' అని పంచ్ వేస్తాడు. దీంతో రోహిణి 'ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని అడివి మనుషులు' అంటుంది. అప్పుడు మీనా 'ఎవరు రోహిణి అడవి మనుషులు? నువ్వు కూడా ఆ అడవిలోనే ఉంటున్నావు. మేము మీ ఫ్రీ కూపన్లకు ఆశపడి రాలేదు' అని బదులిస్తుంది.
అనంతరం మీనా 'మా ఆయన తన సంపాదనతోనే కొనిస్తా అంటున్నారు' అంటుంది. దీంతో బాలు 'మీనా ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగే వాళ్లతో మనకెందుకు' అని అంటాడు. అప్పుడు మీనా 'అంత ఖర్చు ఎందుకు? ఉండండి మామయ్య గారితో చెప్తాను' అంటూ సత్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడాయనకు బాలు మొత్తం వివరిస్తాడు. దీంతో సత్యం 'ఒరేయ్ అయితే ఇంక ఆగకురా. ఒకటి కాదు ఎక్కువే చీరలు కొను. కావాలంటే నేనే నీకు డబ్బులు పంపిస్తాను' అంటాడు. అదంతా విన్న ప్రభావతి 'ఎంతైనా ఇద్దరూ డ్రైవర్లు కదా ఆయన వాడికే సపోర్ట్' అని అంటుంది.
ప్రభావతి, బాలు గొడవ పడుతుండగానే శృతి పక్కకు వచ్చి రవిని పిలుస్తుంటుంది. కానీ, అతడు అక్కడకు వెళ్లలేకపోతాడు. అంతలోనే సంజూ వచ్చి 'అదేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకోసం ఎంత వెతుకున్నా' అని అంటాడు. అప్పుడు శృతి 'అమ్మా దొరికిపోయానే. నీకు కనిపించకపోతే ఏం చేస్తావో అని చూద్దాం అనుకున్నా. కానీ, నువ్వు వెంటనే కనిపెట్టేశావు. ఎంతైనా నువ్వు జీనియస్' అని అంటుంది. అప్పుడు తనకు చీరలు కావాలని అనడంతో సంజూ ఆమెకు కొనిస్తానంటాడు. తర్వాత శృతిని రవి తీసుకుని పక్కకు వస్తాడు. అప్పుడే ప్రభావతి వస్తుంది.
ప్రభావతి వస్తుందన్న కంగారులో శృతి పారిపోతుంది. అప్పుడు కామాక్షికి తగులుతుంది. అప్పుడామెకు గతంలో రవి బైక్‌పై శృతి వెళ్తున్న విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే ఈ విషయాన్ని ప్రభావతికి చెప్తుంది. అంతేకాదు, 'ఇప్పుడు అమ్మాయి పారిపోయింది. నా అనుమానం ప్రకారం మీ రవిగాడు ఆమెతో పాటు షాపింగ్‌కు వచ్చి ఉంటాడు' అంటుంది. దీంతో ప్రభావతి, కామాక్షి వాళ్లను వెతికేందుకు తిరుగుతారు. అప్పుడు శృతి.. ప్రభావతికి తగులుతుంది. తర్వాత రవి ఉన్న ట్రయల్ రూమ్‌లో దూరిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











