Karthika Deepam September 7th Episode: భర్త ప్రవర్తనపై శోభ ఆశ్చర్యం.. తగ్గేదే లేదంటున్న స్వప్న!
కూతురికి ఆమె జన్మ రహస్యం చెప్తాడు దాసు. తాను విన్నది నమ్మలేక పారిజాతం దగ్గరికి వచ్చి తాను విన్నది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది జ్యోత్స్న. తనకు తెలిసిన నిజం నలుగురికి తెలిసేలోపు కార్తీక్ తో పెళ్లి జరిగిపోవాలి అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే చాటుగా విన్న జ్యోత్స్న వాళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు అని అపోహపడుతుంది. పంతులు తో ముందే మాట్లాడి కుటుంబ సభ్యులందరి ముందు పెళ్లి ముహూర్తం త్వరగా జరిగేలా పెట్టిస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. సెప్టెంబర్ 7 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 143వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రెండు రోజులే టైం ఉంది కదా నీకు పెళ్ళికి రావడం కుదురుతుందో కుదరదో నీకు బోలెడన్ని పనులు ఉంటాయి కదా అంటుంది జ్యోత్స్న. ఎన్ని పనులు ఉన్నా మీ పెళ్లికి తప్పకుండా వస్తాను వంటలు నేనే చేస్తాను అంటుంది దీప. అంత మాత్రమే కాదు అన్ని పనులు నువ్వే చూసుకోవాలి అంటుంది జ్యోత్స్న. తనేమీ వంట మనిషి కాదు మన పెళ్లికి అతిధి అనే దీప ని వెనకేసుకొస్తాడు కార్తీక్, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పెళ్ళికి రెండు రోజులే సమయం ఉంది కదా అత్తయ్య, నువ్వు ఇక్కడే ఉండిపోండి అంటుంది జ్యోత్స్న.

నాకు ఎక్కడైనా ఒకటే అమ్మకు చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. చూసావా బావకి నువ్వంటే ఎంత గౌరవమో అని దీపతో వెటకారంగా అంటుంది జ్యోత్స్న. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఈ పెళ్లి నువ్వు ఆపడానికి ట్రై చేస్తావని తెలుసు కానీ అప్పటివరకు నువ్వు ఉండవు అని మనసులో అనుకుంటుంది. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఈ పెళ్లి త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను.
అప్పుడు అత్తయ్యని, పాపని తీసుకుని ఇక్కడినుంచి వెళ్ళిపోతాను, స్వప్న కధ కూడా సుఖాంతం అయితే బాగుండు అనుకుంటుంది దీప. మరోవైపు తన పెళ్లి గురించి తల్లి తండ్రి మాట్లాడుకోవటం విని నేను అతడిని పెళ్లి చేసుకోను,కాశీని పెళ్లి చేసుకుంటాను అంటుంది స్వప్న. కుదరదు అంటాడు శ్రీధర్. మీరు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు నేను చేసుకుంటే తప్పా అంటుంది స్వప్న. నువ్వు ప్రేమించిన వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు వాడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అని డీటెయిల్స్ అడుగుతాడు శ్రీధర్. అతని గురించి తనకు తెలిసిన డీటెయిల్స్ చెప్తుంది స్వప్న.
అలాంటి వాడిని చేసుకొని అడుక్కుతింటావా అని కోపంగా అడుగుతాడు శ్రీధర్. కాశీ తో ఉంటే నాకు ఎక్కడ ఉన్నా సంతోషమే అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్న కూతురితో ఏంటి ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుని తీసుకొస్తావా ఏంటి అని అడుగుతాడు శ్రీధర్. నన్ను అంత దూరం తీసుకొని వెళ్లొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. చూసావా ఎలా మాట్లాడుతుందో అని భార్యతో అంటాడు శ్రీధర్.
నా ప్రేమని నేను చంపుకొని ఉంటే తనతో ప్రేమను చంపుకోమని చెప్పేదాన్ని ఇప్పుడు నేను ఆ మాట దానికి చెప్పలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి. ఎలా అయినా స్వప్న పెళ్లి శ్రీకాంత్ తోనే చేస్తాను అని కసిగా అనుకుంటాడు శ్రీధర్. మరోవైపు దీప జోలికి వెళ్ళినందుకు కార్తీక్ కొట్టిన దెబ్బలకి కాపడం పెట్టుకుంటున్న భర్తతో ఎప్పుడూ తన్నులు తిని రావటమే గాని తన్నడం అనేది ఎప్పుడు లేదు అని వెటకారంగా మాట్లాడుతుంది శోభ.
తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాదన జరగడంతో తల్లికి ఫోన్ చేస్తాను అంటుంది శోభ. ఏంటి బెదిరిస్తున్నావా ఇప్పుడే చెయ్యు నేను మా అమ్మకే భయపడను మీ అమ్మకి ఏం భయపడతాను, ఆడాళ్ళందరూ కలిసి నా బ్రతుకుని తుప్పల్లో తొక్కేశారు నా బ్రతుకు ఇలా అవటానికి కారణమైన వాళ్ళందరి అంతు చూడడానికే వెళుతున్నాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు నర్సింహా. అతడి ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన శోభ నా మొగుడి ఆవేశం చూస్తుంటే ఏదో చేసేవాడిలాగే ఉన్నాడు అనుకుంటుంది.
మరోవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది.పార్టీకి మీ బావ ఎందుకు రాలేదు మీ బావకి పెళ్లి ఇష్టం లేదా అంటుంది ఒక ఫ్రెండ్. మీ బావకి ఫోన్ చేసి రమ్మను అంటుంది మరొక ఫ్రెండ్. నేను ఫోన్ చేస్తే మా బావ తప్పకుండా వస్తాడు అంటూ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ పెళ్లి కోసం తల్లిని బట్టలు కొనమంటుంది శౌర్య. అనసూయ, దీప, శౌర్య బట్టల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఒక ఆవిడ వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వంట చేయాలి అంటూ 5000 అడ్వాన్స్ చేతిలో పెడుతుంది.
ముందు వచ్చినామెని అనుమానిస్తుంది అనసూయ కానీ అడ్వాన్స్ ఇవ్వటంతో ఆమెని నమ్ముతుంది. దీప కి మాత్రం ఏ అనుమానము రాకపోవటంతో మీరు వెళ్ళండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను అని చెప్పడంతో వచ్చినామె వెళ్ళిపోతుంది. మరోవైపు బయటికి వెళ్తున్న కొడుకుని పెళ్లి ఏర్పాట్లు కోసం ఇంట్లోనే ఉండమంటుంది కాంచన. జ్యోత్స్న పార్టీకి పిలిచింది వెళ్తున్నాను అంటాడు కార్తీక్. అంతలోనే శ్రీధర్ వస్తాడు, రాఖీ పండక్కి పెళ్లి మాటలకి దగ్గర లేడని శ్రీధర్ మీద కోప్పడుతుంది కాంచన.
కార్తీక్ పెళ్లి అయ్యేవరకు ఇకమీదట ఎక్కడికి వెళ్ళను అంటాడు శ్రీధర్. మనకి బంధాలు దేవుడు ఇచ్చిన వరం వాటిని నిలబెట్టుకోవడం మన చేతిలోనే ఉంది, రాఖీ రోజు నువ్వు లేవని అత్తయ్య ఎంత బాధ పడిందో నాకు తెలుసు, పెళ్లి మాటలప్పుడు తాతయ్య ఎంత బాధపడ్డాడు నాకు తెలుసు, అయినా వాళ్లు మిమ్మల్ని ఏమీ అనలేదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అలాంటి బంధాలని మనమే కాపాడుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.
కారులో వెళ్తున్న కార్తీక్ కి దారిలో దీప కనిపిస్తుంది క్యాటరింగ్ కి వెళ్తున్నాను అని దీప చెప్పటంతో తాను వెళుతున్న దారిలోనే దీప కూడా వెళ్తుందని తెలుసుకుని ఆమెని తన కార్ లో డ్రాప్ చేస్తాడు కార్తీక్. కార్తీక్ పార్టీకి వెళ్తున్నాడని తెలిసి చివరి వరకు ఉంటేనే వెళ్ళండి లేకపోతే వద్దు అంటుంది దీప. ఇంతకుముందు జరిగిన పొరపాటు ఇప్పుడు జరగనివ్వను అంటాడు కార్తీ.క్ తర్వాత దీపని ఆమె వెళ్ళవలసిన చోటులో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
తర్వాత జ్యోత్స్న కార్తీక్ కి ఫోన్ చేస్తుంది పది నిమిషాల్లో వస్తాను అంటాడు కార్తీక్. అప్పుడే కార్లో ఏదో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకొక ఫోన్ రింగ్ అవుతుంది ఏమిటి కార్లో ఎవరున్నారు అని అడుగుతుంది జ్యోత్స్న. నా దగ్గర ఎవరూ లేరు ఫోన్ నీ దగ్గరే అయి ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. తర్వాత ఆ ఫోన్ తన కార్లోనే రింగ్ అవ్వటంతో దీప మరిచిపోయిందని తెలుసుకొని మళ్లీ ఆమెకి ఇవ్వటానికి బయలుదేరుతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











