Intinti Gruhalakshmi Today Episode: పెళ్లికి ముందు నందూ ఊహించని నిర్ణయం.. ఇంటికొచ్చిన లాస్యకు షాక్
భారతదేశంలోని అన్ని భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూను మళ్లీ పెళ్లి చేసుకుంటావా అని అడిగిన అనసూయతో తనకు ఆ అవకాశం లేదని చెబుతుంది తులసి. అనంతరం తులసి రిపోర్టులను చూసిన అద్వైత కృష్ణ షాక్‌కు గురవుతాడు. ఆమెకు ప్రస్తుతం క్యాన్సర్ సెకెండ్ స్టేజ్‌లో ఉందని, వెంటనే సర్జరీ చేయాలని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని తులసికి స్వయంగా చెబుతాడు. అనంతరం రిపోర్టులు తీసుకుని ఇంటికి వెళ్లిన తులసి కుటుంబ సభ్యులకు తన పరిస్థితిని వివరిస్తుంది. ఆ తర్వాత లాస్య తులసికి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి హెల్ప్ చేయమంటుంది.

కార్డ్ చించాలని నందూ.. ఆపిన తులసి
ఒకవైపు తులసికి సర్జరీ చేయించుకోవాలని అందరూ బాధ పడుతుండగా.. లాస్య మాత్రం తన పెళ్లి కార్డు తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది. అలాగే, తులసికి ఇచ్చి తనకు సహాయం చేయమని అడుగుతుంది. అప్పుడు దాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోతుంది. కాసేపటికి నందూ వచ్చి ఆ కార్డ్‌ను చింపబోతాడు. దీంతో తులసి అతడిని అడ్డుకుంటుంది. 'శుభలేఖను అలా చించకూడదు. మీకు గుర్తుందా.. అప్పట్లో మన కార్డ్‌ను అత్తయ్య గారు మంటల్లో వేశారు. అందుకేనేమో మన జీవితం ఇలా అయింది. కనీసం లాస్య జీవితం అయినా బాగుండాలి' అంటుంది.

తనకు చెప్పలేదని బాధ పడిన నందూ
శుభలేఖ గురించి మాట్లాడిన తర్వాత సర్జరీ గురించి తనకెందుకు చెప్పలేదని తులసిని ప్రశ్నిస్తాడు నందూ. దీనికామె 'నేను మీకు చెబుదామనే అనుకున్నా కానీ, లాస్య ముఖంలో ఉన్న సంతోషం చూసి చెప్పలేకపోయాను' అంటుంది. అప్పుడు సర్జరీ ఎప్పుడని అడుగుతాడు. దీనికి 'మీరు పెళ్లిపీటలు ఎక్కే రోజునే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉంటాను. ఆరోజే నాకు సర్జరీ' అని చెబుతుంది. దీంతో నందూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అనంతరం 'నా పెళ్లికి నువ్వు వచ్చినా రాకున్నా.. నీకు ఆపరేషన్ జరిగినప్పుడు నేను నీ పక్కన ఉండాలి' అంటాడు నందూ.

తులసిపై కోపంతో వెళ్లిపోయిన నందూ
సర్జరీ జరిగే సమయంలో పక్కనే ఉంటానని నందూ అన్న మాటలకు తులసి అడ్డు పడుతుంది. 'మీరు నా పక్కన ఉండి చేసేదేం ఉండదు' అంటుంది. అప్పుడు అతడు 'నా పెళ్లికి ఇంకో ముహూర్తం దొరుకుతుందా? నాకు నీకన్నా ఈ పెళ్లి అంత ముఖ్యమేమీ కాదు' అంటాడు. దీనికి తులసి 'మళ్లీ మొదటికొచ్చారు ఏంటండి? మీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా. మళ్లీ నా గురించి మాట్లాడతారేంటి' అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'ఈ విషయంలో మాత్రం నువ్వు ఎంత చెప్పినా వినే ప్రశక్తే లేదు' అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు.

శృతి బాధ.. తల్లితో తులసి ఆవేదనగా
నందూ వెళ్లిపోయిన తర్వాత తులసి అక్కడ పడుకుంటుంది. దీంతో శృతి వచ్చి నిద్ర లేపి అన్నం పెడుతుంది. ఆ తర్వాత తులసికి తన తల్లి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. దీనికామె 'నీ కష్టాలు చూసి తట్టుకోలేకపోతున్నాను అమ్మా' అంటుంది. అప్పుడు తులసి 'నాకు క్యాన్సర్ ఉందనే విషయం చెప్పకపోవడం తప్పే. నన్ను చూడటానికి నువ్వు రాకూడదు అమ్మ. నీ అల్లుడు లాస్యను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. నువ్వు వచ్చావంటే అక్షింతలు వేయాల్సి ఉంటుంది' అని తల్లికి చెబుతుంది.

నందూ లాస్య షికార్.. స్వీటు తీసుకొచ్చి
నందూ, లాస్య కారులో షికార్లు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో లాస్య ఎంతో సంతోషంగా కనిపించగా.. నందూ మాత్రం డల్‌గా ఉంటాడు. అప్పుడు ఏటైనా తీసుకెళ్లమని అడుగుతుందామె. కానీ, అతడు మాత్రం ఇంటికెళ్లిపోవాలని అంటాడు. దీంతో లాస్యకు కోపం వస్తుంది. అనంతరం ఇంటికి వచ్చిన వాళ్లు.. స్వీట్‌ను అందరికీ పంచుతారు. 'శుభలేఖతోనే ఇద్దామని అనుకున్నా.. కానీ, ఇప్పుడు ఇస్తున్నా' అని అంటుంది. కానీ, అప్పుడు ఆ స్వీట్‌ను ఎవరూ తీసుకోరు. ఆ సమయంలో తులసి మాత్రం అది తీసుకుని తింటుంది. దీంతో లాస్య సంతోషంగా ఉంటుంది.

తులసి కోసం అక్షింతలు పంపిన తల్లి
తులసికి క్యాన్సర్ అని తెలుసుకున్న తల్లి.. ఆమె కోసం పూజలు చేయిస్తుంది. అనంతరం ఆ పూజకు సంబంధించిన కొన్ని వస్తువులతో పాటు అక్షింతలను తులసి కోసం పంపుతుంది. దీన్ని తీసుకొచ్చిన అంకిత.. తులసికి ఇస్తుంది. 'ఈ మూటలో అక్షింతలు ఉన్నాయి. నీ ఆరోగ్యం కుదుటపడటం కోసం మీ అమ్మ దేవుడికి మొక్కకుందట. ఇప్పుడు వాటిని పంపించారు' అని చెబుతుంది. ఆ తర్వాత అనసూయ.. లాస్య కోసం గోరింటాకు నూరుతుంది. ఆ సమయంలో లాస్యను ఎంతగానో తిట్టుకుంటూ ఉంటుంది. అదంతా చూసి నవ్వుకున్న తులసి.. కొద్ది సేపటి తర్వాత వచ్చి 'ఏంటి అత్తయ్యా.. పెళ్లి పనులు చేస్తున్నారా' అని అంటుంది.


Click it and Unblock the Notifications











