Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్‌కు యాక్సిడెంట్.. కడుపులో కత్తెర పెట్టి.. రాజ్యలక్ష్మికి షాక్
ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి గురించి దేవుడు వెటకారంగా మాట్లాడడంతో విక్రమ్ తనకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని తేల్చి చెబుతాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి కూరగాయలు తెచ్చేందుకు వెళ్లగా.. అక్కడ దివ్య కనిపిస్తుంది. దీంతో ఆమెతో విక్రమ్ మాట్లాడతాడు. ఆ సమయంలోనే భాగ్య వీళ్లిద్దరినీ చూసి తన ఫోన్‌లో ఫొటోలు తీసుకుంటుంది. ఇక, తులసికి జ్వరం రావడంతో నందూ చలించిపోతాడు. ఆమెకు సపర్యలు చేయడంతో పాటు సూప్‌ను తయారు చేసి ఇస్తాడు. దీంతో లాస్య అదంతా చూసి తెగ కుళ్లుకుంటూ కెఫేకు ఒంటరిగా వెళ్లిపోతుంది.

వీళ్ల మూకీ ప్రేమ ఏంట్రా బాబూ
దివ్య స్కూటీ టైర్ పంక్చర్ అవడంతో విక్రమ్ ఆమెను కారులో తీసుకెళ్తాడు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పక్క పక్కనే ఉన్న ఇద్దరూ మాట్లాడుకోకుండా సిగ్గు పడుతూ ఉంటారు. అప్పుడు ముందు సీటులో ఉన్న దేవుడు 'వీళ్ల మూకీ ప్రేమ ఏంట్రా బాబు. ఎంతో కష్టపడి మేడం టైర్ పంక్చర్ చేశాను. కానీ, ఇప్పుడు వర్కౌట్ కావడం లేదు. ఒక పని చేస్తా. ఇప్పుడు ఒక లవ్ సాంగ్ ప్లే చేస్తా' అంటూ పొరపాటున శాడ్ సాంగ్‌ను పెడతాడు. అది విని అందరూ షాక్‌కు గురవుతారు. అంతలోనే వీళ్లు ప్రయాణిస్తున్న కారును ఓ జంట స్కూటీపై వస్తూ ఢీ కొడుతుంది.

యాక్సిడెంట్.. వాళ్లిద్దరూ గొడవ
యాక్సిడెంట్ అవడంతో స్కూటీ మీద ఉన్న అమ్మాయికి దెబ్బలు తగులుతాయి. దీంతో వెంటనే దివ్య ఆమెకు ప్రథమ చికిత్స చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ తెగ కంగారు పడుతూ ఉంటారు. ఆ సమయంలో స్కూటీ నడిపిన అబ్బాయిని.. వెనకాలే ఉన్న అమ్మాయి 'ఎందుకంత స్పీడుగా నడిపావు? చెబితే అస్సలు వినలేదు' అంటుంది. అప్పుడతను 'నేను నడపడం వల్ల కాదు. నువ్వు సరిగా కూర్చోలేదు. అందుకే కింద పడిపోయావు' అంటాడు. అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు తప్పును నెట్టుకుంటూ గొడవ పడుతూ ఉంటారు.

ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన విక్రమ్
అమ్మాయి, అబ్బాయి గొడవ పడుతుండగా విక్రమ్ ఆపుతాడు. అంతేకాదు, ఆ వెంటనే 'బ్రదర్ నీ గర్ల్‌ఫ్రెండా? నీ గురించి ఆలోచించి.. నీ గురించి బాధ పడే ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడు.. సంతోషించు. అంతేకానీ, ఇలా చిరాకు పడకు. అయినా తను ఎవరి గురించి చెబుతుంది? తను నీ గురించే చెప్తుంది. తనకు తగిలిన దెబ్బను పట్టించుకోకుండా.. నీకు ఏమీ కాకూడదు అని నీ గురించి ఆలోచిస్తుంది. నీకు ఆమె బాధ వెనుక ప్రేమ అర్థం కావట్లేదా? అయినా అతడు చిరాకు పడుతున్నాడు కదమ్మా.. వదిలేయొచ్చుగా' అని ఆమెతో అంటాడు. దీనికా అమ్మాయి.. 'వాడు విసుక్కున్నా నాకు పర్లేదు. సేఫ్‌గా ఉండడమే నాకు కావాలి' అని బదులిస్తుంది.

పెదాలు పలికే పదాలు కావు
ఆ తర్వాత విక్రమ్ 'ప్రేమంటే పెదాలు పలికే పదాలు కావు బ్రదర్. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే భావన. పెదాలు కూడా పలకలేని భావన. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు.. ఆమె కళ్లు చూడు. కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. అందులో ప్రతి చుక్కా నీ కోసమే. నీకేమి అవుతుందో అన్న భయమే. ప్రేమంటే బైకుపై వెనకాల కూర్చుని నడుము చుట్టూ చేయి వేసుకుని కూర్చోవడం కాదు. జీవితాంతం నీ గురించే తపన పడుతూ నీ చేయి పట్టుకుని కాపాడుకోవడం. అలాంటి మనిషి చేయి నువ్వు వదిలితే అంతకంటే దురదృష్టం ఉండదు' అని క్లాస్ పీకుతాడు. దీంతో ఆ కుర్రాడు అమ్మాయికి సారీ చెప్పి, విక్రమ్‌కు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. ఇక, విక్రమ్ మాటలకు దివ్య ఫిదా అయిపోతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత దేవుడు విక్రమ్‌ను ఆటపట్టిస్తాడు.

వాళ్లను చూసి దివ్య సంతోషం
దివ్య ఇంటికి వచ్చే సరికి తులసికి నందూ సూప్ తాగిస్తూ ఉంటాడు. అది చూసి దివ్య ఎంతో ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత పరందామయ్య, అనసూయ దగ్గరకు వెళ్లి 'నాకు ఊహ తెలిశాక.. అమ్మానాన్నలను ఇలా దగ్గరగా చూడడం ఇదే తొలిసారి. అందుకు సంతోషపడాలా? ఈ క్షణాలు శాశ్వతం కాదని రియలైజ్ అయి బాధ పడాలా' అని అంటుంది. మల్లెతీగ, పందరి అంటూ ఓ కథను చెప్పి ఆమెను ఓదార్చుతాడు. దీంతో దివ్య 'పోగొట్టుకున్నది మళ్లీ దొరకదా తాతయ్య' అని ప్రశ్నిస్తుంది. దీనికాయన 'వేలికున్న బంగారు ఉంగరం బకెట్‌లో పడితే తీసుకోవచ్చు. కానీ, సముద్రంలో పడితే' అంటాడు. తర్వాత అనసూయ కూడా దివ్యను ఓదార్చేలా మాట్లాడుతుంది.

కడుపులో కత్తెర పెట్టారంట
దివ్య ఆస్పత్రిలో ఉండగా ఓ ఇద్దరు వస్తారు. అప్పుడు తులసి దివ్యకు ఫోన్ చేసి.. 'అమ్మా నీ దగ్గరకు శాకుంతల అనే ఆవిడను పంపించాను. ఆమెకు కడుపు నొప్పి ఉంటే మీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారంట. అయినా తగ్గకపోయే సరికి వేరే ఆస్పత్రిలో చూపించారట. దీంతో కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారని చెప్పారట. ఇదేంటి అని అడిగితే మీ వాళ్లు మాకు సంబంధం లేదు అన్నారంట. వేరే ఆస్పత్రిలో చాలా అడుగుతున్నారంట. పాపం ఏమీ లేని వాళ్లమ్మా' అని చెబుతుంది. దీంతో దివ్య 'సర్లే. మా వాళ్లతో నేను మాట్లాడతాను. మరీ ఇంత దారుణమా' అంటుంది.

సారీ చెప్పి.. పది లక్షలిచ్చి
పేషెంట్‌కు జరిగిన అన్యాయం గురించి దివ్య వెళ్లి రాజ్యలక్ష్మికి చెబుతుంది. దీంతో సంజయ్ ఆమెను బుకాయించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి అతడిని ఆపి.. దివ్యను విషయం చెప్పమంటుంది. దీంతో దివ్య 'మన ఆస్పత్రిలో ఓ పెషేంట్‌కు అవసరం లేకున్నా ఆపరేషన్ చేయడంతో పాటు కడుపులో సీజర్స్ పెట్టి కుట్టేశారు. ఆ సర్జరీ చేసింది కూడా డాక్టర్ సంజయ్' అంటుంది. దీంతో అతడు ఆమెతో గొడవ పడతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి క్లాస్ పీకుతుంది. తర్వాత దివ్య 'వాళ్లు మన ఆస్పత్రి అంటే భయపడుతున్నారు. పది లక్షలు నష్టపరిహారం అడుగుతున్నారు' అని చెప్తుంది. దీంతో రాజ్యలక్ష్మి వాళ్లను లోపలికి రమ్మని సంజయ్‌తో సారీ చెప్పించి.. డబ్బు ఇస్తానని అంటుంది. తర్వాత దివ్యను మనసులో తిట్టుకుంటుంది.

విడాకులు ఇస్తావా అంటూ
జ్వరంతో బాధ పడుతున్న తులసి దగ్గరకు సామ్రాట్ కంపెనీ మేనేజర్ వచ్చి 'సారీ మేడం.. మీకు ఒంట్లో బాగోకపోయినా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. సామ్రాట్ గారు ముంబై బ్రాంచులోనే ఉన్నారు. కాబట్టి ఈ ఫైల్స్ మీద మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని చెప్తాడు. దీంతో తులసి సరే అంటుంది. మరోవైపు, నందూకు లాస్య ఫోన్ చేసి 'ఏంటి నందూ నాకేమైనా విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నావా' అని సూటిగా ప్రశ్నిస్తూ గొడవకు దిగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











