బిగ్‌బాస్ సెలెబ్రిటీకి చుక్కలు చూపించారు.. 9 గంటలపాటు మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో!
విదేశీ విమానాశ్రయాల్లో భారతీయులకు తరచుగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. విదేశీ ఇమిగ్రేషన్ అధికారులు ఏదో ఒక వంకతో భారతీయుల సహనాన్ని పరీక్షిస్తుంటారు. షారుఖ్ ఖాన్, శిల్పాశెట్టి లాంటి విఐపీలకే ఇలాంటి అవమానాలు తప్పలేదు. తాజాగా బుల్లితెర నటుడు, బిగ్ బాస్ సెలబ్రిటీ అయిన కరణ్ వీర్ బోరాకు రష్యాలో ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. చివరకు భారత రాయబార కార్యాలయం స్పందించడంతో అతడిని అధికారులు మాస్కో విమానాశ్రయం నుంచి విడుదల చేశారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిలిం ఫెస్టివల్ కోసం
కరణ్ వీర్ ఇటీవల రష్యాకు వెళ్ళాడు. మాస్కో నగరంలో జరగబోయే మాక్ కాఫీ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యేందుకు కరణ్ వీర్ వెళ్ళాడు. కానీ అతడికి మాస్కో విమానాశ్రయంలో చుక్కెదురైంది. కరణ్ వీర్ పాస్ పోస్ట్, వీసా కొంతమేర పాడై ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అనుమతించలేదు. తన వివరాలు అన్ని చెప్పినా కూడా అధికారులు కరుణించలేదు. దీనితో విమానాశ్రయంలో కరణ్ వీర్ కు నిరీక్షణ తప్పలేదు.

9 గంటలపాటు
రష్యా అధికారులు విమానాశ్రయంలో కరణ్ వీర్ కు 9 గంటల పాటు చుక్కలు చూపించారు. చివరకు ఈ ఘటన గురించి మాస్కోలోని ఇండియన్ ఎంబసీ అధికారులకు తెలియడంతో వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని అధికారులు భారత విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ కు తెలియజేశారు. కరణ్ వీర్ కు వెంటనే తాత్కాలిక వీసా, పాస్ పోర్ట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంబసీ అధికారులని ఆమె ఆదేశించారు. కొంతసేపటికి కరణ్ వీర్ చేతుల్లోకి వీసా, పాస్ పోర్ట్ వచ్చాయి.
సెలెబ్రిటీలైనా, సామాన్యులైనా
కొత్త పాస్ పోర్ట్, వీసా వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు కరణ్ వీర్ ని విడిచిపెట్టారు. చిక్కులు తొలగడంతో ఈ ఘటన గురించి కరణ్ వీర్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఈ ఘటన ద్వారా నాకు ఓ విషయం అర్థం అయింది. సామాన్యులైనా, సెలెబ్రిటీలైనా విదేశాలకు వెళ్లే భారతీయులంతా సురక్షితమైన చేతుల్లో ఉన్నారు. సాయం చేసిన సుష్మాస్వరాజ్, ఎంబసీ అధికారులకు కరణ్ వీర్ కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రముఖ సీరియల్స్‌లో
కరణ్ వీర్ హిందీ బుల్లితెరపై ప్రధాన నటుడిగా కొనసాగుతున్నాడు. నాగిన్, కసౌటి జిందగీకే లాంటి టీవీ సీరియల్స్‌తో కరణ్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ముగిసిన హిందీ బిగ్‌బాస్ 12లో కరణ్ వీర్ పాల్గొన్నాడు. బిగ్‌బాస్ 12 తర్వాత కరణ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. భారత చిత్రాలకు సంబంధించిన ఫిలిం ఫెస్టివల్ రష్యాలో జరుగుతుండడం గర్వకారణం అని కరణ్ తెలిపాడు. అలాంటి ఫిలిం ఫెస్టివల్ కు తాను హాజరు కావడం సంతోషంగా ఉందని తెలిపాడు.


Click it and Unblock the Notifications











