Intinti Gruhalakshmi: నందూకు తెలిసిన నిజం.. ఆమె మెడ పట్టుకుని రచ్చ.. బెదిరించి చాలెంజ్ చేయడంతో!
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య, విక్రమ్‌లను ఫస్ట్ నైట్‌ను చెడగొట్టేందుకు రాజ్యలక్ష్మి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎవరు ఎంత చెప్పినా విక్రమ్ తన తల్లి గురించే మాట్లాడతాడు. ఇక, ఇంటికి వచ్చిన తర్వాత రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేసి ప్లాన్ గురించి మాట్లాడి.. తర్వాత తనకు డబ్బులు కావాలని అడుగుతుంది. అదంతా వెనుక నుంచి విన్న తులసి.. లాస్యను చెంపపై కొడుతుంది. దీంతో ఆమె గొడవ చేయగా.. నందూ వాళ్ల ముందు మళ్లీ కొడుతుంది. దీంతో నందూ తులసిని అపార్థం చేసుకుని తిడతాడు. అప్పుడు తులసి ఎంతగానో బాధ పడుతుంది.

దివ్యకు నిజం చెప్పని ప్రియ:ప్రియ తనలో తాను బాధ పడడం గమనించిన దివ్య ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పమని అడుగుతుంది. అప్పుడు ప్రియ 'మీరు నన్ను తిట్టుకున్న నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు కాబట్టి' అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దివ్య 'నీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయని వెళ్ళిపోతున్నావా? లేక నిజం చెప్పడం ఇష్టం లేక వెళ్లిపోతున్నావా' అని ప్రశ్నిస్తుంది. కానీ, ప్రియ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోతుంది.

వాళ్లకు నిజం చెప్పిన తులసి:గదిలో బాధ పడుతోన్న తులసి దగ్గరకు అనసూయ, పరందామయయ వెళ్లగా ఏం కావాలని అడుగుతుంది. అప్పుడు అనసూయ 'నీ కన్నీటికి కారణం కావాలి.. నీ సహనం హద్దు దాటితే తప్పితే నువ్వు అలా ప్రవర్తించవు' అంటుంది. దీంతో తులసి 'కన్నీటికి నాతో చుట్టరికం ఉంది. అందుకే అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతుంది' అంటుంది. దీనికి పరందామయ్య 'మాతో చుట్టరికం అంతకన్నా పెద్దది. నీ కష్టం పంచుకోటానికి ఈ తల్లిదండ్రులకి అర్హత లేదా? నిన్ను ఇబ్బంది పెడితే ఇప్పుడే వెళ్ళిపోతాము' అంటాడు. దీంతో జరిగిందంతా వాళ్లకు చెప్పేస్తుంది.

నిజం తెలుసుకున్న నందూ:తులసి ద్వారా లాస్య మోసం తెలుసుకున్న పరంధామయ్య కోపంతో రగిలిపోతాడు. అంతేకాదు, 'ఇంత జరిగాక కామ్‌గా ఊరుకోవడమేంటి? పదా వెళ్లి రాజ్యలక్ష్మి నిలదీద్దాం' అంటాడు. దీనికి తులసి 'అలా చేస్తే మన దివ్య ఇబ్బంది పడుతుంది. తను చిక్కుల్లో ఉన్నట్లు తనకు తెలియకూడదు. సమస్యను కాలానికి వదిలేద్దాం' అంటుంది. అప్పుడు అనసూయ 'దివ్యకు చెప్పకూడదు సరే కానీ నందూకు ఎందుకు చెప్పొద్దు అంటున్నావు' అని అడుగుతాడు. ఇదంతా నందూ అక్కడే ఉండి వింటాడు. అప్పుడు నందూ 'దివ్య జీవితం చిక్కుల్లో ఉందని తెలుసు కానీ.. అందుకు కారణం లాస్య అని తెలీదు' అనుకుంటాడు. తులసి 'ఇప్పటికే దివ్య విషయంలో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిసిందంటే తట్టుకోలేరు' అంటుంది.

అడ్డంగా దొరికిపోయిన లాస్య:తులసి మాటలు విన్న నందూ కోపంతో లాస్య దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆమెనే కోపంగా చూస్తూ ఉంటాడు. దీంతో లాస్య 'ఏంటి అలా చూస్తున్నావు? తులసి ఇంత అవమానించినా ఎలా సహనంగా ఉన్నాననా? నీ మీద నమ్మకంతోనే నందూ. నన్ను అంత అవమానించినందుకు నువ్వు తులసిని ఏదో చేసేస్తావు అనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు' అని ఏడుస్తుంది. ఇంతలో లాస్యకు రాజ్యలక్ష్మి మేనేజర్ ఫోన్ చేయగా.. అది నందూ లాక్కుని స్పీకర్ ఆన్ చేస్తాడు. అప్పుడతను 'రాజ్యలక్ష్మి మేడం మీకు డబ్బు ఇవ్వమన్నారు ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారు' అంటారు.
నేను రెండూ కొడతానంటూ:ఆ మాటలు విన్న వెంటనే నందూ కాల్ కట్ చేసి.. 'అతను నీకెందుకు డబ్బు ఇస్తున్నాడు? ఏం జరుగుతుంది' అని అడుగుతాడు. దీనికామె 'ప్పుగానే ఇస్తుంది. నీకు ఇష్టం లేకపోతే తీసుకోను' అని చెప్తుంది. అప్పుడు నందూ 'రాజ్యలక్ష్మికి దివ్యను అప్పగించినందుకు ఆవిడ నీకు ముట్టచెబుతున్న డబ్బు కదా' అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదు అంటుంది. దీంతో నందూ 'నువ్వు, రాజ్యలక్ష్మి మాట్లాడుకోవడం తులసి విన్నది అనే విషయం నాకు తెలుసు. తులసి ఒక్క చెంపే పగలగొట్టింది.. నేను రెండు చెంపలు పగలగొడతాను' అని కోప్పడతాడు.

ఆశతోనే పెళ్లికి ఓకే అన్నారు:తర్వాత నందూ 'నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఊరుకున్నాను. కానీ నా పిల్లలు జోలికి వచ్చావు. ఇంక నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇంట్లో నుంచి బయటికిపో' అంటాడు. దీంతో లాస్య 'నీకు తులసి మీద మోజు పుట్టి నన్ను వదిలించుకుందామంటే ఊరుకోను. నేను ఇక్కడి నుంచి కదలను' అంటుంది. దీంతో నందూ నువ్వు చెప్తే వినే రకానివి కాదు అంటూ లాస్యని లాక్కొస్తాడు. అప్పుడు లాస్య 'నేను చెప్పేది విను. నేను ఇన్వాల్వ్ కాకపోయినా నీ కూతురు ఆ విక్రమ్‌ను ప్రేమించింది కాబట్టి ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అలాంటి చదువు లేనివాడిని అల్లుడుని చేసుకున్నారు అంటే డబ్బు ఉన్న వాళ్ళనే కదా. మీరు ఆశ పడితే తప్పులేదు.. కానీ నేను ఆశపడితే తప్పా' అని ప్రశ్నిస్తుంది.

నందూకు షాకిచ్చిన లాస్య:అనంతరం నందూ 'పగతో రాజ్యలక్ష్మి, దివ్యను కోడలు చేసుకుందని తెలిసికూడా మాకు చెప్పలేదు. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు' అంటూ ఆమెని బయటపెట్టి తలుపేసేస్తాడు. అప్పుడు అనసూయ 'తను మూర్ఖురాలు కానీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించొద్దు' అంటుంది. దీంతో నందూ 'తన గురించి ఎవరూ బాధపడక్కర్లేదు. ఒంటరిగా బ్రతికితే అప్పుడు తెలుస్తుంది' అంటాడు. అప్పుడు లాస్య 'మర్యాదగా తలుపు తీస్తావా? లేకపోతే 24 గంటల్లో నా కాళ్లు పట్టుకొని బ్రతిమాలి మరి ఇంట్లోకి తీసుకు వెళ్లే లాగా చేస్తాను. అప్పుడు నాతో కాపురం మామూలుగా ఉండదు' అని చాలెంజ్ చేస్తుంది. దీంతో నందూ ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను లోపలికి రానిచ్చేది లేదు అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











