Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ను గెలిపించిన నందూ.. తులసి కోసం వచ్చిన వసుధార, సాక్షి
ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పాటల పోటీలో ప్రేమ్‌ను ఓడించాలని అనుకున్న లాస్య.. అతడికి దగ్గు వచ్చే మందు కలిపిన జ్యూస్‌ను పంపుతుంది. దీంతో అతడు పాటలు పాడే సమయంలో బాగా తగ్గుతాడు. అప్పుడు తులసి వేడినీళ్లు ఇచ్చి అతడికి ధైర్యం చెప్పడంతో చక్కగా పాటను పూర్తి చేస్తాడు. అయితే, అప్పుడే లాస్యకు దగ్గు వస్తుంది. దీంతో ఆమె బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు తులసి ఇది తానే చేశానని అంటుంది. అంతేకాదు, లాస్యకు వార్నింగ్ ఇస్తుంది. ఇక, చివర్లో లాస్య.. ప్రేమ్‌ను ఓడించేందుకు మరో కంటెస్టెంట్‌కు ఓట్లు వేస్తుంది.

కాంపిటీషన్‌లో గెలుపొందిన ప్రేమ్
పాటల పోటీ పూర్తి అవుతుంది. అప్పుడు నిర్వహకులు ఫినాలేలో విజేతను నిర్ణయించేది జడ్జ్‌లు కాదని.. అక్కడకు వచ్చిన ఆడియెన్స్ అని చెబుతారు. అంతేకాదు, యాంకర్ 'ఇద్దరు సమఉజ్జీలు బాగా పాడారు. కానీ, ఫైనల్స్‌లో ఒక్కరికే విజయం దక్కుతుంది. అది ఎవరో కాసేపట్లోనే తేలిపోతుంది' అని చెబుతుంది. ఆ తర్వాత అందరినీ ఓటింగ్‌లో పాల్గొనమని అంటారు. ఆడియెన్స్ ఓట్ల ఆధారంగా ఈ కాంపిటీషన్‌లో ఎవరు గెలిచారు అన్న దానిని అనౌన్స్ చేస్తారు. ఈ పోటీలో ప్రేమ్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందుతాడు. దీంతో తులసి ఫ్యామిలీ డ్యాన్స్ చేస్తుంది.

ఓటుతో విన్నర్‌ను చేసేసిన నందూ
సింగింగ్ కాంపిటీషన్‌లో ప్రేమ్ విజయం సాధించగానే తులసి ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోతుంది. ఆ తర్వాత అతడిని స్టేజ్ మీదకు పిలుస్తారు. మరోవైపు, లాస్య వచ్చి నందూ ఫోన్ చెక్ చేయబోతుంది. అంతలో ఆయన 'నువ్వేమీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రేమ్‌కే ఓటు వేశాను. నేను వాడి తండ్రిని. వాడు తప్పు చేస్తే కోప్పడతాను. బాగుపడే పని చేస్తే ప్రోత్సహిస్తాను. అయినా వాడు బాగా పాడాడు. నా మనస్సాక్షికి ఏది అనిపిస్తే అది చేస్తా. నేను తనకే ఓటేశా' అని చెబుతాడు. దీంతో నీ ఒక్క ఓటు వల్లే ప్రేమ్ గెలిచాడు అని లాస్య నందూపై కోప్పడుతుంది.

తల్లికి అంకితం... శృతికి ముద్దులు
స్టేజ్ మీద ప్రేమ్ మాట్లాడుతూ.. 'నాకు ఓటేసి గెలిపించిన వాళ్లందరికీ థాంక్స్. మా నాన్న నన్ను నమ్మలేదు. దారి తప్పానని వదిలేశాడు. కానీ, నాలో ఉన్న గాయకుడిని మా అమ్మ చిన్నప్పుడే చూసింది. ఈ గెలుపు మా అమ్మకే అంకితం. మా అమ్మ తర్వాత నేను చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి నా భార్య శృతి. నా కష్టాన్ని పంచుకుంది. నన్ను అక్కున చేర్చుకుని ఓదార్చింది. నా జీవితంలోనే కాదు.. ఈ గెలుపులో కూడా సగ భాగం భార్యదే. నాకు సరైన సంపాదన లేకపోయినా తనే జాబ్ చేస్తూ నాకోసం శ్రమ పడుతోంది. థాంక్యూ శృతి' అంటూ ఆమెకు ముద్దులు ఇస్తాడు.

ట్రోఫీని కూడా తులసికి ఇచ్చేలా
ప్రేమ్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన తర్వాత అతడికి ట్రోఫీని ఇవ్వాలని యాంకర్ జిల్లా కలెక్టర్ ప్రకాశ్‌ను కోరుతుంది హోస్ట్. దీంతో కలెక్టర్ స్టేజ్ మీదికి వస్తారు. అప్పుడాయన ప్రేమ్‌కు ట్రోఫీ ఇవ్వబోతుండగా ఆపుతాడు. అప్పుడు 'నా విజయంలో వెనకున్నది మా అమ్మే. మీరేమీ అనుకోకపోతే ఈ ట్రోఫీని నాకు కాకుండా మా అమ్మకు ఇవ్వండి' అంటాడు. దీంతో సరే అంటాడు. ఆ తర్వాత తులసిని స్టేజ్ పైకి రమ్మని పిలుస్తారు. ఆమె వచ్చి ట్రోఫీని తీసుకుంటుంది. ఆ తర్వాత అందరూ చప్పట్లో కొట్టి ఆమెను అభినందిస్తుంటారు. దీంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది.

నందూకు చురకలు వేసిన తులసి
ట్రోఫీని తీసుకున్న తర్వాత యాంకర్.. తులసిని 'మీ అబ్బాయి విజయం గురించి రెండు మాటలు మాట్లాడండి' అని అడుగుతుంది. దీంతో ఆమె మైక్ తీసుకొని 'నేను తల్లిగా ఓడిపోయాను అంటూ ఒక పెద్దమనిషి నా మీద నింద వేశాడు . ఆ పెద్దమనిషి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. కొడుకు పక్కన గర్వంగా తలెత్తుకు నిలుచున్న నన్ను చూస్తున్నారు. ఇప్పటికీ నేను తల్లిగా ఓడిపోయాను అని అనుకుంటే ఆయన స్టేజ్ మీదికి వచ్చి నాతో చెప్పొచ్చు. ఈ రోజు తల్లిగా గెలిచాను. నా బిడ్డ ముఖంలో సంతోషం చూస్తున్నాను' అంటూ చురకలు అంటిస్తుంది.

ప్రేమ్‌కు నందూ సారీ.. బాధగానే
తులసి, ప్రేమ్ స్టేజ్ దిగి కిందకు వస్తారు. దీంతో అక్కడున్న వాళ్లందరూ అతడికి కంగ్రాట్స్ చెబుతారు. ఆ తర్వాత తులసి ఫ్యామిలీ మొత్తం ఒకచోటుకు చేరుకుంటుంది. ఆ సమయంలో నందూ, అభి వాళ్ల దగ్గరకు వెళ్తారు. అప్పుడు నందూ 'నీ గొప్పతనం ఈరోజు తెలుసుకున్నాను. కంగ్రాట్స్ రా. తండ్రిగా నేను ఓడిపోయాను.. తల్లిగా మీ అమ్మ గెలిచింది' అంటాడు. దీంతో ప్రేమ్ 'తండ్రిగా నన్ను అనే హక్కు మీకు ఉంది. కానీ, అమ్మ మూలంగా నేను చెడిపోయానని అన్నారు కదా. అదే నాకు బాధగా ఉంది. దయచేసి ఇంకెప్పుడూ అలా అనకండి నాన్న' అంటాడు.

నందూతో గొడవ పెట్టుకున్న లాస్య
కాంపిటీషన్ అయిన తర్వాత నందూ ఇంటికి తిరిగి వస్తాడు. అతడిని చూసి లాస్యకు చాలా కోపంగా ఉంటుంది. దీంతో నందూ 'నా కొడుకును గెలిపించుకోవడం నా బాధ్యత అనిపించింది' అంటాడు. అప్పుడు లాస్య 'నీ బాధ్యత అనుకొని మీ మాజీ భార్యను కూడా కలుపుకుంటావా? మళ్లీ ఒక్కటైపోతారా' అని అడుగుతుంది. దీంతో నందూ 'నా కోపం తులసి మీద కానీ.. నా పిల్లల మీద కాదు. వాళ్లకు నేనెప్పుడూ తండ్రినే' అంటాడు. తర్వాత ప్రేమ్ గెలుపును సంబురాలు చేయాలని అనుకుంటుంది. బోనాలు సమర్పించాలని అనుకుంటుంది. బోనాలు ప్రారంభం అవుతాయి. వేడుకలకు అభి కూడా వస్తాడు. అమ్మ మాటను తులసి గౌరవించి వచ్చావు థాంక్స్ అంటుంది. దీంతో గుడిలో అమ్మవారి గురించి వచ్చాను అంటాడు. మరోవైపు రిషి కోసం వసుధర, సాక్షి ఇద్దరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తారు. కానీ.. బోనం ఎలా చేయాలో వసుధరకు తెలియదు. దీంతో తులసి వాళ్లకు నేర్పుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











