Guppedantha Manasu: ఏంజెల్ విషయంలో విశ్వనాథంకు వసుధార ప్రామిస్.. రిషి వద్దన్నా కూడా!
విశ్వనాథంకు మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఏంజెల్ బాధపడిపోతుంది. ఏంజెల్ ను రిషి ఓదారుస్తాడు. విశ్వం పరిస్థితి ఏంటో నీకు తెలుసు. కానీ, నాకు ఏదో ధైర్యం చెప్పాలని చెబుతున్నావ్. నాకు ఏ కష్టం రాకుండా విశ్వం పెంచాడు. నాకు అన్ని విశ్వమే. నా ఆనందమే తన ఆనందంగా పెంచాడు. నాకు విశ్వాన్ని చూస్తూ ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి విశ్వానికి ఇలా జరిగేసరికి నావల్ల కావట్లేదు అని ఏంజెల్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 11 శుక్రవారం నాటి ఎపిసోడ్ 839లో ఇంకా ఏం జరిగిందంటే?
కాలేజీకి వెళ్లు:ఏంజెల్ నువ్ ఇలా బాధపడితే ఆయన ఇంకా దిగాలుపడిపోతారు. నువ్ సాధ్యమైనంత వరకు ఆయన పక్కనే ఉండు. ముఖ్యంగా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ముందు ఉండకు. ముందు వెళ్లి జ్యూస్ ఇవ్వు అని రిషి చెబుతాడు. ఇంతలో ఏంజెల్ కు వసుధార కాల్ చేస్తుంది. కానీ, చూసుకోదు. కాలేజీకి వెళ్లనా, ఇంట్లోనే ఉండనా అని ఏంజెల్ ని రిషి అడుగుతాడు. ఇప్పుడు విశ్వానికి పర్లేదు. నువ్వు కాలేజీకి వెళ్లు. విశ్వం ఎంత ముఖ్యమో. కాలేజీ కూడా అంతే ముఖ్యం. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తా వద్దువు అని ఏంజెల్ అంటుంది. మరోవైపు క్లాస్ లో మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇచ్చి చేయమని స్టూడెంట్స్ కు చెప్పిన వసుధార రిషి గురించి ఆలోచిస్తుంది.

మళ్లీ అటాక్:రిషి సార్ పై మళ్లీ ఏమైనా అటాక్ జరిగిందా. ఎందుకు కాలేజీకి రాలేదు. కాల్ చేస్తే కోప్పడతారు. కాసేపు అయ్యాకా చేద్దాం అని ఆలోచిస్తూ నడుస్తుంటుంది. ఇంతలో కారులో నుంచి దిగి రిషి వస్తాడు. ఒకరినొకరు చూడకుండా ఒక చోట ఆగిపోతారు. లేట్ ఎందుకు అయింది అని అడగాలా. అడిగినా చెప్పరులే అని వసుధార మనసులో అనుకుంటుంది. విశ్వనాథం సార్ గురించి చెప్పాలా అని రిషి అనుకుంటాడు. ఏమైనా చెప్పాలా సార్ అని వసుధార అడిగితే.. ఈ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ మీరే రెడీ చేయండి అని రిషి అంటాడు. అంతేనా సార్. ఇంకేం లేదా అని వసుధార అంటుంది. మీకు నాకు మధ్య ఇంకేముందు మేడమ్ అని కఠువుగా అనేసి వెళ్లిపోతాడు రిషి.
నాకెందుకు చెప్పలేదు:ఇంతలో వసుధారకు ఏంజెల్ కాల్ చేసి విశ్వనాథంకు మైల్డ్ స్ట్రోక్ వచ్చిన విషయం చెబుతుంది. అందుకే నువ్ కాల్ చేసిన రెస్పాండ్ కాలేదు. రిషి కూడా ఇప్పటిదాకా ఉండి ఇందాకే కాలేజీకి వచ్చాడు అని ఏంజెల్ అంటుంది. సార్ కి ఎలా ఉంది. ఉండు నేను ఇప్పుడే వస్తున్నా అని కంగారుగా అంటుంది వసుధార. నువ్ క్లాసులు మానేసి వస్తే రిషి కోప్పడతాడు. విశ్వం కూడా అలా ఎందుకు చేశావ్ అంటాడు. కాలేజీ అయ్యాక రిషితో కలసి రా. నేను రిషికి చెబుతాను అని ఏంజెల్ ఫోన్ పెట్టేస్తుంది. ఇంత సీరియస్ విషయం కూడా నాకు ఎందుకు చెప్పలేదు రిషి సార్ అని అనుకున్న వసుధార తండ్రి చక్రపాణికి విశ్వనాథం విషయం చెబుతుంది. సాయంత్రం వాళ్ల ఇంటికి వెళ్లి చూసి వస్తానని అంటుంది.

వసును తీసుకురా:నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. నువ్ ఇప్పుడు ఏంజెల్ కు తోడుగా ఉండు. నేను కూడా వస్తానమ్మా అని చక్రపాణి అంటే వసుధార వద్దంటుంది. మరోవైపు ఏంజెల్ కు కాల్ చేసి విశ్వనాథం గురించి ఆరా తీస్తాడు రిషి. బాగుందని చెప్పినా ఏంజెల్.. నువ్ వచ్చేటప్పుడు వసుధారను కూడా తీసుకురా అని కాల్ కట్ చేస్తుంది. కాలేజీ తర్వాత వసుధార నడుచుకుంటూ వెళ్తుంటే కారులో వచ్చిన రిషి హారన్ కొడతాడు. అయినా వసు పట్టించుకోకుండా నడుస్తుంటుంది. నన్ను పిలిచి కారు ఎక్కమనే వరకు వెళ్లకూడదు అనుకుంటుంది. మేడమ్ అని రిషి పిలుస్తాడు. అయినా వసు నడుస్తుంటే.. ఏంటీ మేడమ్ మిమ్మల్నే పిలుస్తాన్నాను అని రిషి అంటాడు. హో నన్నా.. ఇంకెవర్నో పిలుస్తున్నారనుకున్నాను అని వెటకారంగా అంటుంది వసుధార.
వయసు ఆగదు:కారు ఎక్కమని రిషి అనడంతో ఎక్కుతుంది వసుధార. విశ్వనాథం గురించి ఎందుకు చెప్పలేదు. ఎస్సై గారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడుగుతుంది వసు. కానీ రిషి సరిగ్గా ఆన్సర్ చేయడు. నేనేందుకు మాట్లాడాలని అనుకుంటుంది వసు. ఏంజెల్ కు ధైర్యం చెప్పమని రిషి అంటాడు. సరే సార్ అని వసు అంటుంది. కట్ చేస్తే విశ్వనాథం దగ్గర కూర్చున్న వసు.. మీరు హెల్త్ కేర్ తీసుకుంటారు. ఇలా జరగడం ఏంటీ సార్ అంటుంది. వద్దన్నా వయసు, రోగం ఆగదు కదమ్మా. నాకు దిగులు అంతా ఏంజెల్ గురించే. తనది చిన్నపిల్లల మనస్తత్వం. తన ఇష్టానుసారమే పెంచాను. తనను నీ తోబుట్టువులా చూసుకోవాలి అని విశ్వనాథం అంటాడు.

థ్యాంక్యూ సార్:మీరు టెన్షన్ పడకండి సార్. నేను ఏంజెల్ ను చూసుకుంటాను. అయినా మీరు మంచి వాళ్లు. మీకు ఏం కాదు. నేను ఇక్కడే ఉండి ఏంజెల్ కు తోడుగా ఉంటాను అని వసుధార అంటుంది. ఇంతలో రిషి వస్తే అదే విషయం విశ్వనాథం చెబుతాడు. అవసరం లేదు. పనిమనిషిని చూశాను అని రిషి అంటాడు. దీంతో లేచి నేను ఇక్కడే ఉంటే మీకేంటి సార్ ప్రాబ్లమ్ అని వసు అంటుంది. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకు మీ పనులు ఉంటాయి కదా అని రిషి అంటాడు. నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్ సార్ అని చెప్పిన వసు.. ఏంజెల్ కిచెన్ లో ఉన్నట్టుంది చెప్పేసి వెళ్తాను అని విశ్వనాథంతో అంటుంది. వసుతో ఏంజెల్ ఇక్కడే తోడుగా ఉండమని చెబుతుంది. రిషి సార్ ఏమనుకుంటారో అని ఆలోచించినా.. తర్వాత ఓకే అంటుంది వసుధార.

అబద్ధం-సంతోషం:విశ్వనాథంకు జ్యూస్ ఇస్తుంది ఏంజెల్. అక్కడ రిషి లేకపోవడంతో.. తన గదికి వెళ్లి కాఫీ ఇవ్వమని వసుధారకు ఏంజెల్ చెబుతుంది. ముందు తటాపటాయించిన వసుతో ఏంజెల్ గట్టిగా చెప్పడంతో కాఫీ తీసుకెళ్తుంది. మీరెందుకు వచ్చారు మేడమ్ అని రిషి అంటాడు. ఏంజెల్ కాఫీ ఇమ్మని చెప్పింది. తను ఏది చెబితే చేయమని చెప్పారు కదా అందుకే తెచ్చాను అని వసు అంటుంది. ఏమైనా చెప్పాలా అని రిషి అంటాడు. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. కానీ మీరు వినరు. అయినా ఒక విషయం మాత్రం చెప్పాలని ఎందుకో అనిపిస్తుంది. ఒకసారి మహేంద్ర సార్ కు కాల్ చేసి మాట్లాడండి. చాలా సంతోషిస్తారు అని వసు అంటుంది. అందరి సంతోషాల గురించి ఆలోచించే మీరు.. ఆ క్షణంలో చెప్పే అబద్ధం నా సంతోషాన్ని మింగేస్తుందని మీకు తెలియదా అని మనసులో అనుకుంటాడు రిషి.


Click it and Unblock the Notifications











