Intinti Gruhalakshmi: దివ్యకు షాకిచ్చిన అత్త.. తప్పు చేయబోయి దొరికిన విక్రమ్.. లాస్యతో తులసి డీల్
ఎన్నో భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్ తనను తిట్టడంతో రాజ్యలక్ష్మి ముందు బసవయ్య ఫీల్ అవుతుంటాడు. అప్పుడామె ఆస్తి కోసం కొన్ని ఇబ్బందులు తప్పవు అని సర్థి చెప్తుంది. అప్పుడే విక్రమ్ వచ్చి పంట డబ్బులు ఆమెకు ఇస్తాడు.
ఆమె మాత్రం నటిస్తూ ఆ డబ్బు దివ్యకు ఇవ్వమంటుంది. కానీ, దానికి విక్రమ్ ఒప్పుకోడు. తర్వాత అతడు వెళ్లగానే రాజ్యలక్ష్మితో దివ్య ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు, నందూను మోహన్ మందలించగా.. తులసిని అంటే తట్టుకోలేనని అంటాడు. ఇక, విక్రమ్‌ను కొత్తగా మార్చేసిన దివ్యను రాజ్యలక్ష్మి అందరి ముందే మందలిస్తుంది.

విక్రమ్‌పై కోప్పడిన రాజ్యలక్ష్మి: దివ్య చెప్పినట్లు కొత్త బట్టలు వేసుకుని స్టైలిష్‌గా వచ్చిన విక్రమ్‌పై రాజ్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అంతేకాదు.. 'నా కొడుకు ఇలా బ్రష్టు పట్టిపోతుంటే చూస్తూ ఉండటానికేనా నేను ఇంకా బ్రతికున్నది? ఈరోజు తల్లిగా నేను ఓడిపోయాను' అంటూ నటిస్తూ ఏడుస్తుంది. ఆ వెంటనే బసవయ్య కూడా 'అయినా ఇన్నాళ్లు పెంచిన మీ అమ్మ మాట కాదని.. 20 రోజుల క్రింద వచ్చిన నీ భార్య మాటకి విలువిస్తావా? ఏంట్రా ఇది' అంటూ విక్రమ్‌ను నిలదీస్తాడు.
కాళ్ల మీద పడిపోయిన విక్రమ్: ఒకవైపు తల్లి.. మరోవైపు మేనమామ తనను అన్నన్ని మాటలు అంటుంటే విక్రమ్ చాలా బాధ పడిపోతాడు. ఆ వెంటనే షూస్ అవీ తీసేసి తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ చెబుతాడు. అంతేకాదు, 'ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను' అని ఆమెకు మాటను కూడా ఇస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి 'వెళ్లి బట్టలు మార్చుకొని రా' అని చెబుతుంది. దీంతో అతడు గదిలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి 'ఇప్పటికైనా అర్థమైందా ఈ రాజ్యలక్ష్మి అంటే ఏంటో' అంటూ దివ్య వైపు చూస్తుంటుంది.
బావగారి మీద ప్రేమతోనేనా?: ఇక, లాస్య దగ్గరకు తులసి వస్తుంది. ఆమె అలా గుమ్మం లోపలికి అడుగు పెట్టే ముందే ఎందుకు వచ్చావంటూ కోప్పడుతుంది. అప్పుడు భాగ్య వచ్చి 'చాలా రోజుల తర్వాత తులసి అక్క మా ఇంటికి వచ్చింది. మర్యాదలు చేసుకోనివ్వు' అంటుంది.
దీంతో తులసి 'నేను నీ సమస్యని తీర్చడానికే వచ్చాను' అనగా.. లాస్య 'నామీద జాలితో వచ్చిందా? మీ బావగారి మీద ప్రేమతో వచ్చిందా అడుగు భాగ్య' అంటుంది. దీంతో భాగ్య 'అలా అడిగితే తను మాత్రం ఏం చెప్తుంది? మనకి కావాల్సింది సమస్యకి పరిష్కారం' అంటుంది.

నందూ వస్తేనే ఒప్పుకుంటా: భాగ్య మాటలకు తులసి 'లాస్యకి కావలసింది తన కాపురం నిలబడటం, కెఫే. ఈ రెండు తనకు దక్కేలాగా నేను చేస్తాను. నాతో రమ్మను' అంటుంది. అప్పుడు లాస్య 'నా అనుమానాలు నాకు ఉన్నాయి. ఈ డీలింగ్ ఏదో నందూ వొచ్చి చెప్పొచ్చు కదా' అంటుంది. దీంతో భాగ్య 'లడ్డు వస్తే తినేయాలి అంతే.
కుడి చేత్తో ఎందుకు ఇచ్చావు? ఎడం చేత్తో ఎందుకు ఇవ్వలేదు అని కాలక్షేపం చేస్తే లడ్డు పాచిపోతుంది' అంటుంది. దీనికి లాస్య 'అదంతా నాకు తెలియదు.. రేపటిలోగా నందూ వచ్చి నా చేయి పట్టుకొని ఇంటికి తీసుకు వెళ్తే సరేసరి. లేదంటే కోర్టులోనే తేల్చుకుందాం' అంటుంది. దీంతో తులసి ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
విక్రమ్‌ను తిట్టిన తాతయ్య: తాతయ్య పక్కన పడుకున్న విక్రమ్ ఏమైనా కబుర్లు చెప్పమని అడుగుతాడు. దీంతో అతడిని ఆయన కోపంగా చూస్తాడు. దీంతో విక్రమ్ 'నేనేం చేశాను? ఎందుకు అంత కోపంగా చూస్తావు? అయినా అమ్మ ఏదో ఆడియో పంపించింది. అది వింటూ పడుకుంటాను' అని భగవద్గీత పెట్టుకుంటాడు.
దీంతో తాతయ్య 'అది పవిత్రమైన భగవద్గీత.. నిద్ర మాత్ర కాదు' అంటూ ఫోన్ ఆపేస్తాడు. దీంతో విక్రమ్ మరి ఏం చేయమంటావు అనగా.. తాతయ్య 'మీ అమ్మ మనసుతో కాదు.. నీ మనసుతో ఆలోచించు. అప్పుడప్పుడు తీయ్యని తప్పులు చేయొచ్చు. లేదంటే మీ అమ్మ జీవితాంతం నా పక్కనే పడుకోబెడుతుంది' అని చెప్తాడు.

తల్లికి దొరికిపోయిన విక్రమ్: తాతయ్య రెచ్చగొడుతోన్న సమయంలోనే దివ్య అక్కడకు వచ్చి విక్రమ్‌ను తన ఫోజులతో టెంప్ట్ చేస్తుంది. దీంతో విక్రమ్ ఆమె వెనుక వెళ్లిపోతాడు. అప్పుడతను అడగ్గా.. 'నువ్వు చెప్పినట్లే తియ్యని తప్పు చేయడానికి వెళ్తున్నాను' అంటాడు. దివ్య వెనుక విక్రమ్ వెళ్తోన్నది బసవయ్య, రాజ్యలక్ష్మి చూస్తారు.
అప్పుడు బసవయ్య అతడిని ఆపి అడగ్గా.. మనసు చెప్పినట్లు విందామని వెళ్తున్నానని విక్రమ్ చెబుతాడు. దీంతో రాజ్యలక్ష్మి 'నీ అవస్థ నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్తే ఇంటికి ఏమైనా అరిష్టం వస్తే ప్రమాదం కదా' అంటుంది. దీంతో బసవయ్య విక్రమ్‌ను తన దగ్గర పడుకోబెట్టుకుంటానని తీసుకెళ్తాడు. ఆ వెంటనే రాజ్యలక్ష్మి దివ్య వైపు గెలిచినట్లుగా చూస్తుంది.

ఇప్పుడు ఒప్పించండి అని: లాస్య దగ్గరకు వెళ్లొచ్చిన తర్వాత తులసి అత్తమామలకు భోజనం వడ్డిస్తూ జరిగిన సంగతి మొత్తం వివరించి చెప్తుంది. దీంతో అనసూయ 'నువ్వు వెళ్లేటప్పుడు చెప్పాల్సింది. నందూను ఒప్పించే వాళ్ళం కదా' అంటుంది. దీంతో తులసి 'చెప్తే వెళ్ళనివ్వరు కదా అత్తయ్య అందుకనే చెప్పలేదు. పోనీ ఆ ఒప్పించేదేదో ఇప్పుడు ఒప్పించండి. ఏమీ చేయకుండా కూర్చుంటే సమస్య రోజు రోజుకి పెద్దదవుతుంది తప్ప సమస్య తీరేదిగా అనిపించడం లేదు' అని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











