‘హైపర్ ఆదికి ఈగో ఎక్కువ.. ఎప్పుడూ అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు'
నవ్వుల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ (Jabardasth)ద్వారా బుల్లితెరపై స్టార్‌డమ్ అందుకున్న ఆది.. తనదైన రైటింగ్, పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల ఆలరిస్తారు. చాలా తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉంటూ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన మార్క్ కొనసాగిస్తున్నారు.అయితే అదే సమయంలో ఆయన కామెడీ స్టైల్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా బాడీ షేమింగ్, అవతలి వారిని తక్కువ చేసే పంచులు, ట్రోలింగ్ కామెడీ అంటూ సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంది. కొందరు అభిమానులు అతని టైమింగ్‌ను ప్రశంసిస్తే..మరికొందరు మాత్రం ఈ తరహా హ్యూమర్ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి ఇంద్రజ (Indraja)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందిన ఇంద్రజ... ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూనే, బుల్లితెరపై జడ్జిగా కూడా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు హైపర్ ఆది కలిసి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)లో సందడి చేస్తున్నారు. తాజాగా ఓ టాక్ షోలో ఇంద్రజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటి ఇంద్రజ ఇటీవల జబర్థస్త్ వర్ష హోస్టింగ్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఇంద్రజ.. హైపర్ ఆది చేసిన స్కిట్స్ గురించి ప్రస్తావించారు. ఇంద్రజ మాట్లాడుతూ 'హైపర్ ఆదికి కాస్త ఈగో ఎక్కువ, ఏ విషయం చెప్పిన ఎక్కువ తీసుకోరు. అలాగే, ఆది ఎప్పుడు చూడు అమ్మాయిలు మీద పడి ఏడుస్తుంటారు, అమ్మాయిల ముఖం ముడతలు పడ్డాయి, వయస్సు అయిపోయింది. మొగుడ్ని కాల్చుకొని తింటారు అంటూ అమ్మాయిలు మీద ఆది జోకులు వేస్తూ సెటైర్లు వేస్తుంటారు. ఇలా అమ్మాయిలు మీద జోకులు వేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం కుళ్ళు జోకులు' అని చెబుతుంటాను. 'ఆది అందరిమీద సెటైర్లు వేస్తారు. కానీ తన మీద ఎవరైనా సెటైర్లు వేస్తే మాత్రం వాటిని యాక్సెప్ట్ చేయలేను ' అని తెలిపారు.
ఆది అంటే చాలా గౌరవం
హైపర్ ఆది వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ... 'ఆది అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. అలాగే చాలా గౌరవం కూడా. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. వర్క్ ఆల్కలిక్. సెట్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి బయటికి వెళ్లే వరకూ పని గురించే ఆలోచిస్తుంటాడు. ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలి? ఇంకా కొత్తగా ఏ స్కిట్స్ చేయాలి? అనే విషయాల మీదే ఎప్పుడూ బిజీగా ఉంటాడు' అంటూ చెప్పుకొచ్చారు ఇంద్రజ.
అంతేకాదు, ఓ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఎలాంటి పెద్ద సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్‌తోనే ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి హైపర్ ఆది అని ఆమె ప్రశంసించారు. 'ఆది వాక్చాతుర్యం, మేధస్సు నిజంగా అద్భుతం. తనకు వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకోకుండా... తనతో పాటు ఉన్నవాళ్లను కూడా ముందుకు తీసుకెళ్లే మనస్తత్వం ఆయనది'అని తెలిపారు. ఇంద్రజ చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హైపర్ ఆదికి ఏదైనా పని వస్తే, తాను చేయలేని పరిస్థితి ఉంటే ఆ అవకాశాన్ని ఇతరులకు అప్పగించి వారిని ఆదుకోవడం చేస్తాడట.
అలాగే ఏ ఈవెంట్‌కి వెళ్తే తన టీమ్‌లో ఉన్నవాళ్లను కూడా వెంట తీసుకెళ్లి వారికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాడని వెల్లడించారు. 'తనతో పని చేసే వాళ్లందరినీ కుటుంబంలా చూసుకుంటాడు. అందుకే ఆయన ఈరోజు అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నారు. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ చాలా అరుదుగా కనిపిస్తాయి' అంటూ హైపర్ ఆదిపై ఇంద్రజ ప్రశంసల వర్షం కురిపించారు. హైపర్ ఆది కామెడీపై ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు విమర్శగా, మరోవైపు ఆయన ప్రతిభపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇంద్రజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. అయితే.. ఆ కామెంట్స్ పై హైపర్ ఆది ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











