Karthika Deepam 2 November 20th: కావేరిని ఉంపుడుగత్తె అన్న జ్యోత్స్న.. శివన్నారాయణ కుటుంబంలో తుఫాను
Photo Courtesy: JioHotstar
హోమానికి రమ్మని శ్రీధర్ కుటుంబాన్ని కాళ్లా వేళ్లాపడి ఎట్టకేలకు ఒప్పిస్తుంది పారిజాతం. మీ ఇంటికొస్తే ఓవరాక్షన్ చేస్తారా అని మీ సంగతి చెబుతానని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. కార్తీక్ తిరిగి వెళ్తూ స్వప్న- కాశీల కాపురంలో గొడవలు జరుగుతున్నట్లుగా గమనిస్తాడు. ఇంటికొచ్చాక హోమం ఆపేలా నువ్వు ఏదో చేయబోతున్నావు కదా.. మర్యాదగా దానిని ఆపేయమని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. వారసురాలికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా? అంటే నువ్వు నీ ఇంటి వారసురాలివి కాదా అని కార్తీక్ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
కార్తీక్- జ్యోత్స్నల మాటలను పారిజాతం దొంగచాటుగా వింటుండటంతో శివన్నారాయణ మండిపడతాడు. హోమానికి శ్రీధర్ కుటుంబం వస్తుందని పారిజాతం చెప్పడంతో ఆమెను లోపలికి రమ్మని చెబుతాడు పెద్దాయన. హోమం గురించి, కార్యక్రమానికి రాబోయే అతిథుల గురించి కాంచనకి చెబుతాడు కార్తీక్. అందరూ కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని తల్లితో అంటాడు. గతంలోనూ హోమం చేయించడానికి ముందు మా అమ్మ చనిపోయిందని.. ఇప్పుడు హోమం అంటుంటే భయంగా ఉందని చెబుతుంది కాంచన. రాత్రి శివన్నారాయణకి, కాంచనకి వాళ్ల అమ్మ మాటలు వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడి నిద్రలేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 20వ తేదీ 520వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
హోమం సందర్భంగా ఇంటిని డెకరేట్ చేస్తున్న దశరథని నువ్వు ఈ పనులు చేయడం ఎందుకు? కార్తీక్ గాడు చూసుకునేవాడు కదా? అంటాడు శివన్నారాయణ. వాడికి ఈరోజు ఏ పనులు చెప్పొద్దని ఫ్యామిలీతో సహా మనింటికి వస్తున్నాడని చెబుతాడు దశరథ. ఎవరి గౌరవ మర్యాదలకు నీ తండ్రి లోటు రానివ్వడని అంటాడు శివన్నారాయణ. హోమం కావడంతో ఇంట్లో సందడి సందడిగా గడుపుతుంది సుమిత్ర. ఈ హుషారు, ఉత్సాహం ఎంతోసేపు ఉండవని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్, శ్రీధర్ తమ కుటుంబాలతో ఇంటికి వస్తారు.
శౌర్య వచ్చి ఇల్లంతా సందడి చేయడంతో సుమిత్ర మురిసిపోతుంది. నీకు కూడా మనవళ్లు వస్తారని పారిజాతం అనడంతో.. శౌర్య కూడా నా మనవరాలే అంటుంది సుమిత్ర. అనుకోవడానికి, అవ్వడానికి చాలా తేడా ఉందని పారు అనగా.. ఇంకా జ్యోత్స్నకి పెళ్లే కాలేదు నువ్వు అప్పుడే మనవళ్లు, మనవరాళ్ల గురించి మాట్లాడుతున్నావా? అని మండిపడతాడు కార్తీక్. ఇంతలో కావేరి దగ్గరికి వెళ్లి వదిన అని సుమిత్ర పిలవడంతో ఆమె ఎమోషనల్ అవుతుంది. జరిగినదంతా వదిలేయండి, ఈ క్షణం మనమంతా కలిశాం... ఇకపైనా కలిసే ఉంటామని అంటాడు శివన్నారాయణ. మా ఇంటి కార్యక్రమానికి మీరొచ్చినట్లే.. మీ ఇంటి కార్యక్రమానికి మేమూ వస్తామని చెబుతాడు దశరథ. ఇకపై ఇదంతా శివన్నారాయణ పరివారమే అంటాడు పెద్దాయన.
మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకున్నారని శివన్నారాయణకు చేతులెత్తి దండం పెడుతుంది కావేరి. శౌర్యని ప్రాణాలతో బతికించింది నువ్వేనని ఆమెకు గుర్తుచేస్తాడు శివన్నారాయణ. ఇకపై కన్నీళ్లకు, కలతలకు నా ఇంట్లో చోటు లేదని పెద్దాయన అంటాడు. అందరూ వచ్చారు.. దాసు ఎక్కడ? అని అడుగుతాడు శివన్నారాయణ. ఆ తర్వాత స్వప్న దగ్గరికి వెళ్లి... సైలెంట్‌గా ఎందుకు ఉన్నావని అడుగుతాడు. ఆనందంలో నాకు మాటలు రావడం లేదని చెబుతుంది స్వప్న. మీ నాన్ననే కానీ మమ్మల్ని పట్టించుకోవా? అని కాంచనతో సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న.
ఇప్పుడు మనమంతా బంధువులం... స్వప్న నా ఆడపడుచు అయితే వాళ్లమ్మ నాకు ఏమవుతుందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నీ మేనత్త ఏమవుతుందో, కావేరి కూడా అదే అవుతుందని అంటుంది పారిజాతం. అయితే కాంచన అత్త అని పిలిచినట్లు, కావేరి అత్త అని పిలవొచ్చు కదా అని అంటుంది జ్యోత్స్న. నిరభ్యంతరంగా పిలవొచ్చని చెబుతుంది దీప. ముందు ముత్తయిదువల కాళ్లకి పసుపు రాయమని సుమిత్ర చెప్పడంతో సరేనని అంటుంది జ్యోత్స్న. ముత్తయిదువలు అంటే ఎవరికి రాయాలని అడుగుతుంది.. నేను లోపలికి వాళ్లకి రాసేశాను నువ్వు మీ అత్తయ్యలకి, స్వప్న, దీప, నాయనమ్మలకి రాయమని చెబుతుంది సుమిత్ర.
పసుపు రాయబోతుండగా.. నువ్వు రాయడమేంటీ? అని పారు ప్రశ్నించగా.. జరగబోయేది చూడమని అంటుంది జ్యోత్స్న. ముందుకు అత్తకు రాస్తాను కానీ.. నీ భర్త నీతో ఉన్నాడు, నువ్వు ముత్తయిదువవి, గ్రానీ భర్త గ్రానీతో ఉన్నాడు గ్రానీ ముత్తయిదువే... దీప, స్వప్నల భర్తలు కూడా వాళ్లతోనే ఉన్నారు కాబట్టి వాళ్లూ ముత్తయిదువులే అంటుంది జ్యోత్స్న. పసుపు కుంకుమలు ఉన్న ప్రతి ఆడపిల్లా ముత్తయిదువేనని చెబుతుంది సుమిత్ర. ఐదోతనం ఉన్న ప్రతి ఆడది ముత్తయిదువే అంటుంది సుమిత్ర. ఈ గొడవతో మండిపడ్డ కాంచన.. అసలు నీకేం కావాలని మండిపడుతుంది. ఇష్టం లేకపోతే పాదాలకు పసుపు రాయడం మానేయమని చీవాట్లు పెడుతుంది.
నేను ఏదో తెలియక అడుగుతుంటే నువ్వెందుకు కోప్పడుతున్నావని అడుగుతుంది జ్యోత్స్న. భర్త ఉన్న ప్రతి ఒక్కరూ ముత్తయిదువేనని అంటుంది పారిజాతం. మరి అత్తతో భర్త లేడు కదా అని జ్యోత్స్న అనడంతో కాంచన షాక్ అవుతుంది. నన్ను అవమానించడానికి కాకపోతే..ఈ మాటలు ఎందుకు అంటావని ప్రశ్నిస్తుంది కాంచన. నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, నిన్ను అవమానిస్తే మమ్మల్ని మేం అవమానించుకున్నట్లేనని చెబుతుంది జ్యోత్స్న. నేను మాట్లాడింది అత్తతో భర్త లేడని, అత్తకు భర్త లేడని కాదని అంటుంది. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అత్తకి, మావయ్యకి పెళ్లి జరిగిందట. అంతేకానీ ఏ గుడిలోనో, బడిలోనో చాటుగా దొంగపెళ్లి జరగలేదని కావేరిని ఉద్దేశించి అంటుంది జ్యోత్స్న.
శ్రీధర్ భర్త ఎవరంటే కాంచన భర్త అంటారు కానీ కావేరి భర్త అనరు కదా? శ్రీధర్ ఎవరంటే కార్తీక్ తండ్రి అంటారు కానీ స్వప్న తండ్రి అనరు కదా? అని సూటిపోటి మాటలతో హేళన చేస్తుంది జ్యోత్స్న. ఆ మాటలతో స్వప్న మండిపడుతుంది. నువ్వు కూడా శ్రీధర్‌ని నా తండ్రి అని చెప్పుకోలేవు.. అప్పుడు నీ తండ్రికి, నీ తల్లికి ఎలా పెళ్లి జరిగిందని అడుగుతారు. అప్పుడు సమాధానం నువ్వు చెబుతావా? మీ అమ్మ చెబుతుందా? అని నానామాటలు అంటుంది. దీని వయసుకు మించి అడ్డదిడ్డంగా వాగుతుంటే నోరు మూయించకుండా దానికి వత్తాసు పలుకుతావా? అని పారిజాతంపై మండిపడుతుంది కాంచన. నువ్వు త్యాగాలు చేసినంత మాత్రాన వీళ్లకు గుర్తింపు రాదని చెబుతుంది జ్యోత్స్న. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఈవిడని ఉంపుడుగత్తె అంటారని కావేరిని అవమానిస్తుంది జ్యోత్స్న.
ఆ మాటలతో మండిపడిన సుమిత్ర.. జ్యోత్స్నను లాగిపెట్టి కొట్టబోతుండగా కావేరి అడ్డుకుంటుంది. నా కూతురి కోసం నీ కూతురిని కొట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది. తప్పు నాదే.. ఇంటికి పిలవగానే రాను అని చెప్పాల్సిందని బాధపడుతుంది కావేరి. నా పెళ్లి, నా బతుకు సక్రమమైంది కాదని అంటుంది. ఇక్కడ మాకెంత మర్యాద ఉందో అర్ధమైందని.. ఆ ఇంటికొచ్చి పిలిచింది, ఈ ఇంటి వాకిట్లో నిలబెట్టి అవమానించడానికేనని అర్ధమైందని అంటుంది స్వప్న. కావేరిని తీసుకుని స్వప్న వెళ్లిపోతుండగా శివన్నారాయణ, కార్తీక్‌లు ఎదురొస్తారు. స్వప్న ఏడుస్తూ ఉండటంతో ఏం జరిగిందని అడుగుతాడు కార్తీక్. ఏం కాలేదు.. మేం ఇంటికి వెళ్లిపోతున్నామని చెబుతుంది స్వప్న.
మేం ఉంటే నీకే అవమానమని అనడంతో ముందు నిన్ను ఎవరేం అన్నారో చెప్పమని అంటాడు కార్తీక్. అమ్మ గురించి, అమ్మకి జరిగిన పెళ్లి గురించి జ్యోత్స్న నీచంగా మాట్లాడిందని జరిగింది చెబుతుంది స్వప్న. మా చిన్నమ్మని ఏమన్నావు? అని జ్యోత్స్నని నిలదీస్తాడు కార్తీక్. సుమిత్రను ఏం జరిగిందని దశరథ అడుగుతాడు. దీనికి ఏదో అయ్యింది.. ఎక్కడో మొదలుపెట్టి ఏదేదో మాట్లాడిందని అంటుంది సుమిత్ర. కొట్టబోతే కావేరి వదిన ఆపిందని చెబుతుంది. లేదంటే దీని చెంప పగిలేదని అంటుంది సుమిత్ర.
అత్తకే కోపం తెప్పించి కొట్టే వరకు వచ్చిందంటే అది ఎలాంటి మాట అయ్యుంటుందో నేను ఊహించగలను అని అంటాడు కార్తీక్. ఇలా అవమానించడానికేనా ఇంటికి పిలిపించింది అని అంటాడు కార్తీక్. మేమంతా ఒకటే కుటుంబం.. నీకెంటీ బాధ, నచ్చితే మాట్లాడు, లేదంటే మానేయమని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ముందు వాళ్లకి క్షమాపణలు చెప్పమంటాడు కార్తీక్. అందరూ కలిసే ఉండాలన్న నీ సంకల్పానికి మేం తలవంచుతాం, కానీ చిన్నమ్మకి జ్యోత్స్న సారీ చెప్పాలని శివన్నారాయణతో అంటాడు కార్తీక్. దాంతో కావేరికి జ్యోత్స్న క్షమాపణలు చెప్పి పసుపు రాస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











