ఎంత తిడితే అన్ని కోట్లని జగన్ ఆఫర్ .. పోసాని ఆస్తుల చిట్టా ఇదే, దమ్ముంటే లెక్కలు తీయ్ : కిరాక్ ఆర్పీ సవాల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తొలి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ దూరమే. కారణాలు తెలియదు కానీ ఆయనంటే అంటీ ముట్టునట్లుగా వ్యవహరించింది టాలీవుడ్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లను కైవసం చేసుకుని చారిత్రక విజయం సాధించిన వైఎస్ జగన్‌ను అభినందిస్తూ పరిశ్రమ నుంచి స్పందించిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు సంఘీభావం తెలిపినవారు కూడా తక్కువే. అయితే అలీ, పోసాని కృష్ణమురళి, థర్టీ ఇయర్స్ పృథ్వీ వంటి వారు జగన్‌కు గట్టి మద్ధతుదారులుగా ఉన్నారు.
మిగిలిన వారి సంగతి ఏమో కానీ పోసాని మాత్రం దూకుడుగా ఉండేవారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తత్వమే జగన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచిందంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవిని కట్టబెట్టగా.. పోసానిని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. తొలి నుంచి జగన్, వైసీపీలపై ఈగ వాలనివ్వని పోసాని కృష్ణమురళీ.. వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి వాళ్లను ఉతికి ఆరేసేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. చివరికి మెగాస్టార్ చిరంజీవిని కూడా వదిలిపెట్టలేదు పోసాని.

అయితే ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి సినీరంగ అభివృద్ధికి చేసిందేమిటీ అని సినీ జనాలు ఘాటుగా విమర్శించేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలను రద్దు చేసినప్పుపడు పోసాని ఎందుకు జోక్యం చేసుకోలేదని కొందరు ప్రశ్నించారు. టికెట్ రేట్లను తగ్గించి ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడినప్పుడు పోసాని .. జగన్‌తో ఎందుకు మాట్లాడలేదని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఈ విమర్శలకు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవారు.
అయితే జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ మాత్రం పోసానిపై వాడి వేడి విమర్శలు చేసేవారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ఫిలిం డెవలప్‌మెంట్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు డెవలప్ కావాలని, కానీ పోసాని బాగుపడ్డారని ఆరోపించారు. కృష్ణమురళీకి హైదరాబాద్ మైహోం భుజలో ఒక్కొక్కటి రూ.5 కోట్లు విలువ చేసే మూడు ఫ్లాట్లు ఉన్నాయని కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసానికి ఎవరూ సినిమా ఆఫర్లు ఇవ్వలేదని.. జగన్ పిలిచి , టీడీపీ వాళ్లని తిట్టాలని .. ఇందుకు రూ.కోట్లలో ముట్టజెప్పారని ఆరోపించాడు.

అసలు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నలుగురు గన్‌మెన్లు ఎందుకు, ఆయనకు ఎవరి నుంచి థ్రెట్ వచ్చిందని కిరాక్ ఆర్పీ ప్రశ్నించారు. అవినీతి మీద పోరాడుతున్న నీతి మనుషులకు థ్రెట్ ఉంటుందని, అలాంటోళ్లకు నలుగురు గన్‌మెన్‌లను ఇవ్వాలని సూచించారు. జగన్ ఇవ్వకుంటే పొసానికి మై హోం భుజలో అంత ఖరీదైన ఫ్లాట్స్ ఎక్కడివి.. దమ్ముంటే లెక్కలు చూపించాలని కిరాక్ ఆర్పీ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











