Karthika Deepam 2 December 23rd: అకౌంట్స్ మాయం చేసిన కాశీ.. కార్తీక్, శివన్నారాయణలకు మరో భారీ షాక్
Photo Courtesy: JioHotstar
శ్రీధర్ అరెస్ట్ అయిన వీడియోను కాంచనకు పంపిస్తుంది పారిజాతం. నా భర్త పరువు తీయాలని మీ ఫ్యామిలీ అంతా డిసైడ్ అయ్యిందా? నువ్వు, నీ భర్త, నీ కొడుకు, నీ కోడలు మాట తప్పడమే పనిగా పెట్టుకున్నారా అని నానామాటలు అంటుంది పారిజాతం. ఆమె అన్న మాటలకు కాంచన కంటతడి పెడుతుంది. కిచెన్‌లో వంట చేసుకుంటున్న దీపని కూడా వదలకుండా పారిజాతం, జ్యోత్స్నలు మాటలతో వేధిస్తారు. వైరాకి జ్యోత్స్న కాల్ చేసి థ్యాంక్స్ చెబుతుంది. నేను సీఈవో అయిన వెంటనే నా కంపెనీలో 50 శాతం షేర్స్ మీకే ఇస్తానని అంటుంది. నేను సీఈవో అయ్యాకా.. ఆ వైరా గాడిని, కాశీ గాడిని విసిరి పారేస్తానని అనుకుంటుంది.
పోలీస్ స్టేషన్‌లో ఉన్న శ్రీధర్ దగ్గరికి కార్తీక్, శివన్నారాయణలు విడిపించడానికి వెళ్తారు. అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని, హాస్పటల్‌లో కొందరు చావుబతుకుల్లో ఉన్నారని చెబుతాడు ఎస్ఐ. అలాగే శ్రీధర్‌తో మాట్లాడిన మాటల తాలూకా ఆడియో క్లిప్‌ను కాశీ ఇవ్వడంతో కార్తీక్, శివన్నారాయణలు షాక్ అవుతారు. కాశీని ఏమి అనొద్దని కార్తీక్‌తో చెబుతాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి డిసెంబర్ 23వ తేదీ 548వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను దొరికిపోతానేమోనని చాలా భయంగా ఉందని వైరాకి కాల్ చేసి చెబుతాడు కాశీ. శ్రీధర్ మా మామగారు, కార్తీక్ మా బావ అని కాశీ చెప్పడంతో వైరా షాక్ అవుతాడు. సొంత అల్లుడితో గొడ్డు చాకిరి చేయించిన శ్రీధర్ అరెస్ట్ కావడంలో ఎలాంటి తప్పులేదని, నువ్వు మంచి పని చేశావని కాశీని రెచ్చగొడతాడు వైరా. నీలాంటి టాలెంటెడ్ పర్సన్‌కి, జీనియస్‌ని కాళ్ల కింద చెప్పులా పెట్టుకోవడం క్షమించరాని నేరం, దానికి నువ్వు ఈ రకంగా ప్రతీకారం తీర్చుకున్నావని అంటాడు వైరా. అయినప్పటికీ నాకు చాలా భయంగా ఉందని కాశీ అనడంతో కల్తీ ఫుడ్ తిన్నవాళ్లు ఎవరైనా చనిపోయారా? పోనీ నీ పేరు చెప్పారా? అని అడుగుతాడు వైరా. ఈ దెబ్బతో మీ మామగారికి సీఈవో పోస్ట్ పోతుందని అంటాడు.
ఈరోజు కాకపోతే రేపు బెయిల్ వస్తుంది.. నువ్వు నా పేరు చెప్పొద్దు, నువ్వు బయటపడొద్దు.. ఏం జరిగినా నష్టం నీకేనని వైరా వార్నింగ్ ఇవ్వడంతో కాశీ సైలెంట్ అవుతాడు. నా సంగతి తర్వాత నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు.. మీ బావతో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తాడు వైరా. రేపటి నుంచి నువ్వు నా కంపెనీలో జనరల్ మేనేజర్‌వి, రెండ్రోజుల్లో మీ మామగారు వస్తారని చెబుతాడు. ఇదంతా కాదు నన్ను పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మంటావా అని వైరా అడుగుతుండగా కార్తీక్ వెనుక నుంచి పట్టుకోవడంతో కాశీ షాక్ అవుతాడు. ఫోన్‌లో ఎవరు? అని కార్తీక్ అడగ్గా.. ఫ్రెండ్ అని అంటాడు. ఆ విషయం చెప్పడానికి ఎందుకంత చెమటలు పడుతున్నాయని ప్రశ్నిస్తాడు.
మా నాన్న మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాశీని నిలదీస్తాడు కార్తీక్. నా మొబైల్‌లో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఉందని కాశీ చెప్పగా.. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడావో వాళ్ల కాల్ రికార్డింగ్ వినిపించమని కార్తీక్ చెప్పడంతో కాశీకి చెమటలు పడతాయి. ఆ యాప్ డిలీట్ చేశానని కాశీ చెప్పగా.. కేవలం మా నాన్న కాల్స్‌ని మాత్రమే రికార్డ్ చేయడానికి వాడావా? అని అడుగుతాడు కార్తీక్. నువ్వు వచ్చిన వాంగ్మూలం వల్లే మా నాన్నకి బెయిల్ రాలేదని మండిపడతాడు. కొడుకు దూరంగా ఉండటంతో అల్లుడిని మా నాన్న పక్కనే పెట్టుకున్నాడు. కొడుకు దూరంగా ఉన్నా నీలో నన్ను చూసుకున్నాడని అంటాడు కార్తీక్. నేను ఏ తప్పు చేయలేదని కాశీ పదే పదే చెబుతాడు. అలాగే నేను జాబ్‌కి రిజైన్ చేశానని కాశీ చెప్పడంతో కార్తీక్, శివన్నారాయణలు షాక్ అవుతారు. ఎక్కడపడితే అక్కడ రాజీనామా లెటర్ ఇవ్వకూడదని ఆఫీసులో ఇవ్వమని చెబుతాడు శివన్నారాయణ.
శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలియగానే కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది కాంచన. నాన్న తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా? కల్తీ భోజనం పెట్టేంత దుర్మార్గుడా అని కార్తీక్ అడగ్గా.. అదంతా నిజం కాదని, ఆయన అలాంటి మనిషి కాదని అంటుంది కాంచన. నాన్న నిర్దోషిగా బయటకు వస్తాడని చెబుతాడు కార్తీక్. ఏం చేయాలి? నాన్నని ఎలా బయటకు తీసుకురావాలని కార్తీక్ ఆలోచిస్తుంటాడు. నా రాజీనామా ఇవ్వడానికి ఆఫీస్‌కి వచ్చానని జ్యోత్స్నకి చెబుతాడు కాశీ. మావయ్య గారు ఇలా ఇరుక్కుంటారని అనుకోలేదని అంటాడు. పోలీసులు నిన్ను ఏమైనా అరెస్ట్ చేశారా? వైరా గారు చూసుకుంటారు అని చెబుతుంది జ్యోత్స్న. మీ బావని సీఈవో పోస్ట్ నుంచి తీయించడానికి నేనే కారణమని నా మీద ఎప్పటి నుంచో పగ పెంచుకున్నాడు.. అవకాశం దొరకగానే మీ మామగారిని సీఈవో చేశాడని అంటుంది జ్యోత్స్న. నువ్వు తప్పుకో అంటే తప్పుకుంటాను కదా అని చెబుతుంది.
నిన్ను మీ మామగారు అర్ధం చేసుకోలేదు.. నన్ను మీ బావ అర్ధం చేసుకోలేదు. నువ్వు బాగుండాలి.. పీఏగా రిజైన్ చేసి హ్యాపీగా జీఎం పోస్ట్ చేసుకోమని చెబుతుంది జ్యోత్స్న. ఈ కేసు వల్ల భవిష్యత్తులో నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా అని అడుగుతాడు కాశీ. నీకు ఏం కాదు... ఈ అక్క నీ కోసం ఏమైనా చేస్తుందని అంటుంది. మరి ఈ తమ్ముడు కూడా నీకోసం ఏమైనా చేయాలి కదా అని చెబుతాడు. నువ్వు తప్పు చేసినట్లుగా ఉన్న అకౌంట్ ఫైల్స్ అన్ని నీకు ఇచ్చేస్తానని అనడంతో జ్యోత్స్న సంబరపడిపోతుంది. నేను తప్పు చేసినట్లు లెక్కలు తీయాలనుకున్న మీ నాన్న పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు, నేను తప్పు చేసినట్లుగా ఉన్న ఆధారాలన్నీ నా అండర్‌లో ఉన్నాయి.. ఎవరు గెలిచారు అంటూ జ్యోత్స్న అనుకుంటుంది. నీ చెల్లెలి మొగుడిని అడ్డుపెట్టుకుని నీకు, నీ పెళ్లానికి నరకం చూపిస్తానని అనుకుంటుంది.
కార్తీక్, శివన్నారాయణలు ఒంటరిగా రావడంతో మావయ్య గారి పరిస్థితి ఏంటీ అని దీప అడుగుతుంది. కార్తీక్ మాత్రం ఒంటరిగా బాధపడుతుంటాడు. అత్తయ్య, మావయ్య వచ్చారా అని అడుగుతాడు కార్తీక్. మీ అమ్మ ఆసుపత్రిలో, మా నాన్న పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. మా నాన్నకి బెయిల్ కూడా ఇవ్వను అన్నారని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. ఫుడ్ కల్తీ జరిగింది? ఆ తిన్నవాళ్లు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు కేసు పెట్టారని చెబుతాడు కార్తీక్. ఎవరో చెప్పినట్లు పోలీసులు నేరుగా మా నాన్న దగ్గరికి వెళ్లారు.. కానీ పోలీసులు రావాల్సింది ఛైర్మన్ దగ్గరికి అని అంటాడు. అది ఇష్టం లేని నాన్న.. నింద తనమీద వేసుకుని అరెస్ట్ అయ్యాడని చెబుతాడు కార్తీక్. హాస్పటల్‌లో ఉన్నవాళ్లకి ఏమైనా జరిగితే అని కార్తీక్ కంగారుపడతాడు.
మనిద్దరికీ ఒకేసారి ఇలా జరిగింది.. మా అమ్మ గురించి బాధపడాలా? మావయ్యకి ఏం జరగదని నిన్ను ఓదార్చాలా అని బాధపడుతుంది దీప. అసలు దీనంతటికి కారణం నేనే.. ఫుడ్ ట్రక్స్ గురించి చెప్పింది నేనే కదా అని ఏడుస్తుంది. మావయ్యగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతుంది. మావయ్యని అరెస్ట్ చేశారని కాశీ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని బాధపడుతుంటాడు అని అంటుంది. శివన్నారాయణ ఒంటరిగా బాధపడుతుండగా ప్రభాకర్ అనే మేనేజర్ వచ్చి.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మన రెస్టారెంట్స్ మీద రైడ్ చేశారని, శాంపిల్స్ తీసుకుని ఫుడ్ కల్తీ కావడం నిజమేనని ధ్రువీకరించి భారీగా ఫైన్ వేశారని అంటాడు. ఆ మాటలతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది.
ఈ ఇంటి అల్లుడు నీ కూతురి జీవితాన్ని, నీ కంపెనీ భవిష్యత్తుని నాశనం చేశాడని పారిజాతం నానామాటలు అంటుంది. మా మామగారు అన్ని మోసాలు చేసేవారైతే పెద్దయ్య గారు.. ఎందుకు సీఈవోని చేస్తారని ప్రశ్నిస్తుంది దీప. హాస్పిటల్‌లో ఉన్న వారిలో ఎవరైనా పోతే.. కల్తీ ఆహారం పెట్టి మనుషుల్ని చంపినందుకు మీ నాన్నకి జీవిత ఖైదు పడుతుందని పారిజాతం అనడంతో కార్తీక్ కోప్పడతాడు. మావయ్య తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా? అని జ్యోత్స్న అడగటంతో శివన్నారాయణ లేదు అని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











