Karthika Deepam 2 November 22nd: దీపపై గురువుగారి వ్యాఖ్యలు.. దీపను లేపేయాలని జ్యోత్స్న స్కెచ్
Photo Courtesy: JioHotstar
కార్తీక్ వార్నింగ్ ఇవ్వడంతో కావేరి కాళ్లకు పసుపు రాస్తుంది జ్యోత్స్న. మిగిలిన వారికి దీప పసుపు రాస్తుంది. తన తల్లి పాదాలకు పసుపు రాస్తూ దీప మురిసిపోతుంది. కాంచనను పక్కకి పిలిచిన శివన్నారాయణ కూతురి దగ్గర బాధపడతాడు. శ్రీధర్‌ను సీఈవో చేయడం వెనుక కంపెనీ బాధ్యతలతో పాటు నీ జీవితం కూడా ఒక కారణం అని చెబుతాడు. శ్రీధర్‌ను నేను క్షమించాను.. నువ్వు కూడా క్షమించు అని అడుగుతాడు శివన్నారాయణ. నేను నా భర్తని దైవంలా చూసుకున్నానని.. కానీ ఆయన నన్ను మోసం చేశారని బాధపడుతుంది కాంచన. నేను నా భర్తను ఎప్పుడు క్షమిస్తానంటే అని చెబుతుండగా దాస్ రావడంతో ఆమె సైలెంట్ అయిపోతుంది. ఈ మాటలన్నీ వింటున్న శ్రీధర్, కార్తీక్‌లు బాధపడతారు.
వారసురాలి చేతుల మీదుగానే హోమంలో పూర్ణాహుతి జరగాలని గురువుగారు చెప్పడంతో దాస్ రగిలిపోతాడు. జ్యోత్స్నే నా కూతురని చెబుతానని అనడంతో పారిజాతం వణికిపోతుంది. ఆవేశంగా హోమగుండం దగ్గరకి వస్తున్న దాస్‌ని చూసి జ్యోత్స్న టెన్షన్ పడుతూ పూర్ణాహుతిని వదిలేస్తుంది. అది వెళ్లి నేరుగా దీప చేతుల మీదుగా హోమంలో పడటంతో దాస్, కార్తీక్ సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 22వ తేదీ 522వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
హోమ గుండంలో దీప చేతుల మీదుగా పూర్ణాహుతి పడటంతో పారిజాతం మండిపడుతుంది. ముందు జరగాల్సిన కార్యక్రమం సంగతి చూడమని అంటాడు శివన్నారాయణ. తర్వాత సుమిత్ర- దశరథలు అందరికీ పండు తాంబూలాలు ఇచ్చి పంపించేస్తారు. బంధువులంతా వెళ్లాక దాస్ సంగతి చెబుతానని అనుకుంటుంది జ్యోత్స్న. మీరు చెప్పినట్లుగానే హోమాన్ని పూర్తి చేశారని గురువుగారితో శివన్నారాయణ చెబుతుండగా జ్యోత్స్న అడ్డుకుంటుంది. హోమం పూర్తి కాలేదని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. హోమంలో పూర్ణాహుతి చివరిగా వారసురాలి చేతుల మీదుగా హోమంలో పడాలన్నారు, ఎవరి చేతుల మీదుగా పడిందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఈ ఇంటి పనిమనిషి చేతుల మీదుగా పడిందని మండిపడుతుంది.
మమ్మల్ని హోమానికి రమ్మని ఎలా పిలిచారో? వచ్చిన మాకు తెలుసు? అని అంటాడు కార్తీక్. నా భార్య పూర్ణాహుతి కావాలని వేసిందా? నీ చేతుల్లో నుంచి జారిపోతుంటే అది కింద పడకుండా చేత్తో పట్టుకునే ప్రయత్నంలో హోమంలో పడిందా? అని నిలదీస్తాడు కార్తీక్. ఆవిడగారు పట్టుకుంటేనే కదా జారిపోవడానికి, ఈవిడ ఆలోచనలు ఇంకెక్కడో ఉంటాయి.. తప్పు జరగకుండా చూడాలనుకున్న వాళ్లను మాత్రం ఈవిడ తప్పుపడుతుందని మండిపడుతుంది. దాంతో నోరుమాయమంటూ పారిజాతం వార్నింగ్ ఇస్తుంది. నీక్కూడా శివన్నారాయణ గారి మనవరాలి మీద గొంతు ఎత్తేంత ధైర్యం వచ్చిందా? అని నిలదీస్తుంది.
నా భార్య అడిగిన దాంట్లో తప్పేముందుని కాశీ అడగ్గా.. వాడిని కూడా నోరుమూయమని అంటుంది పారిజాతం. కాశీ మీకు మనవడే అయ్యుండొచ్చు.. కానీ నా కూతురి భర్త, నా ముందు నా అల్లుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోనని మండిపడుతుంది కావేరి. నువ్వు తప్పు చేసి వాళ్లని అంటావేంటీ? అని ఫైర్ అవుతాడు దశరథ. అంటే నేను తప్పు చేస్తుంటే దీపొచ్చి వాటిని కరెక్ట్ చేస్తుందా అని అడుగుతుంది జ్యోత్స్న. అంటే నువ్వు కావాలనే తప్పు చేశావా అని నిలదీస్తాడు శివన్నారాయణ. పూర్ణాహుతి నీ చేతికి ఇస్తున్నప్పుడు దానిని జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత నీదే కదా అంటుంది సుమిత్ర. నువ్వు సాయం అడగకుండానే నిన్ను పట్టుకుంది.. నువ్వు నేను తల్లీకూతుళ్లం కానీ మన మధ్య దీప ఎప్పుడూ ఒక అడ్డుగోడగా ఉందని మండిపడుతుంది జ్యోత్స్న.
ఇక్కడ ఇంతమంది మాట్లాడుతుంటే దీప ఒక్క మాటైనా మాట్లాడిందా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. అవకాశం చూసి అధికారాన్ని అందిపుచ్చుకునే రకాలు వీళ్లని పారిజాతం అంటుంది. నువ్వెప్పుడు పరాయివాళ్లనే సపోర్ట్ చేస్తావని జ్యోత్స్న మండిపడుతుంది. ఇక్కడ పరాయివాళ్లంటూ ఎవరూ లేరని.. అందరూ నావాళ్లే, అందరూ నా కుటుంబ సభ్యులు.. నేను పిలిస్తే వచ్చారు, నా కోసమే వచ్చారని చెబుతాడు. లేని స్వతంత్రాన్ని తీసుకుని దీప పూర్ణాహుతిని హోమంలో వేసింది, అది మీ కంటికి కనిపించడం లేదా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. పూర్ణాహుతి కిందపడితే అరిష్టమన్నారు, మరి ఈ మనిషి చేతుల మీదుగా పడితే అరిష్టం కాదా అని ప్రశ్నిస్తుంది.
దానికి గురువుగారు కాదు అని సమాధానం చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దీప మా కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని మనిషి.. కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, కాంచనకు కోడలైంది లేదంటే అదొక అమ్మానాన్న తెలియని అనాథ అంటుంది పారిజాతం. భగవంతుడు ఎవ్వరినీ అనాథలుగా పుట్టించడు, అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలుగా మనుషులే చేస్తున్నారని, ఈ దీపకు కూడా అమ్మానాన్నలు ఎక్కడో ఉంటారని చెబుతాడు గురువుగారు. ఏదో ఒక రోజు ఆ భగవంతుడు అందరినీ కలుపుతాడని చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. పూర్ణాహుతి హోమంలో పడకుండా నేల మీద పడుంటే అరిష్టం జరిగేదని, అది జరగకుండా ఆపినందుకు దీపని మెచ్చుకోవాలని చెబుతాడు గురువుగారు. నువ్వేం చేసినా అందరిముందు నన్ను ఫూల్‌ని చేస్తావని దీపని కోపంతో తోసేస్తుంది జ్యోత్స్న.
దీప స్పృహ కోల్పోవడంతో లోపలికి తీసుకెళ్లి పడుకోబెడతారు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మకి ఏం జరిగిందని ఏడుస్తుంది. హోమం అయిపోయింది కదా అందిరికీ ప్రసాదం పెట్టమని స్వప్నకి సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. మీరందరూ బయటికి వెళ్లండి నేను చూసుకుంటానని చెబుతుంది సుమిత్ర. ఎప్పుడూ ఏదో ఒక పెంట చేస్తూ, అందరిచేత చీవాట్లు తింటున్నావని జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. పూర్ణాహుతి ఎవరి చేతుల మీదుగా పడితే నీకెంటీ బాధ అని అడగ్గా.. దీప చేతుల మీదుగా పడితే నేను ఊరుకోనని అంటుంది జ్యోత్స్న. కానీ ఆ దీపే ఈ ఇంటి వారసురాలు అని చెప్పబోతూ ఆగిపోతుంది. దీప నా శత్రువు.. దాని వల్ల నేను చాలా నష్టపోయాను, ఆ పూర్ణాహుతి నేల మీద పడినా నేను బాధపడే దానిని కాదని అంటుంది. చిన్న విషయాన్ని పెంట చేశావు.. అరిష్టం జరగకుండా దీప కాపాడినట్లు, అమాయకురాలైన దీప మీద విరుచుకుపడింది నువ్వని అందరూ అనుకుంటున్నారని మండిపడుతుంది పారిజాతం.
దీప ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నో కోల్పోయాను... చివరికి వారసురాలి స్థానాన్ని కూడా పోగొట్టుకుంటానని జ్యోత్స్న అనడంతో పారిజాతం షాక్ అవుతుంది. నువ్వు దాసు కూతురవని అందరికీ తెలియాలి, లేదా ఎక్కడో బతికున్న సుమిత్ర కూతురు రావాలని చెబుతుంది పారిజాతం. నీ కొడుకుని దీప బాబాయ్.. బాబాయ్ అని పిలుస్తుంది.. నీ కొడుకు నా గురించి దీపకి చెబితే, దీప ఇంట్లో చెప్పదా? అని కవర్ చేస్తుంది జ్యోత్స్న. దీప స్పృహలోకి వచ్చే వరకు ఎవరికీ కనిపించొద్దని జ్యోత్స్నకి సూచిస్తుంది పారు. అందరికీ ప్రసాదం పెట్టి .. కాశీకి పెట్టకుండా వెళ్లిపోతున్న స్వప్నని కాశీకి కూడా పెట్టమని చెబుతాడు కార్తీక్. దాంతో ఆమె తన భర్తకు ప్రసాదం పెట్టి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











