Intinti Gruhalakshmi: వాళ్లకు షాక్ ఇచ్చిన విక్రమ్.. తాళి పోయినా తులసి సంతోషం.. కథలో మరో ట్విస్ట్
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య సూసైడ్ చేసుకోబోతుందని లాస్య అందరినీ నమ్మిస్తుంది. దీంతో బసవయ్య ఇంకా ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అది తట్టుకోలేకపోయి దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత విక్రమ్ అక్కడకు రావడంతో అతడికి వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక, మంగళసూత్రాలను తాకట్టు పెట్టేందుకు నందూ, తులసి వెళ్లగా బేరం కుదరక వచ్చేస్తుంటారు. అప్పుడు వాళ్ల దగ్గర ఉన్న తాళిని ఓ వ్యక్తి దొంగిలించి పారిపోతాడు. అదంతా చూసిన విక్రమ్.. దివ్య వాళ్లకు డబ్బులు నిజంగానే ఇవ్వలేదన్న నిజాన్ని తెలుసుకుంటాడు.

మీ తప్పేం లేదు బాధ పడొద్దు: మంగళసూత్రాన్ని దొంగ ఎత్తుకుపోవడంతో నందూ బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి 'జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. నా అజాగ్రత్త వల్లే వాడు నా చేతిలో నుంచి మంగళసూత్రం లాక్కుని వెళ్లిపోయాడు. నా చేతకానితనం వల్లే నా మంగళసూత్రం పోయింది' అంటుంది. అయినా నందూ ఫీల్ అవుతుంటాడు. దీంతో తులసి 'జరగాల్సింది జరిగిపోయింది. పదండీ ఇంటికి పోదాం. ఇప్పుడు మన చేయగలిగింది ఏమీలేదు రండి' అంటుంది. అదంతా చూసిన విక్రమ్.. ఇక ఆగలేక వచ్చి వాళ్లకి ఎదురుగా నిలబడతాడు.

మీ అమ్మగారు కథ అల్లుతారు: విక్రమ్ అక్కడకు రాగానే తులసి 'బాబూ ఈ విషయం మేము దివ్యకు చెప్పం. మీరు కూడా చెప్పొద్దు బాబూ. మా రోజులు బాలేదు. నిందలు మెడకు చుట్టుకుంటున్నాయి. ఉన్న కష్టాలు చాలు. కొత్త కష్టాలు మోసే ఓపిక లేదు' అని అంటుంది.
దీంతో విక్రమ్ జాలిగా 'అత్తయ్య గారూ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి' అని అంటాడు. దీంతో తులసి 'వద్దు బాబూ వద్దు.. మీ అమ్మ గారు చూశారంటే ఏదొక కథ అల్లుకుంటారు. అల్లుడ్ని మా వైపు తిప్పుకుంటున్నావు అని అనుమానిస్తారు' అని ముఖం మీదనే అనేస్తుంది.
మా దగ్గర ఆధారాలేవీ లేవుగా: తులసి మాటలకు విక్రమ్ మా అమ్మ అలాంటిది కాదు అత్తయ్య గారూ అంటాడు. దీనికామె 'నువ్వు మంచోడివే బాబూ.. నిన్ను అనుమానించడం లేదు' అని అనగా.. ప్లీజ్ అత్తయ్య గారూ నాతో రండి కాదనకండి' అంటాడు. తర్వాత వాళ్లు విక్రమ్ కారులో వెళ్తారు.
అక్కడ దిగగానే తులసి 'నువ్వు ఇంతకు ముందు చూసింది అంతా నిజమే బాబూ నాటకం కాదు. నమ్మమని అడగడమే తప్ప మా దగ్గర ఆధారాలు లేవు' అని అంటుంది. దీంతో విక్రమ్ ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరి కాళ్లపై పడతాడు. తర్వాత తప్పు చేశానని బాధ పడతాడు.

పరువు మర్యాదలే ముఖ్యం: ఆ తర్వాత విక్రమ్ 'నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని, దివ్యను అపార్ధం చేసుకున్నాను.. అవమానించాను.. మీకు డబ్బులిచ్చి ఆ నిజం దాస్తుందని అనుకున్నాను. మీ నిజాయితీని అనుమానించాను. నన్ను క్షమించండి' అంటాడు. దీంతో తులసి 'నేను మీకు చెప్తూనే ఉన్నా. కళ్లతో చూసిందే నిజం కాదని.. ఇప్పుడైనా నమ్ముతావా' అంటుంది.
దీంతో తప్పకుండా నమ్ముతాను అంటాడు. అప్పుడు తులసి 'ఆడపిల్లకు పెట్టడమే తప్ప ఆశించడం మాకు చేతకాదు. మా బంధానికి మచ్చ పడిందని దివ్యను మాతో మాట్లాడొద్దని గట్టిగా చెప్పాను. మాకు అది బాధగానే ఉంది. మాకు బాధకంటే పరువు మర్యాదలు ముఖ్యం' అంటుంది. దీంతో విక్రమ్ 'ఇకపై ఇలా జరగదు. ఇంటి దొంగను పట్టుకుంటాను అత్తయ్య' అంటూ వెళ్లిపోతాడు.
నందూకు సేవలు చేసింది: దొంగను పట్టుకునేప్పుడు నందూ చేతికి గాయం కావడంతో తులసి వచ్చి 'ఆ చేయి ఇలా ఇవ్వండీ.. ఏమీ కాదు.. కాసేపు నన్ను మీ నర్స్ అనుకోండి' అని అంటుంది. అప్పుడు అతడు తాళిని దొంగ తీసుకోవడం గురించి బాధ పడుతుంటాడు. అప్పుడు తులసి 'దాని వల్ల మంచే జరిగింది.
అలా తాళి పోవడం వల్లే కదా.. అల్లుడి గారికి మన గురించి నిజం తెలిసింది. దివ్య జీవితంలో నష్టం జరగకుండా ఆగింది. అల్లుడు మనకు దగ్గరయ్యాడు. ఇందుకు మీకు సంతోషంగా లేదా' అని అనగా నిజమే అంటాడు. తర్వాత తాళి గురించి కంప్లైంట్ ఇచ్చానని తులసి చెప్తుంది.

దివ్య ఆ తప్పు చేయలేదు: విక్రమ్ కోపంగా వచ్చి అమ్మా అని పిలుస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి వచ్చి యాక్టింగ్ షురూ చేస్తుంది. 'నా అనుకున్న వారు.. నేను నమ్మిన వాళ్లు నన్ను వెన్నుపోటు పొడుస్తారని అనుకోలేదు. నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదు' అంటాడు. దీంతో అందరూ దొంగతనం జరిగిన లక్ష గురించేనా అని అడుగుతారు.
దీనికతడు అవును అంటాడు. అప్పుడు బసవయ్య దివ్యనే దొంగతనం చేసిందని మాట్లాడతాడు. ఆమె మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుంది. అప్పుడు విక్రమ్ తాత రంగంలోకి దిగి దివ్యే తప్పు చేసిందా అని అడగ్గా.. విక్రమ్ తను తప్పు చేయలేదు అంటాడు.
దివ్యకు సారీ చెప్పిన భర్త: ఆ తర్వాత విక్రమ్ 'ఇంట్లో కనిపించకుండా పోయిన డబ్బు దివ్య వాళ్ల అమ్మానాన్నకు ఇచ్చిందని నమ్మాను. కానీ, నా కళ్లు నన్ను మోసం చేశాయని తెలుసుకున్నా. కళ్లతో చూసింది నిజం కాదని దివ్య ఎప్పుడూ అంటుండేది. అదే నిజమని ఇప్పుడు నిజమైంది. కచ్చితంగా ఈ ఇంట్లో వాళ్లే.. ఈ ఇంట్లో మనిషే. మర్యాదగా దొంగ తనకు తానుగా ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తా.
అదే నేను పట్టుకుంటే మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. నిన్ను అనుమానించినందుకు సారీ దివ్య' అంటాడు. కానీ, దివ్య మాత్రం తన పరువు పోయిందని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు బసవయ్య బుక్కైపోయా అని మనసులో అనుకుంటాడు. కానీ, బయటకు చెప్పొద్దని రాజ్యలక్ష్మి బెదిరిస్తుంది. తర్వాత రాములమ్ము దివ్యకు ఫోన్ చేస్తుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











