Intinti Gruhalakshmi Today Episode: శృతి రిపోర్టు చూసి తులసి ఆగ్రహం.. ఇద్దరికీ చుక్కలు చూపించిందిగా!
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇంట్లో సంబరాలు చేసుకుంటోన్న సమయంలో శృతి ఓ బెలూన్‌పై కాలు వేసి కింద పడిపోతుంది. దీంతో ఆమె కడుపునకు దెబ్బ తగులుతుంది. అప్పుడు అందరూ కంగారు పడి ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన నందూ, లాస్య కోపంగా చిందులు వేస్తారు. అనంతరం అభి ద్వారా విషయం తెలుసుకున్న నందూ.. నేరుగా ఆస్పత్రికి చేరుకుంటాడు. ఆ వెంటనే తులసిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. అనంతరం ఆమెను కొట్టబోతుండగా సామ్రాట్ వచ్చి అడ్డుగా నిల్చుని వాళ్లకు షాక్ ఇచ్చేస్తాడు.

వాళ్లపై నిందలు వేసిన నందూ
నందూ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండడంతో సామ్రాట్ 'నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? భరించాల్సిన అవసరం మీకేంటి తులసి గారూ' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నందూ అసలు నీ అండ చూసుకునే తను ఇలా రెచ్చిపోతుంది అంటాడు. అప్పుడు సామ్రాట్ 'నిజం చెప్పడం చెలరేగిపోవడం కాదు. లేనిపోని నిందులు వేసి మీరే తులసి గారిని బాధ పెడుతున్నారు' అంటాడు. దీంతో సామ్రాట్, నందూను తులసి ఆగమంటుంది. అప్పుడు నందూ 'నా వారసుడి గురించి చెడ్డ వార్త వినపడితే నన్ను మించిన రాక్షసుడు ఉండడు. ఏం చేస్తానో నాకే తెలీదు' అంటాడు. దీంతో తులసి.. శృతికి ఏమీ కాకూడదు అని దేవుడిని కోరుకుంటుంది.

అంకిత రాక.. అలా చెప్పడంతో
వీళ్లు బయట గొడవ పడుతూ ఉండగానే అంకిత ఐసీయూ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు నందూ.. శృతికి ఎలా ఉంది అని అడుగుతాడు. అంతలో లాస్య 'పాపం తన వారసుడి గురించి నందూ చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇందాక నుంచి శృతి గురించే ఆలోచిస్తున్నాడు' అని చెబుతుంది. అప్పుడు తులసి కూడా 'కన్నీళ్లు తెప్పించే వార్త అయితే దయచేసి నాకు చెప్పకు అంకిత' అని అంటుంది. అప్పుడు అంకిత 'శృతి నవ్వుతూ బయటకు రావాలనే అనుకుంటున్నా. టెస్టులు జరిగాయి.. రిపోర్టులు వస్తేనే ఏంటనేది తెలుస్తుంది' అని వాళ్లకు చెబుతుంది.

పరందామయ్య ఫోన్‌తో గొడవ
అనసూయ కంగారు పడుతూ శృతి గురించి తెలుసుకోవడం కోసం పరందామయ్యను తులసికి ఫోన్ చేయమంటుంది. దీంతో ఆయన ఆమెను వివరాలు అడిగి తెలుసుకుంటాడు. అప్పుడామె మీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడగ్గా 'నందూ చెప్పాడు.. అక్కడే ఉన్నారంట కదా. భయపడకుండా ఉండు' అంటాడు. దీంతో తులసి మళ్లీ చేస్తా అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడు లాస్య 'చూశావా నందూ.. మీ నాన్నకు మాజీ కోడలి మీద ఉన్న నమ్మకం నీ మీద లేదు' అని అంటుంది. దీంతో అభి, దివ్య ఆమెతో గొడవ పడతారు. అప్పుడు నందూ లాస్యపై అరిచేస్తాడు.

గుడ్ న్యూస్ చెప్పేసిన డాక్టర్
ఆ తర్వాత రిపోర్టులు చూసుకుంటూ డాక్టర్ బయటకు వస్తుంది. వచ్చీ రావడమే ఆమె 'కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. తన ప్రెగ్నెన్సీకి ఎలాంటి నష్టం జరగలేదు' అంటుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు ప్రేమ్ దేవుడు ఉన్నాడమ్మా అని అంటాడు. దీంతో తులసి 'శృతి ఐసీయూలోకి వెళ్లినప్పటి నుంచి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడిచింది. దేవుడు దయ చూపించాడు కాబట్టి సరిపోయింది. ఫలితం తిరగబడి ఉంటే ఈ పాటికి మీ తల్లి శవంలా నీ కళ్ల ముందు ఉండేది' అంటుంది. దీంతో లాస్య 'చాన్స్ దొరికింది కదా అని సెంటిమెంట్ డ్రామా ఆడుతోంది' అని మనసులో అనుకుంటుంది.

నందూకు ఇచ్చిపడేసిందిగా
అనంతరం శృతిని చూడొచ్చా అని నందూ అంకితను అడుగుతాడు. దీంతో ఆమె వెళ్లొచ్చు అంటుంది. అప్పుడు తులసి 'ఒక్క నిమిషం నంద గోపాల్ గారు.. ఇంతకు ముందు అంతలా రెచ్చిపోయారు కదా. ఇప్పుడు ఏంటి పిల్లిలా పారిపోతున్నారు? ఇందాకా మమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు కదా. అప్పుడు భయంలో ఉన్నాను. బాధలో ఉన్నాను కాబట్టి మీరు ఏమన్నా నేను ఊరుకుంటా అనుకున్నారా? కుటుంబం విడకూడదని, పిల్లలకు మీ ప్రేమ దూరం చేయకూడదని వాళ్లను నీ దగ్గర ఉంచా. అంతేకానీ, మీకు వెన్నుపోటు పొడవాలని కాదు' అంటుంది.

వెన్నుపోటు అంటే అదేనని
ఆ తర్వాత తులసి 'కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. వదిలేసి మీ దారి చూసుకున్నారు. దాన్ని వెన్నుపోటు అంటారు. మీకు పైసా సంపాదన లేకపోయినా మీ మొగుడు పెళ్లాలను పోషించాను. అవసరం తీరాక తెప్ప తగలేశారు. అది వెన్నుపోటు అంటే. మోసం చేసి మీ ఆవిడ ఇల్లు రాయించుకుంది చూడండి అది వెన్నుపోటు అంటే. మీ వారసుడి మీద మీకే కాదు.. నాకూ హక్కు ఉంది. ఏమంటావురా' అని ప్రేమ్‌తో అంటుంది. దీనికతడు 'ముందు వాడు నీ మనవడు. ఆ తర్వాతే ఆయన మనవడు' అంటాడు. తర్వాత తులసి 'ఇంకోసారి మా స్నేహ బంధం గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు' అని నందుకు వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ప్రేమ్ తన తల్లికి గౌరవం లేని చోట ఉండనని అంటాడు.

తులసి బాధ.. ఇంట్లో అలా
అనంతరం సామ్రాట్ కారులో తులసి ఇంటికి వెళ్తుంది. అప్పుడు దారిలో ఆపి రిలాక్స్ అవుతుంది. ఆ సమయంలో నందూ తీరుపై తులసి అసహనం వ్యక్తం చేస్తుంది. మరోవైపు, శృతి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. అప్పుడు అంకిత ఆమెతో 'నువ్వు ఎప్పుడు ఏం చేయాలో, ఏం తినాలో ఆంటి ఈ పేపర్ మీద రాసింది. నువ్వు ఇది ఫాలో అవ్వాల్సిందే' అంటుంది. అది చూసి లాస్య అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అలాగే, నందూ కూడా ఆమెను వెనకేసుకు వస్తాడు. అప్పుడు అనసూయ మాత్రం తులసికి సపోర్ట్ చేస్తుంది. దీంతో వాళ్లు షాక్ అవుతారు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.
తులసి బాధ.. ఇంట్లో అలా
అనంతరం సామ్రాట్ కారులో తులసి ఇంటికి వెళ్తుంది. అప్పుడు దారిలో ఆపి రిలాక్స్ అవుతుంది. ఆ సమయంలో నందూ తీరుపై తులసి అసహనం వ్యక్తం చేస్తుంది. మరోవైపు, శృతి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. అప్పుడు అంకిత ఆమెతో 'నువ్వు ఎప్పుడు ఏం చేయాలో, ఏం తినాలో ఆంటి ఈ పేపర్ మీద రాసింది. నువ్వు ఇది ఫాలో అవ్వాల్సిందే' అంటుంది. అది చూసి లాస్య అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అలాగే, నందూ కూడా ఆమెను వెనకేసుకు వస్తాడు. అప్పుడు అనసూయ మాత్రం తులసికి సపోర్ట్ చేస్తుంది. దీంతో వాళ్లు షాక్ అవుతారు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











