దర్శకుడిగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. వాళ్ల సపోర్ట్.. 'బలగం' రేంజ్‌లో హిట్?
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. అలా సుధీర్ హీరో కాగా.. వేణు దర్శకుడిగా సత్తా చాటారు. ఇలా ఎంతోమంది సినిమాల్లో దూసుకుపోతున్నారు. వీళ్ల బాటలోనే తాజాగా మరో కమెడియన్ డైరెక్టర్ అవతారం ఎత్తి తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
జబర్దస్త్ నుంచి అంతమంది: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటీనటులు లైమ్ లైట్ లోకి వచ్చారు. కేవలం హాస్యం మాత్రమే కాకుండా తమలోని విభిన్న కళలు, టాలెంట్ ఎంటో చూపిస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, షకలక శంకర్, రంగస్థలం మహేష్ వంటి తదితరులు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక వేణు యెల్దండి ఏకంగా బలగం సినిమాకు దర్శకత్వం వహించి సత్తా చాటాడు.

జేడీ చక్రవర్తి వంటి నటులు:వేణులాగే షకలక శంకర్ టీమ్ లో పనిచేసిన ఎన్. శ్రీధర్ డైరెక్టర్ గా మారి శంభో శంకర్ సినిమా తెరకెక్కించారు. అలాగే కిర్రాక్ ఆర్పీ కూడా దర్శకుడిగా ఓ సినిమా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అతని సినిమాలో జేడీ చక్రవర్తి, రావు రమేష్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు నటిస్తున్నట్లు టాక్. ఇప్పుడు జబర్దస్త్ నుంచి మరో కమెడియిన్ దర్శకుడిగా మారారు. అతనే శాంతి కుమార్.
లిరికల్ వీడియో:శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్త్ శాంతి కుమార్) దర్శకత్వం వహించిన సినిమా 'నాతో నేను'. సాయి కుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, రాజీవ్ కనకాల, దీపాలి రాజ్ పుత్, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్నారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఓసిని వయ్యారి రామ చిలుక' అనే లిరికల్ వీడియోను హీరో ఆది సాయి కుమార్ గురువారం రిలీజ్ చేశాడు.

ఆది సపోర్ట్: వీడియో రిలీజ్ సందర్భంగా "ఈ మధ్య నాన్న (సాయి కుమార్) కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీ అని, తన పాత్ర కొత్తగా ఉంటుందని నాన్న చెప్పారు. మంచి కథను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఆ పాట నాకు బాగా నచ్చింది. లిరిక్స్ అర్థమయ్యేలా ఉన్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అని" ఆది సాయికుమార్ తెలిపాడు.

కంటతడి పెట్టించేలా: "జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని నిర్మాతల సహాకరంతో ఈ సినిమా పూర్తి చేశాం. బిజీలో కూడా ఆది మా సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో సాయి కుమార్ పాత్ర ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది" అని కమెడియన్, డైరెక్టర్ శాంతి కుమార్ పేర్కొన్నారు.

హిట్ అవుతుందా?: ఇదిలా ఉంటే ప్రస్తుతం 'నాతో నేను' సినిమాను బలగం మూవీతో పోల్చడం మొదలు పెట్టారు నెటిజన్స్. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్స్ ఇద్దరూ జబర్దస్త్ ద్వారానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక 'బలగం' సినిమాతో కమెడియన్ల సత్తా ఏంటో చూపించారు వేణు యెల్దండి. దీంతో 'బలగం' స్థాయిలో శాంతి కుమార్ డైరెక్ట్ చేసిన 'నాతో నేను' హిట్ అవుతుందా అని చర్చిస్తున్నారు.


Click it and Unblock the Notifications











