twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ మందలించాలి: ‘బిగ్ బాస్’ షోపై పరుచూరి బ్రదర్ కామెంట్

    ఎన్టీఆర్ బిగ్ బాస్ మీద పరుచూరి గోపాలకృష్ణ కామెంట్. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు గుర్తు చేసుకున్నారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Telugu : Paruchuri Brother Shocking Comments on Bigg Boss Telugu

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షోపై పరుచూరి గోపాలకృష్ణ తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.... నేను ప్రజా వేదిక కార్యక్రమం 5 సంవత్సరాలు 200 ఎపిసోడ్లు చేశాను. చిరంజీవిగారు, నాగార్జున గారు, అమితాబ్ బచ్చన్ గారు వీళ్లంతా రియాల్టీ షోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మా అందరి కంటే చిన్నపిల్లాడు. ఇతడు దాన్ని ఎలా డీల్ చేస్తాడు చూడాలి అనే ఉత్సాహంతో 'బిగ్ బాస్' చూడటం మొదలు పెట్టాను అని ఆయన తెలిపారు.

    ఎన్టీఆర్ కేవలం అన్నగారి మనవడు కాబట్టే చూడటం లేదు. అన్నగారి పిల్లల్లో నాకు మొట్టమొదట నాకు పరిచయం అయింది నందమూరి హరికృష్ణ. 1980లో అనురాగ దేవత సినిమాకు రాయాల్సి వచ్చినపుడు నన్ను ఉయ్యూరు నుండి తీసుకొచ్చే బాధ్యతను అన్నగారు హరికృష్ణగారికి అప్పగించారు. ఉయ్యూరు నుండి కారులో అతడితో వచ్చేశాను. అతడు అపుడు కారు ఎంత వేగంగా తోలాడంటే... నార్కట్ పల్లి వచ్చేసరికి ఇంజన్ హీటెక్కిపోయి పొగలు వచ్చేసి కారు ఆగిపోయింది. అక్కడ పక్కనే దాబా ఉంటే కారు ఆపి కాఫీ తాగుదామని వెళ్లాం. అపుడు ఆయన వేగం చూసి భయం వేసిందా? అన్నారు. శ్రీకృష్ణుడు రథం తోలుతుంటే అర్జునుడికి భయం ఎందుకు ఉంటుంది అనగానే నా భుజం తట్టాడు. ఆ తర్వాత కూడా హరి కృష్ణ నన్ను ఎప్పుడూ పేరుతో పిలవలేదు. పగో(పరుచూరి గోపాల కృష్ణ) అని పిలుస్తాడు. అతడి కుమారుడు ఇతడు.

    కారణం అది మాత్రమే కాదు

    కారణం అది మాత్రమే కాదు

    ఇంతేనా రామారావుగారి మనవడు కాబట్టి, నందమూరి హరికృష్ణ అబ్బాయి కాబట్టా? కాదు... జూ ఎన్టీఆర్ తో కూడా ఓ చిన్న అనుబంధం. గుర్తు చేసుకుంటే అతడి గురించి ఇపుడు ఎందుకు మాట్లాడాలి అనిపించింది. 1995లో రాజమండ్రికి షూటింగ్ వెలుతున్నాం. మాతో పాటు రైలులో గుణశేఖర్, చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా ఏమిటండీ అంటే బాల రామాయణం అని, లాస్ట్ షెడ్యూల్ అని చెప్పారు. రాముడు అనగానే ఓ పన్నెండేళ్ల పిల్లాడు వచ్చాడు. చూస్తే చిన్నతనంలో రామారావుగారు నడిచొచ్చినట్లు అనిపించింది. వచ్చి నమస్కారం అన్నాడు. నేనెవరో తెలుసా? అన్నాను. తెలుసండీ, మీరు పరుచూరి బ్రదర్స్ కదా... మా తాతగారే కదా మీకు ఆ పేరు పెట్టింది అన్నాడు. అపుడు ఇతడు సామాన్యుడు కాదునిపించింది.

    ఆ సమయంలో నాకు రామారావుగారు గుర్తొచ్చారు

    ఆ సమయంలో నాకు రామారావుగారు గుర్తొచ్చారు

    రైల్లో క్యాటరింగ్ ఉంటుంది కదా అని నేను ఇంటి వద్ద నుండి తినడానికి ఏమీ తెచ్చుకోలేదు. కానీ ఆ రోజు క్యాటరింగ్ లేదు. నాకు ఆకలేసి టీసీని ఈ విషయం గురించి అడిగాను. వెంటనే పన్నెండేళ్ల ఎన్టీఆర్ నడుకుంటూ వచ్చి నాకు తినమని ఓ బాక్స్ ఇచ్చాడు. మరి నీకు అంటే... మా అమ్మ నాకు రెండు బాక్సులు ఇచ్చిందని చెప్పాడు. ఆ బాక్సు తీసుకుంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ నాడు నందమూరి తారక రామారావుగారు ఓ ఇష్యూలో నాకు గుర్తొచ్చారు... అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

    అన్నయ్యకు కోపం వచ్చింది

    అన్నయ్యకు కోపం వచ్చింది

    1981లో అన్నయ్య వెంకటేశ్వరరావు ఓ సినిమాకు రాశారు. ఆ సినిమాకు నన్ను పాటలు రాయడానికి పిలిపించారు. పాటలు రాద్దామనుకునే సమయానికి మా గురువుగారు సి నారాయణ రెడ్డి గారు వచ్చారు. ఇదేంటి ఆయన వచ్చారు...ఆయన ఇంకో పాట రాస్తున్నారా అని అడిగాను. లేదు ఇదే పాట ఆయనా రాస్తున్నారు, మీరూ రాస్తున్నారు. ఏ పాట బావుంటే ఆ పాట తీసుకుంటామని ఆ నిర్మాత చెప్పాడు. ఇది కరెక్ట్ కాదండీ, నేను ఓడిపోతే ఆయన బాధ పడతారు. ఆయన ఓడిపోయే ప్రసక్తే లేదు. ఆయనే గెలుస్తాడు. నా శిష్యుడు ఓడిపోయాడు అని ఆయన బాధ పడటం నాకు ఇష్టం లేదు. నేను రాయను అన్నాను. ప్రపంచంలో ఎప్పుడూ ఎదురు చూడని ఒక మాట ఆయన నోటి నుండి వచ్చింది. వెంకటేశ్వరరావుగారు మీరు మా సినిమాకు డైలాగులు రాస్తున్నారు, కాబట్టి మీరు లంచ్ ఇక్కడ చేస్తారు, మరి గోపాల కృష్ణ గారు పాట రాయను అంటున్నాడు, ఆయన ఎక్కడ భోంచేస్తారు? అని అడగారు. అడగ్గానే అన్నయ్య వెంకటేశ్వరావు గారికి కోపం వచ్చింది. అడగ్గానే ఆ రెండు బైండ్లు తీసుకొచ్చి ఆ నిర్మాత చేతికి ఇచ్చి.... సార్ నేను ఇంత వరకు మీ దగ్గర రూపాయికూడా అడ్వాన్స్ తీసుకోలేదు. రెండు స్క్రిప్టులు రాసేసి ఉన్నాయి. ఈ రెండు స్క్రిప్టులు మీకు అప్పజెబుతున్నాను. నా తమ్ముడు ఎక్కడ అన్నం తింటాడు అని అడిగిన చోట నేను కూడా తినలేను. మేము వెళ్లి పోతాం అన్నారు. అపుడు ఆ నిర్మాత పశ్చాత్తాప మొహం కూడా పెట్టలేదు. ఏంటో బాధేసింది... అలా వెలుతున్నాం. ఇద్దరం ఆటోలో సూట్ కేసులు పెట్టేసుకున్నాం. వెలుతున్నాం. ఉస్మాన్ రోడ్డులోకి రాగానే అక్కడ రెయిన్ బో అనే హోటల్ కనిపించింది. తిందామా అన్నాను. కోపం వచ్చింది, ఆకలి చచ్చిపోయింది. అన్నగారికి సర్దార్ పాపారాయుడులో చేతికి దెబ్బ తిగిలిందని విన్నాను. ఒకసారి అన్నగారిని చూసొద్దాం. ఆయన్ను చూస్తే కోపం మొత్తం దిగిపోతుంది. అప్పుడు తిందాం అన్నారు. సరే పదా అని నేనూ వెళ్లాను. అంతకు ముందే మేము ‘చండశాసనుడు', ‘అనురాగ దేవత' స్క్రిప్టులు రాశాం కాబట్టి అన్నగారి ఇంటి వాచ్ మెన్ గుర్తుపట్టి లోనికి పంపించారు.

    కళ్లలో నీళ్లు తిరిగాయి

    కళ్లలో నీళ్లు తిరిగాయి

    అపుడు అన్నగారు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుని ఉన్నారు. అలా వెళ్లే సరికి రాఘవేంద్రరావుగారు, అర్జున్ రాజుగారు ఇలా ఒక తొమ్మిది పది మంది నిర్మాతలు ఆయన చూట్టూ ఉన్నారు. వాళ్లందరికీ పరుచూరి సోదరులు అని పరిచయం చేశారు. అందరికీ నమస్కారం పెట్టి రెండు నిమిషాలు కూర్చుని బయల్దేరుతున్నాం అని వెక్కి తిరిగాం. అపుడు అన్నగారు ఒక్క నిమిషం అని ఆపారు. భోజనం ఎక్కడ చేస్తున్నారు అని అడిగారు. హోటల్ లో చేస్తాం సార్ అన్నాం. ఈ రోజు వినాయక చవితి, పండగ పూట హోటల్ లో తినడం ఏమిటి? మా ఇంట్లో తిందురుకానీ రండి అని చెప్పి కిందకు తీసుకెళ్లి... తారకం గారు అని వాళ్ల ఆవిడను, కొడుకులను, కూతుళ్లను పిలిచారు. మనం అందరం ఈరోజు అదృష్టం చేసుకున్నాం. పండగపూట ఇద్దరు సరస్వతీ పుత్రులు మనింట్లో భోజనం చేయడానికి వచ్చారు. వారికి వడ్డించండి అన్నారు. అపుడు నిజంగా కళ్లలో నిజంగా నీళ్లు గిర్రున తిరిగాయి. అక్కడేం విన్నాం.... ఇక్కడ ఈ మహానుభావుడి నోటి నుండి ఏం విన్నాం. కరెక్టుగా ఆ పిల్లాడు చిన్న రామయ్య తినండి సార్ అని ఇవ్వగానే నాకు అది గుర్తొచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు రాశాం.

    బిగ్ బాస్ నచ్చింది

    బిగ్ బాస్ నచ్చింది

    బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటే... నాకు ఈ షో నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే... ఒకప్పుడు భారత దేశ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇపుడు విచ్చిన్నం అయిపోయింది. మా చిన్నతనంలో మా ఇల్లు, మా పెదనాన్న గారి ఇల్లు ఒకే కాంపౌండులో ఉంటే, మా నాయనమ్మగారి ఇల్లు ఎదురుగా ఉండేది. పది పన్నెండు మంది ఇంటి నిండా కళకళలాడుతూ కేనపడేవాళ్లం. ఇపుడు ఏ ఇంటికి వచ్చినా అతడికి ఆమె, ఆమెకు అతడు. లేకుంటే వారి పిల్లలు. ఇలా కుటుంబం కుదించుకుపోయింది. ఇలా కుటుంబం కుదించుకుపోయి కుటుంబ బాంధవ్యాలు నాశనం అయిపోతున్న సందర్భంలో రక్త సంబంధం లేని 14 మందిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి 70 రోజుల్లో వాళ్లకు తెలియని ప్రేమాభిమానాలు పుట్టేలా చేస్తున్నారు.

    ఎన్టీఆర్ సూపర్

    ఎన్టీఆర్ సూపర్

    మొన్న కల్పనగారు వెళ్లిపోతున్నపుడు, ఆవిడ బయటకు వచ్చి మాట్లాడున్నపుడు లోపలున్నవారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తిరిగి పంపించండి ఆవిడను అని అడిగారు. సంబంధం లేని వీరి మధ్య ఈ ప్రేమ పెరగడానికి కారణం వారంతా కలిసి ఓకే ఇంట్లో ఉండటమే. శని, ఆదివారాల్లో ఈ షోకు మరింత క్రేజ్ ఉంది. లోపల నాటీవీలో చిన్న రామయ్యను చూడటానికి వాళ్లెంత ఉత్సాహ పడిపోతున్నారో.... మా టీవీలో చూడటానికి మేమూ అంతే ఉత్సాహ పడిపోతున్నాం. ఉరికే నిలుచుంటే ఎంత గొప్పోడైనా సరే కొంతసేపటికే అయిపోతుంది. అలా అవకుండా ఉండాలంటే దాన్ని అద్భుతంగా నడపాలి. అంటే దానికి బాష కావాలి. సమయస్పూర్తి కావాలి. అది ప్రేక్షకులు ఇష్టపడే విధంగా ఉండాలి. దీన్ని ఎన్టీఆర్ బాగా హ్యాండిల్ చేస్తున్నాడు.

    మందలించండి

    మందలించండి

    ఇంటి నుండి బయటకు వచ్చిన వారిని ఎన్టీఆర్ ఎంత ఆత్మీయ బంధంతో పంపిస్తున్నారో అందరం చూస్తున్నాం. బిగ్ బాస్ షో అంటేనే ముక్కు మొహం తెలియని వారు కిలిసి ఉండటం. కొంత మంది ఈ మధ్య ఈషోపై విమర్శలు చేస్తున్నారు. దానికి చిన్న రామారావు ఏమీ చేయలేక పోవచ్చు. ఎందుకంటే అది గేమ్ షో. బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. అర్చనను చూస్తేనే జాలేస్తుంది. మొన్న అందరూ ఆమె మెడలో మిరపకాయ దండ వేస్తుంటే బాధేసింది. 24 గంటలు జరిగిన అంశాలను గంట మాత్రమే మనం చూస్తున్నాం. ఏం ఎడిట్ అయిందో తెలియదు, ఏం మిగిలుందే తెలియదు. కల్పనగారు ఔట్ అవుతారని అనుకోలేదు, కత్తి మహేష్ ఔట్ అవుతారని అనుకోలేదు. ప్రేక్షకుల ఓటింగుతోనే ఎలిమినేషన్ జరుగుతోందని ఎన్టీఆర్ అంటున్నారు. నా మనసుకు ఆదర్శ్, ప్రిన్స్ చివరి దాకా ఉంటారని అనిపిస్తోందని. జూనియర్ నీ మాటల్లో కవ్వింపులు ఉన్నాయి. మీ మాటల్లో లాలింపులు ఉన్నాయి. మీ మాటల్లో మందలింపులు కూడా పెట్టండి. ఎందుకంటే ఎవరైనా అన్ వాంటెడ్ గా ఉన్నపుడు నా టీవీ ద్వారా వారికి మీ మందలింపు ద్వారా చిన్న సందేశం ఇస్తే బావుంటుంది. ఈ షో విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను అని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయ పడ్డారు.

    English summary
    Jr NTR's Bigg Boss Show made me Emotional says Tollywood Writer Paruchuri Gopala Krishna. He also shares his memories about Sr NTR & Jr NTR in Today's Paruchuri Palukulu Episode 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X