Intinti Gruhalakshmi Today Episode: తులసికి మరో కష్టం.. డబ్బుతో బుక్కైన అభి.. అత్తింటికి అంకిత రాక
భారతదేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రవళ్లికతో కలిసి జాగింగ్ చేసేందుకు వెళ్లిన తులసి.. ఆ డ్రెస్ వేసుకుని సిగ్గు పడుతూ ఉంటుంది. దీంతో ప్రవళ్లిక ఆమెకు ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత తులసి భయాన్ని వదిలేసి చక్కగా జాగింగ్ చేస్తుంటుంది. అప్పుడు చూసిన నందూ ఆమెపై ఫైర్ అవుతాడు. దీంతో అసలు మీరెవరో నాకు తెలీదు అంటూనే నందూకు సరైనా సమాధానాలు చెబుతుంది. ఇక, శృతి ఆరోగ్యం మెరుగు పడడంతో పనులు చేస్తుంటుంది. అప్పుడు ఆమె పని చేసే ఓనర్ ఫోన్ చేయగా ప్రేమ్ లిఫ్ట్ చేస్తాడు. కానీ, శృతి అతడి దగ్గర నిజాన్ని దాచేస్తుంది.

తులసిని చూసి మురిసిపోతారు
తులసి జాగింగ్ డ్రెస్ వేసుకోవడం చూసి పరందామయ్య, అనసూయ అందరూ ముందుగా షాక్ అవుతారు. అప్పుడు పరందామయ్య నీలో వచ్చిన ఈ మార్పును చూసి చాలా ఆనందంగా ఉంది అంటాడు. దీంతో ఈ మార్పుకు కారణం ప్రవళిక అని చెబుతుంది. ఆ తర్వాత కరెక్ట్‌గా చెప్పావమ్మా.. నీకు నచ్చినట్టు ఉండు అని అనసూయ చెబుతుంది. దీంతో తులసి ఒక్క పది నిమిషాలు ఉండండి.. ఇప్పుడే టిఫిన్ తయారు చేస్తాను అంటుంది. అలా తులసి వెళ్లగానే ఆమెలో వచ్చిన మార్పులు చూసి.. వేసుకున్న డ్రెస్ గురించి చెబుతూ అత్తమామలు మురిసిపోతారు.

ఆర్థిక ఇబ్బందులు రావడంతో
కాలేజ్‌కు వెళ్తోన్న దివ్య రేపు ల్యాబ్‌కు 20 వేలు కట్టాలి. మరిచిపోకు అని చెబుతుంది. దీంతో డబ్బులు ఎలా కట్టాలో తులసికి అర్థం కాదు. దివ్యకు ల్యాబ్ ఫీజు ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య, అనసూయ వస్తారు. 'ఇప్పుడు ఎలా డబ్బులు సంపాదిస్తావమ్మా. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ఫ్యాక్టరీ కూడా మానేశావు' అంటారు. అప్పుడు తులసి 'ఇంటి ఖర్చుల గురించి మీరు ఆలోచించకండి. నేను చూసుకుంటాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బయటకు వెళ్లి ఓ రెస్టారెంట్‌లో ప్రవళ్లికను కలుస్తుంది.

తులసి ఎందుకలా ఉందో అని
రెస్టారెంట్‌లో తులసి ధీనంగా కూర్చుని ఉంటుంది. దీంతో ఏమైందని ప్రవళ్లిక అడుగుతుంది. అంతేకాదు, 'ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. కష్టం చెప్పుకుంటూ ఉంటే మనసుకు బాధగానే ఉంటుంది. కానీ.. అలా చెప్పుకోకపోతే ఆ బాధ గుండెలోనే పేరుకుపోయి బరువెక్కుతుంది. ఫ్యాక్టరీ గురించేనా బాధ' అని అడుగుతుంది. దీనికామె ఫ్యాక్టరీ వదిలేశాను కదా అంటుంది. అప్పుడు ప్రవళ్లిక 'ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయా' అని అడుగుతుంది. దీంతో తులసి 'ఈ నెల వరకు ఓకే కానీ.. వచ్చే నెల నుంచి డబ్బులకు ఇబ్బంది రావచ్చు' అంటుంది.

పాటలు పాడమని సలహాలు
ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న తులసిని ఉద్యోగం చూడమంటావా అని ప్రవళ్లిక ప్రశ్నిస్తుంది. దీనికామె 'నాకు డిగ్రీ లేదు ఏం లేదు.. ఎవరు ఇస్తారు జాబ్. అందుకే కదా మా ఆయన ముందు లోకువ అయింది' అని చెప్తుంది. దీనికి ప్రవళ్లిక 'సరే అయితే.. నీకు తెలిసిన పని చేయి. మళ్లీ పాటలు పాడటం స్టార్ట్ చేయి. నువ్వు చక్కగా పాటలు పాడటం నేర్చుకున్నావు కదా' అంటుంది. అప్పుడు తులసి అదంతా గతం అంటుంది. దీనికి ప్రవళ్లిక 'మీ అమ్మను తలుచుకొని పాటలు పాడటం మొదలు పెట్టు' అని ప్రోత్సహిస్తుంది. దీంతో తులసి ఆలోచనలో పడుతుంది. అప్పుడు ప్రవళ్లిక 'ఇష్టపడ్డ పనే బతుకుతెరువు అయితే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది' అని అంటుంది.

రగిలిపోతోన్న నందూతో ఫైట్
లాస్య, నందూ ఇద్దరూ తులసి మాట్లాడిన తీరు గురించే ఊహించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో నందూకు ఎనలేని కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు లాస్య 'తులసితో మాట అనిపించుకున్న నాకు ఇరిటేటింగ్‌గా ఉంది' అంటుంది. దీంతో నందూ నిన్నే కాదు.. నన్ను కూడా అన్నది కదా అంటాడు. దీనికి లాస్య 'నువ్వెప్పుడైనా నా డ్రెస్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయ్యావా? ఇది బాగుంది.. అది బాగుంది.. అది వేసుకోవద్దు అని ఎప్పుడైనా కామెంట్ చేశావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ చేయలేదు అయితే ఇప్పుడు ఏంటి అని అంటాడు. అప్పుడామె 'పెళ్లాం అయిన నా డ్రెస్ విషయంలోనే నువ్వు ఏనాడూ పట్టించుకోలేదు.. తులసి డ్రెస్ విషయంలో మాత్రం నువ్వెందుకు పట్టించుకోవాలి' అని ప్రశ్నించగా నందూ ఏదో చెబుతాడు.

తులసి ఇంటికొచ్చిన కోడలు
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అంకిత.. తులసిని చూడడానికి వస్తుంది. వెళ్లగానే ఎలా ఉన్నారు ఆంటి అని అడుగుతుంది. అయితే, తులసి మాత్రం 'అభి ఏం చేస్తున్నాడు. వాడికి ఈ అమ్మ గుర్తొస్తుందా' అని అడుగుతుంది. దీనికి అంకిత 'ఖచ్చితంగా మీరు అభికి గుర్తొస్తారు ఆంటి. కానీ, నాకు చెప్పుకోడు' అంటుంది. అప్పుడు తులసి 'మీ అమ్మ గారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా' అని అడుగుతుంది. దీంతో అంకిత నేను వచ్చింది మీ గురించి తెలుసుకోవడానికి అంటుంది. దీనికి తులసి నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది అని బదులిస్తుంది.

అభితో గొడవ పడిన అంకిత
తులసి దగ్గరకు వచ్చిన అంకిత ఆమెకు డబ్బులు ఇవ్వబోతుంది. కానీ, తులసి మాత్రం వాటిని తీసుకోదు. పైగా నాలుగు మంచి మాటలు చెబుతుంది. మరోవైపు, అభిని పిలిచిన గాయత్రి.. తాను ఆస్పత్రికి రావడం లేదని.. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయమని అంటుంది. అంతేకాదు, అతడికి కొంత డబ్బును కూడా ఇస్తుంది. అదంతా పక్కనే ఉన్న అంకిత చూస్తుంది. దీంతో గాయత్రి వెళ్లిపోగానే అభితో గొడవ పడుతుంది. డబ్బులు ఎందుకు తీసుకున్నావంటూ అతడిపై ఫైర్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











