Guppedantha Manasu: సినిమాను తలపించేలా ఎపిసోడ్.. అల్లుడు రాజీవ్ నిజస్వరూపం చక్రపాణికి తెలిసిందా?
దాబాలో మంచంపై పడుకుని వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార మాటలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీ ప్రేమ కావాలి రిషి సార్.. ఐ లవ్ యూ అన్న మాట నుంచి ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్న మాటల వరకు మొత్తం తలుచుకుని బాధపడిపోతుంటాడు రిషి. రిషి లేకుండా వసు పూర్తవదు. నా ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు. రిషి చేతులు నాకు ధైర్యం అని చెప్పిన వసుధార మాటలను మరోసారి గుర్తు చేసుకుంటాడు. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 7 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 654లో ఇంకా ఏం జరిగిందంటే?

రిషిధారలో నుంచి రిషి విడిపోడు..
జైల్లో వసుధార కూడా రిషి గురించి బాధపడుతూ ఉంటుంది. నేను ఉన్న ఈ పరిస్థితిలో మీకు ఏ విషయం చెప్పలేను సార్ అని కుమిలిపోతూ ఉంటుంది వసుధార. మరోవైపు వసుధార నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావ్.. బంధం అనుకుంటే భ్రమ అయ్యావా.. నువ్వు ఏం అడిగినా చెప్పవు.. నువ్వు వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతానా.. రిషిధార లోనుంచి రిషి విడిపోడు. ధారను విడిపోనివ్వడు అంటూ మంచం పై నుంచి లేస్తాడు రిషి. ఇంతలో ఆర్డర్ ప్లీజ్ అని బేరర్ వచ్చి అడిగితే.. ఏం వద్దని చెబుతూ టిప్ ఇచ్చి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు ఆస్పత్రిలో వసుధార తల్లిదండ్రులు ఉంటారు. బయట ఉన్న సెక్యూరిటీ వాళ్లు కాఫీ తాగేందుకని బయటకు వెళతారు.

మావయ్య నన్ను ఉత్తముడు అనుకుంటున్నాడు..
వసుధార తల్లిదండ్రులు ఉన్న ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇస్తాడు రాజీవ్. ఇద్దరినీ హాస్పిటల్ బెడ్ పై చూసి కొంతసేపు ఏదేదో మాట్లాడతాడు. అయ్యో మావయ్య.. అయ్యో అత్తయ్య ఎంత పని జరిగిపోయింది అంటూ మాట్లాడతాడు. మీలాంటి మావయ్య గారు ఉన్నంతవరకు నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ అత్తయ్య గారే సమస్య అంటూ సుమిత్ర బెడ్ దగ్గరికి వెళతాడు రాజీవ్. ఒకవేళ మీరు బతికితే నేను మిమ్మల్ని పొడిచాను అనే విషయం బయటకు తెలుస్తుంది. నన్ను మావయ్య ఉత్తముడు అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అసలు విషయం చెబితే నేను జైలుకు వెళతాను. మీరు చస్తారనుకుంటే చావలేదు. రేపో మాపో లేచి కూర్చుంటారు. తర్వాత జరిగింది మొత్తం మావయ్యగారితో చెప్పేస్తారు. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని రాజీవ్ అంటాడు.

రాజీవ్ మాటలు చక్రపాణి విన్నాడా..
మిమ్మల్ని పొడిచింది నేనే అని అందరికీ తెలిస్తే నా క్యారెక్టర్ ఏమైపోతుంది. మీరు బతికి నన్ను జైలుకు పంపిస్తారా.. మీరు చనిపోయి నా పెళ్లి జరిపిస్తారా ఆలోచించుకోండి. మీరు బతకడం అవసరమా.. మీరు బతికినా నాకు సపోర్ట్ చేయరు.. పుణ్యస్త్రీగా వెళ్లిపోయే వరాన్ని మీకు ప్రసాదిస్తాను అంటూ ఆక్సిజన్ తీసేస్తాడు రాజీవ్. ఇవే మీకు చివరి ఘడియలు అనేసి వెళ్లిపోతుంటాడు. అప్పుడే కళ్లు తెరిచిన చక్రపాణి.. రాజీవ్ బయటకు వెళ్లడం చూస్తాడు. అప్పటిదాగా రాజీవ్ అన్న మాటలు చక్రపాణి విన్నాడో లేదో తెలియలేదు. కానీ రాజీవ్ వెళ్లేటప్పుడు చూడటం.. అతని మాటలు విన్నట్లుగా చక్రపాణి హావాబావాలు అయితే కనిపించాయి. పక్కకు తిరిగి చూస్తే సుమిత్ర కాళ్లు చేతులు కొట్టుకోవడం కనిపిస్తుంది. సుమిత్ర అంటూ బలవంతగా అంటాడు. ఇంతలో అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు.

నాకు బాధ్యత ఉంది..
సుమిత్ర కాళ్లు చేతులు కొట్టుకోవడం చూసిన రిషి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడతాడు. డాక్టర్స్ ని పిలిచి ఆక్సిజన్ మాస్క్ ఎందుకు పెట్టలేదు. పేషెంట్ ను సరిగా చూసుకోరా అని అడుగుతాడు రిషి. ఎంత ఖర్చు అయిన సరే ట్రీట్మెంట్ ఇవ్వండి. వీళ్లకు ఎవ్వరు లేరనుకోకండి. నేనున్నాను అని రిషి అంటాడు. ఇదంతా చక్రపాణి వింటాడు. రిషి సార్ వజ్రం.. మంచి మనసున్న మనిషి అని వసుధార చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు తండ్రి చక్రపాణి. అప్పుడు చక్రపాణి కళ్లు కొద్దిగా కన్నీటితో కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే రిషి మంచితనం, రాజీవ్ నిజ స్వరూపం చక్రపాణికి తెలిసినట్లే అనిపిస్తుంది. డాక్టర్స్ తో రిషి మాట్లాడుతుండగా.. రాజీవ్ వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని రిషిని రాజీవ్ అడిగితే.. వీళ్లను చూసుకునే బాధ్యత నాకు ఉందని రిషి అంటాడు.

రిషి గాయాలను వసు ప్రేమ నయం చేసింది..
హాస్పిటల్ లో రాజీవ్, రిషి ఇద్దరు గొడవపడతారు. నీ కారణంగానే వసుధార జైలుకు వెళ్లింది. నిన్ను చూస్తే మావయ్య గుండెపోటుతో.. అత్తయ్య ఉరి వేసుకుని చనిపోతుంది అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు రాజీవ్. తర్వాత ఇద్దరిని చూసి డాక్టర్ వారిస్తాడు. వీళ్ల దగ్గర ఇద్దరు సెక్యూరిటిలను పెట్టండి అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు హోటల్ రూమ్ లో రిషి పరిస్థితిని చూసి బాధపడిపోతుంటారు జగతి-మహేంద్ర. మహేంద్ర నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా రిషికి ఎవరు ధైర్యం చెబుతారని జగతి అంటుంది. వసుధార రావడంతో రిషి జీవితంలో చాలా మార్పు వచ్చింది. అన్ని గాయాలను వసుధార ప్రేమ నయం చేసింది అని మహేంద్ర అంటాడు. మరోవైపు ఒక దగ్గర నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు రిషి.

రిషిని వదిలేశావా..
నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా.. ఎన్ని కబుర్లు చెప్పావ్. ఎన్నో అందమైన మాటలు చెప్పావ్. కొత్త జీవితాన్ని చూపించి ఇప్పుడు వెళ్లిపోమ్మంటున్నావ్. నా జీవితంలోకి రావడం వెళ్లడం అంతా నీ ఇష్టమేనా.. నువ్వు నన్ను మోసం చేశావా.. రిషిధారలో నుంచి రిషిని వదిలేశావా.. అని బాధపడతాడు రిషి ఒక్కసారిగా అరుస్తాడు. మరోవైపు జైల్లో ఉన్న వసుధార.. ఏడుస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు చెప్పలేను. నన్ను క్షమించండి సార్ అనుకుంటుంది వసుధార. ఇంకోవైపు రిషి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంటికి వెళ్లి చూస్తారు. కానీ అక్కడ రిషి ఉండడు. ఇంతలో ఇంటికి దేవయాని కారులో నుంచి ఎంట్రీ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











