Karthika Deepam 2 November 21st: జ్యోత్స్నపై దాస్ ఆగ్రహం... దీపే వారసురాలని శివన్నారాయణకు సంకేతాలు
Photo Courtesy: JioHotstar
ఇంట్లో హోమం ఉండటంతో కార్తీక్, కాంచన, శ్రీధర్, కావేరి, దీప, స్వప్న, కాశీలు శివన్నారాయణ ఇంటికి వస్తారు. వాళ్లందరికీ శివన్నారాయణ, దశరథలు స్వాగతం పలుకుతారు. కావేరిని, స్వప్నని పలకరించిన శివన్నారాయణ.. ఇకపై మనమంతా ఒకే ఫ్యామిలీ, గతంలో జరిగినదంతా మరిచిపోమ్మని చెబుతాడు. ఆ తర్వాత నేను ఐదుగురు ముత్తయిదువలకు నీచేత పసుపు రాయిస్తానని మొక్కుకున్నానని.. కాంచన, దీప, కావేరి, స్వప్న, మీ నాయనమ్మల కాళ్లకు పసుపు రాయమని జ్యోత్స్నకి చెబుతుంది సుమిత్ర.
దాంతో జ్యోత్స్న సూటిపోటి మాటలతో కాంచన, కావేరి, స్వప్నలను బాధపెడుతుంది. దాంతో మనస్తాపానికి గురైన స్వప్న తన తల్లిని తీసుకుని వెళ్లిపోతుండగా శివన్నారాయణ, కార్తీక్‌లు ఎదురవుతారు. ఎందుకు ఏడుస్తున్నావని అడగ్గా.. స్వప్న జరిగినదంతా చెబుతుంది. దాంతో మండిపడిన కార్తీక్.. వెంటనే నా చిన్నమ్మకి, నా చెల్లెలికి క్షమాపణలు చెప్పమని జ్యోత్స్నపై విరుచుకుపడతాడు. దాంతో చేసేది లేక కావేరి, స్వప్నలకు క్షమాపణలు చెబుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 21వ తేదీ 521వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావేరి పాదాలకు పసుపు రాయమని కోప్పడుతుంది సుమిత్ర. దాంతో కావేరి కాళ్లకు పసుపు రాస్తుంది జ్యోత్స్న. మిగిలిన వాళ్లకు దీప పసుపు రాస్తుంది. అది చూసి కార్తీక్ సంతోషిస్తాడు. సుమిత్ర కాళ్లకు పసుపు రాస్తూ సంతోషిస్తుంది దీప. నేను నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నానని కాంచనతో అంటాడు శివన్నారాయణ. శ్రీధర్ విషయంలో నేను చేసింది ఏది ముందుగా నీతో చెప్పలేదని.. కనీసం తర్వాత కూడా ఫోన్ చేసి చెప్పలేదు, కార్తీక్‌ను ఒక మాట అడిగానంతే అంటాడు శివన్నారాయణ. తప్పు చేశాడని ఒకప్పుడు కొట్టాను, అతనిలో మార్పును చూసి మళ్లీ నేనే చేరదీశాను. అవమానించిన నేనే అధికారాలు ఇచ్చానని అంటాడు శివన్నారాయణ.
నా చుట్టూ ఉన్న అందరూ సంతోషంగా ఉన్నారు.. నువ్వు మాత్రం లేవు, నీ భర్తని క్షమించలేవా? అని అడుగుతాడు పెద్దాయన. ఆ మాటలతో కాంచన షాక్ అవుతుంది. నేను శ్రీధర్‌ను సీఈవోని చేయడానికి ఉన్న కారణాల్లో ఒకటి కార్తీక్ అయితే రెండోది నువ్వు అని చెబుతాడు. నేను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నా.. నువ్వు భర్తకు దూరంగా ఉంటూ ఎంతటి క్షోభను అనుభవిస్తున్నానో నేను అర్ధం చేసుకుంటానని అంటాడు పెద్దాయన. అన్నీ తెలిసే అడుగుతున్నావా నాన్నా.. నువ్వు నా కోసం నీ భర్తను క్షమించలేవా అని అడుగుతాడు శివన్నారాయణ. క్షమిస్తాను కానీ, భర్తగా మాత్రం దగ్గరికి తీసుకోనని అంటుంది కాంచన.
నువ్వు జరిగింది మరిచిపోయి చాలా తేలికగా క్షమించావు.. కానీ అల్లుడు మోసం చేయడానికి , భర్ మోసం చేయడానికి చాలా తేడా ఉందని అంటుంది కాంచన. నువ్వు అల్లుడిని మనిషిలా చూశావు.. నేను నా భర్తని దైవంలా చూశానని చెబుతుంది. నాలో సగం అనుకున్నానని, నేనే తనలా బతికాను.. నువ్వు క్షమించినంత తేలికగా నేను క్షమించలేనని తేల్చేస్తుంది కాంచన. నువ్వు ఎవరితో కలిసొచ్చావని అడిగితే.. కార్తీక్ తండ్రితో కలిసొచ్చానని అంటుంది. కావేరికి నా భర్తను ఇచ్చేశానని చెబుతుంది కాంచన. తిరిగిరాని బాల్యం ఎలాంటిదో, నేను భర్తను ఇచ్చేయడం కూడా అలాంటిదే అంటుంది. నేను ఎప్పుడు ఆయనను క్షమించి దగ్గరికి తీసుకుంటానని తెలుసా అని చెబుతుండగా దాస్ వస్తాడు. కాంచన చెబుతున్న మాటలన్నీ వింటున్న శ్రీధర్, కార్తీక్‌లు షాక్ అవుతారు. దాస్ రావడం రెండు నిమిషాలు ఆలస్యమైతే కాంచన మనసు తెలిసేది అని అనుకుంటాడు పెద్దాయన.
ఎందుకు పనికిరాని ఆ కావేరి కాళ్లకు నా చేత్తో పసుపు రాయించారని రగిలిపోతుంది జ్యోత్స్న. నువ్వు ఆ పనిచేశావు కాబట్టే.. ఆ విషయం అక్కడితో వదిలేశారని అంటుంది పారు. ఆ స్వప్న, దీపలు గెలిచామన్న పొగరుతో వెలిగిపోతున్నారని చెబుతుంది. ఫంక్షన్‌కి దాస్ రావడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇంతలో గురువుగారు రావడంతో అందరూ నమస్కారం పెట్టుకుంటారు. ఇంట్లో ఉండకుండా దేశాలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావని దాస్‌ని అడుగుతుంది పారు. నువ్వు ఈ ఇంటి వారసురాలిని వెతికేపనిలోనే ఉన్నావా? అని అడుగుతుంది. నీ కూతురికి ద్రోహం చేస్తున్నావు, ఎక్కడుందో తెలియని దాని కోసం నీ కూతురికి పట్టిన అదృష్టాన్ని దూరం చేయొద్దని బతిమలాడుతుంది పారిజాతం.
హోమం మొదలయ్యాక కాశీ- స్వప్నలు గొడవపడుతూ ఉండటంతో వీరిద్దరి మధ్య ఏం జరిగిందోనన కార్తీక్‌కు డౌట్ వస్తుంది. హోమం ముగిసిందని మీ అమ్మాయి చేతుల మీదుగా పూర్ణాహుతి వేయాలని చెబుతాడు గురువుగారు. పూర్ణాహుతి కిందపడితే జరగబోయే నష్టాన్ని నేను మాటల్లో చెప్పలేనని అంటాడు. ఆ విపత్తు ఎదుర్కోవడం ఎవరి వల్లా కాదని అనడంతో అందరూ షాక్ అవుతారు. మీ ఇష్టాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయండి అని చెబుతాడు గురువుగారు. ఇంటి వారసురాలు హోమంలో పూర్ణాహుతి వేయాలట, నువ్వు విన్నావా? అని దీపని అడుగుతాడు కార్తీక్. అంతా విధి రాత అని, ఏం జరుగుతుందో చూద్దామని అంటుంది దీప.
ఈ ఇంటి వారసురాలు దీప.. దీప వేయకుండా నా కూతురు జ్యోత్స్న చేతుల మీదుగా పూర్ణాహుతి వేయడం ఈ ఇంటికి అరిష్టం కదా అని మనసులో అనుకుంటాడు దాసు. అన్ని తెలిసినా కూడా నేను ఆపకపోతే ఎలా అని బాధపడతాడు. దాసు దగ్గరికి వస్తుండగా జ్యోత్స్న చూసి నీ కొడుకుని ఆపమని పారుకు చెబుతుంది. దాంతో దాసుని బయటికి లాక్కెళ్తుంది పారిజాతం. గురువుగారు ఏం చెప్పారో విన్నావు కదా? ఈ ఇంటి వారసురాలు మాత్రమే హోమగుండలో పూర్ణాహుతి వేయాలి కదా అని అంటాడు దాసు. ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్నే అని పారు అనగా.. కాదమ్మా జరగబోయే అరిష్టాన్ని ఆపుతానని చెబుతాడు. ఎవరు ఎలా పోతే నీకేంటీ? నీ కూతురికి ఏం కాదు కదా అంటుంది పారు.
నువ్వే వెళ్లి పూర్ణాహుతి వేయడానికి వీళ్లేదని తేల్చేస్తాడు దాసు.. అసలైన వారసురాలు ఇక్కడే ఉంటే అది వేయకుండా, ఇది వేస్తోందని బాధపడొచ్చు, అక్కడ ఉన్నది నీ కూతురు అని చెబుతాడు. మనమంతా ఒకటే కుటుంబం మనకేం కాదు, బిడ్డల్ని మార్చింది నేనే అని బయటపడితే నన్ను బతకనిస్తారా? అని అంటుంది పారిజాతం. అలాంటి పరిస్ధితే వస్తే వాళ్ల కాళ్లు పట్టుకుని అయినా నేను నిన్ను కాపాడుకుంటాను, అంతేకానీ అన్నయ్య కుటుంబానికి అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనని అంటాడు దాసు. నిజం బయటపడే సమయం వచ్చిందేమో, ఈ కథకు ఇక్కడే శుభం కార్డ్ వేసేస్తాను, జ్యోత్స్న నా కూతురని అందరికీ చెప్పేస్తానని ఆవేశంగా లోపలికి వెళ్తాడు దాసు.
పూర్ణాహుతి వేయబోతుండగా సుమిత్ర కళ్లు తిరిగి పడిపోవడంతో దీప పట్టుకుంటుంది. దాంతో సుమిత్రను పట్టుకుని దీప నడిపిస్తుంది. ఏదో చెబుతానని వచ్చి ఆగిపోయావేంటీ అని అడుగుతుంది పారు. నేను చేయాలని అనుకున్నది దేవుడు చేశాడని చెబుతాడు. పూర్ణాహుతిని హోమంలో వేయమని గురువగారు చెప్పగా.. దాసు వంక జ్యోత్స్న చూస్తూ దానిని వదిలేస్తుండగా అది వెళ్లి దీప చేతుల మీదుగా హోమగుండంలో పడిపోతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










