Guppedantha Manasu: తల్లీ కొడుకులకు షాక్ ఇచ్చిన మహేంద్ర.. ఒకే ఇంట్లో వసు-రిషి
శైలేంద్ర, దేవయాని చేసిన దారుణాల గురించి మహేంద్రకు చెబుతుంది జగతి. వాళ్ల అంతు చూస్తానని మహేంద్ర అంటాడు. రిషి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కారణం కొడుకు, భార్య అని తెలిస్తే బావగారు తట్టుకోలేరు. ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని జగతి అంటే.. ఏంటీ జగతి అని మహేంద్ర అంటాడు. నాకు మీ ప్రాణాలే కాదు బావగారి ప్రాణాలు కూడా ముఖ్యమే. మీ అంతటా మీరు ఈ విషయం బయట పెడితే రిషి మీద ఒట్టే అని జగతి అంటుంది. ఏంటీ జగతి మొండిగా ప్రవర్తిస్తున్నావ్ అన్న మహేంద్ర తర్వాత ఊరుకుంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 30 శుక్రవారం నాటి ఎపిసోడ్ 803 లో ఇంకా ఏం జరిగిందంటే?
భయంతో ఆగిపోయా: వసుధార ఎక్కడుందో చెప్పు మహేంద్ర. రిషి ఎక్కడున్నాడో వసుధారకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. నీకు చెప్పకపోయినా నాకు చెబుతుంది. నేను బతిమాలైన రిషి ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అని జగతి అంటుంది. రిషి ఎక్కడున్నాడో నాకు తెలిసింది అని మహేంద్ర అంటాడు. అవునా, ఎక్కడున్నాడు. ఎలా ఉన్నాడు. కలిశావా.. మాట్లాడవా.. తనకు కోపం తగ్గిందా.. నా గురించి అడిగాడా చెప్పు మహేంద్ర ప్లీజ్ అని కంగారుగా అడుగుతుంది జగతి. ఎక్కడున్నాడో తెలుసు, కానీ కలవలేదు, మాట్లాడలేదు. రిషి ఇంకా ఆ బాధలోనే ఉన్నాడు. నేను కలిస్తే అటు నుంచి ఎటైనా పారిపోతాడో అన్న భయంతో కలవకుండా ఆగిపోయాను అని మహేంద్ర చెబుతాడు.

ఒకరికొకరు: వాడి గొంతు మాత్రం విన్నాను. రిషి మాట వినగానే నా మనసు కొంచెం కుదుటపడింది. స్వార్థం వల్ల నిందలు పాలైన మన కొడుకు ఒంటరి వాడు అయిపోయాడు. మన రిషి మన దగ్గరకు రావాలి. తన మీద పడిన నింద తొలగిపోయి రాజకుమారుడిగా ఈ ఇంటికి రావాలి అని మహేంద్ర అంటాడు. వస్తాడు మహేంద్ర. మనమే తీసుకొద్దాం అని జగతి అంటుంది. మరోవైపు గదిలో కూర్చుని రిషి గురించి వసుధార ఆలోచిస్తుంటే.. వసు గురించి రిషి ఆలోచిస్తాడు. నేను ఇక్కడున్నానని రిషి సార్ కి తెలిస్తే ఏం అనుకుంటారో అని వసు అనుకుంటుండుగా ఏంజెల్ వచ్చి ట్యాబ్ లెట్ వేసుకోమ్మని చెబుతుంది. ఇక్కడ నీకు ఏం అవసరం ఉన్నా నాకు చెప్పు. ఆఖరికి గోడ గడియారం ముల్లు సౌండ్ ఇబ్బందిగా అనిపించినా చెప్పు అని ఏంజెల్ అంటుంది.

గొడలు ఉన్నాయి: ఏంజెల్ అలా అనడంతో వసు నవ్వుతుంది. నీ స్మైల్ భలే ఉంటుంది. నీ స్మైల్ కు ఎంతోమంది పడిపోతారు. నా దగ్గర ఇలాగే ఉండాలి అని ఏంజెల్ చెప్పి రిషి దగ్గరికి వెళ్తుంది. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఏమైనా గమనించావా. సరే నాతో రా అని రిషిని వసుధార దగ్గరికి తీసుకెళ్తుంది ఏంజెల్. వసుని చూసిన రిషి షాక్ అవుతాడు. నేనే తనను తీసుకొచ్చాను. అంత దూరంలో ఉన్న ఇంటికి ఎందుకులే అని నాన్నకు చెప్పి తీసుకొచ్చాను. తను మాత్రం నువ్ ఫీల్ అవుతావని ఇబ్బంది పడుతోంది అని ఏంజెల్ అంటుంది. ఎవరో ఈ ఇంట్లో ఉంటే నేనేందుకు ఫీలవుతాను. ఎవరి రూమ్ వారిది. మధ్యలో గోడలు ఉన్నాయి కదా అని రిషి అంటాడు.

అవసరం ఉండదు:అదేంటి రిషి అలా మాట్లాడుతున్నావ్. మీ కాలేజీ లెక్చరరే కదా. ఎవరో అంటావేంటీ. రేపు తనకు సమస్య వస్తే అలానే వదిలేసి వెళ్తావా అని ఏంజెల్ అంటుంది. సార్ అలా వదిలేసే రకం కాదు. అలా అయితే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్తి, బిల్ ఎందుకు కడతారు అని వసు అంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు. ఇంత సాయం చేసి మళ్లీ ఏం తెలియనట్లు సైలెంట్ గా ఉంటావ్ అని ఏంజెల్ అంటే.. తన స్థానంలో ఎవరున్నా అదే చేసేవాడిని అని రిషి అంటాడు. ఎంతైనా రిషి జెంటిల్ మెన్ కదా వసుధార అని ఏంజెల్ అంటుంది. దీంతో వసు, రిషిలకు గతంలో వసు జెంటిల్ మెన్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. సర్లే ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్ మెంట్ చేయిస్తే సరిపోదు. పూర్తిగా తగ్గిందో లేదో కొంచెం గమనిస్తూ ఉండూ అని ఏంజెల్ అంటుంది. బహుశా నా అవసరం ఉండకపోవచ్చు అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అన్నయ్య కోసమా:మహేంద్ర డల్ గా ఉండటం చూసి ఏమైంది అని ఫణీంద్ర అడుగుతాడు. రిషి గురించి తప్పకుండా తెలుస్తుందిలే మహేంద్ర అని ఫణీంద్ర సర్ది చెప్పుతాడు. కాస్తా తలనొప్పిగా ఉంది అన్నయ్యా. జగతి హెడెక్ ట్యాబ్ లెట్ ఉందా అని జగతిని మహేంద్ర అడుగుతాడు. దీంతో శైలేంద్ర, దేవయాని ఒక్కసారిగా షాక్ అయితే.. ధరణి, ఫణీంద్ర సంతోషిస్తారు. మహేంద్ర నువ్వు జగతిని పిలిచావంటే కోపం పోయినట్టే కదా. నాకు చాలా సంతోషంగా ఉంది అని ఫణీంద్ర అంటాడు. మీకోసం, మీరంతా బాధపడుతున్నారని, నా కోపం, పంతం పక్కన పెట్టాను అన్నయ్య అని మహేంద్ర చెబుతాడు. అన్నయ్య కోసం మాట్లాడుతున్నాడా. ఇంకా నేను కోపం పోయిందేమో అనుకున్నాను అని దేవయాని మనసులో అనుకుంటుంది.
అలా జరగదమ్మా:ఉదయాన్నే వసుకి ఏంజెల్ ట్యాబ్ లెట్ ఇస్తుంటే రిషి వచ్చి గుమ్మం దగ్గర నిలబడతాడు. తర్వాత రిషికి కాఫీ పెట్టిస్తా అని ఏంజెల్ వెళ్లిపోతుంది. ఇంతలో వసుకు చక్రపాణి కాల్ చేస్తాడు. మహేంద్రను ఇంటికి తీసుకొచ్చినట్లు, రిషి సార్ ఎక్కడున్నారో చెప్పినట్లు చక్రపాణి చెబుతాడు. అయ్యే నాన్నా అలా ఎందుకు చెప్పారు. ఇప్పుడు మహేంద్ర సార్ వచ్చి రిషి సార్ ని చూస్తే నాపై కోపం ఇంకా పెంచుకుంటారు అని వసు కంగారుపడుతుంది. అలా జరగదమ్మా.. నేను బావగారికి అన్ని వివరంగా చెప్పాను అని చక్రపాణి అంటే.. ఇంకా ఏం చెప్పలేదు కదా అని వసు అంటే.. లేదమ్మా అని చక్రపాణి అంటాడు. వసును చూద్దామాని వచ్చిన రిషి గుమ్మం వద్దే ఆగి.. నాకేం అవసరం అనుకుని వెళ్లిపోతాడు. మరోవైపు జగతిని అన్న మాటలు తల్చుకుంటూ మహేంద్ర బాధపడుతుంటాడు.


Click it and Unblock the Notifications











