Karthika Deepam 2 December 5th: శివన్నారాయణ ఫ్యామిలీకి షాకిచ్చిన దీప... కోడలిని కడిగిపారేసిన కాంచన
Photo Courtesy: JioHotstar
జ్యోత్స్నని దశరథ తన కారులో దీప ఇంటికి తీసుకెళ్తుండగా నేను రానని మొండిపట్టు పడుతుంది. దాంతో దశరథ కారు దిగి కూతురికి ఐస్‌క్రీమ్ తినిపించి.. నా కూతురు ఒకప్పుడు ఎంతో సరదాగా, అల్లరి చేసేదని ఇప్పుడు ఆమె మనసు నిండా స్వార్ధం నిండిపోయిందని చెబుతాడు. పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుందని దశరథ చెప్పడంతో పెళ్లికి జ్యోత్స్న గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో దశరథ ఎంతో సంతోషిస్తాడు. శ్రీధర్‌ను క్షమించమని కాంచనను కోరగా.. నా ప్రాణాలు పోయే వరకు ఆయన చేసిన మోసాన్ని మరిచిపోనని కాంచన అంటుంది. ఆ మాటలతో శివన్నారాయణ కంటతడి పెడతాడు.
ఇంతలో జ్యోత్స్న, దశరథలు కార్తీక్ ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. దీప నా కూతురని ఆమెకు పుట్టింటి తరపున సారె తీసుకొచ్చామని దశరథ, సుమిత్రలు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు. అలాగే రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రానక్కర్లేదని సుమిత్ర చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నువ్వు ఈ ఇంటికి వచ్చావేంటీ? అని జ్యోత్స్నని పారిజాతం అడగ్గా.. జరగబోయేది చూడమని తన నానమ్మకి చెబుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 5వ తేదీ 533వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రేపటి నుంచి నువ్వు మా ఇంటికి రానక్కర్లేదని దీపతో సుమిత్ర చెబుతుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న నువ్వేం మాట్లాడవేంటీ? అని పారిజాతంను అడుగుతుంది. నేను మాట్లాడను, నువ్వు కూడా ఏం మాట్లాడొద్దు అని అంటుంది పారిజాతం. నీకు కాన్పు వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉండాలన్నది నా కోరిక అని కాంచన కూడా అంటుంది. నీకు రెస్ట్ అవసరం అని డాక్టర్ గారు చెప్పారు.. నువ్వు హాయిగా ఇంట్లోనే ఉండమని చెబుతాడు శివన్నారాయణ. నీ మందుల ఖర్చు నుంచి భోజనాల వరకు అన్నీ నేనే చూసుకుంటాను, అవసరమైతే నీ పనులు చేయడానికి ఒక పనిమనిషిని కూడా పెడతానని చెబుతాడు.
దీప కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలంటే ఆమె మనింటికి రావాల్సిందేనని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. నిన్ను చూసుకోవడానికి నీ మేనత్త ఉంది, మేం ఎవరో ఒకరం వస్తూనే ఉంటామని దశరథ చెబుతాడు. ఇదంతా ఎందుకు దీపే మనింటికి వస్తే సరిపోతుంది కదా అని అంటుంది పారిజాతం. ఆ మాటలతో శివన్నారాయణ మండిపడతాడు. దీప జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు నీ ముందే చెప్పింది కదా అని అంటాడు. మరి పెద్ద మేడం గారు ఏమంటారోనని జ్యోత్స్నని ప్రశ్నిస్తాడు కార్తీక్. కార్పోరేట్ ఆఫీసుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు.. ఇది కూడా మెటర్నీటీ లీవే అని చెబుతాడు దశరథ. బిడ్డ పుట్టి వాడికొక సంవత్సరం వచ్చే వరకు దీప మనింటికి రానక్కర్లేదని అంటాడు.
నేను సెలవు తీసుకోనని దీప చెప్పడంతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నీ గురించి మేమంతా బాధపడుతుంటే నువ్వు అలా మాట్లాడతావేంటీ? అని ప్రశ్నిస్తాడు. నీ ఇష్టమే నా ఇష్టం .. ఇక్కడున్న వాళ్లంతా నీ మంచే కోరుకుంటున్నారు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో బాగా ఆలోచించు అని చెబుతాడు కార్తీక్. ఆఫీసులో తనను మావయ్య గారు అని పిలవొద్దని కాశీకి వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్. కంపెనీకి కొన్ని పద్ధతులు ఉంటాయి... నచ్చినా, నచ్చకపోయినా వాటిని పాటించాల్సిందేనని అంటాడు. ఈ జాబ్ నీకు నచ్చకపోతే మానేయొచ్చని చెబుతాడు శ్రీధర్. దాంతో స్వప్న మాటలు గుర్తొచ్చి కంపెనీలో మీకు పీఏగానే ఉంటానని అంటాడు కాశీ. మీటింగ్స్ సరిగా ప్లాన్ చేయకపోవడంతో అల్లుడిపై కోప్పడతాడు శ్రీధర్. ఫస్ట్ డే నే ఇలా ఉందంటే ముందు ముందు నా పరిస్ధితి దారుణంగా ఉంటుందని భయపడతాడు కాశీ.
దీప ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనసూయ మండిపడుతుంది. ఆ దేవుడు నీకు కన్నవాళ్లని దూరం చేశాడు.. పెంచిన వాళ్లని దూరం చేశాడు, నీ మీద జాలిపడి ఇంత పెద్ద కుటుంబాన్ని బంధువులుగా నీకిచ్చాడని చెబుతుంది. నువ్వు నెల తప్పితే వాళ్లింటి బిడ్డలా సంబరపడిపోతున్నారు, నీకు కష్టమొస్తే వాళ్లు బాధపడిపోతున్నారు. నీ కడుపులో నొప్పి వస్తే మేమంతా బాధపడిపోతున్నామని చెబుతుంది అనసూయ. మా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని దీప చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీరేమో దీపను లీవ్ తీసుకోమంటుంటే, ఇదే అదనుగా తీసుకుని బావని కూడా మనింటికి రావొద్దని చెప్పేలా చేస్తోందని అంటుంది జ్యోత్స్న. మా బావ మీఇంటికి వస్తాడు, నేను మీ ఇంటికి వస్తానని దీప చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
అగ్రిమెంట్ మాత్రం క్యాన్సిల్ చేయనని జ్యోత్స్న చెప్పగా.. చేయమని కూడా అడగనని చెబుతుంది దీప. మీ బావ మా ఇంట్లో ఉండిపోడని, మీ ఇద్దరిని దూరం చేసినట్లు మాట్లాడొద్దని మండిపడుతుంది సుమిత్ర. మీరేం చెప్పినా సరే దీప వినదని పారిజాతం అంటుంది. కార్తీక్ రాకపోతే నీకు ఓకేనా అని అడుగుతాడు శివన్నారాయణ. దాంతో కార్తీక్‌ని మా ఇంటికి రావొద్దని చెబుతాడు పెద్దాయన. నువ్వు నాకు రాసిన అగ్రిమెంట్ ప్రకారం.. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఆగిపోవడానికి కుదరదని తేల్చిచెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నీకు డ్రైవర్ కావాలంటే వేరే మనిషిని మాట్లాడతానని చెబుతాడు శివన్నారాయణ. అవసరం లేదు .. నేను మీ ఇంటికి వస్తానని చెబుతాడు కార్తీక్. మా బావతో పాటే నేను కూడా వస్తానని దీప చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దీపని తన ఇష్టప్రకారమే చేయనివ్వండి.. బాగా ఇబ్బంది అయితే అప్పుడు చూసుకుందామని అంటుంది పారిజాతం. దాంతో చేసేదేం లేక శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు వెళ్లిపోతారు. పుట్టబోయే బిడ్డ మీద నువ్వు పెట్టుకున్న ఆశలు నీ కోడలు పెట్టుకోలేదని కాంచనకు నూరిపోస్తుంది పారిజాతం.
అందరూ వెళ్లిపోయాక దీప, కార్తీక్‌లపై సీరియస్ అవుతుంది కాంచన. దీప ఏం చెబితే దానికి తలాడిస్తావా? దీప నువ్వు వెళ్లొద్దు అంటే నీ మాట నీ పెళ్లాం వినదా అని మండిపడుతుంది. నీకు అహంకారం, మనుషులంటే లెక్కలేనితనమని దీపపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాంచన. పెద్దవాళ్లంతా నీ గురించి, నీ బిడ్డ గురించి ఆలోచించి ఇంట్లో ఉండమని చెబితే ఆలోచించవా అని సీరియస్ అవుతుంది. నువ్వొక స్వార్ధపరురాలివి... నీకొక బిడ్డ ఉంది కాబట్టి.. ఈ బిడ్డ ఉంటే ఎంత? పోతే ఎంత? అనుకుంటున్నావని కాంచన అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. కాంచన మాటలని అనసూయ కూడా సమర్ధిస్తుంది. మా అమ్మ నా మనవరాలి రూపంలో మళ్లీ నా ఇంట్లోనే పుడుతుందని నేను ఆశపడ్డాను, దీప నాకు ఆ ఆశలు కూడా మిగల్చడం లేదని మండిపడుతుంది కాంచన. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా ప్రాణమని చెప్పడంతో దీప, కార్తీక్‌లు బాధపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











