ఎన్టీఆర్ కొత్త షో ప్రోమో రిలీజ్: సరికొత్తగా టైటిల్.. కుర్చీలో ఉన్నది ఆ హీరోనే.. పూర్తి వివరాలివే!
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. అలాంటి షోలలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ప్రసారం అయ్యే ఈ గేమ్ షో ఇండియాలో 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే పేరుతో హిందీలో ప్రారంభం అయింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రసారం అయింది. ఇప్పుడీ మరో సీజన్‌తో రెడీ అయింది. తాజాగా ఈ షోకు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు
'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులో ప్రసారం అయిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ షో.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.

ఐదో సీజన్ ఇందులో.. టైటిల్ మారింది
'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

ప్రోమో విడుదల... సిద్ధంగా ఉండండని
తాజాగా జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో ప్రోమోను విడుదల చేశారు. అందులో దీని ప్రస్థానం గురించి వివరించారు నిర్వహకులు. అంతేకాదు, 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కూర్చీలో ఉన్నది ఆ స్టార్ హీరోనే కదా
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన ప్రోమో విడుదలైనప్పటికీ.. ఇది ఎప్పటి నుంచి ప్రసారం అవుతుంది? దీన్ని ఏ స్టార్ హీరో హోస్ట్ చేయబోతున్నాడు? అనే విషయాలను మాత్రం నిర్వహకులు వెల్లడించలేదు. కానీ, టైటిల్ పడిన సమయంలో ఓ హీరో కుర్చీలో కూర్చున్నట్లు చూపించారు. అక్కడ ఉన్నది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆరే అని అందరికీ అర్థం అవుతోంది.
ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది?
షో నిర్వహకులు ఇప్పుడు ప్రకటించకున్నప్పటికీ.. 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను జూనియర్ ఎన్టీఆరే హోస్ట్ చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్ దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రెడీ చేశాడు. ఇక, ఈ షో మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందట. మొదటి ఎపిసోడ్‌కు పెద్ద స్టార్‌ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ షో.. మొత్తం వివరాలు మీకోసం!
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో వారంలో ఐదు రోజులు (ఆదివారం నుంచి గురువారం వరకు) ప్రసారం అవుతుందని తెలుస్తోంది. మొత్తం 60 ఎపిసోడ్లు ఈ షో నడుస్తుందని సమాచారం. ప్రతి రోజూ రాత్రి 9 గంటల నుంచి 10.30 గంటలకు ఇది ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఉంటుందని టాక్.


Click it and Unblock the Notifications











