Guppedantha Manasu: మనసును కలిచివేసే ఎపిసోడ్.. ఒంటరిగా రిషి.. ఆ ట్విస్టుతో శైలేంద్రకు పెద్ద దెబ్బ
కాన్ఫరెన్స్ హాల్లో విచారణ జరుగుతూనే ఉంటుంది. అంతా వసుధార చెప్పే నిజం కోసం ఎదురుచూస్తుంటారు. వసుధార చెప్పు.. ఆ చెక్ మనం ఇష్యూ చేశామా అని నిలదీస్తాడు రిషి. వసుధార అది నిజం కాదని చెప్పు. రిషి తప్పు చేయడు కదా అని శైలేంద్ర కావాలనే అంటాడు. దీంతో వసు మౌనంగా మనసులోనే అల్లాడిపోతుంది. వసుధార అడుగుతున్నారు కదా. చెప్పు అని గట్టిగా అరుస్తాడు రిషి. రిషి సార్ జీవితం నీ చేతుల్లో ఉంది. నోరు తెరచి నిజం చెప్పమని ఇండైరెక్ట్ గా అబద్దం చెప్పమని జగతి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 26 శుక్రవారం నాటి ఎపిసోడ్ 773లో ఇంకా ఏం జరిగిందంటే?
అబద్ధం చెబుతున్నావ్: చెప్పు వసుధార నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిజమే చెప్పు. నిజమైతే నిజమని చెప్పు. లేకుంటే అబద్దం అని చెప్పు అంతే అని మినిస్టర్ అంటాడు. చెప్పు వసుధార అని మరోసారి గట్టిగా అరుస్తాడు రిషి. దీంతో ఆ చెక్ రిషి సారే ఇచ్చారు అని వసుధార అంటుంది. దీంతో రిషితోపాటు మంత్రి, ఫణీంద్ర షాక్ అవుతాడు. దేవయాని, శైలేంద్ర, సారథి సంతోషిస్తారు. వెంటనే లేచిన ఫణీంద్ర.. వసుధార ఏం మాట్లాడుతున్నావ్. రిషి తప్పు చేయడం ఏంటీ. ఏమైనా పొరబడుతున్నావా. సరిగా గుర్తు చేసుకుని చెప్పు అని ఫణీంద్ర అడుగుతాడు. నిజం చెప్పు వసుధార. ఎందుకు అబద్దం చెబుతున్నావ్ అని శైలేంద్ర కోపం నటిస్తూ అంటాడు.

నిస్సహాయంగా రిషి:వసుధారను లేపి నా కళ్లలోకి చూసి చెప్పు.. నేను ఆ చెక్ ఇచ్చానా అని రిషి అడుగుతాడు. అవును, వసుధార ఇందులో ఏదైనా మతలబు ఉందా. రిషి నాకు తెలిసి ఇలా చేయడు అని మంత్రి అంటాడు. ఏం లేదు సార్ నిజమే చెబుతున్నాను. రిషి సారే ఆ చెక్ ఇష్యూ చేశారు అని వసు అంటుంది. అటు చూసి కాదు. నావైపు చూసి చెప్పు. నా కళ్లలోకి చూసి చెప్పు అని రిషి బాధగా అంటాడు. దీంతో అతి కష్టంగా మీరే ఇచ్చారు సార్ అని వసుధార అంటుంది. దీంతో వసుని వదిలి, వెనక్కి నిస్సహాయంగా అడుగులు వేస్తాడు రిషి. వసు పట్టుకోబోతుంటే వద్దని చేయి చూపిస్తాడు. దేవయాని, శైలేంద్ర అసలు ఏంటీ ఇది అని దొంగ ప్రేమ నటిస్తారు. ప్రాణానికి ప్రాణమైన వసు చెప్పింది కదా అని కఠినంగా అంటుంది జగతి.
నాకు శిక్ష పడాలి: వసుధార కూడా చెప్పింది దీనిపై ఏమైనా చెప్పాలనుకుంటున్నావా రిషి అని మంత్రి అంటాడు. నిస్సహాయంగా, బల్లకు చేతులు ఆనించి నిలబడిన రిషి.. జగతి మేడమ్, వసుధారలు కలిసి నేను తప్పు చేశానని నిరూపించాకా చెప్పడానికి ఇక ఏముంది. తప్పు చేశాను.. మనుషుల్ని నమ్మి కచ్చితంగా తప్పు చేశాను. మోసం చేశాను.. నా మనసాక్షిని మోసం చేశాను. అడ్డంగా దొరికిపోయాను. దొరికిపోయి దోషిలా నిలబడ్డాను. మనుషుల విషయంలో నా అంచనాలు తప్పాయి. అంతకు మించిన తప్పు ఇంకేముంటుంది. దోషిగా నేను మీ ముందున్నా. నాకు శిక్ష పడాలి. ఈ రిషీంద్ర భూషణ్ కు మీరు వేసే శిక్ష ఏంటో చెప్పండి అని రిషి చెప్పే మాటలు మనసును కలచివేయక మానదు.

శైలేంద్రకు షాక్:రిషి అలా చెబుతుంటే లోలోపలే కుమిలిపోతారు వసుధార, జగతి. చెప్పండి జగతి మేడమ్ అని మంత్రి అడుగుతాడు. ఇక నుంచి నువ్వు కాలేజీ ఎండీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. కాలేజీ బోర్డ్ తో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఏ విద్యాసంస్థల్లో కూడా ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి వీల్లేదు. ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పదవులు చేపట్టడానికి వీల్లేదు అని జగతి కన్నీళ్లతో చెబుతుంటే రిషి గుండె మరింత బరువెక్కుతుంది. ఇప్పుడు కాలేజీ ఎండీ పదవిని ఎవరు చేపడతారు అని శైలేంద్ర అడుగుతాడు. దానికి జగతి మేడమ్ అని మంత్రి చెప్పడంతో శైలేంద్ర ఒక్కసారిగా కంగుతింటాడు. ఏంటీ సార్ అని కన్ఫ్యూజన్ లో శైలేంద్ర అడిగితే అవును జగతి మేడమ్ ఇక నుంచి ఎండీ బాధ్యతలు తీసుకోవాలి అని మినిస్టర్ అంటాడు.
కోపంగా, బాధగా రిషి:ఈ కాలేజీ బోర్డ్ నుంచి రెండు నెలల క్రితమే జగతి మేడమ్ ఎండీ పదవి చేపడుతున్నట్లుగా మాకు లెటర్ వచ్చింది. దానిపై రిషి సైన్, బోర్డ్ ఆమోదం కూడా ఉంది అని మినిస్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. గతంలో వసు మోసం చేసిందన్న బాధలో కాలేజీ వదిలి పోవాలని, జగతిని ఎండీ సీటులో కూర్చోబెట్టాలని రిషి చేసింది గుర్తు చేసుకుంటాడు. మినిస్టర్ గారు చెప్పింది నిజమే. ఇక నుంచి జగతి మేడమే ఎండీ. నాకు ఈ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు విధించిన శిక్షని సంతోషంగా స్వీకరిస్తాను నిబంధనకు కట్టుబడి ఉంటాను అని రిషి అక్కడి నుంచి వెళ్లబోతుంటే రిషి అని పిలుస్తుంది జగతి. ఇంకా చెప్పేది ఏమైనా మిగిలి ఉందా మేడమ్ అని రిషి కోపంగా, బాధగా అంటాడు.

మళ్లీ అడుగు పెట్టను:ఈ అభియోగం నిజం కాదని నిరూపించగలిగిన వెంటనే ఈ శిక్ష వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తర్వాత నువ్వు మళ్లీ కాలేజీ ఎండీగా పదవి చేపట్టవచ్చు అని జగతి అంటుంది. దానికి కోపంగా అక్కర్లేదు.. నేను ఎప్పటికీ డీబీఎస్టీ కాలేజీలో అడుగు కూడా పెట్టను. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లోను, మీ జీవితాల్లో కూడా ఉండలేను. శిక్షను మోస్తూ మాముము మనిషిగా మీ ముందు తిరగడం నా వల్ల కాదు. రిషి మోసగాడు, నేరస్తుడు. ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతాను. ఇందులో ఎలాంటి మార్పులేదు. నన్నెవరూ ఆపే ప్రయత్నం చేయొద్దు. ఇక నుంచి ఈ రిషీంద్ర భూషణ్ ఒంటరి అని రిషి ముందుకు కదులుతాడు. దీంతో జగతి, వసు గుండె ముక్కలవుతుంది.
ఇది మాయని మచ్చ:వెంటనే రిషి అంటూ వచ్చి చేయి పట్టుకుంటుంది దేవయాని. నువ్వు వెళ్లడం ఏంటీ నాన్న నేను తట్టుకోలేను అని డ్రామా చేస్తుంది. నా జీవితంలో ఇది ఒక మాయని మచ్చ. ఎవరు ఏంటో నాకు పూర్తిగా తెలిసింది. తప్పు చేసి పారిపోవట్లేదు. తప్పు ఎవరు చేశారో ఆ పైవాడికి తెలుసు. నా చుట్టు ఉన్న మనుషుల మీద నాకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నాకు అవసరం లేదు. నాకు ఎవ్వరూ అవసరం లేదు. జాగ్రత్త అని వెళ్లిపోతాడు రిషి. తన వెంటే వసు, జగతి వెళ్తుంది. కట్ చేస్తే.. కారులో వెళ్తూ జరిగినదాని గురించి సంతోషిస్తుంటారు దేవయాని, శైలేంద్ర. కానీ ఆ ట్విస్ట్ మాత్రం ఊహించలేదు మమ్మీ అని ఎండీ సీట్ గురించి శైలేంద్ర అంటాడు. దాన్ని కూడా జగతి నుంచి తీసుకోవచ్చు. టెన్షన్ పడకు. రిషీ కూడా మళ్లీ తిరిగి రాడు. నిశ్చింతగా ఉండు అని దేవయాని అంటుంది.


Click it and Unblock the Notifications











