Intinti Gruhalakshmi: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన లాస్య.. నందూకు జైలు శిక్ష.. సీరియల్‌లో సూపర్ ట్విస్ట్
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తనకు మంచి చేసిందన్న కారణంతో లాస్య ఫోన్‌లో ఉన్న వీడియోను భాగ్య డిలీట్ చేస్తుంది. ఆ వెంటనే ఈ విషయాన్ని తులసికి ఫోన్ చేసి చెప్తుంది. మరోవైపు, రాజ్యలక్ష్మిని ఒక్కరోజులోనే నడిచేలా చేస్తానన్న దివ్య.. ఆమె కాళ్లకు బలంగా మర్ధనా చేస్తుంది.
అంతేకాదు, వెంటనే నడవకపోతే కాళ్లు విరగ్గొడతానని బెదిరిస్తుంది. దీంతో ఆమె నడుచుకుంటూ కొడుకు దగ్గరకు వస్తుంది. అది చూసి విక్రమ్ వాళ్లు సంతోషిస్తారు. ఇక, లాస్య ఇంటికి వచ్చి నందూ వాళ్లను బెదిరిస్తుంది. దీంతో వాళ్లు కూడా ఆమెకు ఎదురు తిరుగుతారు.

విక్రమ్‌కు క్లాస్ పీకేసిన దివ్య: తన తల్లి నడిచేలా చేసినందుకు విక్రమ్ పువ్వు ఇవ్వడంతో దివ్యకు కోపం వస్తుంది. అప్పుడామె 'ఈ పువ్వును నా మీద ప్రేమతో ఇచ్చావనుకున్నాను. కానీ అమ్మ మీద ప్రేమతో ఇచ్చావా' అంటూ తిరిగి ఇచ్చేస్తుంది.
దీంతో విక్రమ్ 'ఈ రెండింటికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు' అంటాడు. అప్పుడామె 'భార్యాభర్తల అనురాగం మధ్య మరొక వ్యక్తి ప్రభావం ఉండకూడదు. నీ ప్రేమను మీ అమ్మగారు గైడ్ చేయకూడదు. అది ఏ భార్య సహించలేదు. భార్యను అర్థం చేసుకో' అంటుంది. దీంతో విక్రమ్ సరే అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి కోర్టుకు బయలుదేరుతారు.

నందూ వాళ్లతో తులసి రాక: నందూ, తులసి కోర్టుకు బయలుదేరుతారు. అయితే, అప్పటికే లాస్య వచ్చి కారు దగ్గర ఉంటుంది. అప్పుడామె 'కొత్తగా పెళ్లయిన మొగుడు పెళ్లాల్లాగా బాగానే వస్తున్నారు. కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా' అంటూ నందూ వాళ్లను తిడుతుంది. ఆ తర్వాత 'ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇప్పటికీ మనిద్దరం భార్యాభర్తలమే.
మనం మాట్లాడుకోవాల్సిన ఊసులు చాలా ఉన్నాయి. పెళ్లిలో ఇలాగే అగ్నిహోత్రం చుట్టూ కలిసి నడిచాము. కలిసి రాలేనట్లుగా ఉంది.. ఇప్పుడు కోర్టుకి కలిసి వెళ్తున్నాము. ఇప్పటికైనా మించి పోయింది లేదు. వెనక సీట్లో కూర్చొని కోర్టుకు వెళ్లే లోపు బాగా ఆలోచించు' అంటుంది. దీంతో నందూ కారు తాళాలు చేతిలో పెట్టగా.. నేనేమీ కావాలని డ్రైవింగ్ సీట్లో కూర్చోలేదు అంటుంది.

నందూ అలా ఏడ్చేవాడని: లాస్య మాటలకు తులసి 'తెలుసు నందగోపాల్ గారు.. డ్రైవ్ చేస్తే ఎక్కడ నేను ఆయన పక్కన కూర్చుంటానో అని స్టీరింగ్‌ను చేతిలోకి తెచ్చుకున్నావు' అంటుంది. దీనికి లాస్య 'బాగానే గెస్ చేశావు. పెళ్ళికి ముందు నీ వలన పడిన కష్టాలు చెప్పుకొని నందూ ఈ భుజం మీదే ఏడ్చేవాడు.
నేనే ఓదార్చే దానిని' అని తులసికి చెప్తుంది. దీంతో అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు అని అడగ్గా.. లాస్య 'ఒకప్పుడు నిప్పు ఉప్పు లాగా ఉండే మీరిద్దరూ కలిసిపోయారు. నేను చేసిన తప్పులు కూడా మర్చిపోయి ఇలాగే కలిసుందాం అంటే నందు ఒప్పుకోవటం లేదు' అంటుంది.

తులసి అమృతం అంటూ: లాస్య ఓవర్‌గా మాట్లాడుతుంటే నందూ 'నువ్వు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటి దానివి. నిన్ను పక్కన పెట్టుకుంటే నాకే ప్రమాదం' అంటాడు. దీంతో లాస్య 'మరి తులసి ఏంటి' అని అడుగుతుంది. దీనికి నందూ 'తను అమృతం. మంచి చేసిన వాళ్ళకైనా చెడు చేసిన వాళ్లకైనా అమృతం మంచినే చేస్తుంది' అంటాడు.
దీంతో లాస్య 'చూస్తాను ఈ అమృతం నీకు ఎంత మంచి చేస్తుందో' అంటుంది. ఇంతలో కోర్టు రావడంతో నందూ గబగబా కారు దిగి వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్య నేను కలుద్దామనుకుంటే నందూ వద్దనుకుంటున్నాడు అని తులసితో చెప్తుంది.

వీడియో కథ కంచికి చేరేలా: లాస్య మాటలకు తులసి 'నేను మారాను.. మారుతున్నాను.. అని చెప్తున్నావు కానీ నువ్వు ఎప్పటికీ రాజ్యలక్ష్మి మనిషివే. అలాంటప్పుడు నిన్ను నందగోపాల్ గారు ఎలా నమ్ముతారు' అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య 'నమ్మకపోతే మీకే నష్టం. నా దగ్గర ఉన్న వీడియోతో నందూను జైలు పాలు చేస్తాను' అంటుంది.
దీంతో తులసి ఏది చూపించు అనగా వీడియోను వెతుకుతుంది. కానీ, అది కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. అప్పుడు తులసి 'నీ వీడియో కథ కంచికి చేరినట్లే. ఇప్పుడు మన స్కోర్ సమానం. నువ్వు నందగోపాల్ గారిని ఏమి చేయలేవు' అంటుంది.
నందూకు శిక్ష విధించేసి: ఇక, కోర్టులో విచారణ సమయంలో జడ్జ్ సాక్ష్యాలు అడగ్గా మోహన్ తమ దగ్గర ఏమీ లేవు అంటారు. అప్పుడు లాస్య తన దగ్గర వీడియో ఉందని ఫోన్‌ను ఇస్తుంది. అందులో లాస్యను నందూ కొట్టినది జడ్జ్ చూస్తారు. అప్పుడాయన నందూను మందలించడంతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నట్లు చెప్తారు. దీంతో అందరూ షాక్ అవుతారు.
ఇక, దివ్య మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నందూను జైలుకు తీసుకు వెళ్తుండగా ఆపి కౌగిలించుకుని బాధ పడుతుంది. అప్పుడు నందూ కూడా కన్నీరు పెట్టుకుంటాడు. ఆ తర్వాత దివ్యను జాగ్రత్తగా చూసుకోమని విక్రమ్‌కు చెప్పగా.. అతడు హామీ ఇస్తాడు.

ప్లాన్ బయటపెట్టిన లాస్య: నందూను జైలుకు తీసుకు వెళ్తుండడంతో తులసి షాక్‌లో ఉంటుంది. అప్పుడు లాస్య ఆమె దగ్గరకు వెళ్లి 'నేను బిస్కెట్ ముక్క వేస్తేనే పడిపోయే భాగ్యం.. నువ్వు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే పడిపోదని నాకు తెలియదా. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను' అంటుంది.
తర్వాత నందూ దగ్గరికి వెళ్లి 'నిన్ను జైలు పాలు చేయాలని నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకో నీ బ్రతుకు మారుస్తాను' అని హగ్ చేసుకోబోగా ఆమెను వదిలించుకుంటాడు. అంతేకాదు, 'జైలు నుంచి రాగానే నేను నీ బ్రతుకుని మారుస్తాను. డైవర్స్‌కు సిద్ధంగా ఉండు' అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











