Gunde Ninda Gudi Gantalu Weekly:బాలుకు ఏడేళ్ల జైలు శిక్ష.. మేకమామపై అనుమానం.. తల్లి కాబోతున్న మౌనిక.. .
photo courtesy: jio hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 2వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. భావోద్వేగాలు, ఆనందాలు, అవమానాలతో ఉత్కంఠభరితంగా సాగింది. మౌనిక గర్భవతి అనే శుభవార్త తెలిసిన క్షణం నుంచి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బాలు, మీనా ఆనందానికి అవధులు లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అయితే సంజు మాత్రం లోలోపల అనుమానాలతో మౌనంగా ఉంటాడు. ఇదే సమయంలో నీలకంఠ రిపోర్టులు తెప్పించుకుని మౌనిక తల్లి కాలేదని భావించి కుట్రలు పన్నుతాడు. కానీ మౌనిక స్వయంగా "మీరు నానమ్మ కాబోతున్నారు" అని చెప్పడంతో అతని ఆశలు చెదిరిపోతాయి. సువర్ణ మాత్రం కోడలిని ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకుంటుంది.

photo courtesy: jio hotstar
పూజా కార్యక్రమంలో మీనా బస్తీ వారిని ఆహ్వానించగా ప్రభావతి వారిని అవమానిస్తుంది. దీనికి డాక్టర్ గట్టిగా నిలదీసి మానవత్వంపై ప్రశ్నిస్తాడు. మరోవైపు రోహిణి, శివ వీడియో కోసం బాలు ఫోన్‌లో వెతుకుతూ పొరపాటున వేరే వీడియో గుణకు పంపి చిక్కుల్లో పడుతుంది. గుణ హెచ్చరికతో ఆమె ఆందోళన పెరుగుతుంది. ఇదే సమయంలో బాలు తన ఫోన్ గురించి ప్రశ్నించడంతో రోహిణి భయపడుతుంది. మౌనిక ఆనందాన్ని సంజు అనుమానంతో చెదరగొడతాడు. "పుట్టబోయే బిడ్డకు తండ్రి నేనేనా?" అన్న వ్యాఖ్యతో ఇంట్లో ఉద్రిక్తత చెలరేగుతుంది. సువర్ణ కొడుకును గట్టిగా మందలిస్తుంది. చివర్లో బాలు రోహిణి తల్లి సుగుణమ్మను పూజకు ఆహ్వానించడం కొత్త ట్విస్ట్‌కు దారితీస్తుంది. రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠతో నిండిపోయింది. బొమ్మల కొలువు పూజకు రావాలని బాలు స్వయంగా రోహిణి తల్లి సుగుణమ్మకు ఫోన్ చేయడంతో కథ మలుపు తిరిగింది. రాలేమని చెప్పినా బాలు పట్టుబడటంతో, రోహిణి ప్లాన్ ప్రకారం సుగుణమ్మ ఇష్టంలేకుండానే పూజకు రావాల్సి వచ్చింది. పూజా వేడుకలో చింటూ కృష్ణుడి వేషంలో అందరినీ అలరించగా, అతడిని చూసి బాలు-మీనాల మమకారం మరింత పెరిగింది. దత్తత విషయాన్ని ప్రస్తావించగానే సుగుణమ్మ కఠినంగా స్పందించి, "నా మనవడిని ఎందుకు దూరం చేస్తారు?" అంటూ గట్టిగా మాట్లాడింది. చింటూ "నేను నా తల్లితోనే ఉంటాను" అన్న మాట బాలు-మీనాల గుండెల్ని తాకింది.
ఇంటికి వెళ్లిన తర్వాత సుగుణమ్మలో పశ్చాత్తాపం ఉప్పొంగుతుంది. బాలు-మీనాలపై చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుని తల్లిగా తాను తప్పు చేశానని భావోద్వేగానికి లోనవుతుంది. అదే సమయంలో రోహిణిపై ఆమె విరుచుకుపడటం ఎపిసోడ్‌కు మరింత తీవ్రతను జోడించింది. అబద్ధాల పునాదిపై జీవితం నిర్మించవద్దని హెచ్చరించిన సుగుణమ్మ మాటలు రోహిణిని కుదిపేశాయి. మరోవైపు గుడి సన్నివేశంలో ప్రభావతి మీనాను తప్పుబట్టినా, పూజా సామాగ్రి మీనానే ముందుగా పంపించిందని బయటపడటంతో ఆమె విమర్శలు తారుమారయ్యాయి. మీనా స్నేహితురాలి సమాధానం ప్రభావతికి గట్టి సమాధానంగా నిలిచింది.
బుధవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ తగాదాలు, ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మౌనిక గర్భవతి అయితే అమ్మవారికి సారె పెట్టి అన్నదానం చేయిస్తానని ప్రభావతి మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ మొక్కు నెరవేర్చే రోజు వచ్చినప్పుడు మీనాకు పెద్ద పూల ఆర్డర్ రావడంతో ఆమె గుడికి వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని అవకాశం గా తీసుకున్న ప్రభావతి, మీనా కావాలనే బాధ్యత తప్పించుకుందని కుటుంబ సభ్యుల ముందే విమర్శించింది. అయితే కొద్దిసేపటికి నిజం బయటపడింది. మీనా గుడికి రాకపోయినా పూజా సామగ్రి, పూల దండలు, అన్నదానం ఏర్పాట్లు అన్నీ ముందుగానే చూసుకుని తన స్నేహితురాలి ద్వారా పంపించింది. పంతులు గారు కూడా మీనా ముందుగానే అన్నీ చెప్పి ఏర్పాట్లు చేయించిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాలు వెంటనే భార్యను పొగిడినా ప్రభావతి మాత్రం తగ్గకుండా మళ్లీ మీనాను విమర్శించడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో శృతి సెటైర్లతో ప్రభావతికి కౌంటర్ ఇచ్చింది.
ఇక గుడిలో సారె పెట్టే ఆచారం గురించి రోహిణికి తెలియకపోవడంతో సత్యం, బాలు ఇద్దరూ చురకలు వేశారు. ఇదే సమయంలో మరో మహిళ వచ్చి మౌనికకు సారె ఇవ్వగా, అది కూడా మీనా ముందే చెప్పి పంపించిందని చెప్పడంతో ప్రభావతి మౌనంగా నిలిచిపోయింది. అన్నదానం ఏర్పాట్లు కూడా మీనా ముందే చేయించిందని తెలిసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇక మరోవైపు మనోజ్ వడ్డీ డబ్బులు తీసుకురావాలని అనగా రోహిణి తానే వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఈ విషయం గమనించిన బాలు స్నేహితుడు రాజేష్, సుగుణమ్మ మరియు చింటూ కనిపించారని బాలుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బాలు వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు. అదే సమయంలో రోహిణి తన కొడుకు చింటూను కలుసుకోగా, అతడు బాలు-మీనాల మంచితనం గురించి చెప్పిన మాటలు ఆమెను భావోద్వేగానికి గురి చేశాయి. ఈ సమయంలోనే బాలు ఆ ఇంటి తలుపు తట్టడంతో కథ ఉత్కంఠభరితంగా ముగిసింది.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరిత మలుపులతో సాగింది. సుగుణమ్మ, చింటూను వెతుకుతూ బాలు విద్య ఇంటి వద్దకు చేరుకోవడం కథలో కీలక ఘట్టంగా నిలిచింది. అయితే బాలు కాలింగ్ బెల్ కొట్టేలోపే విద్య రోహిణికి ఫోన్ చేసి హెచ్చరించడంతో, రోహిణి వెంటనే చింటూను వెనక్కు లాగి తలుపు లాక్ చేసింది. బాలు పలుమార్లు బెల్ కొట్టినా ఎవరూ బయటకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో రోహిణి ఊపిరి పీల్చుకుంది.ఇక గుడిలో మరో డ్రామా జరిగింది. మేక మామ పొరపాటున ప్రభావతిని ఢీకొట్టడంతో అనుమానాలు మొదలయ్యాయి. బాలు మేక మామపై అనుమానం పెంచుకుని వరుసగా ప్రశ్నలు సంధించాడు. హారతి మీద ప్రమాణం చేయమని ఒత్తిడి చేస్తున్న సమయంలో రోహిణి అక్కడికి చేరుకుని పరిస్థితిని కవర్ చేసింది. తన మలేషియా మామయ్య ప్రతి సంవత్సరం మౌనవ్రతం చేసి గుళ్లు తిరుగుతాడని చెప్పి అందరినీ నమ్మించింది. అయితే మాణిక్యం మాత్రం రోహిణికి నిజం చెప్పమని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా బాలు, మీనాతో కలిసి ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లాడు. అక్కడ మీనా చెల్లెలు వారిని చూసి ఆశ్చర్యపోయింది. ఇదే సమయంలో శివ కాలేజీ నుంచి డీబార్ అయ్యాడని చెప్పడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. గుణ తన బ్యాగ్‌లో మద్యం సీసా పెట్టించి తనను ఇరికించాడని శివ వెల్లడించాడు. దీంతో బాలు గుణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని వదిలిపెట్టనని హెచ్చరించాడు. మరోవైపు గుణ తన ప్లాన్ సక్సెస్ అయిందని పార్టీకి సిద్ధమవుతుండగా, బాలు అక్కడికి వస్తున్నాడని తెలిసి భయంతో పారిపోయాడు. గుణ అనుచరులను బాలు తీవ్రంగా హెచ్చరిస్తూ "గుణ నా చేతికి చిక్కితే ప్రాణాలతో ఉండడు" అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రాబోయే ఎపిసోడ్లలో బాలు-గుణ మధ్య ఘర్షణ మరింత పెరగనున్నట్టు సంకేతాలు కనిపించాయి.
శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన మలుపులతో ఆకట్టుకుంది. ఇంట్లో శృతి పేరుతో వచ్చిన ఒక పార్సిల్ చుట్టూ మొదట చిన్న వివాదం ప్రారంభమైంది. ఆ పార్సిల్‌ను చూసిన ప్రభావతికి ఆసక్తి కలగడంతో వెంటనే బాక్స్ తెరవాలని ప్రయత్నించింది. అయితే మీనా ఆమెను ఆపేందుకు ప్రయత్నిస్తూ, 'అత్తయ్య.. అది శృతి వస్తువు. ఆమె ఇంట్లో లేనప్పుడు తెరవడం సరైంది కాదు'అని చెప్పినా ప్రభావతి పట్టించుకోలేదు. చివరకు బాక్స్ తెరిచి అందులో ఉన్న హెడ్‌ఫోన్స్ తీసుకుని చూడటంతో అక్కడికి వచ్చిన శృతి తీవ్రంగా కోపగించింది. తన అనుమతి లేకుండా వస్తువులను తాకారని ప్రభావతిపై మండిపడింది. ఈ సంఘటన ఇంట్లో ఉద్రిక్తతను పెంచింది. ఆ తర్వాత ప్రభావతి తన కొడుకు రవిని పక్కకు పిలిచి శృతి గురించి ఫిర్యాదు చేస్తూ, ఆమెను అదుపులో పెట్టాలని చెప్పింది. కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మీనా మధ్యలోకి వచ్చి, శృతి కోపం వెనుక ఉద్దేశం లేదని రవికి చెప్పి పరిస్థితిని సర్దిచెప్పింది.
ఇక మరోవైపు శివ సస్పెన్షన్ సమస్యను పరిష్కరించేందుకు బాలు ప్రయత్నాలు ప్రారంభించాడు. గుణ అనే వ్యక్తి కావాలనే శివ బ్యాగులో మద్యం బాటిల్ పెట్టి అతన్ని కాలేజీ నుంచి డీబార్ చేయించాడని తెలుసుకున్న బాలు ప్రిన్సిపాల్‌ను కలవాలని నిర్ణయించాడు. కానీ ప్రిన్సిపాల్ వారిని పట్టించుకోలేదు. దీంతో బాలు ఒక తెలివైన ప్లాన్ వేసాడు. మీనాతో కలిసి ప్రిన్సిపాల్ ఇంటి ముందు తాగుబోతులా నటిస్తూ గొడవ చేయడంతో ప్రిన్సిపాల్‌కు నిజం అర్థమైంది. శివపై పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన నిర్ణయించాడు. అయితే బాలు వేసిన ఈ నాటకం అనూహ్య మలుపు తీసుకుంది. రోడ్డుపై తాగి గొడవ చేస్తున్నాడని భావించిన పోలీసులు అక్కడికి వచ్చి బాలును అరెస్ట్ చేశారు. మీనా ఎంత చెప్పినా వినకుండా అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న శివ తన కోసం బాలు చేసిన త్యాగం తెలుసుకుని తీవ్రంగా పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఇక బాలును ఎలా విడుదల చేస్తారో అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











