రాజమౌళి అలిగారు.. అవమానించలేదు.. తెలుగు హీరోల ట్రోల్స్‌పై హైపర్ ఆది ఫైర్..
Varanasi Controversy: సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వర్డల్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ కోసం వంద అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై మహేష్ బాబు సినిమా టైటిల్ టీజర్‌ను అద్భుతంగా ఆవిష్కరించాలని భావించారు. కానీ, కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ అంతరాయంతో దర్శకధీరుడు రాజమౌళి కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హనుమంతుడి పేరు ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఊహించని విధంగా దుమారం రేపాయి. రాజమౌళిపై ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన స్టైల్ లో స్పందించాడు. ఇంతకీ ఏమన్నారంటే?
ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైపర్ ఆది హాజరయ్యారు. సినిమాలను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకులు, ఇండస్ట్రీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన నటులు కూడా ఈ రోజుల్లో ట్రోలింగ్‌కు గురవుతుండటం బాధాకరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. మొదటగా రాజమౌళి ఉదాహరణను ప్రస్తావిస్తూ.. "మన సినిమాలను, మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన వ్యక్తి రాజమౌళి. అలాంటి మహానుభావుడు ఒక సినిమా కోసం ఎంత శ్రమ పడతాడో అందరికీ తెలుసు. ఒక ఈవెంట్‌లో కేవలం టెక్నికల్ సమస్య వల్ల టీజర్ ఆలస్యమైందని ఆయన ఎమోషనల్ అయిన దానికి ప్రజలు అసహనంతో ట్రోల్స్ పెట్టడం చాలా అన్యాయం" అన్నారు.

రాజమౌళి గారు ఎన్నోసార్లు రామాయణం, మహాభారతం పట్ల తనకున్న భక్తి, గౌరవం గురించి చెప్పారని, తన గ్లింప్స్ వీడియో కాస్త లేట్ అయిందని హనుమంతుడిపై అలిగాడు. అంతే తప్ప ఏ దేవుడిని అవమానించలేదని చెప్పుకోచ్చారు. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేస్తున్నారని,ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరోను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ సంస్కృతి పెరిగిపోవడం బాధాకరమని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సన్నబడ్డా ట్రోల్, బాలకృష్ణ గారు ఏ మాట మాట్లాడినా ట్రోల్, అల్లు అర్జున్ నవ్వినా మీమ్స్, ప్రమాదం నుంచి కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ మాట్లాడడంలో ఇబ్బంది పడినా సైతం ట్రోలింగ్ చేయడం ఎంత అన్యాయం అని ప్రశ్నించారు. "మన హీరోలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే గర్వించాలి కానీ, వారిని అవమానించడం దారుణం" అని అన్నారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ వంటి ప్రపంచవ్యాప్త ఖ్యాతి ఉన్న హీరోలపైనా ఇదే వ్యవహారం కొనసాగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
"విదేశాల్లో బాహుబలి అంటే ఇండియా అని గుర్తిస్తారు. అలాంటి స్టార్స్‌ను మనమే లుక్స్ కోసం ట్రోల్ చేస్తుంటే ఎంత విచిత్రం?" అని ప్రశ్నించారు. చిక్కిరి చిక్కిరి సాంగ్ పై విదేశాలలో స్టెప్పులు, రీల్స్ చేస్తుంటే.. మనం మాత్రం మీమ్స్ చేసి రామ్ చరణ్‌ను కూడా అవమానిస్తున్నాం అన్నారు. అలాగే.. విజయ్ దేవరకొండపై జరుగుతున్న ట్రోలింగ్‌ను కూడా ప్రస్తావించిన ఆది, "ఒక వ్యక్తి కెరీర్‌లో చిన్న ఫ్లాప్ వచ్చినా వెంటనే అతడిని మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నించడం ఏమిటి? ప్రతి ఒక్కరికి తిరిగి నిలబడే సమయం ఇవ్వండి" అని చెప్పాడు.
ఇటీవల శ్రీలీలపై జరుగుతున్న ట్రోలింగ్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. "సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న అమ్మాయి. ఆమె డాన్స్ చేస్తుంది కాబట్టి యాక్టింగ్ రాదు అనడం ఏంటి? భగవంతు కేసరి సినిమాను బాలీవుడ్‌లో కూడా చర్చిస్తున్నారు అంటే ఆమె నటన కూడా అందులో భాగం కదా?" అని ప్రశ్నించారు.
మెగాస్టార్ చిరంజీవిపై జరిగిన డీప్‌ఫేక్ వీడియోల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మూడు దశాబ్దాలపాటు నంబర్ వన్‌గా ఉన్న మెగాస్టార్‌ను కూడా ట్రోల్స్ చేయడం ఎంత దుర్మార్గం? ఆయన లాంటి లెజెండ్‌పై తప్పుడు వీడియోలు చేయడం క్షమించరాని నేరం" అని అన్నారు. చిరంజీవి ఒక రాష్ట్రం, ఒక కులం లేదా ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు. దేశం గర్వించదగ్గ నటుడు అని ఆయన స్పష్టం చేశారు. చివరగా, ఈ ట్రోలింగ్ సంస్కృతే.. తెలుగు సినిమాలను దెబ్బతీస్తోందని ఆది ఆవేదన వ్యక్తం చేశారు.
"హీరోయిజాన్ని ప్రేక్షకుల ముందు చూపితేనూ ట్రోల్స్, మీమ్స్ కారణంగా అది కామెడీలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల వల్లే సినిమాలు ఫెయిలవుతున్నాయి. మన సొంత ఇండస్ట్రీని మనం తానే దెబ్బతీసుకుంటున్నాం" అని అన్నారు. హైపర్ ఆది వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై సినీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











