Karthika Deepam July 5th : కార్తిక్ ని తమ జీవితాల్లో నుంచి వెళ్లిపోమంటున్న దీప.. నర్సింహ చెంప పగలగొట్టిన అనసూయ
తన పెళ్లి విషయం మాట్లాడేటందుకు తన పేరెంట్స్ తో పాటు జ్యోత్స్న ని, దీప, శౌర్య లను కూడా రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్. అదే రెస్టారెంట్ కి స్వప్న వాళ్ళు రావడంతో ఇబ్బంది పడతాడు శ్రీధర్. నర్సింహ తన కూతుర్ని దొంగతనంగా ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తాడు, వాడి దగ్గర నుంచి కూతుర్ని కాపాడుకుంటుంది దీప. ఆ గొడవకి కంగారుపడిన శౌర్య స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన శౌర్య ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు నర్సింహ. ఆ బిడ్డకు తండ్రి నువ్వు కాదు నేను అని చెప్పి షాకిస్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. జూలై 5 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 89వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నువ్వు నా బిడ్డకి తండ్రివా అంటూ కార్తీక్ పై కత్తెర ఎత్తుతుంది దీప. ఏమిటీ ఆవేశం అంటాడు కార్తీక్. ఆవేశం కాదు నువ్వు అన్న మాటలకి నా నరాలు చిట్లిపోతున్నాయి. కార్తీక్ ఏదో మాట్లాడబోతే అతడిని వారించి నువ్వు మాట్లాడితే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను, మీరు మాట్లాడొద్దు అయినా మీరు కత్తితో నా గొంతు కోసేసినా నాకు అంత బాధ అనిపించదు కానీ అంతకు మించిన బాధ పెట్టారు మీరు, అసలు ఏం మాట్లాడుతున్నారో స్పృహ ఉండే మాట్లాడారా, మీరు మాట్లాడిన మాటలు నా జీవితంలోని, నా కూతురు జీవితంలోని ఎలాంటి పరిణామాలు తీసుకువస్తాయో ఆలోచించారా..

తప్పుగా మాట్లాడాడని నా భర్తనే క్షమించలేదు అలాంటిది ఈరోజు ఆ తప్పుని మీరు నిజం చేసినట్లు మాట్లాడారు ఎలా క్షమిస్తాననుకున్నారు, అసలు ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని నిలదీస్తుంది దీప. మీరన్న మాట నా కూతురు వింటే ఏం జరిగేదో తెలుసా, తండ్రి కోసం తపిస్తున్న నా కూతురికి మీరు అన్నది అబద్ధమని చెప్పలేను, ఎందుకంటే అబద్ధం అంటే అప్పుడు నిజమేమిటి అని అడుగుతుంది.దానికి నేను సమాధానం చెప్పలేను అంటుంది దీప.
ఇప్పటివరకు మీరు చేసింది చాలు, మీరు వద్దు, మీ స్నేహము వద్దు దయచేసి ఇక్కడనుంచి వెళ్లిపోండి మళ్లీ మా జీవితాలలోకి రాకండి అని ఏడుస్తూ చెప్తుంది దీప. కార్తీక్ మౌనంగా అక్కడ నుంచి వచ్చేస్తుంటే హాస్పిటల్స్ స్టాప్ ఫీజు పే చేయమంటారు. ఫీజు పే చేసి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ అన్న మాటలని డైజెస్ట్ చేసుకోలేక పోతుంది జ్యోత్స్న. నిజంగానే ఆ శౌర్య బావకి పుట్టిందా, బావ నిజమే చెప్పాడా, నేను విన్నది నిజమేనా అని ఏడుస్తూ అనుకుంటుంది.

నేను ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలి అని బాగా ఫ్రస్టేట్ అవుతుంది. మరోవైపు ఇంటికి వచ్చిన భర్తని శౌర్య ఏది అని అడుగుతుంది శోభ. అది నా కూతురు కాదు, ఆ కార్తీక్ గాడికి దీపకి పుట్టిన అక్రమ సంతానం అంటాడు నర్సింహా. అతని చెంప పగలగొడుతుంది అనసూయ. నువ్వు నీ పెళ్ళాన్ని మోసం చేసావేమో కానీ అది మొగుణ్ణి మోసం చేయదు అంటుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు, నా కూతురే అని ఆ కార్తీక్ గాడే చెప్పాడు అంటాడు నర్సింహ.
అది నా తమ్ముడు చేతుల్లో పెరిగింది, అది అలాంటిదో నాకు తెలుసు. ఆ కార్తీక్ చాలా తెలివైనవాడు, వాడు అలా అన్నాడు కాబట్టే పాపని వదిలేసి నువ్వు రాగలిగావు, ఆ మాట అన్నందుకు నేను నిన్ను కొట్టినట్లే ఆ దీప కూడా కార్తీక్ చెంప పగలగొట్టి ఉంటుంది పదిమంది కార్తీక్ లు చెప్పినా ఆ బిడ్డ కార్తీక్ ది అంటే దీప గురించి తెలిసిన ఏ ఒక్కరూ నమ్మరు. ఆ బిడ్డ నీ బిడ్డె, తనని నీ దగ్గరికి ఎలా తెచ్చుకోవాలా అని మాత్రమే ఆలోచించు అంటుంది అనసూయ. మరోవైపు దీప గురించి ఆలోచిస్తూ మీరు అలా రియాక్ట్ అవటంలో తప్పులేదు.

ఈరోజు మీరు నా మీద ఆవేశపడినా రేపు నేను ఇలా ఎందుకు చేసానో మీరే అర్థం చేసుకుంటారు. మీరు నన్ను అవమానించినా పర్వాలేదు కానీ పాప వాడి చేతికి వెళ్ళకూడదు, మీకు దూరం కాకూడదు అనుకుంటాడు కార్తీక్. మరోవైపు శౌర్య దగ్గర కూర్చున్న దీప కార్తీక్ అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది, జ్యోత్స్న కి తెలిసిందంటే నన్ను మాటలతోనే చంపేస్తుంది అనుకుంటుంది.
అప్పుడే అక్కడికి నర్స్ వస్తుంది ఆమెకి శౌర్యని అప్పగించి నేను చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను అని చెప్పి బయటకు వెళుతుంది. మరోవైపు కార్తీక్ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దీప తన ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్లి లైట్ వేస్తుంది. దీప హాస్పిటల్ లో ఉంటే ఇంట్లో లైట్ వెలుగుతుందేంటి అనుకుంటుంది జ్యోత్స్న. ఇంట్లోకి వచ్చిన దీప తండ్రి ఫోటో తీసి చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











