Guppedantha Manasu: రిషికి బుక్కైన దేవయాని.. రిషిధార రొమాన్స్.. ఒంటరి మహిళనంటూ వసు ఆవేదన!
వసుధార ఇంటికి వెళ్లి.. చక్రపాణితో దేవయాణి గొడవ పడుతుంది. ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. నువ్వా నేనా అన్నంతలా మాట్లాడుకుంటారు. చక్రపాణి కోపం చూసి దేవయాని కొంచెం జంకుతుంది. ఇలా చక్రపాణి-దేవయాని గొడవ పడుతుండగా.. రిషి, వసుధార వస్తారు. పెద్దమ్మ మళ్లీ ఏదో గొడవ పెట్టుకున్నట్లు ఉంది అని అనుకున్న రిషి.. దేవయానిని వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు. ధరణి వంట చేసుకుంటూ ఉండగా.. మహేంద్ర ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ధరణి వంటకు ఏమైనా హెల్ప్ చేయనా అని జగతి అడిగితే.. వద్దులే చిన్నత్తయ్య అని ధరణి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 23 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 694లో ఇంకా ఏం జరిగిందంటే?

అపశకునాలు ఎందుకు..
ధరణి వద్దని చెప్పిన తర్వాత.. అక్కయ్య (దేవయాని) ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది జగతి. తెలీదు.. నేను వచ్చేసరికి ఇంట్లో లేరు అని ధరణి సమాధానం ఇస్తుంది. దీంతో వదిన బయటకు వెళ్లింది అంటే ఎవరికో మూడింది అని అర్థం అని మహేంద్ర అంటాడు. ఎందుకు మహేంద్ర అలా అపశకునాలు మాట్లాడుతావ్ అని జగతి అంటే.. అపశకునాలు కాదు జగతి.. నిజాలే కదా అని మహేంద్ర అంటాడు. ఇంతలో రిషితో దేవయాని రావడం చూసి ఆశ్చర్యపోతారు అందరూ. రా రిషి అని మహేంద్ర అంటే.. డాడ్ మీతో నేను తర్వాత మాట్లాడాను. పెద్దమ్మ మీరు ఇంకోసారి ఇలా చేయకండి అని రిషి అంటే.. అది కాదు రిషి అని దేవయాని అంటుంది.

రిషికి ఇష్టం లేని పనులు..
పెద్దమ్మా.. ఇప్పటివరకు మీరు నా బాగోగులు చూసుకున్నారు. నేను కాదు అనను. కానీ మా విషయంలో మాత్రం మీరేం మాట్లాడకండి. ఆ విషయం గురించి నేనే ఆలోచిస్తాను. మీరు దయచేసి ఇంకొకసారి వసుధార వాళ్ల ఇంటికి వెళ్లొద్దు. మళ్లీ నేను ఇలా మీకు చెప్పే పరిస్థితి తీసుకురాకండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. అయితే వసుధార వాళ్ల ఇంటికి వెళ్లకండి అని రిషి అనడంతో.. మహేంద్ర, జగతి, ధరణి ముగ్గురు షాక్ అవుతారు. ఎందుకు వెళ్లిందా అని ఆలోచిస్తారు. రిషి వెళ్లాక.. ముసి ముసి నవ్వుకున్నా జగతి.. ఎందుకు అక్కయ్య.. రిషికి ఇష్టం లేని పనులు చేస్తారు అని అంటుంది. జగతి.. నాకు ఏం చేయాలో నువ్ చెప్పాల్సిన అవసరం లేదు అని దేవయాని కోపంగా అంటుంది. అంతకుముందు ఇక్కడ ఇంకేం చేస్తున్నావ్ వంట చేసుకో పో అని ధరణిని బెదిరిస్తుంది దేవయాని.

రిషిని చూస్తూ అలానే..
మరోవైపు పాటలు వింటూ వంట చేసుకుంటుంది వసుధార. రిషి గురించి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. సార్ కి నాపై ఉన్న కోపాన్ని పెద్దగా పట్టించుకోను అనుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో చక్రపాణి బయటకు వెళ్లోస్తానని చెప్పి వెళ్లిపోతాడు. అది వసుధారకు వినిపించదు. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. నేను ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చాను. ఇదే మాట వసుధార అడిగితే నా దగ్గర సమాధానం ఏంటీ అనుకుంటూ చేతిలో నుంచి పెండ్రైవ్ తీసుకుని.. సమాధానం ఉందిలే అనుకుంటాడు. తర్వాత నాన్నా.. ఏం చేస్తున్నారు. ఆ టీపాయ్ ఖాళీ చేయండి.. నేను ఉప్మా చేస్తున్నాను అంటుంది వసుధార. అది రిషి క్లీన్ చేస్తాడు. అనంతరం నాన్న ఇక్కడికి రండి అని పిలుస్తుంది వసుధార. వెంటనే రిషి వెళ్లి వెనుకే నిల్చుంటాడు. అప్పుడే వసుధార వెనక్కి తిరిగి రిషిని చూసి అలాగే ఉండిపోతుంది. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది.

కోపం తగ్గలేదా సార్..
అలా ఇద్దరు కొద్దిసేపు చూసుకున్న తర్వాత ఉప్మా వైపు తిరిగి చూసి మళ్లీ వెనక్కి తిరిగే సరికి అక్కడ రిషి ఉండడు. ఏంటీ రిషి సార్ వచ్చినట్లు భ్రమ పడ్డానా అని అనుకుంటుంది వసుధార. ఇంతలో చక్రపాణి వచ్చి రిషి సార్ అని పిలవడంతో.. ఆశ్చర్యపోయి వంట గదిలో నుంచి బయటకు వస్తుంది వసుధార. సార్ ఎప్పుడు వచ్చారు. ఇప్పుడే వచ్చారా.. సర్ ఇందాకా మీరు కిచెన్ లోకి వచ్చారా అని వసుధార అంటుంది. కిచెన్ లో నాకేం పని. అదేమైనా నాకు హాబీనా అని రిషి అంటాడు. ఇంకా నా మీద కోపం తగ్గలేదా సార్. అన్నీ వివరంగా చెప్పాను కదా అని వసుధార అంటే.. పెన్ను, పెన్సిల్ తీసుకుంటే వచ్చే కోపం కాదు. పోవడానికి. వివరాలు నాకు అక్కర్లేదు అని రిషి అంటాడు. పొద్దున్నే వచ్చారు సార్ అని వసు అంటే.. పెన్ డ్రైవ్ ఇచ్చి.. ఇందులో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వివరాలు ఉన్నాయి. ఇవ్వి నువ్వు ప్రజంట్ చేయొచ్చు అని రిషి చెబుతాడు.

సమయం వచ్చినప్పుడు పెళ్లి..
అది కాలేజీలోనే ఇవ్వొచ్చు కదా అని అనుకున్న వసుధార.. ఈ కోపం ఎన్నాల్లు సార్.. నా వల్ల పొరపాటు జరిగింది అని అంటుంది. పొరపాటు కాదు వసుధార.. తప్పు జరిగింది. మరోసారి అడుగుతున్నాను నీ మెడలో ఉన్న తాళిని తీసేస్తావా.. తీయలేవు కదా అని రిషి అంటుండగా.. చక్రపాణి కాఫీ తీసుకొస్తాడు. రిషి సార్ ఉప్మా తింటారు అని వసు అంటే.. చక్రపాణి కాఫీ తాగుతారు అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. దీంతో నేను సెలవు తీసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు జగతి-మహేంద్ర కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు. రిషి-వసుధార సమస్య ఒక కొలిక్కి వచ్చింది కదా.. పెళ్లి చేద్దామం అని ఉంది.. కానీ రిషి ఒప్పుకోడేమో అని మహేంద్ర అంటాడు. రిషి మాటను గౌరవిద్దాం. నువ్వు తొందరపడకు అంటుంది జగతి. సమయం సందర్భం చూసి పెళ్లి గురించి మాట్లాడతానేమో అని అంటుంది.

నా ఉంగరం నాకు ఇచ్చేయ్..
మరోవైపు కాలేజీలో స్టూడెంట్స్ తో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ గురించి వసుధార స్పీచ్ ఇస్తుంది. ఇంతలో అక్కడికి రిషి వచ్చి వసుధార మాటలు వింటాడు. వసుధార బోర్డుపై రాస్తుండగా.. సైలెంట్ గా క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఒక బెంచ్ పై కూర్చుంటాడు. రిషి వచ్చింది గమనించని వసుధార ప్రాజెక్ట్ గురించి, నేను, మేము అనే విషయాలు చెబుతుంది. మధ్యలో రిషి సార్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదంతా నా భ్రమే అనుకుంటుంది. తర్వాత స్టూడెంట్స్ అందరూ వెళ్లాక.. రిషి నిజంగానే వచ్చాడని గమనించి.. సార్ ఎప్పుడొచ్చారని అడుగుతుంది. నా ఉంగరం నాకు ఇచ్చేయ్ అని రిషి అంటాడు. ఎలా ఇస్తారు సార్.. నేను ఇవ్వను అని వసుధార అంటే.. ఎందుకు ఇవ్వవు అని రిషి అంటాడు.

నువ్ చేసిన తప్పుకు నాకు శిక్ష పడింది..
అందులో నా పేరు కూడా ఉంది సార్.. వి అక్షరం నాకు ఇచ్చి. ఆర్ తీసుకోండి అని వసుధార అంటుంది. అలా ఎలా సాధ్యం అవుతుంది అని రిషి అంటాడు. మన పేర్లు కాదు సార్ కలిసిపోయింది. మన ఆత్మలు. మన బంధం కలిసిపోయింది. మెడలో తాళి బయటకు చూపిస్తూ ఈ రెండు అక్షరాలు ఎప్పిటీకీ ఇలాగే కలిసిపోవాలి. మనం కూడా కలిసే ఉండాలి అని వసుధార అంటుంది. బంధం అంటే బాధ పెట్టడం, దాపరికాలు ఉండటం అని ఎక్కడైనా ఉందా వసుధార అంటూ బాధగా మాట్లాడిన రిషి నువ్వే ఆలోచించూ. తప్పు నువ్వు చేశావ్ శిక్ష నాకు పడింది. ఇది ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. అప్పుడు వసుధార తనలో తానే మాట్లాడుకుంటూ బాధపడుతుంది. ఏదో జరిగిపోయింది సార్. ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే ఎలా. అప్పుడు ఏదో క్షణాన అలా చేశాను. ఒంటరి ఆడదాన్ని ఏం చేయగలను అనుకుంటూ బాధపడుతుంది వసుధార.


Click it and Unblock the Notifications











