Intinti Gruhalakshmi Today Episode: పండుగ రోజు లాస్యకు ఘోర అవమానం.. ముఖం మీదే అలా అడిగిన నందూ
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఢిల్లీ ఈవెంట్‌కు రమ్మని వచ్చిన ఆఫర్‌ను ప్రేమ్ వద్దనుకుంటాడు. దీంతో శృతి అతడి నిర్ణయాన్ని తప్పుబడుతుంది. ఆ సమయంలో ఎంతగానో నచ్చజెబుతుంది. కానీ, అతడు మాత్రం వినడు. ఆ తర్వాత దివ్య వచ్చి కిచెన్‌లో పనులన్నీ చేశానని అంటుంది. అనంతరం అభిని నిజంగానే ఆస్పత్రికి వెళ్తావా అని అడుగుతుంది. దీంతో తులసి మీద ప్రమాణం చేసి ఇకపై తప్పు చేయనంటాడు. తర్వాత ప్రేమ్‌కు తులసి క్లాస్ పీకుతుండగా నందూ వస్తాడు. ఆ సమయంలో తండ్రిని కూడా అతడు ఎదురించేలా మాట్లాడతాడు.

సంబరాల్లో లాస్య, నందూ లేటుగా
తులసి ఇంట్లో మహాశివరాత్రి పండుగ సంబురాలు ఘనంగా జరుగుతుంటాయి. అందరూ సరదాగా ఉండటంతో తులసి కూడా సంతోషంగా కనిపిస్తుంది. అప్పుడామె 'మా కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు' అని తులసి కోటను మొక్కుతుంది. అలా అందరూ పండుగ పనుల్లో బిజీగా ఉండగా.. నందూ, లాస్య మాత్రం అప్పుడే నిద్రలేస్తారు. లేవడమే రాములమ్మను కాఫీ తెమ్మంటుంది లాస్య. వాళ్లను చూసి పరందామయ్య విసుక్కుంటూ 'ఈరోజు శివరాత్రి.. అందరూ ఉదయాన్నే లేచి పూజలు చేస్తుంటే మీరు ఇంకా కాఫీ దగ్గరే ఉండిపోయారు' అంటాడు.

లాస్యను లైట్ తీసుకున్న ఫ్యామిలీ
పరందామయ్య తిట్టడంతో లాస్య వెంటనే రెడీ అయి వచ్చి శృతితో నేను కూడా పూలు కడతాను అంటుంది. దీంతో మొన్న సంక్రాంతికి కటినప్పుడే అన్ని పూలు ఊడిపోయాయి అంటుందామె. ఇంతలో ప్రేమ్ వచ్చి.. 'నువ్వు పూలు కట్టడం పక్కన పెట్టు. అందరూ పూజ చేశాక నువ్వు ఇంత ప్రసాదం తిను. అదైనా నీకు పూజ చేసిన ఫలాన్ని అందిస్తుంది' అంటాడు. దీంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి.. రాములమ్మను పిలిచి.. నేను ఏం వంటలు చేయాలో చెబుతా. ఆ వంటలు చేయి అంటుంది. దీంతో వంటలు పూర్తి చేయడం ఎప్పుడో అయిపోయింది అంటుంది రాములమ్మ.

క్లాస్ పీకిన తులసి... లాస్యకు కోపం
లాస్య మాటలు విన్న తులసి 'ఏం వంటలు చేయాలో చెప్పాలనుకుంటే ఉదయమే లేవాలి' అంటూ క్లాస్ పీకుతుంది. దీంతో అక్కడి నుంచి లాస్య కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అంకిత దగ్గరికి వెళ్తుంది. ఆమెతో పూజ ఏర్పాట్లు చేద్దాం పదా అంటుంది. దీంతో 'పూజ ఏర్పాట్లు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రసాదం కూడా పూర్తయింది. పూజ అయిపోయాక వెళ్లి ప్రసాదం తిను' అంటుంది. ఆ తర్వాత పూజ మొదలు అవుతుంది. అందరూ మహాశివుడి లింగానికి పూజ చేస్తుంటారు. లాస్య, నందూను మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో లాస్యకు కోపం వస్తుంది.

లాస్యకు ప్రసాదం ఇవ్వని అంకిత
మహాశివరాత్రికి సంబంధించిన పూజ మొత్తం పూర్తైన తర్వాత రాములమ్మ హారతి తీసుకెళ్లి అందరికీ ఇస్తుంది. ఆ తర్వాత అంకిత ప్రసాదం పంచుతుంది. కానీ, లాస్య దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం అయిపోతుంది. దీంతో 'సారీ ఆంటి.. మీ దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం అయిపోయింది. ఏమనుకోకండి మళ్లీ తెచ్చిస్తాను' అంటుంది. దీంతో లాస్యకు కోపం వస్తుంది. అక్కడి నుంచి తన రూమ్‌లోకి వెళ్లిపోతుంది. వెనకాలే వెళ్లిన నందూ 'అదేంటి లాస్య అలా వచ్చేశావు. ఎందుకు అలా కోపంగా ఉన్నావు. నిన్ను ఎవ్వరూ ఏం అనలేదు కదా. ఎవ్వరూ ఏం అనకుండానే నీకు నువ్వే అనేసుకుంటున్నావు' అని అంటాడు.

నందూను బాగా రెచ్చగొట్టిన లాస్య
నందూ పదే పదే అడుగుతుండగా లాస్య 'ఉదయం నుంచి నేను పూజ కార్యక్రమాల్లో పాల్గొందామని అనుకున్నా కానీ.. నన్ను ఉదయం నుంచి ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా నన్ను దారుణంగా అవమానిస్తున్నారు. అందరూ ఒకటై నన్ను ఒంటరిని చేశారు. మీ వాళ్ల మనసులో అసలు నా గురించి ఏముందో తెలియాలి. నువ్వు ఇప్పుడే నీ వాళ్లతో నేను ఈ ఇంటి కోడలును అని ఒప్పించు' అని అంటుంది. దీంతో అతడు రేపు మాట్లాడుదాంలే అంటాడు. కానీ, లాస్య వద్దు ఇప్పుడే చెప్పాలి అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు కోపంతో లాస్యను తీసుకొని వస్తాడు నందూ.

వాళ్లను సూటిగా అడిగిన నందూ
లాస్యను తీసుకొచ్చిన నందూ 'అందరూ వినండి. లాస్య ఒక విషయం మీ నోటి నుంచి విని తెలుసుకోవాలని అనుకుంటోంది. భర్త స్థానంలో నేను ఇచ్చే హామీని తను నమ్మడం లేదు' అంటాడు. అప్పుడు అనసూయ 'నీ మాటే నమ్మడం లేదు.. మా మాట ఏం వింటుంది' అంటుంది. దీనికి నందూ 'సూటిగా అడుగుతున్నాను.. సూటిగా చెప్పండి. ఈ ఇంట్లో కోడలు ఎవరు.. తులసా.. లాస్యా' అని ప్రశ్నిస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మహాశివరాత్రి రోజు ఇంట్లో పూజ పూర్తవగానే అందరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి.

ప్రేమ్ ఎంట్రీతో గొడవ తీవ్రతరం
ఇక, నందూ 'తులసికి ఈ ఇంట్లో దక్కే మర్యాద తనకు దక్కడం లేదని లాస్య అంటోంది. ఈరోజు తెలిసిపోవాలి. ఎవరి పొజిషన్ ఏంటో తెలవాలి. లాస్యకు ఈ ఇంటి కోడలుగా ఎందుకు మర్యాద దక్కడం లేదు' అంటాడు. దీంతో ప్రేమ్ 'మర్యాద అనేది అడుక్కొని తీసుకునేది కాదు. ఎదుటి వాళ్ల మనసులోంచి పుట్టుకురావాలి' అంటాడు. అప్పుడు నందూ 'నేను నిన్ను అడగలేదు. మా అమ్మానాన్నలను అడుగుతున్నా. ప్రేమ్ మాట్లాడేది నీ గొంతుతోనా తులసి' అని అంటాడు. దీనికి ప్రేమ్ 'నేను అడుగుతున్నాను చెప్పండి.. మీరు లాస్య గొంతుతో మాట్లాడుతున్నారా.. లేక మీ గొంతుతో మాట్లాడుతున్నారా' అంటాడు.

తండ్రీ కొడుకుల మధ్య ఫైటింగ్
తండ్రి మాటలకు ప్రేమ్ 'పాతికేళ్లు మీ కోసం అమ్మ పడ్డ శ్రమను లాక్కున్నారు. ఇంకా సరిపోలేదా. తన కోసం తన వాళ్లతో అల్లుకున్న బంధాన్ని కూడా తీసేద్దామని అనుకుంటున్నారా. మా అమ్మ సంస్కారం ముందు మీరు దేనికీ పనికిరారు' అంటాడు. అప్పుడు లాస్య 'ఇప్పటి వరకు నాకు మాత్రమే విలువ లేదని నేను బాధపడ్డాను. నీకు కూడా విలువ లేదని నీ కొడుకు తేల్చేశాడు నందూ. ఒక్కరు కూడా ప్రేమ్‌ను తప్పుపట్టడం లేదు. మా అమ్మ... మా నాన్న అంటావు కదా ఇప్పుడేమైంది' అంటుంది. దీంతో ప్రేమ్ ఆమెపై కోప్పడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











