Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి లాస్య గుడ్‌బై.. నందూకు భార్యగా ఎంట్రీ.. లక్కీకి దెబ్బ తగలడంతో!
భారతదేశంలో ఉన్న చాలా భాషలతో పోల్చుకని చూస్తే... తెలుగు బుల్లితెరపై వస్తున్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బీరువాలకు సంబంధించిన తాళాలను రాజ్యలక్ష్మి దగ్గర నుంచి తీసుకున్న ప్రకాశం వాటిని దివ్యకు అందజేస్తాడు. దీంతో ఆమె అత్త ముందే పనిమనిషికి డబ్బులు ఇచ్చేస్తుంది. ఇక, తులసి ఇంట్లో ఉన్న లక్కీకి ఫోన్ చేసిన లాస్య.. ఇంకో ప్లాన్ అమలు చేయమని చెప్తుంది. కానీ, దానికి ఆ బుడ్డోడు ఒప్పుకోడు. అసలు లక్కీ ఇంట్లోకి ఎలా వచ్చాడో తెలుసుకోవడం కోసం నందూ మంచిగా ఉన్నట్లు నటిస్తూ తనతో ఎవరో అబద్ధం చెప్పించారని తెలుసుకుంటాడు. అది చూసి అపార్థం చేసుకున్న తులసి.. నందూకు క్లాస్ పీకుతుంది.

కొడుకును పోగొట్టుకుంది అని: దివ్య కొట్టిన దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చిన లాస్య 'ఆ తులసి నా జీవితంతో ఆడుకుంటుంది. నా కొడుకును నా మాట వినకుండా చేస్తుంది' అని చెప్తుంది. దీంతో బసవయ్య 'ఇక్కడ కూడా అదే జరుగుతుంది. విక్రమ్‌ను ఆ దివ్య మా అక్క మాట వినకుండా చేస్తుంది. ఇద్దరిదీ ఒకే పరిస్థితి' అంటాడు. అప్పుడు ప్రసన్న 'అయినా తులసి సంగతి తెలిసి కూడా ఆమె దగ్గర ఎందుకు పెట్టావు' అనగా.. బసవయ్య 'ఏముందీ అన్నవస్త్రాల కోసం ఆశపడితే.. ఉన్న వస్త్రాలు పోయాయి. అత్యాశకి పోయింది.. కొడుకుని పోగొట్టుకుంది' అంటాడు.
ఇప్పటికైనా మేలుకో అక్కాయ్: బసవయ్య మాటలకు లాస్యకు కోపం వచ్చి వెటకారం వద్దని చెప్పు అంటుంది. దీనికి అతడు 'ఏంటీ చెప్పేదీ? చూడు అక్కా.. నిన్ను ఇలాగే రెచ్చగొట్టి ముగ్గులోకి లాగుతుంది. ఆ తర్వాత చేతులు ఎత్తేస్తుంది. ఇప్పటికైనా తెలుసుకో. మేలుకో అక్కా' అని అంటాడు. దీనికి లాస్య 'ఏంటి రాజ్యలక్ష్మీ ఇదంతా? నీ తమ్ముడు అన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడవే. నువ్వు కూడా నమ్ముతున్నావా? మోసం చేస్తున్నానని అనుకుంటున్నావా' అని నిలదీస్తుంది. దీంతో రాజ్యలక్ష్మీ 'అందరం సమస్యల్లో ఉన్నాం.. ఒకర్నొకరు అనుకుని లాభం లేదు' అని అంటుంది.

విలువ లేని చోటు ఉండనని: బసవయ్య, లాస్య గొడవ పెట్టుకుంటూ ఉండగా రాజ్యలక్ష్మి 'లాస్య ముందు అక్కడ తులసిని ఇక్కడ దివ్యని దెబ్బకొట్టే మార్గం చెప్పు' అని అంటుంది. దీనికామె 'ఓ ఎగిరెగిరి పడ్డావ్ కదా.. మార్గం నువ్వు చెప్పు' అని బసవయ్యతో అంటుంది. దీనికతడు 'ఏంటీ.. పడవ నువ్వు ముంచేసి ఇప్పుడు తెడ్డు నా చేతికి ఇస్తావా' అంటాడు. దీంతో లాస్య 'చూడు రాజ్యలక్ష్మీ.. నా మాట చెల్లని చోట నేను మాట్లాడలేను. తులసి సంగతి నేను చూసుకుంటాను. దివ్య సంగతి నువ్వు చూసుకో. ఉన్నాడు కదా సలహాలు ఇవ్వడానికీ' అని వెళ్లిపోగా బసవయ్య సంతోషిస్తాడు.

దొంగ ప్రేమ బయట పెడతా: గదిలో ఉన్న ప్రకాశం పాటలు వింటూ సంతోషంగా ఉంటాడు. అప్పుడు దివ్య, ప్రియ ఆయన దగ్గరకు వెళ్లి చూసి ఆనందిస్తారు. దివ్య వల్లే ఈ సంతోషం అని ప్రకాశం అంటాడు. అప్పుడు దివ్య 'ఇన్నేళ్లు మీరు చీకట్లోనే ఉన్నారు.. చీకటి నుంచి మీరు బయటకు వచ్చారు కానీ.. విక్రమ్ ఇంకా మాయలోనే ఉన్నాడు. వాళ్ల అమ్మ చేసే తప్పుల్ని ఒప్పుకునే స్థితిలో తను లేడు' అని అంటుంది. దీంతో మరి ఇప్పుడు ఏం చేస్తావ్ దివ్యా అని ప్రకాశం అడగ్గా.. 'విక్రమ్ దూరం పెట్టినంత మాత్రాన నేను దూరం కాను. విక్రమ్ మనసు మార్చుతా.. అతనికి దగ్గరౌతా.. అత్తయ్య దొంగ ప్రేమను బయటపెడతా' అని దివ్య అంటుంది.
కుక్కిన పేనులా పడి ఉంటా: నందూను బుట్టలో వేసుకునేందుకు లాస్య అతడికి ఫోన్ చేస్తుంది. దీంతో విసుక్కుంటూ తిట్టుకుంటూ మాట్లాడతాడు. అప్పుడు లాస్య 'ఏంటి నందూ.. నేను ఇంత ప్రేమగా మాట్లాడితే నువ్వు విసుక్కుంటూ మాట్లాడతావు. నాకు మాత్రం నీ గొంతు వినిపిస్తే ప్రాణం లేచొస్తుంది నందూ. ఎంతసేపు విన్నా అలా వినాలనిపిస్తుంది. నీ దగ్గరకు పరుగెత్తుకుని రావాలనిపిస్తుంది. నీ కూతుర్ని నీ అల్లుడు దగ్గరకు తీసుకోవాలని ఆశపడుతున్నావు. తప్పులు చేసిన నిన్ను తులసి దగ్గరకు తీసుకోవాలని ఆరాటపడుతున్నావు. అలాంటప్పుడు నువ్వెందుకు నన్ను క్షమించలేకపోతున్నావు? నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నేను పూర్తిగా మారిపోయాను నందూ.. నీ కాలుకింద చెప్పులా పడి ఉంటాను' అని అంటుంది. కానీ, నందూ మాత్రం ఆమె మాటలను వినడు.

లక్కీని తోసేసిన నందూ: లాస్య విసిగించినా నందూ మాట్లాడుతుంటాడు. చివరకు నీకు మరో అవకాశం ఇవ్వను అంటూ అరుస్తాడు. అంతలోనే లక్కీ వచ్చి 'డాడీ ఆడుకుందాం రా' అంటూ గోల చేస్తుంటాడు. చేయి పట్టుకుని లాగుతూ ఉంటాడు. దీంతో నందు.. ఆవేశంగా లక్కీని పక్కకు తోసిపారేస్తాడు. లక్కీ వెళ్లి తలుపుపై పడతాడు. దీంతో అతడి తలకు గాయం అవుతుంది. అరుపు విన్న వెంటనే తులసి అక్కడకు వచ్చి 'ఏమైంది నాన్నా? కాలు జారావా?' అని అడగ్గా.. లేదు డాడీ నెట్టేశాడు అని అంటాడు. దీంతో తులసి 'మీరు ఎందుకు ఇలా తయారౌతున్నారో అర్ధం కావట్లేదు' అంటుంది.
మారారని అనుకున్నాను:ఆ తర్వాత తులసి 'పెద్ద వాళ్లతో ఎలా మాట్లాడాలో ఎలాగూ తెలియదు. కనీసం పిల్లతో కూడా ఎలా ఉండాలో తెలియదా? మీరు మారారని అనుకున్నాను. జీవితంలో మారరు. ఇంకా ఎందుకండీ.. తప్పు మీరు చేసి ఎదుటివాళ్లపైకి నెట్టేస్తారు. మీకు ఆ అలవాటు పోలేదా. నాటకాలు ఆడేది మీరు.. మీరే వాడ్ని ఇక్కడికి పిలిపించి కొత్త నాటకాలు ఆడుతున్నారు. పైకి మా ముందు దూరం పెట్టినట్టు నాటకాలు ఆడి.. ఈ వయసులో కూడా మీకు ఇంత యాక్షన్ అవసరమా' అంటూ క్లాస్ పీకుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











