Satyabhama : సత్య పాత్రకు షాకింగ్ రెమ్యునరేషన్ , దేబ్జానీ మోదక్‌కు ఒక్కరోజు పారితోషికం ఎంతంటే?
ఒకప్పుడు నటీనటులు సీరియల్స్ చేస్తున్నారంటే ఎన్నో విమర్శలు ఎదుర్కొనేవారు. సినిమాల్లో అవకాశాలు లేక , ఏ దిక్కూ లేక చివరికి సీరియల్స్ చేస్తున్నారా అంటూ సూటిపోటీ మాటలతో హింసించేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. టీవీలు, డీటీహెచ్, స్మార్ట్ ఫోన్, ఓటీటీలు రావడంతో బుల్లితెర పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సినిమా మార్కెట్‌తో సమానంగా పాపులారిటీలోనూ, ఆదాయంలోనూ పోటీపడుతోంది టెలివిజన్ రంగం.
గతంలో టీవీ ఆర్టిస్ట్‌లంటే చిన్న చూపు ఉండేది .. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు బుల్లితెర నటీనటులకు సినీ తారలతో సమానంగా , వారికంటే ఎక్కువగానే క్రేజ్ ఉంటోంది. భారీ రెమ్యునరేషన్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ విషయంలో సినిమా వాళ్లకే పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్స్‌లో నటిస్తున్న నటీనటీలకు బాగానే రెమ్యునరేషన్ దక్కుతోంది . ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్ దుమ్మురేపుతున్నాయి. టీఆర్పీ విషయంలో స్టార్ మా సీరియల్స్ శిఖరాగ్రాన ఉన్నాయి. టాప్ హీరోల సినిమాలకు మించి సీరియల్స్ రేటింగ్ సాధిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. స్టార్ మా సీరియల్స్‌లో ఒకటైన సత్యభామకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో సత్యగా లీడ్ రోల్‌లో నటిస్తున్నారు దేబ్జానీ మోదక్. డింపుల్ బ్యూటీగా హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతుంటారు ఈ బెంగాలీ ముద్దుగుమ్మ.
1996 మార్చి 20న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దేబ్జానీ మోదక్ జన్మించారు. ఆమె తండ్రి అపూర్భా మోదక్ వ్యాపారవేత్త కాగా, తల్లి మితా మోదక్ గృహిణి. కోల్‌కతాలోని సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్లస్ 2 తర్వాత నటన వైపు రావడంతో కరస్పాండెన్స్ ద్వారా బీఏ ఇంగ్లీష్ హానర్స్ పూర్తి చేశారు దేబ్జానీ. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. ఇంట్లో వాళ్లు దేబ్జానీని కిన్ని అని ముద్దుగా పిలుచుకుంటారు.

2013లో నాకౌట్ అనే బెంగాలీ సినిమాతో దేబ్జానీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. తర్వాత గ్యాంగ్‌స్టర్ కింగ్, క్లాప్ స్టిక్ వంటి సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో బెంగాలీ సీరియల్స్‌లో అవకాశం రావడంతో అటు వైపు వెళ్లి బుల్లితెరపై స్టార్‌గా ఎదిగారు. ఇదే సమయంలో సౌత్ నుంచి ఆఫర్లు రావడంతో తొలుత తమిళంలో సన్ టీవీ నిర్మించి రసతి, వనతై పోలా ధారావాహికలలో నటించారు. అనంతరం స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌తో తెలుగువారిని పలకరించారు. ప్రస్తుతం జెమినీలో బంగారు చెల్లెలు, స్టార్ మాలో సత్యభామ సీరియల్స్‌లో నటిస్తున్నారు దేబ్జానీ మోదక్.
అంతా బాగానే ఉంది కానీ సత్యభామ సీరియల్‌లో సత్య రోల్ పోషించినందుకు గాను దేబ్జానీ మోదక్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ఒక రోజుకు రూ. 20 వేల చొప్పున పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా బుల్లితెర వర్గాల టాక్. దాదాపు నెలలో 25 రోజుల పైనే షూటింగ్‌లో పాల్గొనే దేబ్జానీ నెలకు సుమారు రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











