అవసరం తీరిపోయాక అమ్మానాన్నల్ని నరికేస్తారా... యాంకర్ రష్మి షాకింగ్ కామెంట్స్
దేశంలో వీధి కుక్కల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట వీధి కుక్కులు జనంపై విరుచుకుపడుతుండటంతో వాటి నివారణపై మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు విషయం ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ వరకు వెళ్లింది. మరోవైపు.. దేశంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలను విచక్షణారహితంగా చంపేస్తూ ఉండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వీధి కుక్కలు, సుప్రీంకోర్ట్ తీర్పు అంశంపై సినీనటి రేణు దేశాయ్, యాంకర్ రష్మి గౌతమ్‌లు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు
సుప్రీంకోర్ట్‌లో తీర్పు రాకముందే జనం చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని అసలు మూగజీవులకు ఎలాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఓ వైపు బాధగా, మరోవైపు వింతగా అనిపిస్తోంది. దేశంలో రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరకలేదు. కానీ కుక్కల విషయం మీద ఇంత హడావుడి జరగడం ఏంటో. రాబిస్ వల్ల జరిగే మరణాల గురించి మాట్లాడారు, చిన్నపిల్లలను కుక్కలు కరవడం వల్ల చిన్నారులు చనిపోవడం గురించి మాట్లాడారు. ఇవన్నీ బాధాకరమైన విషయాలే.. కానీ వీటికి పరిష్కారం ఉండాలి. మున్సిపల్ కార్పోరేషన్‌లు, ఇతర సంస్థలు కుక్కల నిర్మూలనకు సంబంధించిన ప్రోసీజర్ ఫాలో అవుతున్నారు. కానీ జనం ఎవరికి వారు చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుంటున్నారు అని రష్మి గౌతమ్ మండిపడ్డారు.

ముక్క లేకపోతే ముద్ద దిగదు
మీడియా కూడా ఈ విషయంలో మారాలి. మేమంతా సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సేవ చేస్తున్నారు. అలాంటిది మా మీద లేనిపోని కామెంట్స్ చేస్తున్నారు. రాత్రి నాకు నిద్రలేదు.. నేను కుక్కల గురించి మాట్లాడితే, కొంతమంది మేకలు, కోళ్లు, ఆవుల గురించి మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే వాటి మీద జరిగే హింస కుక్కల మీద కూడా జరగడం లేదు. వాటిని ఆహారంగా మార్చేసి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు.. రుచికి, నాలుకకి బానిసలుగా మారిపోయారు. గతంలో వారానికి ఒకసారి చికెన్, మటన్ తినేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రోటీన్, ఆరోగ్యంతో పాటు ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్లుగా మారిపోయింది. కోడి, కుక్కలు, మేకలే కాదు.. చెట్లకు కూడా ప్రాణం ఉంది. అందుకే తినేముందు ఆహారాన్ని గౌరవించాలి. ఎందుకంటే మాకు ప్రాణం పోయడానికి అది దాని ప్రాణాన్ని త్యాగం చేసింది అని రష్మి వ్యాఖ్యానించారు.
సాంప్రదాయాలు మరిచిపోయారు
మా అమ్మ, అమ్మమ్మలు మిగిలిపోయిన అన్నంలో పెరుగు, పాలు కలిపేసి బయట కుక్కలకు పెట్టేవారు. ఇంట్లో చపాతీలు చేసినప్పుడు తొలి రెండు ఆవుకి, చివరి రెండూ కుక్కలకి పెట్టేవాళ్లు. ఆ సాంప్రదాయాలు మరిచిపోయారు.. ఒకప్పుడు ఆవు మన కుటుంబ సభ్యుడిగా ఉండేది. ఆవు బిడ్డలు తాగిన తర్వాత మిగిలిపోయిన పాలుతో టీ, పెరుగు చేసుకుని బతికేవాళ్లం. ఇప్పుడు ఆవుల్ని, ఆవుపాలును వ్యాపారంగా మార్చారు. జున్ను అనేది ఆవు తల్లిగా మారిన తర్వాత ఫస్ట్ పాలు... అవి ఆవిబిడ్డకే అవసరం, మనకి అవసరం లేదు. అది మనం తింటే మనకు సరిగా అరగదు కూడా. కానీ టేస్ట్ కోసం మేం తింటున్నాం... దీనిని ఎవ్వరూ ప్రశ్నించడం లేదని రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మానాన్నల్ని నరికేస్తారా
ఈరోజు కుక్కలు మనకి అవసరం లేదు కాబట్టి తీసేయండి.. పావురాలు అవసరం కాదు తీసేయండి. ఒకప్పుడు పావురాలు టెలిఫోన్ లెక్క. వాటిని ట్రైన్ చేసి, వాటిని బ్రీడ్ చేసి పెంచుకున్నాం. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేశాయి.. పావురాలు అవసరం కాదు వాటిని చంపేయండి అంటే ఎక్కడికెళ్తాయి. ఒకప్పుడు కుక్కలు కాలువల్లోని ఎలుకల్ని తిని బతికేవి.. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వచ్చేశాయి. ఇప్పుడు కుక్కలతో మాకు పనిలేదు.. తీసేయండి. ఇప్పుడు జింకలు కూడా రోడ్డు మీదకి వచ్చేశాయి.. అడవులు నరికేయడంతో అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయి. ఏదైనా అడ్డొచ్చినా, అవసరం తీరిపోయినా తీసేయండి.. నరికేయండి అంటే ఇక ఏం మిగుల్తుంది. రేపు అమ్మానాన్నలు మనల్ని సరిగా చూడకపోతే వాళ్లని కూడా నరికేస్తారా. ఏదైనా చట్టప్రకారం జరగాలి కానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అని రష్మి గౌతమ్ సూచించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











