Gundeninda Gudigantalu July 22th Episode: బాలు ప్లాన్ సక్సెస్, చింతామణి చాప్టర్ క్లోజ్, ప్రభావతికి మీనా షాక్.

Gunde Ninda Gudi Gantalu: 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో రోజులుగా మీనాను వేధిస్తున్న రూ.9 లక్షల మోసం వ్యవహారానికి ఈ ఎపిసోడ్‌లో ముగింపు పలికారు. బాలు వేసిన తెలివైన ప్లాన్‌తో చింతామణి, ఫంక్షన్ హాల్ మేనేజర్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో కథ ఆసక్తికర మలుపు తిరిగింది. బాలు చెప్పిన ప్లాన్ ప్రకారం చింతామణి, మేనేజర్ ఇద్దరూ డబ్బుతో గుడికి చేరుకోగా, అక్కడే ఫంక్షన్ హాల్ ఓనర్, మీనా, రవి, శృతి అందరూ కలిసి వారిని నిలదీస్తారు. పరిస్థితి అర్థం చేసుకున్న చింతామణి వెంటనే తనకు ఏమీ తెలియదని, తాను కేవలం గుడికి మాత్రమే వచ్చానని నాటకం ఆడే ప్రయత్నం చేస్తుంది. అయితే మీనా ఆమె మాటలను అడ్డుకొని, ఇక ఆ డ్రామాలు తన దగ్గర పనిచేయవని గట్టిగా హెచ్చరిస్తుంది.

ఇదిలా ఉండగా మేనేజర్ అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ శృతి అతడిని అడ్డుకొని గట్టిగా నిలదీస్తుంది. దీంతో ఫంక్షన్ హాల్ ఓనర్ అసలు విషయం ఏంటో చెప్పాలని తీవ్రంగా ప్రశ్నిస్తాడు. "నిజం చెబుతావా... లేక పోలీసులకు అప్పగించమంటావా?" అంటూ గట్టిగా హెచ్చరించడంతో మేనేజర్ చివరకు నిజం ఒప్పుకుంటాడు. చింతామణి ఇచ్చే కమిషన్‌కు ఆశపడి తాను కూడా ఈ మోసంలో భాగమైనట్లు మేనేజర్ అంగీకరిస్తాడు. మొదట మీనాతో లక్ష రూపాయల ఒప్పందంపై సంతకం చేయించి, తర్వాత ఆ అగ్రిమెంట్‌ను చింతామణి మార్చేసిందని చెబుతాడు. ఆ నకిలీ ఒప్పందం ఆధారంగా రూ.9 లక్షలు కాజేశామని పూసగుచ్చినట్లు మొత్తం విషయాన్ని బయటపెడతాడు. మేనేజర్ నోట నిజం వినగానే అక్కడున్న వారంతా షాక్‌కు గురవుతారు.

Gundeninda Gudigantalu serial episode 732 July 22th 2026 here is full story

photo courtesy: jiohotstar

మేనేజర్ ఒప్పుకున్న వెంటనే శృతి ఆగ్రహంతో చెలరేగిపోతుంది. మీనాను ఇంత పెద్ద మోసం చేసినందుకు అతడిపై విరుచుకుపడి తన ఆవేదనను బయటపెడుతుంది. మరోవైపు చింతామణి అక్కడి నుంచి ముఖం చాటేసుకొని వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. అయితే మీనా ఆమెను అడ్డుకొని జీవితంలో గుర్తుండిపోయేలా గట్టి వార్నింగ్ ఇస్తుంది. "ఒకరిని మోసం చేసి ఎదగాలని చూసేవారిని దేవుడు ఎప్పటికైనా శిక్షిస్తాడు. ఈ నగరంలో ఎన్నో ఫంక్షన్ హాల్స్ ఉన్నా నేను ఎప్పుడూ నీకు పోటీగా రాలేదు. కానీ నువ్వే నన్ను శత్రువుగా చూసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. ఇకపై నేను ఎవరో, నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను. నువ్వు చేసిన ద్రోహాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోను" అంటూ మీనా ధైర్యంగా సమాధానం చెబుతుంది.

మీనా మాటలు విన్న ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా చింతామణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "నీ గురించి ఇప్పటికే చాలా ఫిర్యాదులు విన్నాను. గతంలో కూడా ఇలాంటి మోసాలతో నీ జీవితాన్నే నాశనం చేసుకున్నావు. అయినా నీకు బుద్ధి రాలేదు. నువ్వు ఆడదానివి కాబట్టే పోలీస్ కేసు పెట్టడం లేదు. లేకపోతే ఈరోజే జైలుకు పంపేవాడిని" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. అంతేకాకుండా మీనాకు జరిగిన అన్యాయాన్ని అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తానని, ఇకపై అందరికీ ఆమె నిజాయితీ గురించి చెబుతానని హామీ ఇస్తాడు. తన ఫంక్షన్ హాల్‌లో జరిగే ప్రతి కార్యక్రమానికి డెకరేషన్ ఆర్డర్లు మీనాకే ఇస్తానని అందరి ముందూ ప్రకటిస్తాడు. దీంతో మీనా భావోద్వేగానికి గురై ఓనర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

దీనికి ఓనర్ స్పందిస్తూ, "నువ్వు ఈరోజు గెలిచింది నా వల్ల కాదు... నీ కుటుంబం నీకు అండగా నిలబడినందువల్ల. బాలు, రవి, శృతి కలిసి నీ కోసం పోరాడకపోతే నిజం బయటకు వచ్చేది కాదు. నన్ను కూడా పెద్ద మోసం నుంచి కాపాడారు. ఇకపై నా ఫంక్షన్ హాల్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నేనూ జాగ్రత్త పడతాను" అని చెబుతాడు. చివరగా బాలు కూడా చింతామణికి గట్టి హెచ్చరిక ఇస్తాడు. "మరోసారి నా భార్య జోలికి వస్తే ఈరోజు తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెడతాను. అవసరమైతే పోలీసులకు కూడా ఇస్తాను. నీ అసలు రూపాన్ని అందరికీ చూపిస్తాను" అని వార్నింగ్ ఇవ్వడంతో చింతామణి అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సమస్య మొత్తం ముగిసిన తర్వాత మీనా బాలును చూసి, "మీరు ఎప్పుడు వచ్చారు? నాకు ఈ విషయం మీకు ఎలా తెలిసింది?" అని అడుగుతుంది. అందుకు బాలు, "నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు ఇబ్బందిలో ఉన్నావని అర్థమైంది. అందుకే సమస్య పరిష్కారమైన తర్వాత నీ ముఖంలో నవ్వు చూడాలని వచ్చాను" అని చెబుతాడు. ఆ మాటలకు మీనా కృతజ్ఞతలు చెబుతుంది. అయితే బాలు మాత్రం ఈ విజయానికి అసలు కారణం రవి, శృతేనని చెబుతూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాడు. వెంటనే రవి సరదాగా "థ్యాంక్స్ మాత్రమేనా... పార్టీ లేదా?" అని అడగడంతో అక్కడ నవ్వులు పూస్తాయి. బాలు వెంటనే డబ్బులు ఇచ్చి బిర్యానీ తీసుకురమ్మని రవికి చెప్పడంతో అందరూ ఆనందంగా ఇంటి వైపు బయలుదేరుతారు.

బాలు, మీనా, రవి, శృతి అందరూ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. అయితే ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రభావతి తన సహజ ధోరణిలో మీనాపై మండిపడుతుంది. "ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో పని చేయకుండా బయట తిరుగుతున్నారా?" అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది. అయితే ఈసారి మీనా మునుపటిలా మౌనంగా ఉండదు. "ఈరోజు నేను వంట చేయను" అని ధైర్యంగా చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. మీనా తీరు చూసిన ప్రభావతి, "దీనికి ఇప్పుడు చాలా పొగరు వచ్చింది.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది" అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే సత్యం కలుగజేసుకొని, "ముందు వాళ్ల చేతిలో ఏముందో చూడు.. ఏం జరిగిందో తెలుసుకోకుండా నోరు పారేసుకోకు" అంటూ ప్రభావతికి క్లాస్ తీస్తాడు.

అందరి ముందు బాలు సంతోషంగా అసలు విషయాన్ని వెల్లడిస్తాడు. "నా భార్య మీనా విజయవంతంగా రూ.10 లక్షల డెకరేషన్ ఆర్డర్ పూర్తి చేసింది. తనకు రావాల్సిన డబ్బు కూడా తిరిగి వచ్చింది" అని గర్వంగా చెబుతాడు. అది విన్న ప్రభావతి నమ్మలేక, "నిజంగానే పూర్తి చేసిందా?" అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో శృతి వ్యంగ్యంగా, "ఎందుకు పూర్తి చేయలేదని ఎవరైనా చెప్పారు? లేక మీకు ముందే ఏదైనా తెలుసా?" అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పంచ్ వేస్తుంది. శృతి మాటలకు ప్రభావతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.

మీనా సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించిన బాలు, ముందుగానే తీసుకొచ్చిన పూలదండను మీనా మెడలో వేసి ఆమెను అభినందిస్తాడు. ఇంట్లో ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ మీనాను అభినందిస్తారు. కానీ ప్రభావతి మాత్రం ఒక్క చప్పటు కూడా కొట్టకుండా మౌనంగా కూర్చుంటుంది. ఆ విషయం గమనించిన సత్యం, "చేతులకు ఏమైంది? చప్పట్లు కొట్టలేవా?" అని ప్రశ్నించగా, "నా చేతులు పడిపోయాయి" అంటూ ప్రభావతి వ్యంగ్యంగా సమాధానం ఇస్తుంది. వెంటనే శృతి, "ఆ మాట బాలు అనాలి కానీ మీరు కాదు" అంటూ మరోసారి చురకలు అంటిస్తుంది. దీంతో ప్రభావతి శృతిపై కూడా విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది.

సత్యం అసలు ఏం జరిగిందో అడగడంతో బాలు మొత్తం వ్యవహారాన్ని వివరిస్తాడు. చింతామణి, ఆమె మేనేజర్ కలిసి అగ్రిమెంట్ మార్చి రూ.9 లక్షలు కాజేయాలని ప్రయత్నించారని, రవి, శృతి సహాయంతో వారి కుట్రను బయటపెట్టి మీనాకు రావాల్సిన డబ్బును తిరిగి తెచ్చామని చెబుతాడు. అది విన్న సత్యం ఆనందంతో, "ఇది నిజంగా పండుగ లాంటి సందర్భం. మనమంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి" అని అంటాడు. అయితే ప్రభావతి మాత్రం అమాయకంగా, "అసలు నిన్ను మోసం చేసింది ఎవరు?" అని అడుగుతుంది. దానికి శృతి, "మీకు నిజంగానే తెలియదా?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తుంది. వెంటనే బాలు, "ఇప్పుడు ఆ విషయాలు వద్దు.. ముందు అందరం కలిసి బిర్యానీ తిందాం" అంటూ వాతావరణాన్ని మార్చేస్తాడు.

ఇంట్లో అందరూ ఆనందంగా బిర్యానీ తింటుంటే ప్రభావతి మాత్రం మీనా విజయాన్ని తట్టుకోలేక లోలోపల రగిలిపోతుంది. చింతామణి కూడా విఫలమవడంతో తన ప్లాన్ పూర్తిగా దెబ్బతిందని బాధపడుతుంది. "నాకు ఆకలిగా లేదు" అంటూ భోజనం చేయకుండా తన గదిలోకి వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మీనా మజ్జిగ గ్లాస్ తీసుకుని అత్తగారి గదికి వెళ్తుంది. "మీరు అనుకున్నది జరగలేదా? అందుకే ఇలా ఉన్నారా?" అని ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నిస్తుంది. ప్రభావతి మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తుంది. అయితే మీనా, "అతిగా ఆలోచించకండి.. సమయానికి తినండి, సమయానికి నిద్రపోండి.. ఆరోగ్యం జాగ్రత్త" అంటూ నవ్వుతూ చెప్పిన మాటలు ప్రభావతికి పరోక్ష హెచ్చరికలా అనిపిస్తాయి.

అవమానాన్ని తట్టుకోలేక ప్రభావతి డాన్స్ స్కూల్‌కు వెళ్తుంది. అక్కడికి చింతామణి కూడా వస్తుంది. ఆమెకు ఓటమికి గుర్తుగా క్యాలీఫ్లవర్ బొకే ఇచ్చి వ్యంగ్యంగా అవమానిస్తుంది. "నువ్వు నా కోడల్ని ఇంటికే పరిమితం చేస్తానని గొప్పలు చెప్పావు. కానీ చివరికి నువ్వే ఏమీ చేయలేకపోయావు. నాకు చెప్పకుండా రూ.10 లక్షలు మోసం చేయాలని చూసి నా ఇంటికే సమస్యలు తెచ్చావు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు" అంటూ చింతామణిని తీవ్రంగా మందలిస్తుంది. అప్పటికే అవమానంతో కుంగిపోయిన చింతామణికి ఈ మాటలు మరింత బాధ కలిగిస్తాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన మీనాక్షి కూడా, "మీనా, బాలు జోలికి వెళ్తే జీవితంలో ఎప్పటికీ గెలవలేరు. చెడు చేస్తే చెడే ఎదురవుతుంది" అంటూ చింతామణికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అవమానంతో చింతామణి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతుంది.

తర్వాత మీనా ఫైనాన్సర్ సింగరాజు వద్దకు వెళ్లి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తుంది. సమయానికి డబ్బు ఇచ్చేస్తానని చెప్పి ఆలస్యం కావడానికి కారణం ఏమిటని సింగరాజు అడగడంతో, చింతామణి-మేనేజర్ కలిసి తనను ఎలా మోసం చేయాలని ప్రయత్నించారో మీనా పూర్తిగా వివరిస్తుంది. అది విన్న సింగరాజు, "మోసం చేసినవాళ్లు ఎంతకాలమైనా బయటపడుతారు. ప్రతి వృత్తిలో పోటీదారులు ఉంటారు. వాళ్లకు భయపడి వెనక్కి తగ్గకూడదు. నీ నిజాయితీనే నీ బలం. ఇకపై ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా, ఎంత డబ్బు అవసరమైనా నన్ను అడుగు. ఒక్క రూపాయి వడ్డీ లేకుండా నీకు సహాయం చేస్తాను" అంటూ మీనాకు భరోసా ఇస్తాడు.

అయితే సింగరాజు మీనాకు ఇంత అండగా నిలవడం వెనుక అసలు కారణం ఏమిటి? చింతామణితో ఆయనకు గతంలో ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయా? లేక చింతామణిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మీనాకు సహాయం చేస్తున్నాడా? మరోవైపు వరుస పరాజయాలతో చింతామణి మళ్లీ కొత్త కుట్ర పన్నుతుందా? మీనాను దెబ్బతీయడానికి మరో ప్లాన్ సిద్ధం చేస్తుందా? అనే ప్రశ్నలతో సీరియల్ తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని మరింత పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X