Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణిపై ప్రభావతి అనుమానం.. శృతి సంచలన నిర్ణయం.. మద్యం మత్తులో బాలు రచ్చ..
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 12వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం (జనవరి 12) ఎపిసోడ్ ఆద్యంతం అపార్థాలు, భావోద్వేగాలు, షాకింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే సుమతి తన అక్క మీనాకు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిన శుభవార్త చెప్పడంతో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఇంటర్వ్యూ సమయంలో మేటర్నిటీ హాస్పిటల్‌లో రోహిణిని చూసినట్టు చెప్పడం కథను అనూహ్య మలుపు తిప్పింది. ఈ మాటను మీనా తప్పుగా అర్థం చేసుకుని రోహిణి గర్భవతి అయ్యిందని అనుకోవడంతో పెద్ద అపార్థం మొదలైంది. ఆనందంతో మీనా ఇంట్లో స్వీట్స్ చేసి 'మనింట్లో శుభవార్త' అంటూ అందరినీ పిలవడం, రోహిణిని తల్లి కాబోతున్నావని ప్రకటించడం ఒక్కసారిగా సంబరాల వాతావరణాన్ని తీసుకొచ్చింది. కానీ అసలు విషయం తెలియని రోహిణి తీవ్ర షాక్‌కు గురై ఆగ్రహంగా స్పందించింది.

హాస్పిటల్‌కు వెళ్లినంత మాత్రాన ఇలాంటి ఊహలు చేయడం ఎంత తప్పో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం ఎమోషనల్‌గా మారింది. ప్రభావతి కూడా తన ఆశలు చిద్రమయ్యాయని మీనాపై కోపం చూపించడంతో మీనా పూర్తిగా అపార్థంలో మిగిలిపోయింది. తర్వాత బాలు అడిగిన ప్రశ్నలతో అసలు నిజం బయటపడింది. అదే హాస్పిటల్‌లో సుమతికి ఉద్యోగం వచ్చిందని తెలిసి అందరూ సిగ్గుపడ్డారు. ఇక రోహిణి-మనోజ్ మధ్య సంభాషణ మరింత ఘర్షణకు దారి తీసింది. పిల్లల విషయం ప్రస్తావన, మనోజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రోహిణిని తీవ్రంగా కలచివేశాయి. చివర్లో ప్రభావతి చేసిన వ్యాఖ్యలు రోహిణి గతంపై కొత్త అనుమానాలను రేకెత్తించి, కథను మరింత ఉత్కంఠభరిత దశకు తీసుకెళ్లాయి.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉద్రిక్తతలతో మలుపు తిరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలో ప్రభావతి, మనోజ్‌ను పక్కకు తీసుకెళ్లి పర్సనల్‌గా మాట్లాడుతుంది. రోహిణి గతం గురించి తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పి, పెళ్లికి ముందు ఆమె జీవితం మనకు పూర్తిగా తెలియదని, ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని హెచ్చరిస్తుంది. రోహిణి గతం ఏంటో తెలుసుకోవాలని సూచించినప్పటికీ, మనోజ్ మాత్రం ఆమె మాటలను పెద్దగా పట్టించుకోడు. రోహిణి నిజాయితీగా అన్నీ చెప్పిందని, ఆమె చాలా మంచిదని సమర్థిస్తాడు. అయితే ప్రభావతి మాత్రం లోకం తీరు తెలుసుకుని, విచక్షణతో ఆలోచించాలని గట్టిగా చెప్పడంతో మనోజ్ మనసులో సందేహాలు మొదలవుతాయి.
ఇక మరోవైపు బాలు దాబాపై కూర్చుని ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, రూమ్ నిర్మాణం కోసం డబ్బులు లెక్కపెడుతూ ఒత్తిడిలో కనిపిస్తాడు. మీనా అతడి దగ్గరకు వచ్చి ప్రేమగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా, మొదట బాలు పట్టించుకోడు. చివరికి మీనా తన చీర కొంగుతో అతడిని టెంప్ట్ చేయడంతో బాలు మనసు మారుతుంది. పిల్లలు కావాలన్న మీనా కోరికను బాలు అప్పుల కారణంగా తిరస్కరించినా, ఇద్దరూ చివరికి రొమాన్స్‌లో మునిగిపోతారు. మరుసటి రోజు మనోజ్ ఖరీదైన గిఫ్టులతో ఇంటికి వచ్చి రోహిణి, ప్రభావతిని సర్ప్రైజ్ చేస్తాడు. అయితే అతడి అహంకార ప్రవర్తన, బాలు-సత్యల పట్ల అవమానకర మాటలు ఇంట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తాయి. గదిలోకి వెళ్లాక క్రెడిట్ కార్డు మీదే ఈ ఖర్చులన్నీ చేశానని మనోజ్ చెప్పడంతో రోహిణి లోపల ఆందోళనకు గురవుతుంది. చివరికి గోవా ట్రిప్ సర్ప్రైజ్‌తో ఎపిసోడ్ ముగియగా, రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
బుధవారం ఎపిసోడ్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. గుణ తన అనుచరుడు శివతో కలిసి ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి, అతడు ఇంట్లో లేని సమయంలో అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతాడు. ఆ మహిళ వెంటనే తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. బాలు అదే సమయంలో కారులో అక్కడికి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఈ హడావుడిలో బాధితుడు తన బ్యాగ్‌ను కారులో మర్చిపోతాడు. మొత్తం వ్యవహారాన్ని బయట నుంచే గమనించిన బాలు, సరైన సమయంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి గుణ- శివలను నిలదీస్తాడు. 'ఇంకా మీ బుద్ధి మారలేదా?' అంటూ గట్టి క్లాస్ పీకుతూ, పోలీసులకు ఫోన్ చేయమని బాధితుడికి సూచిస్తాడు.
గుణ మాత్రం 'క్యాజువల్‌గా వచ్చాను' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు చాటుగా తీసిన వీడియోను చూపించి షాక్ ఇస్తూ, ఇదే నిన్ను జైలుకు పంపడానికి చాలని మాస్ వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు, శివ చేత నెలవారీ వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లిస్తామని లేఖ రాయించి, గుణతో సంతకం పెట్టించి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఈ సీన్‌లో బాలు క్యారెక్టర్‌కు వచ్చిన మాస్ ఎలివేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మరోవైపు శృతి, మీనా చెల్లెలు సుమతికి జాబ్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది. అదే సమయంలో 'పిల్లలు కావాలి కానీ నేను కనను'అంటూ సరోగసీపై కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. ఈ మాటలతో కథలో కొత్త మలుపు ఏర్పడుతుంది. అదే సమయంలో మీనా పుట్టింటి విషయంలో ఉద్రిక్తత నెలకొంటుంది. శివ మొండి వైఖరి, బాలు స్పష్టమైన మాటలతో మీనా అయోమయంలో పడుతుంది.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు తీవ్ర భావోద్వేగాల్లోకి నెట్టేసింది. శివ పుట్టినరోజు సందర్భంగా దేవుడికి మొక్కు తీర్చాలనే ఉద్దేశంతో పార్వతి, మీనాకు గుడికి రావాలని ఫోన్ చేయడంతో కథ కీలక మలుపు తిరిగింది. ఒకవైపు భర్త బాలు మాట దాటినట్లవుతుందేమో అన్న భయం, మరోవైపు పుట్టింటి వాళ్లను బాధపెట్టకూడదన్న ఆందోళనతో మీనా తీవ్ర అయోమయంలో పడుతుంది. ఈ సందర్భంలో శృతి మీనాకు ధైర్యం చెప్పి, పుట్టింటి ఫంక్షన్‌కు వెళ్లడం తప్పు కాదని స్పష్టంగా చెబుతుంది. అయినా భర్తను కాదనలేని మీనా చివరకు ధైర్యం చేసి గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. గుడిలో శివ భావోద్వేగంతో స్పందించగా, మీనా ఆశీర్వచనాలతో ఆ క్షణాన్ని మరింత హృదయాన్ని తాకేలా చేస్తుంది. అయితే బాలుకు చెప్పకుండా వచ్చిన విషయం బయటపడటంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంటుంది.
ఇదిలా ఉండగా, ఇంట్లో ప్రభావతి తన అసలు కుట్రను అమలు చేస్తుంది. మీనా గుడికి వెళ్లిందని బాలు మనసులో అనుమానాలు నాటుతూ, పరిస్థితిని అతిగా మలిచింది. ఫోన్ లిఫ్ట్ కాకపోవడం ఆమెకు ఆయుధంగా మారింది. చివరికి కోపంతో బాలు గుడికి వెళ్లి, అందరి ముందు మీనాను అవమానించేలా మాట్లాడటం కథను తీవ్రంగా మలుపుతిప్పింది. ఇంటికి వచ్చిన మీనాను ప్రభావతి మరింతగా గాయపరుస్తుంది. ప్రసాదాన్ని కూడా తిరస్కరించి, సంసారంలో చిచ్చు పెట్టినట్లు బహిరంగంగా ఒప్పుకోవడం సంచలనం సృష్టించింది. మరోవైపు మద్యం మత్తులో ఉన్న బాలు 'నన్ను ముట్టుకోకు' అని మీనాను తోసిపుచ్చడం ఆమెను పూర్తిగా ఒంటరిగా మిగిల్చింది. ఈ ఎపిసోడ్‌తో బాలు-మీనా బంధం ప్రమాదంలో పడగా, ప్రభావతి క్రూరత్వం కథను కొత్త దిశలో నడిపిస్తోంది.
శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలు, అపార్థాలు, ఘర్షణలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా-బాలు మధ్య తీవ్ర స్థాయి గొడవ ప్రేక్షకులను కట్టిపడేసింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన బాలు, తన మాట వినకుండా గుడికి వెళ్లిందని మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే శివపై ప్రేమతోనే గుడికి వెళ్లానని, తండ్రి లేని పిల్లాడిని వదిలేయలేనని మీనా చెప్పడంతో బాలు మరింత రెచ్చిపోతాడు. "అంటే నాపై ప్రేమ లేదా?" అంటూ మీనా మాటలను తప్పుగా అర్థం చేసుకుని, తనను తక్కువగా చూస్తోందన్న అనుమానంతో మాటలు మితిమీరుతాయి.
ఈ గొడవను చూసిన ప్రభావతి మాత్రం లోపల సంతోషపడుతూ, మీరు ఇలా గొడవపడుతుంటేనే తనకు ఆనందమని వ్యంగ్యంగా చెప్పడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తుంది. మరుసటి రోజు ఉదయం బాలు మీనా ఇచ్చిన కాఫీని తిరస్కరించడంతో మీనా కారు తాళాలు దాచిపెట్టి అతడికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఈ వ్యవహారం సత్యం వరకు చేరడంతో బాలు తాగుడిపై హెచ్చరికలు వస్తాయి.కిచెన్‌లో మరోసారి జరిగిన గొడవలో మీనా తొలిసారి ధైర్యంగా ఎదురు తిరిగి, పెళ్లయితే ఆడపిల్ల పుట్టింటిని మర్చిపోవాలా అని ప్రశ్నిస్తుంది. ఈ మాటలు బాలు మనసును కలిచివేయగా, చివరికి పార్వతి క్షమాపణ చెప్పినా "నాకు ట్రిప్ ఉంది" అంటూ బాలు వెళ్లిపోవడం ఎపిసోడ్‌కు భావోద్వేగ ముగింపునిచ్చింది.


Click it and Unblock the Notifications











