Intinti Gruhalakshmi: దివ్యతో విక్రమ్ క్లోజ్‌గా.. రాజ్యలక్ష్మి ఊహించని శిక్ష.. లాస్య మరో ప్లాన్
ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి టెన్షన్ పడుతున్న నందూకు తులసి ధైర్యం చెబుతుంది. అప్పుడతను కూతురి మీద ప్రేమను బయట పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ లేకపోవడంతో బాధ పడుతున్న విక్రమ్‌ను వాళ్ల తాతయ్య రెచ్చగొడతాడు. దీంతో విక్రమ్ నేరుగా వెళ్లి దివ్య గదిలో దూరుతాడు. అప్పుడామె బలవంతంగా అతడిని బయటకు పంపిస్తుంది. ఇక, దివ్య, విక్రమ్‌ను కలవకుండా చేయాలని రాజ్యలక్ష్మి అనుకుంటూ ఉండగానే.. వాళ్లిద్దరూ చిలిపి పనులు చేస్తూ ఉంటారు. ఇక, చివర్లో రాజ్యలక్ష్మి వ్రతం పనులు మొత్తం దివ్యకు అప్పగిస్తుంది.

తులసిని తిట్టడంతో దివ్య బాధ:వ్రతానికి సంబంధించిన పనులన్నీ చేయాలని దివ్యకు రాజ్యలక్ష్మి చెప్పడంతో ఆమె బిజీగా ఉంటుంది. ఇందుకోసం అక్షింతలు కలుపుతూ ఉండగా బసవయ్య భార్య అక్కడకు వచ్చి ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు దివ్య అక్షింతలు కలుపుతున్నా అనడంతో 'బియ్యాన్ని కొంచెం తడి చేసి పసుపు కలిపితే అప్పుడే అంటుకుంటుంది. ఆ మాత్రం కూడా నేర్పించలేదా మీ అమ్మ' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో దివ్య 'ఇందులో అమ్మ తప్ప ఏమీ లేదు పిన్ని. నాకే టైం దొరక పనులు నేర్చుకోలేదు' అంటూ వివరించే ప్రయత్నం చేస్తుంది.
అలా తిరగడం ఎవరు నేర్పారు:దివ్య మాటలను విన్న వెంటనే బసవయ్య 'ఇందాక మావాడు, నువ్వు చెంగుచెంగు మని ఒకరి వెనుక ఒకరు పరిగెడుతున్నారు కదా. అవి మాత్రం ఎవరు నేర్పారు? అలాగే పనులు కూడా త్వర త్వరగా నేర్చుకోవాలి' అని అంటాడు. ఆ తర్వాత కూడా దీపాన్ని వెలిగించే కుందులు కడుగుతున్న దివ్యను బసవయ్య భార్య సాధిస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి వచ్చి 'ఇంకా ఇక్కడే ఉంటే పూజకి టైం అయిపోతుంది. వెళ్లి మండపం అలంకరించి మామిడి తోరణాలు కట్టు' అని కంగారు పెడుతుంది. దీంతో దివ్యకు ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. తర్వాత దివ్య 'అమ్మ పనులు నేర్చుకోమంటే ఆరోజు నేర్చుకోలేదు.. ఈరోజు అనుభవిస్తున్నాను' అని మనసులో అనుకుంటుంది.

దివ్యను విక్రమ్ ఎత్తుకోవడంతో:ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టమని రాజ్యలక్ష్మి చెప్పడంతో దివ్య వెళ్తుంది. కానీ, ఆమెకు అది అందదు. అప్పుడు ఎవరూ చూడడం లేదు అనుకున్న విక్రమ్ ఆమెను ఎత్తుకుంటాడు. కానీ, అది బసవయ్య, రాజ్యలక్ష్మి చూస్తారు. అప్పుడు బసవయ్య 'నువ్వు ఏవేవో ఆశలు పెట్టుకుంటున్నావు. కానీ అవేవీ జరిగేటట్టుగా లేదు. చూడలేక మనం కళ్ళు మూసుకుంటున్నాం కానీ.. వాళ్ళు అస్సలు జంకటం లేదు' అంటాడు. దీంతో కోపంతో దివ్య వాళ్ళ దగ్గరికి వచ్చి 'ఏం చేస్తున్నావు. వాడికంటే లోకజ్ఞానం తెలీదు. కనీసం నీకైనా జ్ఞానం ఉండాలి కదా. పంతులుగారు పూజ పవిత్రంగా చేయాలన్నారు. ఇలాంటి సమయంలో వాడిని ముట్టుకోవచ్చా? వెళ్లి తల స్నానం చేసి రా' అంటుంది. అప్పుడు దివ్య ఎంత చెప్పినా రాజ్యలక్ష్మి మాత్రం అస్సలు వినదు.
అనసూయ జోక్.. నందూ కోపం:దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి తులసి రెడీ అవుతుంది. ఆ తర్వాత అనసూయ వాళ్ళను త్వరగా రమ్మని పిలుస్తుంది. ఈలోపు నందూ కూడా వస్తాడు. అప్పుడు నందూ 'నీకంటే నాకూ కంగారే అందుకే త్వరగా రెడీ అయిపోయాను' అంటాడు. అంతలో అక్కడికి వచ్చిన అనసూయ.. ఎందుకు అంత కంగారు? తాపీగా వెళ్దాము అంటుంది. దీంతో తులసి 'మరీ పూజ టైం కి వెళ్తే బాగోదు. ముందుగా వెళ్తే కాస్త హెల్ప్ చేయొచ్చు' అంటుంది. అప్పుడు అనసూయ దివ్యను వాళ్ల అత్తగారు రాచి రంపాన పెడతారని భయమా అని జోక్ చేయగా.. నందూ కోపంతో కేకలు వేస్తాడు.

కన్నీరు పెట్టుకున్న నందూ:నందూ గట్టిగా అరవడంతో భయపడిపోయిన అనసూయ 'నేనేదో సరదాగా అన్నానురా. దానికే ఎందుకలా ఫీల్ అయిపోతావు' అని అడుగుతుంది. అప్పుడు నందూ 'సరదాకు కూడా దివ్య కంట్లో కన్నీరు చూడలేను' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న పరందామయ్య 'నువ్వు ఇలా బేలగా అయిపోతే నిన్ను చూసిన దివ్య మరింత దిగులు పడుతుంది. ధైర్యంగా ఉండు' అంటూ ఓదార్చుతాడు. ఇంతలోనే లాస్య వచ్చి బయలుదేరుదామా అని అడుగుతుంది. అందరూ ఒక్కొక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు లాస్యను అక్కడే ఉండమని వాళ్లంతా ఆర్డర్ వేస్తారు. కానీ, అందుకామె ఒప్పుకోదు. దీంతో వాళ్లు 'దివ్య తల్లి తులసి కాబట్టి తనే రావాలి. అయినా మేము ఒక గంటలో మళ్ళీ వచ్చేస్తాము' అంటూ లాస్యను వదిలి వెళ్లిపోతారు.
రాజ్యలక్ష్మితో లాస్య కుమ్మక్కు:తనను వదిలేసి వెళ్లారని కోపంతో ఉన్న లాస్య వెంటనే రాజ్యలక్ష్మికి ఫోన్ చేస్తుంది. 'ఆ ముసల్ది తులసిని నందూకు దగ్గర చేయాలని చూస్తుంది. అందుకే నన్ను తీసుకురాకుండా వదిలేశారు. నాకు ఒక చిన్న సాయం చేయాలి' అని అడుగుతుంది. దీనికామె ఏంటో చెప్పు అంటుంది. అప్పుడు లాస్య 'మీ ఇంటికి వచ్చిన నందూ వాళ్ళను బాగా అవమానించి పంపించు. అప్పటికి గానీ నా కడుపు మంట చల్లారదు' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి మీ గొడవల్లోకి నన్ను లాగొద్దు అనగా.. నేను నీకు ఎంత సాయం చేశాను. ఆ మాత్రం కృతజ్ఞత లేదా అంటుంది లాస్య.

డబ్బు తీసుకుంటే సాయమా?:లాస్య మాటలకు రాజ్యలక్ష్మి 'డబ్బులు తీసుకుని చేసేదాన్ని సాయం అనరు కూలి పని అంటారు' అని చెబుతుంది. దీంతో లాస్య 'ఏదైతేనేమి మనిద్దరం ఐకమత్యంగా ఉంటే ఇద్దరికీ లాభమే కదా' అని బ్రతిమాలుతుంది. దీంతో రాజ్యలక్ష్మి సాయం చేయటానికి ఒప్పుకుంటుంది. తర్వాత పూజ దగ్గర పనులు చేస్తున్న దివ్యను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా పనులు చేయిస్తుంటారు. నాకు ఏ పని చేత కావట్లేదు అంటూ దివ్య తనలో తానే బాధపడుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











