11 అంటే చాలా గుర్తొస్తాయ్.. YS జగన్ పై హైపర్ ఆది మాస్ ర్యాగింగ్
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌లో అదిరే అభి టీమ్‌లో ఓ చిన్న కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది తర్వాత తన టాలెంట్‌తో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. తనలాగే ప్రతిభ ఉండి సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని వెతికి పట్టుకుని తన జట్టులో స్థానం కల్పించాడు. గంటల తరబడి ఆగకుండా నవ్వించగల సత్తా ఆది సొంతం. కేవలం తన స్కిట్ కోసమే ప్రేక్షకులు జబర్దస్త్ ఎపిసోడ్ చూసేవాళ్లంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్‌లోనూ మిలియన్లకొద్దీ వ్యూలతో సరికొత్త రికార్డులను సృష్టించాడు ఆది. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో హైపర్ ఆదికి సినిమాల్లో అవకాశాలు క్యూకడుతున్నాయి.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఇతర మూవీ ఫంక్షన్‌లలో ఆది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన హైపర్ ఆది.. ఆయనపై ఎప్పుడూ అభిమానం చాటుకుంటూ ఉంటారు. జనసేనలో చేరిన ఆది... పార్టీకి గట్టి వాయిస్‌గా మారారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలోనే మకాం వేసిన ఆది.. తన సహచరులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్ధించారు.

తన విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తెలిపారు. పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే నడిచిన పి . హరిప్రసాద్‌ను ఆయన ఎమ్మెల్సీగా చేశారు. ఈ క్రమంలో హైపర్ ఆదిని కూడా ఎమ్మెల్సీగా చేసి చట్టసభలోకి పంపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఆది ఖండించారు. పవన్‌కు దగ్గరగా ఉంటే చాలని.. అంతకుమించిన ఏ పదవి తనకు అక్కర్లేదేని ఆది కుండబద్ధలు కొట్టారు.
ఏపీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కాగా.. జగన్ ఓటమిపై యాంటీ వైసీపీ కేడర్ సెటైర్లు వేస్తూనే ఉంది. ఆది కూడా తన స్కిట్లు , మాటల ద్వారా వైసీపీ, జగన్‌ను టార్గెట్ చేస్తున్నాడంటూ ఆ పార్టీ కేడర్ మండిపడుతోంది. మొన్నామధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో పొట్టి నరేష్‌తో కలిసి ఓ స్కిట్ చేశాడు ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీలో తన గురించి ఏమనుకుంటున్నార్రా అని ఆది అడుగుతాడు. దానికి నరేష్ బదులిస్తూ.. ఆది అన్నా, ఆది అన్నా అందరూ మెచ్చుకుంటున్నారన్నా అని రోజాను కిరాక్ ఆర్పీ వెక్కిరించిన విధంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు. ఆ మాట చెప్పగానే ఆది, నరేష్ సహా వేదికపై ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. ఇది తమ అధినేతను, నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందంటూ వైసీపీ శ్రేణులు ఇప్పటికీ భగ్గుమంటున్నాయి.
తాజాగా వైసీపీపై పరోక్షంగా సెటైర్లు వేశారు హైపర్ ఆది. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగ్గా.. ఆది సందడి చేశారు. ఈ సందర్భంగా 11వ నెంబర్ చుట్టూ ఆయన ప్రసంగం సాగింది. ఈ సినిమాలో 11 మంది హీరోలను పెట్టి నిహారిక ట్రెండ్ సెట్ చేసినట్లేనని.. 11 మంది హీరోలంటే ఇండియాకు 11 మంది క్రికెటర్లు వరల్డ్ కప్ తెచ్చినట్లని అన్నారు. మనకి 11 అంటే ఇంకా చాలా గుర్తొస్తాయి.. కానీ కమిటీ కుర్రోళ్లు రిలీజైన తర్వాత ఖచ్చితంగా ఈ 11 మందే గుర్తొస్తారు అంటూ ఆది వ్యాఖ్యానించాడు. అయితే ఆది పరోక్షంగా జగన్ ఓటమిపై సెటైర్లు వేశాడంటూ ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











