Karthika Deepam 2 December 8th: అత్తగారిని ఒప్పించిన దీప.. శ్రీధర్‌ను కాంచన దగ్గరికి వెళ్లిపోమన్న కావేరి
Photo Courtesy: JioHotstar
మా నాన్న ఇంటికి వెళ్లొద్దని నేను చెప్పాను కదా? దాని గురించి మీరిద్దరూ ఏం ఆలోచించారని దీప, కార్తీక్‌లను నిలదీస్తుంది కాంచన. నువ్వు నీ కూతురికి చెప్పుకోలేవు.. పెళ్లానికి చెప్పుకోలేవని కార్తీక్‌ని కసురుకుంటుంది. నా చెల్లెలు, ఆ పెద్దాయన కుటుంబం ఎందుకు చెబుతున్నారో ఆలోచించమని దీపకి చెబుతుంది అనసూయ. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడంతో శివన్నారాయణ ఫ్యామిలీ సంతోషిస్తుంది. మీ అందరికీ నేను అడ్డుగా ఉన్నాను.. నన్ను ఎలా బయటికి పంపాలో తెలియక పెళ్లి పేరుతో గెంటేస్తున్నారని ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది జ్యోత్స్న. కాంచన అత్తయ్య ఈ ఇంటి ఆడపడుచు.. ఆమె కోసం ఏం చేసినా నేను అడ్డురాను. కానీ ఆ దీప కోసం ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అవుతుంది జ్యోత్స్న.
దీప కడుపులోని బిడ్డపై కాంచనకి ఓ నమ్మకం ఉంది.. నా కూతురి కోడలి కోసం నేను ఏమైనా చేస్తానని కరాఖండీగా చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న జీవితం గురించి ఆలోచిస్తూ సుమిత్ర, దశరథలు బాధపడతారు. కార్తీక్‌కి అర్ధం చేసుకునే భార్య దొరికిందని.. వాడు ఉన్నంత వరకు మన రెండు కుటుంబాలకు ఏం కాదని సుమిత్రకు ధైర్యం చెబుతాడు దశరథ. ఇంతలో సుమిత్రకు కళ్లు తిరిగినట్లుగా ఉండటంతో దశరథ ఆసుపత్రికి వెళ్దామని అడుగుతాడు. శౌర్యను నానమ్మ దగ్గర పడుకోమని చెప్పడంతో కార్తీక్‌పై కోప్పడుతుంది చిన్నారి. అంతా జో గ్రానీ చెప్పినట్లుగానే జరుగుతుందని శౌర్య నోరుజారడంతో తన కుటుంబంలో చెప్పుడు మాటలతో చిచ్చుపెట్టాలని పారు ట్రై చేసిందని కార్తీక్‌కి అర్ధమవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 8వ తేదీ 535వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తన మాట వినిపించుకోకపోడంతో దీపపై రగిలిపోతుంది కాంచన. ఆమె ఎంత మాట్లాడాలని అనుకున్నా కాంచన వినిపించుకోదు. నా బిడ్డపై నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నానని చెబుతుంది దీప. ఆశలు ఎవరైనా పెట్టుకుంటారు, నిలబెట్టుకోవాలని అంటుంది కాంచన. నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అని దీప మాటిస్తుంది. కానీ నేను శివన్నారాయణ గారింటికి వెళ్లాల్సిందేనని తేల్చిచెబుతుంది దీప. ఆ మాటలతో కాంచన, అనసూయలు షాక్ అవుతారు. మాట నిలబెట్టుకుంటానంటే మారిపోయావని అనుకున్నాను, అయినా అది నీ పుట్టినిల్లు కాదు, నిన్ను పనిమనిషిని చేసిన ఇల్లు అని ఫైర్ అవుతుంది కాంచన. అక్కడ నీకు కొందరి వల్ల ఏమైనా జరగొచ్చని భయపడుతుంది.
నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఈ అవిటి దానికి ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందని అనుకుంటున్నావా? అని కాంచన అనడంతో దీప బాధపడుతుంది. ఎవరి సాయం లేకుండా నా పనులు నేను చేసుకోగలను, నీతో సేవలు చేయించుకునేంత దౌర్భాగ్యం నాకు పట్టలేదని అంటుంది కాంచన. మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, మీ కళ్లముందే నీ కొడుకు నా మెడలో తాళికడితే మీరు నన్ను కోడలిగా ఆదరించారని బాధపడుతుంది దీప. నా కూతురిని సొంత మనవరాలిగా చూసుకుంటున్నారని, అలాంటి మీకు సేవలు చేసే అవకాశం రావడం నా అదృష్టమని అంటుంది. నేను శివన్నారాయణ గారింటికి వెళ్లడానికి కారణం ఉందని చెబుతుంది దీప. ఆ కారణం ఏంటని కాంచన నిలదీస్తుంది. అది ఇప్పుడు చెప్పలేమని చెప్పేరోజు వస్తుందని.. ఆ రోజు మీ కోడలు ఇదంతా ఎందుకు చేస్తుందో అర్ధమవుతుందని అంటుంది దీప.
కడుపుతో ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది.. నేను సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటికి వెళ్లనివ్వండని ప్రాధేయపడుతుంది దీప. నా కడుపులోని బిడ్డను ప్రాణాలు అడ్డేసి అయినా కాపాడుకుంటాను, మీ చేతుల్లో బిడ్డను పెట్టి మాట నిలబెట్టుకుంటానని చెబుతుంది దీప. నా కొడుకు, నువ్వు ఆ ఇంటికి వెళ్లడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు.. అప్పుడు కొడుకుని నమ్మాను, ఇప్పుడు కోడల్ని నమ్మి వదిలేస్తున్నానని చెబుతుంది కాంచన. దాంతో దీప సంతోషిస్తుంది. నేనే మొండిదానిని అనుకుంటే ఇది నన్ను మించిన మొండిదని అనసూయతో అంటుంది కాంచన. అత్తాకోడళ్లు కలిసిపోవడంతో అనసూయ సంతోషిస్తుంది. దీప వాళ్లింటికి వెళ్లడం మా అన్నయ్యకి, వదినకి, నాన్నకి ఇష్టం లేదు.. నా భర్తకి కూడా అని చెప్పబోతూ ఆగిపోతుంది కాంచన.
ఫోన్‌లో కాంచన ఫోటో చూస్తూ శ్రీధర్ బాధపడుతుండటంతో కావేరి షాక్ అవుతుంది. మీరు కాంచన అక్క దగ్గరికి వెళ్లిపోతారా అని కావేరి అడగటంతో శ్రీధర్ ఉలిక్కిపడతాడు. వాళ్లని నేను ఏ రోజు మరిచిపోలేదని శ్రీధర్ చెప్పగా.. కానీ మీరు నన్ను మరిచిపోయారని కావేరి చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. గత కొద్దిరోజుల నుంచి మీరు ఇంట్లో పడుకోవడం లేదని.. ఇప్పుడు కూడా కాంచన అక్క ఫోటో చూస్తూ బాధపడుతున్నారని చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కతో ఫోన్‌లో మాట్లాడుతూ ఏడ్చారు.. నేను ఇదంతా చూస్తున్నాను, కానీ ఇప్పుడు అడగక తప్పడం లేదని అంటుంది కావేరి. నేను ఎవరితోనూ బంధాన్ని వదులుకోలేనని చెబుతాడు శ్రీధర్. అక్క ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి కదా అని చెబుతుంది కావేరి.
నాకు కాంచన, నువ్వు ఇద్దరూ కావాలి.. స్వప్న నా బిడ్డే, కార్తీక్ కూడా నా బిడ్డే.. ఒక్క దీప మీద తప్పించి ఎవ్వరి మీదా ద్వేషం లేదని చెబుతాడు శ్రీధర్. నా కొడుకు డ్రైవర్‌గా బతకడానికి కారణం దీపేనని అంటాడు. కార్తీక్ వారసత్వాన్ని దీప కడుపులో మోస్తోందని కావేరి అనగా.. అందుకే ఆవిడగారిని జాగ్రత్తగా ఉండమని చెప్పానని అంటాడు శ్రీధర్. కార్తీక్ విషయంలో దీపను నేను ఎలా క్షమించలేనో.. కాంచన కూడా నన్ను నీ విషయంలో క్షమించదని తేల్చేస్తాడు. అలాగని నేను బాధపడటం మానలేని.. ఫోటోలు చూస్తాను, ఫోన్‌లో ఏడుస్తానని అంటాడు శ్రీధర్. ఏం జరిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను.. ఇప్పటికే ఒక ఆడదానిని ఏడిపిస్తున్నాను, మరో ఆడదానిని ఏడిపించలేను చెబుతాడు.
నా వల్ల నీకు దెబ్బ తగిలిందని దీపకు సారీ చెబుతుంది శౌర్య. ఈరోజు నుంచి నేను నానమ్మ దగ్గరే పడుకుంటానని దీప కడుపుపై ముద్దుపెడుతుంది. దీపని అర్ధం చేసుకున్నందుకు తల్లికి థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. దీప ఇచ్చిన మాట మీద నాకు నమ్మకం ఉందని.. కానీ రాంగ్ రూట్‌లో వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అంటుంది కాంచన. మనమంటే పడనివారి చేష్టలు మనకి యాక్సిడెంట్ చేస్తాయని వార్నింగ్ ఇస్తుంది కాంచన. నీ కోడలి మాట నిలబెట్టే బాధ్యత నాదని కార్తీక్ కూడా మాట ఇస్తాడు.
మీ అమ్మనాన్నలని రోజూ చూసుకోవచ్చని నువ్వు ఆశపడుతున్నావని దీపతో అంటాడు కార్తీక్. కానీ మా అమ్మ భయం నీ బిడ్డ గురించేనని చెబుతాడు కార్తీక్. నువ్వు ఉండగా నాకు, నా బిడ్డకు ఏం కాదని దీప అంటుంది. నా మెడలో ఈ తాళి నా ఇష్టంతో పడలేదని, మనిద్దరం పెళ్లి చేసుకుంటామని తాళి కట్టే ముందు క్షణం వరకు మనకే తెలియదని చెబుతుంది. నా కడుపులో వాళ్ల అమ్మ పుట్టబోతుందని అత్తయ్య నమ్ముతున్నారని.. ఒకేసారి అత్తకి, తాతయ్యకి అమ్మమ్మ ఎందుకు కలలోకి వచ్చిందని ప్రశ్నిస్తుంది దీప. పారిజాతం గారు, జ్యోత్స్నే కాదు వాళ్ల కుటుంబంలో చనిపోయిన వాళ్లంతా తిరిగొచ్చినా మన బిడ్డ పాదాలు నేలకు తాకకుండా ఆపలేరని అంటుంది దీప. అక్కడి దాకా వస్తే నాలోని అమ్మ.. అదిశక్తి అవతారం ఎత్తుతుందని చెబుతుంది. నువ్వు, మా అమ్మ.. మీ ఇద్దరే నా బలం, మీ ఇద్దరే నా బలహీనత అని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











