Guppedantha Manasu: దేవయాని ఊహించని స్కెచ్.. వ్రతం పేరుతో అలా.. షాక్ లో రిషి ధార!
దేవయాని అన్న మాటలకు ఏడుస్తూ వంటగదిలోకి వెళ్తుంది ధరణి. అది చూసి దేవయాని తప్పా అంతా బాధపడతారు. భోజనం తర్వాత వంట గదిలోకి వెళ్లి వదినా అని వెతుకుతాడు రిషి. ఇంతలో ధరణి వచ్చి ఏం రిషి ఇలా వచ్చావని అడుగుతుంది. జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించుకుంటాం. కానీ అన్నీ జరగవు కదా అని ధరణి అంటుంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా జరగని పనులు అప్పుడప్పుడు అలవోకగా అవుతాయి. ఇన్నాళ్లు అన్నయ్య రాకపోవడం మీరు ఓపికగా ఎదురుచూడటం గ్రేట్. శైలేంద్ర అన్నయ్య త్వరలోనే వస్తాడు అని రిషి అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 15 బుధవారం నాటి తాజా ఎపిసోడ్ 711లో ఇంకా ఏం జరిగిందంటే?

ఇప్పుడు అడుగుతుందా..
రిషి అలా అనడంతో.. శైలేంద్ర వస్తాడో రాడో అని కూడా డౌట్ వచ్చింది అని ధరణి అంటుంది. శైలేంద్ర అన్నయ్యతో నేను మాట్లాడతాను అని రిషి చెబుతాడు. ఇదంతా గోడచాటుకు ఉండి వింటుంది దేవయాని. ఇదంతా వసుధార వల్లే అని తిట్టుకుంటుంది. ఇప్పటివరకు నేను పెద్దత్తయ్య గారిని శైలేంద్ర గురించి అడగలేదు అని ధరణి అంటే.. ఏంటీ ఇప్పుడు అడుగుతుందా. ఏంటీ రిషికి ఎందుకు అంత ఇంట్రస్ట్. ఆ వసుధార వల్లే అని రగిలిపోతుంది దేవయాని. శైలేంద్ర విషయంలో కలుగుజేసుకోవద్దని రిషితో మాట్లాడాలా అని అనుకున్న దేవయాని.. వద్దులే నేను చేసేది చేస్తే అయిపోద్ది. దానికి అడగడం ఎందుకు అని అనుకుంటుంది. తర్వాత వసుధార రూమ్ కి వెళతాడు రిషి. అక్కడ వసుధార కనిపించకపోవడంతో ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు రిషి.

తల్లిదండ్రులు ఆలోచిస్తారు..
మేడపైకి వెళ్లి రిషి చూస్తే అక్కడ వసుధార వాళ్ల నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. కోడలినే కానీ కోడలిని కాను. ఇక్కడ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. హోలీ పండుగ చాలా బాగా చేసుకున్నాను నాన్నా. పండుగలో ఎన్ని రంగులో.. రిషి సార్ హోలీ పండుగలను ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంటూ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు. దీంతో నాన్న మళ్లీ కాల్ చేస్తా అని కట్ చేస్తుంది వసుధార. నీకోసం అంతా వెతికి ఇక్కడికి వచ్చాను. మీ అమ్మా నాన్నకి బాగానే కలరింగ్ ఇస్తున్నావ్ కదా అని రిషి అంటాడు. కలర్స్ పండుగ చేసుకున్నా కదా అని వసుధార అంటే. ప్రతి విషయం చెప్పాలా, మభ్య పెడుతున్నావా అని రిషి అంటాడు. తప్పదు సార్.. అత్తింటికి వచ్చిన అమ్మాయి గురించి తల్లిదండ్రులు అలానే ఆలోచిస్తారు అని వసుధార అంటుంది.

అమావాస్య.. వెన్నెల..
మీరు నాకోసం రావాలా కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అని వసుధార అంటుంది. నువ్వు నా గదికి వచ్చే టైం రాలేదు. అందుకే నేను వచ్చాను అని రిషి అంటాడు. మనం అన్న పదం అందంగా వినిపించేది. ఇప్పుడు అర్థం మారింది అని వసుధార అంటుంది. పదం మారలేదు మన చేసిన పనులు మారాయి. దాపరికాలు లేని ప్రేమను అడిగాను. బంధమే దాపరికం అయింది అని రిషి అంటాడు. నేను వెన్నెల కోసం ఎదురుచూస్తున్నాను అని వసు అటే.. అమావాస్య రోజు వెన్నెల కోసం ఎదురుచూడటాన్ని ఏమంటారు అని రిషి అంటాడు. అమావాస్య అయినా సగం రోజులే కదా అని వసుధార అంటే.. మన ప్రేమని చూడు మన బంధాన్ని కాదు. దగ్గరున్నామా దూరం ఉన్నామా అని రిషి అంటాడు. దగ్గరే ఉన్నాం కానీ దగ్గర కాలేకపోతున్నాం అని వసు అంటుంది. ఇద్దరినీ ఓ గీత వేరుచేస్తోంది. ఆ గీత గీసింది నవ్వే వసుధార అని రిషి అంటాడు.

నన్ను ఇదే భయపెడుతోంది..
వసు, రిషిని వెతక్కుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది దేవయాని. పైకి వచ్చి మళ్లీ రిషిధార మాటలను చాటుగా వింటుంది. అందమైన కల హఠాత్తుగా మెలకువ వచ్చినట్లుందని రిషి అనగానే చేయిపట్టుకుంటుంది వసుధార. నువ్వు వచ్చాక కొత్తగా పుట్టానేమో అనిపిస్తుంది. కానీ అంటూ వసు చేతులు వదిలేస్తూ నిజాన్ని కాదనలేను. ప్రేమను కాదనలేను అని రిషి అంటాడు. మన మధ్య ప్రేమ ఎంతుదే దూరం కూడా అంతే ఉంది. ఇదే భయపెడుతోంది నన్ను అని వసుధార అంటుంది. ఇదే కదా నాకు కావాల్సింది. నాకు పనికొచ్చేదే అని నవ్వుకుంటుంది దేవయాని. తర్వాత రిషి వెళ్లిపోతాడు. ఈ దూరం ఈ భారం మీరే తగ్గించాలి సార్ అనుకుంటుంది వసుధార. మరోవైపు ధరణి గురించి ఆలోచిస్తూ ఉంటారు జగతి మేహంద్ర.

కంగారు పడకు జగతి..
అక్కయ్య ధరణిని కావాలని ఇబ్బంది పెడుతోంది. అందుకే ఆవిడ మనసు మార్చాలని చూడటం కన్నా శైలేంద్రను రప్పించే ప్రయత్నం చేయడం మంచిది. సమయం చూసి నేను రిషికి చెబుతాను. ఈ విషయంలో నువ్వు తొందరపడి ధరణికి లేనిపోని తలనొప్పులు తీసుకురావొద్దు అని చెబుతుంది జగతి. మరునాడు ఉదయం అందరికీ కాఫీ తీసుకొస్తుంది దేవయాని. ఈరోజు ఎవ్వరు కాలేజీకి వెళ్లడం లేదు. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం అని దేవయాని చెబుతుంది. సడెన్ గా వ్రతం ఏంటీ అని మహేంద్ర అడిగితే.. కొత్తగా పెళ్లయిన దంపతులు ఇంట్లో ఉండగా వ్రతం చేసుకోవడం ఆచారం కదా. నీకు జగతికి ఇలాంటివి పట్టవు. అందుకే నేనే అన్నీ సిద్ధం చేయించాని అని దేవయాని అంటుంది. ముత్తైదువులను కూడా పిలుస్తున్నాం అని అంటుంది దేవయాని. దీంతో జగతి మహేంద్ర లోపలికి వెళ్తుంటే.. వ్రతానికి కావాల్సినవి నేను తెప్పించాను. నువ్వు కంగారు పడకు జగతి అని దేవయాని చెబుతుంది.

అనుకున్నంత గయ్యాళీ..
వసుధార, రిషి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇదే కదా నాకు కావాల్సింది అని దేవయాని అనుకుంటుంది. వదిన ప్రవర్తన తేడాగా ఉంది అని మహేంద్ర అంటే.. అవును మహేంద్ర అక్కయ్య ఏం చేసినా అందులో ఏదో ఉంటుంది అని జగతి అంటుంది. అయినా అన్నయ్యా వదిన వ్రతం చేస్తారేమో అని సర్దిచెప్పుకుంటారు. కానీ ఏదో ఉందని అనుకుంటారు. మరోవైపు వ్రతానికి అన్నీ సిద్ధం చేస్తారు దేవయాని, జగతి. ఇల్లంతా కళగా కనిపిస్తోంది కదా. ఇంట్లో ఏదైనా పూజ జరిగితే ఆ కళే వేరు. మనసుకి ఆనందంగా ఉంటుంది. మీరు నన్ను గయ్యాళిలా చూస్తారు. కానీ మీరు అనుకున్నంత గయ్యాళిని కాదు. నేను ఈ వ్రతాన్ని మనం ఇద్దరం కలిసి ఎలాంటి ఆటంకం లేకుండా జరిపిద్దాం సరేనా అని జగతితో అంటుంది దేవయాని. ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు అని జగతి అంటే.. చెప్పాలి కదా అని తనవెంట తీసుకెళ్తుంది దేవయాని.


Click it and Unblock the Notifications











