హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. దర్శకుడిగా మరో కమెడియన్.. అలా ఎంట్రీ
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. అలా సుధీర్ హీరో కాగా.. వేణు, శాంతి కుమార్ దర్శకులుగా సత్తా చాటిన విషయం తెలిసిందే. వీళ్ల బాటలోనే ఇమ్మాన్యుయేల్ చేరాడు. ఆ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటీనటులు లైమ్ లైట్ లోకి వచ్చారు. కేవలం హాస్యం మాత్రమే కాకుండా తమలోని విభిన్న కళలు, టాలెంట్ ఎంటో చూపిస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, షకలక శంకర్, రంగస్థలం మహేష్, వేణు యెల్దండి, శాంతి కుమార్ వంటి తదితరులు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో ఇమ్మాన్యుయేలు ఒకరు. వర్షతో లవ్ ట్రాక్, కామెడీ పంచులతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన తాజాగా హీరోగా మారాడు. అతను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానెల్ లో వివిధ రకాలు వీడియోలు పెడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తాజాగా ఓ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'ప్రేమ వాలంటీర్' (Prema Volunteer) అనే వెబ్ సిరీసులో ఇమ్మాన్యుయెల్ హీరోగా చేస్తున్నాడు. ఇందులో అతనికి జోడీగా విజయ విజ్జు హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రేమ వాలంటీర్ వెబ్ సిరీసులో గోపి, అనూష, దివాకర్, పుష్పమ్మ, జయరామ్, రాజు తాత, మహేశ్, మార్క్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ వెబ్ సిరీసుకు మరో జబర్దస్త్ కమెడియన్ బాబు దర్శకత్వం వహించడం విశేషం. వెంకీ వీణ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. దాదాపు సినిమా కథను ట్రైలర్ లో చెప్పేశారు. ఇది పక్కా పల్లెటూరి కథలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ను ఇమ్మాన్యుయెల్ యూట్యూబ్ ఛానెల్ లోనే ఒక్కో ఎపిసోడ్ గా విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 11న మొదటి ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. ఇలా యూట్యూబ్ ఛానెల్ లో వెబ్ సిరీస్ ద్వారా ఇమ్మాన్యుయెల్, బాబు ఎంట్రీ ఇచ్చారన్నమాట.


Click it and Unblock the Notifications











