Evaru Meelo Koteeswarulu: చిరంజీవి అభిమానులకు తారక్ కానుక.. గెస్ట్ ఎపిసోడ్, షో ఆరంభ తేదీపై ప్రకటన!
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చినా.. అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే జనరంజకంగా సాగుతుంటాయి. భారీ స్థాయిలో ఆదరణను అందుకుని తద్వారా అవే సూపర్ డూపర్ హిట్ షోలుగా కితాబందుకుంటాయి. సుదీర్ఘమైన తెలుగు టెలివిజన్ హిస్టరీలో ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌గా వచ్చి విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో. క్విజ్ గేమ్ షోగా ప్రసారం అయిన దీనికి అన్ని భాషల మాదిరిగానే మన దగ్గర కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన ఐదో సీజన్ మాత్రం ఎంతో గ్రాండ్‌గా రాబోతుంది. ఈ సారి దీన్ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. ఇక, తాజాగా ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే తేదీని ప్రకటించారు. ఆ సంగతులు మీకోసం!

ఇద్దరు స్టార్లతో నాలుగు సీజన్లు సక్సెస్
హిందీలో చాలా కాలం క్రితమే మొదలైన 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. జనరల్ నాలెడ్జ్ ఆధారంగా.. సామాన్యులను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో దీన్ని మొదలు పెట్టారు. అన్ని భాషల మాదిరిగానే తెలుగులోనూ ఇది విజయవంతం అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం చిరంజీవి హోస్ట్ చేశారు. షో జరిగే తీరుకు వీళ్ల హోస్టింగ్ తోడవడంతో ఇది సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.

ఐదో సీజన్ వాటికి మించేలా వస్తుందిగా
టెలివిజన్ హిస్టరీలోనే సూపర్ హిట్ షోగా పేరొందిన వాటిలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. నాలుగు సీజన్లు పూర్తైనా తర్వాత ఎందుకనే దీన్ని ఐదోది మొదలెట్టలేదు. దీంతో ఈ షో ఇకపై ఉండదన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత దీన్ని మరోసారి ప్రసారం చేస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు. అంతేకాదు, ఈ సీజన్‌ను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. అలాగే, కంటెంట్‌లోనూ కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈ సీజన్ కోసం అంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

ఈ సారి ఎన్టీఆర్ హోస్టింగ్.. భారీ బజ్‌తో
ఇప్పటి వరకూ వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగు సీజన్లను ఇద్దరు సీనియర్ హీరోలు నడిపించగా.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌ను మాత్రం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోను హిట్ చేసిన అతడు.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను కూడా అదే రీతిలో నడిపించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అతడికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కూడా వచ్చేసింది. ఆ పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పిన తారక్.. ఈ గేమ్ షోపై మరింతగా అంచనాలను పెంచేశాడని చెప్పొచ్చు.

షూట్ అప్‌డేట్.. ఒకేసారి అన్ని పూర్తిగా
నిజానికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' సీజన్‌ను ఎప్పుడో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. అయితే, తెర వెనుక మాత్రం ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు. ఇక, ఇటీవలే ఈ షోకు సంబంధించిన షూట్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఏకంగా 16 ఎపిసోడ్స్ కూడా చిత్రీకరణలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్‌ను జరుపుకుంటున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

షో డేట్‌ను అనౌన్స్ చేసిన యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు నుంచే ప్రసారం చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా దీన్ని ఆగస్టు 15 నుంచి మొదలు పెడతారన్న టాక్ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఐదో సీజన్‌ను ఆగస్టు 22 నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇది సోమవారం నుంచి గురువారం వరకూ రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
మెగాస్టార్‌కు కానుక... తారక్ ప్రకటన
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌తో ప్రారంభం తేదీని ప్రకటించారు. అందులో 'వస్తున్నా.. ప్రతి ఇంటికీ వచ్చేస్తున్నా.. సోమవారం నుంచి గురువారం వరకూ.. ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు.. ఎవరు మీలో కోటీశ్వరులు.. మీ జెమినీ టీవీలో' అంటూ తన గంభీరమైన స్వరంతో తెలిపాడు. ఇక, అదే రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉంది. దీంతో మెగా అభిమానులకు సైతం ఈ నందమూరి హీరో మంచి కానుకను ఇచ్చినట్లు అయింది. ఈ ప్రకటనతో ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Recommended Video

ఆ గెస్టుతో ఎపిసోడ్ ఆరోజే.. అందుకే
ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన ప్రారంభ ఎపిసోడ్ ఆగస్టు 22న ప్రసారం కాబోతుంది. 23 నుంచి షో మొదలవుతుంది. ఇక, ప్రారంభ ఎపిసోడ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్టుగా వచ్చాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అతడు రూ. 25 లక్షలు కూడా గెలిచాడని అంటున్నారు. అంటే.. మెగాస్టార్ పుట్టినరోజున చరణ్.. తారక్ కలిసి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను మొదలు పెట్టబోతున్నారు. అందుకే మెగా ఫ్యాన్స్‌కు కానుక అంటున్నారు. ఇది టాలీవుడ్‌లో మంచి సంకేతాలను ఇస్తుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











