Karthika Deepam 2 January 1st: జైళ్లో కాశీ.. జ్యోత్స్నని లాగికొట్టిన పారిజాతం.. కార్తీక్‌పై పగబట్టిన వైరా
Photo Courtesy: JioHotstar
పోలీస్ స్టేషన్‌కు వెళ్లేదారిలో కారుని ఆపి జ్యోత్స్నకి క్లాస్ పీకుతాడు కార్తీక్. జరిగిన దాని వెనుక మొత్తం నీ కుట్ర ఉందని నాకు తెలుసని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నేనే అన్ని చేశానని ఆధారాలు నువ్వు చూపించగలవా? అని సవాల్ విసురుతుంది జ్యోత్స్న. నేను తలచుకుంటే అది నిమిషం పట్టదు.. కానీ నీకు ఏమైనా జరిగితే సుమిత్ర అత్త బాధపడుతుందని వదిలేస్తున్నానని అంటాడు కార్తీక్. జైలుకి వెళ్లి శ్రీధర్‌ని విడిపిస్తారు కార్తీక్, జ్యోత్స్న. జైలు నుంచి వస్తూ నిన్ను నేను కొడుకు అనుకున్నాను, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు.. నిన్ను జీవితంలో క్షమించనని కాశీతో అంటాడు శ్రీధర్.
పోలీస్ స్టేషన్ నుంచి శ్రీధర్ మాత్రమే రావడంతో కాశీ ఎక్కడ అని అడుగుతుంది పారిజాతం. కాశీ ఈ కేసులో నిందితుడని కార్తీక్ చెప్పడంతో వాడికి ఎవ్వరూ లేరు, దిక్కులేని వాడు.. వాడిని ఎవరు విడిపిస్తారని బాధపడుతుంది పారు. తన, మన అన్న ఇంగీతం లేకుండా మన కుటుంబానికి కాశీ ద్రోహం చేశాడని... ఇకపై ఇంటి గుమ్మం కూడా తొక్కనీయొద్దని శివన్నారాయణ మండిపడతాడు. కాశీని మావయ్య గారు కన్న తండ్రిలా దారిలో పెట్టాలని చూశారని కానీ ఆయనను మోసం చేశారని దీప బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 1వ తేదీ 556వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కాశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది పారిజాతం. నువ్వు చేసిన పాపాల పుట్ట ఎక్కడ బయటపడుతుందోనని నీ తమ్ముడిని బలిచేశావని మండిపడుతుంది. నేరం నిరూపించబడితే నా మనవడు జైలుకి వెళ్లాల్సిందే అంటుంది. అక్కడి వరకు నేను రానివ్వనని, నా తమ్ముడిని కాపాడుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. కార్తీక్ గాడు వాళ్ల నాన్నని నిర్దోషిగా నిరూపించి, పోయిన పరువుని తిరిగి తీసుకొచ్చాడు. కానీ నువ్వు సొంత తమ్ముడిని మోసం చేశావు.. వాడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జీవితమే లేకుండా చేశావని ఫైర్ అవుతుంది. నా తమ్ముడిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న.
కాశీని పోలీసులకు పట్టించింది కార్తీక్ బావ.. నేను చేసిన తప్పుల వల్ల దీపకి, కార్తీక్‌కి ప్రమాదం లేదు.. తండ్రిని కాపాడుకోవడానికి సొంత చెల్లెలి భర్తని అరెస్ట్ చేయించాడని చెబుతుంది జ్యోత్స్న. సీఈవో పోస్ట్ నుంచి మావయ్యని దించడానికి వైరాని ట్రాప్ చేశాను, తమ్ముడికి ఉద్యోగం ఇప్పించానని అంటుంది. ఆ వైరా ఇరుక్కుంటాడని అనుకుంటే బావ కారణంగా కాశీ గాడు కూడా జైలుకు వెళ్లాడని చెబుతుంది జ్యోత్స్న. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కాశీ గాడు రిలీజ్ కావాలని అంటుంది పారిజాతం. నాకు ఎలాంటి బంధాలు ఉండవు, ఏదైనా నా అవసరాల మేరకే అని అనుకుంటుంది జ్యోత్స్న.
జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్, కావేరి, స్వప్నలని ఇంటికి భోజనానికి పిలుస్తాడు కార్తీక్. అయితే ఇప్పటికైనా నాన్నని క్షమించాలని కాంచనని కార్తీక్ బ్రతిమలాడతాడు. మీ నాన్న మీ కోసం పారుని పెళ్లి చేసుకున్నాడు.. అలాగే నువ్వు కూడా నా కోసం మనసు మార్చుకోవాల్సిందే అంటాడు. ఆ మాటలతో కాంచన ఆలోచనలో పడుతుంది. ఇంతలో కావేరి, శ్రీధర్, స్వప్నలు ఇంటికొస్తారు. నేను అందరినీ బాధపెట్టానని స్వప్న ఏడుస్తుంది. కాశీ వల్ల అందరూ ఏడుస్తున్నారని.. నేను తొందరపాటుతో తీసుకున్న నిర్ణయంతో నా వల్ల నాన్న ఎప్పుడూ అవమనాలు పడుతూనే అంటుంది స్వప్న. నా భర్త ఏకంగా మావగారినే పోలీస్ స్టేషన్‌కి పంపించాడు, ఇన్నిరోజులు నాన్న, మీరు, మేం నరకం అనుభవించామని బాధపడుతుంది.
జీవితం విలువ కాశీకి తెలియదా? ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకు, నీకు, లేదా దీపకి చెబితే బాగుండేదని అంటాడు కార్తీక్. ఇంక అర్ధం చేసుకోవడానికి ఏం లేదని స్వప్న అనగా.. ఇకపై దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, వదిలేయమని చెబుతాడు కార్తీక్. ఇప్పటికే తాను చేసింది ఎంత పెద్ద తప్పు అనేది కాశీకి అర్ధమవుతుందని అంటాడు. అందరూ మాట్లాడుకుంటున్నా కాంచన- శ్రీధర్‌లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండటంతో కార్తీక్ బాధపడతాడు. అందరూ భోజనాల దగ్గరికి వెళ్తారు.
జైళ్లో వైరాని చూడటానికి అతని అసిస్టెంట్ వస్తాడు. నీ శత్రువుని నమ్మొద్దని చెప్పాను, ఏం చేయాలో నాకు తెలియదా అన్నావు అని మండిపడతాడు. అవసరాల కోసం నా దగ్గరికి వచ్చి నన్ను ముంచేశారని వైరా రగిలిపోతాడు. ఏ తప్పు చేయకపోయినా నేను నీతో జైళ్లో ఉన్నాను, టైం దాటిపోయాక రియలైజ్ అయ్యానని కాశీ బాధపడతాడు. దొరికిపోయాననే బాధ, మీ మావగారికి శిక్ష పడుంటే నువ్విలా మాట్లాడతావా అని ప్రశ్నిస్తాడు వైరా. నేను సెల్‌లో కూర్చోవడానికి ఎవరైతే కారణమో వాడిని కూడా ఇక్కడే కూర్చోబెడతానని సవాల్ చేస్తాడు. మా బావ జోలికి నువ్వు వెళ్లకపోవడమే మంచిదని అంటాడు కాశీ. ఇదే మాట నీ బావతో నువ్వు చెప్పేలా చేస్తానని చెబుతాడు వైరా.
నిద్రపోతుండగా సుమిత్ర కాలికి ఆయింట్‌మెంట్ రాస్తాడు దశరథ.. అది చూసిన సుమిత్ర బాధపడతుంది. భార్యాభర్తలు వేరు వేరు కాదు.. ఇద్దరూ ఒకటే అంటాడు దశరథ. ఇంతలో దశరథకు డాక్టర్ నుంచి ఫోన్ వస్తుంది. సుమిత్ర గారి రిపోర్ట్స్ వచ్చాయని రేపు ఓ స్పెషలిస్ట్ ఆసుపత్రికి వస్తున్నారని, మీరు ఒక్కరే వచ్చి ఆమెతో మాట్లాడాలని చెబుతారు డాక్టర్. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. కాంచన ఇంట్లో శ్రీధర్ కుటుంబం భోజనం చేస్తుండగా శ్రీధర్‌కు కాంచన అన్న మాటలే గుర్తొస్తాయి. అది గమనించిన కార్తీక్.. పిలిచి మాట్లాడతాడు. నీకు ఏం చెప్పాలో సందర్భం కోసం చూస్తున్నావా? అని అడుగుతాడు. మన ఫ్యామిలీ అంతా ఇలా కలిసి భోజనం చేయడం ఇదే మొదటి సారి అనుకుంటా అని అంటాడు కార్తీక్.
ఇది ఇలాగే ఉంటే చాలా బాగుంటుందని అంటాడు శ్రీధర్. కొడుకు - కోడలు ఉంటే సరిపోతుందా? కూతురు - అల్లుడు ఉండొద్దా అని కాంచన సీరియస్ అవుతుంది. ఇంక ఆ మనిషి గురించి మాట్లాడొద్దని తేల్చిచెబుతుంది స్వప్న. ఒక మనిషి తప్పు చేస్తే అతనిని జీవితాంతం క్షమించకూడదా అని అడుగుతుంది కాంచన. మనం పెట్టిన నమ్మకాన్ని మోసం చేసినవాడిని ఎలా క్షమిస్తామని అంటుంది స్వప్న. నీ చెల్లెలు ఏమందో విన్నావు కదా అని అడుగుతుంది కాంచన. తప్పు చేశాడు కాబట్టి.. స్వప్నకి కోపం వచ్చింది అంటాడు కార్తీక్. కాశీ తప్పు చేయడానికి కారణం మీరేనని శ్రీధర్‌పై మండిపడుతుంది కాంచన. వాడేదో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోయింది.. మళ్లీ వస్తుంది అంతేకానీ పీఏగా పెట్టుకుని ఎటు కదలకుండా చేసింది ఎవరు? అని కాంచన ప్రశ్నిస్తుంది. అల్లుడు తనకు నచ్చినట్లుగా ఉండాలని అనుకోవడం తప్పు అంటుంది కాంచన. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











