Karthika Deepam 2 November 5th: శివన్నారాయణపై జ్యోత్స్న కుట్ర... కాంచన మాటలతో శ్రీధర్ మనసు ముక్కలు
Photo Courtesy: JioHotstar
నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసేరోజు త్వరలోనే ఉందని పారిజాతం అనడంతో జ్యోత్స్న వణికిపోతుంది. దాసుగాడిని పిలిచి నీ కూతురిని నువ్వు తీసుకెళ్లు అని చెబుతారని అంటుంది. ఆ తర్వాత అసలైన యువరాణిని వెతికేందుకు వేట మొదలవుతుందని పారిజాతం అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర దీపని సుమిత్ర, దశరథలు తమ ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని భోజనం వడ్డిస్తారు. అది చూసిన జ్యోత్స్న ఇంకా టెన్షన్ పడుతుంది. అతి త్వరలోనే దీప ఎవరో అత్తయ్యకి, మావయ్యకి చెప్పేస్తానని మనసులో అనుకుంటాడు కార్తీక్.
డైనింగ్ టేబుల్ మీదున్న వెరైటీలన్నీ లాగించేసిన పారిజాతం కిందా మీదా పడుతుంది. శ్రీధర్, కాంచన, కార్తీక్, దీపలకు శివన్నారాయణ బట్టలు పెడతాడు. త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతుందని దానికి మీరంతా రావాలని చెబుతాడు పెద్దాయన. నీ చిన్న ఫ్యామిలీని కూడా తీసుకురమ్మని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 5వ తేదీ 507వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కిచెన్‌లో వంట చేస్తోన్న దీప దగ్గరికి సుమిత్ర వచ్చి నీతో మాట్లాడాలని చెబుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలో నటిస్తున్నట్లుగా లేదు, నిజాయితీగా చేస్తున్నట్లే ఉందని అంటుంది. నీకు, కార్తీక్‌కు జరిగే పెళ్లిని ఆపుదామని తాళిని తెంచాను, కానీ పైకి మాత్రం నవ్వుతూనే ఉన్నానని చెబుతుంది సుమిత్ర. నిజాయితీగా ఉండటానికి, నిజాయితీతో ఉన్నట్లు నటించడానికి తేడా స్పష్టంగా తెలిసింది. నువ్వు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉన్నావా? అని సుమిత్ర ప్రశ్నించగా.. ఏ విషయంలో నిజాయితీగా లేనో మీరే చెప్పండి అని అడుగుతుంది దీప. నాకు కావాల్సిన వాళ్లు నేను వెళ్లిపోతుంటే చూసి కూడా ఆపలేదు.. నాతో ఏ సంబంధం లేని నువ్వు మాత్రం నీకు అవసరం లేకపోయినా నా కోసం వెతికావు, తిరిగావు, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకున్నావు, నన్ను నీ ఇంటికి తీసుకెళ్లావు, నా కోసం మాటలు పడ్డావు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కావు.. వీటిలో ఎక్కడా నువ్వు నటిస్తున్నట్లుగా అనిపించలేదని అంటుంది సుమిత్ర.
రక్త సంబంధం కోసం మనం ఎలా చేస్తామో, నువ్వు కూడా అలాగే చేశావని చెబుతుంది సుమిత్ర. నీ తండ్రి కోసమో, నీ తల్లి కోసమో చేసినట్లు చేశావని .. నేను చూస్తున్న దీప వేరని అంటుంది. నువ్వు మా అమ్మవి అన్నావు.. కానీ నేను కాలేను కదా అని సుమిత్ర అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఇదంతా మీ ఇద్దరి మధ్య తీరుతున్న రుణానుబంధమే అంటాడు. సమస్య నీలోనే ఉందని, సాక్ష్యాలు ఎదురుగానే ఉన్నప్పటికీ అది నిజం కాదని చెబుతాడు కార్తీక్. దీప పట్టుకున్న గన్‌లో నుంచి బుల్లెట్ రాలేదని ఎలా నిరూపిస్తావని అడుగుతుంది సుమిత్ర.
చిన్నప్పుడు నేను కోనేటిలో మునిగిపోతున్నప్పుడు కాపాడిందని కార్తీక్ గుర్తుచేస్తాడు. ఆ తర్వాత నువ్వెవరో తెలియకపోయినా కాపాడిందని, నన్ను ఎవరో చంపబోతే నాకు బ్లడ్ ఇచ్చి రక్షించిందని చెబుతాడు కార్తీక్. దశరథ మావయ్యకి బుల్లెట్ తగిలిన విషయంలోనూ దీప తప్పు లేదని అంటాడు. ఆ రోజున దీప చేతిలో గన్ పేలింది, నా భర్తకు బుల్లెట్ తగిలింది.. ఈ తప్పు దీప చేయలేదని నువ్వు నిరూపించు అని కార్తీక్‌తో అంటుంది సుమిత్ర. దీప నిర్దోషి అని నిరూపించడంతో పాటు నీకొక సర్‌ప్రైజ్ కూడా ఇస్తానని చెబుతాడు కార్తీక్. నీకు అది జీవితాంతం గుర్తుంటుందని అంటాడు. దీని కోసం వెయిట్ చేస్తానని చెబుతుంది సుమిత్ర.
మీ అమ్మ ప్రతిదానికి సాక్ష్యాలు అడుగుతుంది, ఇప్పుడే సరికొత్త ఆట మొదలైంది దీనిని ఎవ్వరూ ఆపలేరని అంటాడు కార్తీక్. అమ్మానాన్న కలిసిపోయారు, వాళ్లిద్దరి మధ్య కూర్చొని భోజనం చేశావు, మీ తాత బట్టలు పెట్టాడు చాలా సంతోషంగా ఉన్నావని అంటాడు. దాంతో థ్యాంక్స్ చెబుతుంది దీప. బావకి ఒక మరదలు ఎలా థ్యాంక్స్ చెబుతుంది.. దగ్గరికి లాక్కొని ఒక హగ్ ఇచ్చి కళ్లలోకి కళ్లు పెట్టి, కన్ను కొట్టి థ్యాంక్స్ చెబితే ఆ కిక్కే వేరని అంటాడు కార్తీక్. దాంతో దీప అలాగే చేయడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
మీరంతా అమ్మమ్మ, తాతయ్య పెళ్లిరోజు సెలబ్రేషన్స్‌కి వెళ్లి నన్ను మాత్రం స్కూల్‌కు పంపారని శౌర్య అలుగుతుంది. నువ్వు రాలేదని నీ కోసం మీ తాత స్వీట్స్ పంపించాడని చెబుతుంది కాంచన. అమ్మమ్మ మనింటికి రాదా? తాతయ్య దగ్గర అమ్మమ్మ ఉండిపోయింది కదా అని అంటుంది శౌర్య. అంటే దాగుడుమూతల ఆటలో అమ్మమ్మ ఓడిపోయినట్లేనా అని అంటుంది. అసలు ఈ దాగుడుమూతలు ఏంటీ? అమ్మమ్మ ఓడిపోవడం ఏంటీ? అని శ్రీధర్ అడుగుతాడు. మన జీవితాల్లోకి ఒక తుఫాన్ వచ్చి వెళ్లిపోయిందని అంటుంది కాంచన. జ్యోత్స్నకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే ఎవరి జీవితాల్లోకి, ఏ తుఫాన్ రాదని అంటాడు శ్రీధర్. సంబంధం చూస్తే వాడు జ్యోత్స్న కంటే ముదురు అయ్యుండాలి లేకపోతే పెళ్లయిన మూడో రోజే పారిపోతాడని అంటాడు శ్రీధర్. అన్ని గొడవలు సద్దుమణిగి అందరం ఒక్కటైపోయామని చెబుతుంది కాంచన.
నీ వల్ల కాకుండా కార్తీక్, దీప వల్ల మీ అమ్మానాన్నలు కలిశారని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. ఇంతకీ నువ్వు ఎవరి వైపు ఉన్నావో చెప్పమని జ్యోత్స్న నిలదీయగా.. నేనెప్పుడూ మనవరాలి కోసమే బతుకుతానని చెబుతుంది పారు. నా జీవితానికి డెడ్‌లైన్ వచ్చింది.. కోరుకున్న ప్రేమను పొందలేకపోయాను దీప ఎత్తుకుపోయింది, ఆస్తి మొత్తం తాతయ్య డాడీ పేరు మీద రాశాడు, కనీసం ఇంట్లో రెస్పెక్ట్ కూడా లేదని అంటుంది పారిజాతం. ఇప్పుడు నేను వెళ్లి సీఈవో పోస్ట్ గురించి అడిగితే బయటికి వెళ్లమని అంటాడని చెబుతుంది జ్యోత్స్న. నీ తెలివితేటల్ని ఉపయోగించి తాతని బుట్టులో వేసుకో.. మనం అనుకున్నది జరగాలంటే పాత పారిజాతం రావాల్సిందేనని చెబుతుంది జ్యోత్స్న. దానికి సరేనని చెబుతుంది పారిజాతం.
నేను మీతో ఉండొచ్చా అని శ్రీధర్ అడగ్గా.. మనమంతా కలిసే ఉంటాం, కానీ ఎవరి ఇల్లు వారికి ఉన్నాయని అంటాడు కార్తీక్. జ్యోత్స్న అడిగింది కరెక్టే.. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కానీ మీ అమ్మానాన్నల గురించి ఎందుకు ఆలోచించడం లేదని శ్రీధర్ అడుగుతాడు. మనం కుటుంబంగా కలిసి ఉండటం అనేది నా తల్లి నిర్ణయం మీద ఆధారపడ్డ విషయమని చెబుతాడు కార్తీక్. అత్తయ్య నిర్ణయమే నా నిర్ణయమని అంటుంది దీప. మన కుటుంబం కూడా కలిసిపోతే అది కదా నిజమైన ఆనందమని అంటాడు శ్రీధర్. నేను వద్దు అనుకున్నది నాకొద్దు.. నేను మరొకరికి ఇచ్చేసింది నాకొద్దు అని తేల్చేస్తుంది కాంచన.
నేనెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నానో అందరికీ తెలిసిందేనని చెబుతుంది కాంచన. మీరు ఇలా ఇంటికొస్తే నలుగురూ ఏమనుకుంటారు? రెండో భార్య ఎవరు అనుకుంటారు? అని ప్రశ్నిస్తుంది. సగం సగం పంచుకోలేనని మిమ్మల్ని పూర్తిగా వేరొకరికి ఇచ్చేశానని చెబుతుంది కాంచన. కావేరి నా భర్తను పంపను అంటే మా ఇంటి శుభకార్యాలకు కూడా మిమ్మల్ని పంపే అధికారం నాకు లేదు.. కావేరి తోబుట్టువులా కలిసిపోయే మనిషి కాబట్టి మీరు మాతో ఇలా ఉండగలుగుతున్నారని చెబుతుంది కాంచన. దీనిని కూడా మీరు దూరం చేసుకోవద్దని అంటుంది. కానీ ఇది కూడా మీ ఇల్లే.. ఇక్కడికి రావొచ్చు, వెళ్లొచ్చు అది కూడా తండ్రిగా మాత్రమే, కాంచనకు భర్తగా కాదని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










