Intinti Gruhalakshmi: తులసికి గుడ్ న్యూస్ చెప్పిన నందూ.. అమ్మాయితో అడ్డంగా బుక్కైపోయిన విక్రమ్
చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య మోసాన్ని తులసి నిలదీయడంతో ఆమె ఏదేదో చెప్పుకొస్తుంది. దీంతో తులసికి కోపం వచ్చి ఆమెను కొట్టబోతుంది. అప్పుడు నందూకు కంప్లైట్ చేయగా.. అతడు కూడా కొట్టమంటాడు. చివరకు లాస్యకు తులసి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.
ఇక, విక్రమ్‌కు పెళ్లి చేయాలని అనుకున్న రాజ్యలక్ష్మి అతడి కోసం ఓ మధ్య తరగతి సంబంధం చూస్తుంది. ఆ సమయంలో అతడి ప్రేమ గురించి అడగ్గా ఎవరినీ లవ్ చేయడం లేదని చెప్తాడు. ఇక, నందూ మరోసారి లాస్యకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. అలాగే, విక్రమ్ గురించి దివ్య తులసికి చెబుతుంది.

విక్రమ్ గురించి తులసికి చెప్పేసి
రెండు లక్షల రూపాయల ఎక్కడి నుంచి వచ్చాయని అడగడంతో దాని గురించి మాట్లాడుతూ విక్రమ్ గురించి దివ్య తన తల్లికి చెబుతుంది. 'ప్రశాంతంగా మాట్లాడుతూ.. నుదిటిపై కుంకుమ బొట్టుతో రాముడు మంచి బాలుడు అంటాడు కదా ఆ టైప్ అన్నమాట' అని చెబుతుంది. దీంతో తులసి ఓహో నచ్చాడు అన్నమాట అంటుంది.
దీంతో దివ్య నచ్చడం ఏంటమ్మా అనగా.. నచ్చడం అంటే నచ్చడమే అని దివ్యను ఆటపట్టించేలా మాట్లాడుతుంది. అప్పుడామె 'నువ్వు ఏదో తేడాగా మాట్లాడుతున్నావు' అంటుంది. దీంతో దివ్యను చూస్తూ తనలో తానే తులసి నవ్వుకుంంటుంది.

డబ్బులు ఇచ్చేయమన్న తులసి
దివ్యతో మాట్లాడిన తర్వాత తులసి 'సరే ఇవన్నీ పక్కన పెట్టు. ఆ డబ్బులు తీసుకొని ఇంత వరకూ వాటిని మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే ఈ డబ్బులు అతనికి ఇచ్చేయ్. వీలైతే అతన్ని ఒకసారి మన ఇంటికి పిలుచుకొని రా' అని చెబుతుంది. దీంతో షాకైపోయిన దివ్య ఎందుకమ్మా అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి 'నుదిటి మీద బొట్టు, పెదాలపై చిరునవ్వు, మొహంలో ప్రశాంతత.. మొత్తంగా.. రాముడు మంచి బాలుడు అన్నావుగా. ఇవన్నీ నేను కూడా చూద్దామని' అని చెబుతుంది. ఆ వెంటనే తులసి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.

విక్రమ్‌కు ఫోన్ చేసి కలుద్దామని
విక్రమ్ కారులో వెళ్తూ దివ్య గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు 'అమ్మా.. నా మనసులో అయితే ఒకరు ఉన్నారు. కానీ ఆ అమ్మాయి మనసులోకి వెళ్లే అంతా స్నేహం చనువు మా మధ్య లేదు' అనుకుంటాడు. ఇంతలోనే దివ్య అతడికి ఫోన్ చేస్తుంది. ఆమె పల్లెటూరి అమ్మాయి మాట్లాడినట్లు మాట్లాడడంతో విక్రమ్ తికమకపడతాడు. ఆ తర్వాత దివ్య 'నేను డాక్టర్ దివ్యను. ఆరోజు హాస్పిటల్ డబ్బులు ఇచ్చారు కదా గుర్తుందా' అని అడుగుతుంది.
దీంతో విక్రమ్ 'మర్చిపోతేనే కదా' అనుకుంటూ ఉంటాడు. తర్వాత దివ్య మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అనడంతో 'ఏంటిది చదువుకున్న వాళ్ళు ఇంత స్పీడుగా ఉంటారా? నేను కూడా రెడీగా ఉన్నాను' అని మనసులో అనుకుంటూ ఎప్పుడు కలుద్దాం అంటాడు. దీంతో దివ్య అడ్రెస్ పంపి అక్కడకు రమ్మని చెబుతుంది.

నందూకు గుడ్ న్యూస్ చెప్పాడు
నందూ వాళ్ళ ఫ్రెండ్ వాసుదేవ్‌తో సరదాగా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగా సరే నేను డైరెక్ట్‌గా మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు నందూ సంతోషపడుతూ.. డాన్స్ చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది.
అప్పుడామె ఏమైందని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ ఇంట్లో ఏవైనా స్వీట్స్ ఉన్నాయా అనగా.. లేవు చేయమంటే చేస్తాను అంటుంది. దీనికతడు 'రేపు నా జీవితంలోకి అదృష్టం రాబోతోంది. రేపటి నుంచి నందగోపాల్‌కు రాజయోగం పట్టబోతోంది' అనుకుంటాడు. దీంతో తులసి అతడు ఏం చెబుతున్నాడో అర్థం కాక అయోమయ పడుతూ ఉంటుంది.

తులసితో ఇరికించిన వాసుదేవ్
తులసి క్లారిటీగా చెప్పమనగా నందూ 'నీకు మా ఫ్రెండ్ వాసుదేవ్ గుర్తున్నాడా. అక్కడికి వెళ్లి బాగా సంపాదించుకున్నాడు. ఇండియాలో కూడా డెవలప్ చేద్దామనుకుంటున్నాడు. అందుకే ఇండియాకు వస్తున్నాడు' అని చెప్తాడు. దీంతో తులసి సంతోషిస్తుంది. ఆ తర్వాత నందూ ఫ్రెండ్ వాసుదేవ్ మళ్లీ ఫోన్ చేసి 'మా చెల్లెలు చేతి వంటకాలు తినడానికి వస్తున్నాను. మా చెల్లెల్ని అన్ని వంటకాలు చేసి ఉండమని చెప్పు' అని అంటాడు.
అప్పుడు నందూ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత 'తులసి డివోర్స్ తీసుకున్న విషయం వాసుదేవ్‌కు తెలియదు వారికి తెలిస్తే బాధపడతాడు ఇప్పుడు ఏం చేయాలి. విడాకులు తీసుకున్న విషయం వానికి తెలిస్తే.. బిజినెస్ విషయం పక్కన పెడితే మా ఇంటికి కూడా రాడు' అనుకుంటాడు.

ఫ్రెండ్‌కు క్లాస్ పీకేసిన విక్రమ్
దివ్య రమ్మన్న దగ్గరకు వచ్చి విక్రమ్ ఆమె కోసం వేచి చూస్తూ ఉంటాడు. అప్పుడు తనలో తాను సంతోషపడుతూ 'ఏంట్రా విక్రమ్.. ఒక అమ్మాయి కాఫీ షాప్‌కు రమ్మంది. నీకు ఏదేదో అయిపోతుంది' అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వాళ్ళ ఫ్రెండ్ శిరీష కనిపించడంతో 'ఏంటి శిరీష అమెరికాకు వెళ్తున్నావా? అంత డబ్బులు ఎక్కడివి' అని ప్రశ్నిస్తాడు.
దీనికామె మేము ఉన్న ఇల్లు అమ్మేస్తున్నాను అనగా.. మరి మీ అమ్మానాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె స్వార్థంగా మాట్లాడుతుంది. అప్పుడామెకు విక్రమ్ గట్టిగానే క్లాస్ పీకుతుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దివ్య వస్తుంది.

విక్రమ్‌ను అపార్థం చేసుకుని
తన ఫ్రెండ్‌తో విక్రమ్ గొడవ పడడం చూసి దివ్య 'రాముడు అనుకున్నాను కానీ బొట్టు పెట్టుకున్న రావణాసురుడు అనుకుంటూ' అపార్థం చేసుకుంటుంది. అప్పుడు వచ్చేసారా అని విక్రమ్ అనడంతో ఏం రాకూడని టైంలో వచ్చానా అంటుంది. దీంతో విక్రమ్‌కు ఏమీ అర్థం కాదు. అప్పుడతను 'అరగంట నుంచి మీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అండి' అంటాడు.
దీంతో దివ్య 'ఒక ఆడపిల్ల చీ కొట్టగానే మరో ఆడపిల్లకి లైన్ వేయడం అమ్మో మామూలు విషయం కాదు' అంటుంది. దీనికి విక్రమ్ 'ఏంటండీ ఏం మాట్లాడుతున్నారు. మేడం మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి వాడిని కాదు' అని వివరించే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ, దివ్య మాత్రం అతడిని చడామడా తిట్టేసి డబ్బులు చేతిలో పెట్టేసి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











