Guppedanta Manasu July 6th episode: తప్పంతా సరోజదే అంటున్న రాధమ్మ.. అనుపమని క్షమాపణ కోరిన ఫణీంద్ర!
వసుధార రంగా ని బట్టలు కొని తీసుకు రమ్మంటుంది, బట్టలు తీసుకొచ్చిన రంగాపై కోప్పడుతుంది సరోజ. తరువాత వసుధార కి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాడు రంగా. మరోవైపు తన దగ్గర ఉన్న లెటర్ తో అనుపమని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తారు దేవయాని, శైలేంద్ర. తర్వాత కాలేజీకి వెళ్లి మనుని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతారు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 6వ తేదీ ఎపిసోడ్ 1,120 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మేడం గారి విషయంలో మరొకసారి ఇలాంటి గొడవలు తీసుకురావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగా. సరోజ కోపంగా రాధమ్మ దగ్గరికి వెళ్లి నువ్వేమీ మాట్లాడవేమిటి, మా పెళ్లి జరగటం ఇష్టం లేదా అంటుంది. ఇష్టమే కానీ వాడి మాటని కాదని అడుగు ముందుకు వేయలేను. అయినా తప్పంతా నీదే ఏ ఆడపిల్ల అయినా కట్టుకునే మొగుణ్ణి తన చుట్టూ తిప్పుకోవాలి అంతేగాని ఇలా అయినదానికి కాని దానికి వాడి మీద పడిపోతే వాడు నిన్ను దూరం పెడతాడు, తర్వాత నువ్వు అనుకున్నదే నిజం చేస్తాడు.

అందుకే కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండు, అయినా మీ బావ పెళ్లి నీతోనే జరుగుతుంది వాడు నీ మెడలోనే తాళి కడతాడు అని సరోజకి మాటిస్తుంది రాధమ్మ. ఈ ముసలిది నాతో ఇలా అంటుంది కానీ ఆ వసుధారకి సపోర్ట్ చేస్తుంది, ఎలాగైనా తనని ఇంట్లోంచి పంపించేయాలి అనుకొని అక్కడ నుంచి వెళ్లబోతుంది సరోజ. ఆమెని ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది రాధమ్మ. నీకెందుకు అంటుంది సరోజ. నువ్వు ఇలా చిన్నపిల్ల లాగా బెట్టు చేయకు, రేపు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి..
అలాంటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేగాని ఇలా ఆవేశపడితే లాభం ఉండదు అంటుంది రాధమ్మ. నువ్వు అలాగే చెప్తావు కానీ బాధ అనుభవించేది నేను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. మరోవైపు ఆవేశంగా ఇంటికి వచ్చిన ఏంజెల్, మను లని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు మహేంద్ర. దేవయాని మాట్లాడిన మాటల గురించి చెప్తుంది ఏంజెల్. అసలు ఇదంతా నీ వల్లే, ఎదుటి వాళ్ళు తప్పుగా మాట్లాడుకునే అవకాశం నువ్వు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అనుపమని నిలదీస్తుంది ఏంజెల్.

అది నా వ్యక్తిగత వ్యవహారం నేనెందుకు చెప్పాలి అంటుంది అనుపమ. మహేంద్ర మాట్లాడుతూ వదిన గారికి ఎవరో ఒకరిని బాధ పెడుతూ మాట్లాడటం అలవాటైపోయింది పదా ఇప్పుడే వెళ్లి ఆవిడతో మాట్లాడదాం అంటాడు. మీ అన్నయ్య ఉంటారేమో అంటుంది అనుపమ. ఆయనకి అన్నీ తెలియాలి లేకపోతే తల్లీ కొడుకులు రెచ్చిపోతున్నారు అంటూ మను వద్దని చెప్తున్నా వినకుండా ఫణీంద్ర ఇంటికి బయలుదేరుతారు మహేంద్ర, అనుపమ.
ఎందుకు నిజం చెప్పావు, ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో అని ఏంజెల్ ని మందలిస్తాడు మను. పర్వాలేదులే వెళ్ళనీ ఎన్నాళ్ళని నువ్వు మాత్రం మాటలు పడతావు, అసలు ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు మాటలు పడాలి అంటుంది ఏంజెల్. మరోవైపు ఫణీంద్ర ఇంటికి వచ్చిన మహేంద్ర వదిన గారు అని గట్టిగా పిలుస్తాడు. ఏం జరిగింది, మళ్లీ తనేమైనా చేసిందా అని అడుగుతాడు ఫణీంద్ర. ఆవిడని పిలవండి చెప్తాం అంటాడు మహేంద్ర. ఫణింద్ర దేవయానిని పిలవడంతో అక్కడికి వస్తుంది.
అప్పుడు అనుపమ నా కొడుకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీకేమైనా అడగాలని ఉంటే నన్ను అడగండి అంతేగాని నా కొడుకుని ఇబ్బంది పెట్టొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. సరే నిన్నే అడుగుతున్నాను నీ బిడ్డకి తండ్రి ఎవరు అని అడుగుతుంది దేవయాని. అప్పుడు ఫణీంద్ర మాట్లాడుతూ నీకు పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చాలాసార్లు చెప్పాను అని దేవయానిని మందలించి ఆమె తరుపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అంటూ అనుపమకి క్షమాపణలు చెప్తాడు ఫణీంద్ర. అంత మాట అనొద్దు అంటుంది అనుపమ.

తర్వాత ఫణీంద్ర మహేంద్ర తో మాట్లాడుతూ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు దాని గురించి మీ వదినకి నేను సర్ది చెప్పగలను కానీ బయట చాలామంది దేవయాని లు ఉంటారు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించుకోండి అని చెప్తాడు. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత పెద్ద గొడవ జరుగుతుందేమో అని భయపడ్డాను డాడీకి నీ మీద కోపంతో పాటు ప్రేమ కూడా ఉంది అని తల్లితో అంటాడు శైలేంద్ర. అందుకే నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను అంటుంది దేవయాని. ఏ పనులు అంటూ అక్కడికి వస్తుంది ధరణి.
అప్పుడు శైలేంద్ర కోప్పడుతూ నీ ఎంట్రీ ఎప్పుడు ఎండింగ్ లోనే ఉంటుందేంటి అని అడుగుతాడు. మీ ప్లాన్లు పూర్తిగా నేను వినకుండా ఆ దేవుడు మీకు సపోర్ట్ చేస్తున్నాడు అయినా ఈ కొట్రలో కోతంత్రాలు మానేయమని చెప్పాను కదా అంటుంది ధరణి కుట్రలు కుతంత్రాలు చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అంటూ చాలా పెద్ద ఎక్స్ప్లనేషన్ ఇస్తాడు శైలేంద్ర. చాలు అంత పెద్ద డైలాగ్ చెప్పకండి మీ ఊపిరి ఆగిపోతుంది అంటుంది ధరణి.
చూసావా ఎలా తీసిపారేస్తుందో అని తల్లికి కంప్లైంట్ ఇస్తాడు శైలేంద్ర. అప్పుడు దేవయాని మాట్లాడుతూ అయినా ధరణి నువ్వు ఏంటి ఎప్పుడు సీన్ ఎండింగ్ లో ఎంట్రీ ఇస్తావు అంటుంది. సినిమా చూస్తేనే కదా రివ్యూ ఇవ్వగలం అంటుంది ధరణి. నువ్వు సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తున్నావు అంటాడు శైలేంద్ర. రివ్యూ నాకు ముందే తెలుసు అని వెటకారంగా చెప్పి వెళ్ళిపోతుంది ధరణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











