Karthika Deepam 2 December 4th: పెళ్లికి జ్యోత్స్న గ్రీన్ సిగ్నల్... దీపకి షాకిచ్చిన సుమిత్ర, దశరథ
Photo Courtesy: JioHotstar
కార్తీక్, దీపలు డ్యూటీ రాకపోవడంతో వాళ్లపై విసుక్కుంటుంది పారిజాతం. అది గమనించిన శివన్నారాయణ వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయడు. దాంతో కాంచనకి ఫోన్ చేస్తాడు. రాత్రి దీపకు కడుపులో నొప్పి రావడంతో వాళ్లిద్దరూ పడుకోలేదని చెబుతుంది కాంచన. ఆ మాట వినగానే భయపడ్డ శివన్నారాయణ.. వెంటనే సుమిత్ర, పారిజాతంలతో కలిసి డాక్టర్‌ను తీసుకుని కార్తీక్ ఇంటికి వస్తాడు. దీపని చెక్ చేసిన డాక్టర్.. మరోసారి ఇది రిపీట్ అయితే తల్లికి, బిడ్డకి చాలా కష్టమని వార్నింగ్ ఇస్తుంది. శౌర్యను నా దగ్గర పడుకోమంటే అది మీ దగ్గరకి వచ్చి ఇలా చేసిందని కాంచన మండిపడుతుంది.
శౌర్య మనసు ముక్కలు చేసి కార్తీక్‌కు ప్రశాంతత లేకుండా చేయాలని డిసైడ్ అయిన పారిజాతం.. శౌర్య దగ్గరకి వెళ్లి చెప్పుడు మాటలు చెబుతుంది. మీ నానమ్మ మారిపోయిందని, మీ అమ్మకి బిడ్డ పుట్టబోతోంది కదా? మీ నానమ్మ ప్రేమంతా ఆ బిడ్డ మీదే ఉందని అంటుంది. నిన్ను బాగా చూసుకోవాలంటే నువ్వు అన్నింటికి అల్లరి చేయాలి, మారాం చేయాలి, ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టాలని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో శౌర్య ఆలోచనలో పడుతుంది. కాంచన, శౌర్యలు నా బుట్టలో పడిపోయారు.. ఇక కార్తీక్‌కి నరకమే అని సంబరపడిపోతుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 4వ తేదీ 532వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీప ఇంటికి దశరథ, జ్యోత్సలు బయల్దేరతారు. కారు స్పీడుగా పోనిస్తున్న కూతురిపై దశరథ మండిపడతాడు. ఆ దీప అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని, అయినా ఎందుకు నన్ను తీసుకొస్తున్నారని రగిలిపోతుంది జ్యోత్స్న. దాంతో కారు ఆపిన దశరథ రెండు ఐస్‌క్రీమ్‌లు కొనుక్కుని జ్యోత్స్నకి ఇస్తాడు. మనిద్దరం కాసేపు తండ్రీ కూతుళ్లలాగా మాట్లాడుకుందామా? అని అడుగుతాడు దశరథ. నేను నీ కూతురినే కదా అని అంటుంది జ్యోత్స్న. నువ్వు నా కూతురివి కాదు, నా కూతురు వేరే ఉందని దశరథ అనడంతో జ్యోత్స్న షాక్‌లో ఉండిపోతుంది. నా కూతురు నాతో ఆడుకునేది, నాకు కథలు చెప్పేది, బయటకు వస్తే అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉండేది, నా కూతురంటే నాకు చాలా ఇష్టమని అంటాడు దశరథ.
నా కూతురు ఉన్నట్లుండి చాలా పెద్దగా మారిపోయింది, ఎవరో తన మనసులో విషం నింపారు, తన చేతల్ని చూసి ఇది నా కూతురేనా అనేంతలా మారిపోయింది అంటాడు దశరథ. ఇంట్లో అందరిమీదా కోపం, నీకు ఇది రాసి పెట్టిలేదు అని తెలిసికూడా దాని వెంటే పడతావు అని చెబుతాడు. నీ పనులన్నీ ఆపేయ్.. నువ్విలా అర్ధం లేకుండా పరిగెత్తుతూ ఉంటే ఎక్కడ పడిపోతావోనని భయంగా ఉందని అంటాడు దశరథ. మీ అమ్మ కూడ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందని చెబుతాడు. నా ఆశలేవీ నెరవేరలేదు కానీ.. మీ ఆశల్ని మాత్రం నిలబెడతానని అంటుంది జ్యోత్స్న. ఈ మాట నిజమైతే నువ్వు పెళ్లికి ఒప్పుకో... నీకు మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకోమని చెబుతాడు దశరథ.
మీరు కోరుకున్న భవిష్యత్తు నాకు పెళ్లితోనే దొరుకుతుందని అనుకుంటే నేను పెళ్లికి రెడీ అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో దశరథ సంబరబడిపోతాడు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని చెబుతుంది. ఈ విషయం మీ అమ్మకి చెబితే చాలా సంతోషిస్తుందని సుమిత్రకు కాల్ చేయబోగా... ఇప్పుడే వద్దు, ఈ విషయం మనింట్లో మాట్లాడుకుందామని అంటుంది జ్యోత్స్న. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిన అవసరం లేదని నేనే వెళ్లిపోతానని చెబుతుంది. నువ్వు వెళ్లిపోతే తాతయ్య బాధపడతాడని, మనం కాంచన ఇంటికి వెళ్దామని అంటాడు దశరథ.
శౌర్య కనిపించకపోవడంతో ఎక్కడ అని అడుగుతుంది దీప. నేనే దగ్గరుండి స్కూల్ బస్సు ఎక్కించానని చెబుతుంది పారిజాతం. ఇక ఇంటికి వెళ్దామని ఆమె అడగ్గా... వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదని చెబుతాడు శివన్నారాయణ. నాకు ఆరోగ్యం బాలేదు నిమ్మరసం తీసుకురమ్మని దీపకు చెబుతుంది సుమిత్ర. ఆమె మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కిచెన్‌లోకి వెళ్తుంది పారిజాతం. అందరం సరదాగా కలిశాం.. మీ నాన్న కూడ ఇక్కడే ఉంటే బాగుంటుందని కార్తీక్‌తో శివన్నారాయణ చెప్పగా కాంచన షాక్ అవుతుంది. శ్రీధర్ సీఈవోగా బాగా పనిచేస్తున్నాడు... రమ్మని ఫోన్ చేసి తనను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంటాడు శివన్నారాయణ. మనుషుల్ని క్షమించాలి, లేదంటే మానవత్వానికి అర్ధం లేదని అంటాడు. నన్ను, నా భర్తని ఎందుకు కలపాలని అనుకుంటున్నావని సీరియస్ అవుతుంది కాంచన.
నువ్వు ఒక పెళ్లి చేస్తే, మా ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. మోసానికి మించిన దారుణం కూడా ఉండదని అంటుంది. నేను ప్రాణాలతో ఉన్నన్ని రోజులు ఈ దూరం తప్పదని చెబుతుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, శివన్నారాయణ షాక్ అవుతారు. నా కోడలు తల్లి కావడంతో నేను చాలా సంతోషంగా ఉన్నానని, మీరంతా నా జీవితమేనని అంటుంది కాంచన. నువ్వు భర్తతో ఉండాలని నేను కోరుకుంటున్నాను, నీ తండ్రిగా నిన్ను శాసిస్తున్నాను.. నువ్వు శ్రీధర్‌ను క్షమించడమే కాదు, అంగీకరించాలి ని తేల్చిచెబుతాడు శివన్నారాయణ. లోకానికి నోరు మాత్రమే ఉంది, మనసు ఉండదు.. నువ్వు సరేనంటే వెంటనే శ్రీధర్‌ని రమ్మని చెబుతానని అంటాడు. శ్రీధర్‌కి కాల్ చేయమని కార్తీక్‌కి చెప్పగా... కాంచన ఆపుతుంది.
కూతురిగా నేను ఏం అడిగినా ఇస్తావా? అని కాంచన అంటుంది. నువ్వు ఏం అడిగినా ఇస్తానని చెబుతాడు శివన్నారాయణ. అయితే నన్ను లేపి నా కాళ్ల మీద నిలబెట్టమని అంటుంది కాంచన. ఆ మాటలతో శివన్నారాయణ, కార్తీక్ షాక్ అవుతారు. ఫారిన్ డాక్టర్లు కూడా నా కాళ్లు పనిచేయవని తేల్చేశారని కాంచన చెప్పడంతో శివన్నారాయణ కంటతడి పెట్టుకుంటాడు. నేను క్షమించానని తెలిస్తే నా భర్త వచ్చేస్తాడు.. గుమ్మంలోకి వచ్చిన భర్తకి ఈ కాళ్లతో నడుచుకుంటూ ఎదురెళ్లి స్వాగతం చెప్పాలని అనుకుంటున్నానని నా కోరిక తీర్చమని కాంచన అనడంతో శివన్నారాయణ వెక్కి వెక్కి ఏడుస్తాడు. దాంతో తాతని కార్తీక్ ఓదారుస్తాడు.
జీవితంలో రాని కాళ్లకి, జీవితంలో నుంచి వెళ్లిపోయిన భర్తకి ముడిపెడతావా? అని బాధపడతాడు శివన్నారాయణ. యాక్సిడెంట్ జరిగినట్లే ఒక మోసం జరిగిందని, భర్త మీద ఆశలు వదిలేసుకున్నానని అంటుంది కాంచన. నా జీవితం సగం కాలిపోయిన పూలతోట లాంటిదని చెబుతుంది. నా మనసులోని మంటల్ని నువ్వు ఏ నీళ్లతోనూ ఆర్పలేవని అంటుంది కాంచన. ఇంతలో అక్కడికి జ్యోత్స్న, దశరథలు పిండి వంటలు, ఫ్రూట్స్ తీసుకుని వస్తారు. వాళ్లని చూడగానే పారిజాతం, కాంచన షాక్ అవుతుంది. దీపని కూతురిగా అనుకుని మేమిద్దరం కాళ్లు కడిగి కన్యాదానం చేశాం, ఇప్పుడు దీప మా ఇంటి బిడ్డ అని అంటాడు దశరథ. ఆడపిల్ల తల్లయితే పుట్టింటి నుంచి కానుకలు ఇవ్వడం, సారె తీసుకురావడం ఆనవాయితీ అని చెబుతాడు.
నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని జ్యోత్స్నని అడుగుతుంది పారిజాతం. జరిగేది నువ్వు చూడు మనం తర్వాత మాట్లాడుకుందామని అంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత దీపకి బొట్టు పెట్టి దంపతులిద్దరినీ ఆశీర్వదిస్తారు దశరథ, సుమిత్ర. రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదని దశరథ చెప్పడంతో దీప, కార్తీక్, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











