Intinti Gruhalakshmi: తులసి తాళితో పరారైన దొంగ.. నిజం తెలుసుకున్న విక్రమ్.. కథలో ఊహించని ట్విస్ట్
జనరేషన్లు చేంజ్ అవుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ బిజినెస్ కోసం తన మెడలోని తాళిని తీసి ఇస్తుంది తులసి. అది తీసుకోవడం ఇష్టం లేకపోయినా అతడు తప్పక తీసుకుంటాడు. మరోవైపు దివ్య ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ ఉండగా లాస్య, రాజ్యలక్ష్మి సంతోషిస్తారు. అంతేకాదు, విక్రమ్ ఆస్తిని కొట్టేసే వరకూ యాక్టింగ్ చేస్తానని రాజ్యలక్ష్మి లాస్యతో అంటుంది. తర్వాత లాస్య వచ్చి విక్రమ్‌ను బ్లాక్‌మెయిల్ చేయమని దివ్యతో చెప్తుంది. కానీ, ఒప్పుకోదు. అప్పుడు లాస్య.. దివ్య ఆత్మహత్య చేసుకోబోతుందని విక్రమ్‌కు చెప్తుంది. దీంతో అతడు కంగారుగా వచ్చి ఆమె తాగే పాలను పడేస్తాడు.

దివ్య గురించి లాస్య కట్టు కథ:దివ్య గురించి చెప్పిన లాస్య ఆ తర్వాత 'దివ్య నిద్ర మాత్రలు తీసుకుని బాటిల్‌ను విసిరేయడాన్ని కళ్లారా చూశాను' అని కట్టు కథ చెప్తుంది. దీంతో దివ్య అబద్దం చెప్తున్నావు అనగా.. లాస్య 'నీపై ద్వేషం ఉంటే చూసి ఊరుకునే దాన్ని విక్రమ్‌తో ఎందుకు చెప్తాను? నిన్ను ఎందుకు రక్షించాలని అనుకుంటాను? మీ నాన్న కూడా అంతే అపార్ధం చేసుకుని నన్ను వదిలేశాడు' అంటుంది. అప్పుడు బసవయ్య'అపార్ధం చేసుకోవడం వీళ్ల ఫ్యామిలీకి ఉన్న కామన్ జబ్బు అనుకుంటా. అందుకే ఆ ఇల్లు.. రెండు ఇల్లు.. రెండు పెళ్లిళ్లతో కళకళలాడుతుంది' అంటాడు.

అందరినీ అరెస్ట్ చేసేవాళ్లు:బసవయ్య మాటలతో దివ్యకు కోపం వచ్చి అరుస్తుంది. అప్పుడు విక్రమ్ 'అరవడం కాదు దివ్యా.. లాస్య సమయానికి వచ్చి నన్ను హెచ్చరించింది. లేకపోతే ఏంటి పరిస్థితి' అని అంటాడు. దీంతో బసవయ్య 'లేకపోతే ఏంటి అల్లుడూ? ఈపాటికి దివ్య నురగలు కక్కుతూ పడిపోయేది. వాళ్ల అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది.. నిమిషాల్లో పోలీసులు వచ్చేవాళ్లు. అక్కయ్యతో పాటు అందరినీ సంకెళ్లు వేసి లాక్కుని వెళ్లేవాళ్లు. కోర్టులో నిలబెట్టేవాళ్లు. మన పరువు అంతా మూసీ నదిలో కలిసిపోయేది' అని అంటాడు. దీంతో విక్రమ్ అతడిపై సీరియస్ అవుతాడు.

అమ్మ లేకుండా ఉండలేను:తర్వాత రాజ్యలక్ష్మి 'అమ్మా దివ్యా.. నాపై కోపం ఉంటే నాపై తీర్చుకో కానీ, నా బిడ్డను మాత్రం జైలు పాలు చేయకు. దయచేసి వాడి జోలికి వెళ్లొద్దమ్మా. నా బిడ్డ నిన్ను ప్రేమించాడని తెలసి పది మెట్లు కిందికి దిగి మీకు పెళ్లి చేశాను కదమ్మా' అని యాక్టింగ్ చేస్తుంది. దీంతో బసవయ్య 'అక్కా.. అనుక్షణం భయపడుతూ మనం ఇక్కడ ఉండలేం. వేరే ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుందాం పదా. విక్రమ్, దివ్య సంతోషంగా ఉంటారు. దివ్యకి కావాల్సింది కూడా అదే కదా.. మనం ఈ ఇంట్లో ఉండటం నువ్వు ఏరికోరి తెచ్చుకున్న కోడలికి ఇష్టం లేదు' అని అంటాడు. దీంతో విక్రమ్ 'తెలిసో తెలియకో దివ్య తప్పు చేసింది.. అంత మాత్రానికి మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారా? అమ్మ లేని ఇంట్లో నేను ఉండలేను. నాకు ఈ ఇల్లే అక్కర్లేదు' అంటాడు.

జీవితాంతం చెల్లిస్తుంటాను:తులసి ఇచ్చిన తాళిని చూసస్తూ నందూ 'తోడు నీడగా నిండు నూరేళ్లు నీతో కలిసి ఉండాలని ఈ తాళి నీ మెడలో కట్టాను. కానీ నా మాటను నిలబెట్టుకోలేదు. నీ తాళి తెంపేశాను. నా దారి నేను చూసుకున్నాను. నువ్వు ఏమైపోతే నాకేంటి అనుకున్నాను. దానికి మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నా తులసి. జీవితాంతం చెల్లిస్తూనే ఉంటాను' అని ఏడుస్తాడు. అప్పుడే తులసి అతడి దగ్గరకు వస్తుంది. దీంతో నందూ ఎమోషనల్‌గా మాట్లాడతాడు. దీనికి తులసి కూడా అలాగే మాట్లాడుతుంది. మొత్తానికి తమ మధ్య బంధం ఉందని ఇద్దరూ నమ్ముతారు.

విక్రమ్‌కు వివరించిన దివ్య:అందరూ మాటలు అంటుంటే గొడవ పడలేక గదిలోకి వెళ్లిపోయిన దివ్య దగ్గరకు విక్రమ్ వస్తాడు. అప్పుడామె ఇంట్లో తను ఎదుర్కొంటోన్న పరిస్థితుల గురించి బాధ పడుతూ విక్రమ్‌ను నిలదీస్తుంది. అంతేకాదు, లాస్య కావాలనే తాను సూసైడ్ చేసుకోబోతున్నట్లు చెప్పిందని వివరిస్తుంది. అప్పుడు విక్రమ్ ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ, దివ్య మాత్రం అస్సలు ఆగకుండా తన ఇబ్బందుల గురించి తెలిసేలా మాట్లాడుతుంది. దీంతో విక్రమ్‌లో ఆలోచన మొదలవుతుంది.
తాళిని అమ్మేయాలనుకుని:ఇక, తాళిని తాకట్టు పెట్టేందుకు తులసి, నందూ బంగారం షాపునకు వెళ్తారు. అది తూకం వేసిన ఆయన ఎంత డబ్బు వస్తుందో చెప్తాడు. కానీ, అది తనకు సరిపోదని కాస్త పెంచమని నందూ అడుగుతాడు. అయినా ఆయన రెండు వేలు కంటే ఎక్కువ పెంచనని అంటాడు. దీంతో తులసి అమ్మితే ఎంత వస్తుందో చెప్పమని అడుగుతుంది. అప్పుడాయన లెక్క చూస్తుండగా నందూ తాళి అమ్మడానికి వీలు లేదని అది తీసుకుని వెళ్లిపోతాడు. అలా ఇద్దరూ బయటకు వచ్చి నడుస్తూ వెళ్తుండగా.. వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ బంగారు తాళిని తీసుకుని పారిపోతాడు.

నిజం తెలుసుకున్న విక్రమ్:తాళిని దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తిని నందూ వెంబడిస్తాడు. ఒక సందర్భంలో అతడిని పట్టుకుని తాళి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఆ వ్యక్తి విడిపించుకుని తాళితో పారిపోతాడు. అదంతా అదే దారిలో వస్తున్న విక్రమ్ చూస్తాడు. కానీ, వాళ్ల దగ్గరకు వెళ్లడు. ఇక, ఆ దొంగ పారిపోయిన తర్వాత తులసితో నందూ 'చెప్తే విన్నావా? అసలు ఆ తాళి వద్దు అని చెప్పా. అసలు నువ్వు నా గురించి పట్టించుకోవద్దు' అని ఏడుస్తూ చెప్తాడు. అది చూసిన విక్రమ్ 'అంటే.. దివ్య చెప్పింది నిజమే అన్న మాట. వీళ్లు డబ్బు తీసుకోలేదు' అని నిజం తెలుసుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











