అందుకే జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయా.. హైపర్ ఆది ఇన్ని అవమానాలు పడ్డారా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పంచుల వర్షం కురిపిస్తూ, పదునైన ప్రాసలతో నవ్వులు పూయించే ఈ కమెడియన్, బుల్లితెర నుంచి వెండితెర వరకూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్నారు హైపర్ ఆది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను భావోద్వేగంగా పంచుకున్నాడు. ముఖ్యంగా తొలిసారి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయినా సందర్భం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
హైపర్ ఆది తన కామెడీ కెరీర్‌ను 'జబర్దస్త్' షోతో ప్రారంభించాడు. మొదటగా అదిరే అభి టీమ్‌లో మెంబర్‌గా చేరిన ఆది, తన ప్రత్యేకమైన పంచులు, ప్రాసలతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు గెలిచాడు. వేదికపై అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ ట్యాలెంట్‌తోనే అనతి కాలంలో టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో జబర్దస్త్ షో నుంచి బయటకు రావాల్సి వచ్చిన సందర్భం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆది వెల్లడించాడు. ఆ దశలో తనపై విమర్శలు, అవమానాలు ఎదురయ్యాయని చెప్పాడు.అయినా.. ఆ కష్టాలే తనను మరింత బలంగా మార్చాయని, కొత్త అవకాశాల కోసం ప్రయత్నించేందుకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు.

జబర్దస్త్ తర్వాత హైపర్ ఆది ప్రయాణం సినిమాల వైపు మళ్లింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన 'మేడ మీద అమ్మాయి' సినిమాలో నటించడమే కాకుండా, ఆ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశాడు. ఇది అతని కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. నటుడిగా మాత్రమే కాదు, రచయితగా కూడా తన సత్తా చాటాడు. తర్వాత తొలి ప్రేమ, ఆటగదరా శివ, సవ్యసాచి, మిస్టర్ మజ్ను, చిత్రలహరి, వెంకీ మామ, అలా వైకుంఠపురం, క్రాక్, ధమాకా, సార్, దాస్ కా ధమ్కీ, గ్యాంప్స్ ఆఫ్ గోదావరి, పుష్ప 2, మజాకా వంటి పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. పవన్ కల్యాణ్‌పై ఉన్న తన అభిమానాన్ని ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు.
ఇటీవల హైపర్ ఆదికు సంబంధించిన ఓ తాజా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ ఆరంభ దశలో ఎదుర్కొన్న పరిస్థితులు, జబర్దస్త్ షోలోకి ఎలా వచ్చాడన్న విషయాలను ఆసక్తికరంగా వెల్లడించారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. తాను మొదటినుంచే జబర్దస్త్‌కి రావాలనే ప్లాన్‌తో ఎప్పుడూ లేనని స్పష్టంగా చెప్పారు. 'కేవలం జబర్దస్త్ మాత్రమే అనుకొని నేను అక్కడికి వెళ్లలేదు. నిజానికి అసలు ఈ షోలోకి రావాలనే ఆలోచన కూడా లేదు. ఒకచోట కూర్చుని చేసే జాబ్ నాకు బాగా బోర్ కొట్టింది. కానీ పక్కన ఉన్న వాళ్లను నవ్వించడం అంటే మాత్రం నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అలా ఇతరులను నవ్వించడానికి నాకు కనిపించిన ఒక దారి జబర్దస్త్. అంతేకానీ ముందుగానే ఇందులోకి వెళ్లాలని డిసైడ్ అయ్యి రాలేదు'అని వివరించారు.
అలా సరదాగా చేస్తూ.. అప్పట్లో సంచలనం సృష్టించిన 'అత్తారింటికి దారేది' సినిమా క్లైమాక్స్‌ను స్ఫూఫ్ చేస్తూ ఓ వీడియో చేశామని ఆది చెప్పారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా వేల మంది చూశారని, ఆ స్పందన తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అదే వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, కామెడీ షో జబర్దస్త్‌లో కీలకంగా ఉన్న అదిరే అభి చూసి, 'బాగా చేశావ్ బ్రదర్... ఒకసారి కనిపించు' అంటూ మెసేజ్ పెట్టారని తెలిపారు. అదే తన జీవితానికి కీలక మలుపుగా మారిందని ఆది చెప్పుకొచ్చారు. 'అలా నేను జబర్దస్త్‌లోకి ఎంటర్ అయ్యా. షోలోకి వెళ్లిన వెంటనే అక్కడి టీమ్ మెంబర్స్‌తో కలిసి ఫొటోలు దిగాం. అవి ఫేస్‌బుక్‌లో పెట్టేశాను. అప్పటివరకూ నా పోస్టులకు రెండు మూడు లైక్‌లు కూడా కష్టంగా వచ్చేవి. కానీ ఆ ఫొటోలు పెట్టిన తర్వాత ఒక్కసారిగా వందల్లో లైక్‌లు వచ్చాయి. అప్పుడే నాకు అర్థమైంది... కేవలం ఫొటోలకే ఇంత రెస్పాన్స్ వస్తే, వాళ్లతో పాటు వేదికపై ఉంటే ఇంకెంత క్రేజ్ వస్తుందో అని'అన్నారు.
అయితే.. అదే ఇంటర్వ్యూలో హైపర్ ఆది తన కెరీర్‌లో తొలిసారి స్టేజ్ ఎక్కిన అనుభవాన్ని భావోద్వేగంగా పంచుకున్నారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. 'నేను మొదటిసారి స్టేజ్ ఎక్కినప్పుడు పెద్దగా ఏమీ చేయాల్సిన సీన్ కూడా కాదు. కమెడియన్ సునీల్ గారు సినిమా ప్రమోషన్ కోసం జబర్దస్త్‌కు వచ్చారు. ఆయనను రిక్షాలో కూర్చోబెట్టి స్టేజ్ మీదకు తీసుకురావాలి. జస్ట్ ఆయనను లాక్కుని తీసుకురావడమే నా సీన్. 'అలా కనిపించినా చాలు' అని అప్పట్లో అనుకున్నా. కానీ ఆ సీన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి... మెరుపుతీగ లాగానే" అంటూ సరదాగా గుర్తు చేసుకున్నారు.
ఆ సీన్ తర్వాత తన ఫుటేజ్ ఎంత చిన్నదో చెప్పుతూ.. 'యూట్యూబ్‌లో ఆ స్కిట్‌ను పాస్‌లో పెట్టుకుని చూస్తే తప్ప నేను కనిపించలేను. అప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది. 'ఇది చేయడానికేనా మంచి జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి వచ్చాను?' అని నాలో నేనే బాధపడ్డాను'అన్నారు. అయినా ధైర్యం కోల్పోకుండా వరుసగా స్కిట్లు చేస్తూ ముందుకు వెళ్లానని చెప్పారు. 'జస్ట్ ఎంట్రీ ఇచ్చే సీన్స్ నుంచి రెండు డైలాగులు చెప్పే క్యారెక్టర్ వరకు వచ్చాను. కానీ కొన్ని సార్లు ఎడిటింగ్‌లో నా డైలాగ్స్ తీసేసేవారు. అప్పుడు 'నేను చేసినా మనం కనిపించకపోతే ఎందుకు? ఇక వద్దు ఈ జబర్దస్త్' అనిపించింది. అలా ఒక దశలో షో నుంచి వెళ్లిపోయాను' అని తెలిపారు.
అయితే బయటికి వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత బాధాకరంగా మారిందట.'రెండు మూడు ఎపిసోడ్స్‌లో కనిపించలేదని, 'జబర్దస్త్ నుంచి తీసేశారా?' అంటూ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇక్కడే పోగొట్టుకున్నామో, ఇక్కడే మనం ఏంటో నిరూపించుకోవాలి అని' అని చెప్పారు. ఆ నిర్ణయంతో మళ్లీ జబర్దస్త్‌కు వెళ్లి ఈసారి గట్టిగా ప్రయత్నించారట. మధ్య మధ్యలో డైలాగులు చెప్పడం మొదలుపెట్టగా, అది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ దృష్టికి వెళ్లింది. వాళ్లే తనకు స్క్రిప్ట్ ఇచ్చారని, అలా స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టానని చెప్పారు. క్రమంగా తన క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడం, ముఖ్యంగా నాగబాబు నుంచి ప్రశంసలు, పాజిటివ్ కామెంట్స్ రావడం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. ఇలా అవమానాలు, నిరాశలు ఎదుర్కొంటూనే చివరికి సక్సెస్ అందుకున్నాను అంటూ హైపర్ ఆది తన ఎమోషనల్ జర్నీని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











