Karthika Deepam 2 January 13th: నిజం చెప్పకుండా దాస్‌ని అడ్డుకున్న కార్తీక్... విడాకుల దిశగా కాశీ - స్వప్న
Photo Courtesy: JioHotstar
సుమిత్రను చూస్తూ దశరథ బాధపడుతుంటాడు. ఆమెకు ఎలా నిజం చెప్పాలని కార్తీక్‌ను అడగ్గా... నిజం చెప్పడం కష్టం, దానిని గుండెల్లో మోయడం ఇంకా కష్టమని అంటాడు. ఆవిడ నాకు అత్త కాదు.. అమ్మ. అత్తను బతికించడానికి ఏమైనా చేస్తానని దశరథకు ధైర్యం చెబుతాడు కార్తీక్. నువ్వు వదిన నిండు నూరేళ్లు బతుకుతారని మనవళ్లు పుట్టడం, వాళ్ల ఎదుగుదలను కూడా చూస్తారని చెబుతంది కాంచన. మరోవైపు.. జ్యోత్న్స పుట్టుక గురించి నిజం బయటపుడుతుందని భయపడ్డ పారిజాతం... తన మనవరాలిని కాపాడేందుకు దాస్‌ని ఇంటికి పిలిపిస్తుంది.
సుమిత్ర అసలు కూతురు ఎక్కడుందో నీకు తెలిస్తే వెంటనే ఇంటికి తీసుకురమ్మని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు కూతురికి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి ఆమె ద్వారా సుమిత్రను బతికిద్దామని చెబుతుంది. ఇంతలో దీప వచ్చి దాస్‌కి కాఫీ ఇచ్చి.. జ్యోత్స్న, పారిజాతంలు ఏదో ప్లాన్ చేస్తున్నారని కార్తీక్‌కి చెబుతుంది. దాస్, జ్యోత్స్న, పారిజాతంలు మాట్లాడుకుంటూ ఉండగా శివన్నారాయణ రావడంతో ముగ్గురూ షాక్ అవుతారు. మీతో ఒక నిజం చెప్పాలని దాస్ అనడంతో కుటుంబం మొత్తాన్ని పిలుస్తాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 13వ తేదీ 566వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను మీకు ద్రోహం చేశాను... అది తెలిస్తే మీరు నన్ను క్షమించరని అంటాడు దాస్. అసలు నువ్వు ఎవరి గురించి చెప్పాలని అనుకున్నావని శివన్నారాయణ అడగ్గా... జ్యోత్స్న గురించి అంటాడు దాస్. మావయ్య నిజం చెప్పేసేలా ఉన్నాడు... ఎలా ఆపాలో అర్ధం కావడం లేదని కార్తీక్ టెన్షన్ పడతాడు. అటు దశరథ కూడా దాస్‌ని జ్యోత్స్న చంపాలనుకున్న విషయం చెబుతాడేమోనని భయపడతాడు. దాస్ ఏదో చెప్పడానికి భయపడుతున్నాడు... తనని పక్కకి తీసుకెళ్లి మాట్లాడతానని అంటాడు దశరథ. కాశీ, జ్యోత్స్నలు నా సంతానమే అని చెప్పబోతుండగా కార్తీక్ అడ్డుపడి... కాశీకి బెయిల్ ఇప్పించడానికి జ్యోత్స్న సాయం తీసుకున్నానని అంటున్నావా అని కవర్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.
నీ కొడుకు చేసిన తప్పుకి వాడిని జీవితంలో క్షమించకూడదని అనుకున్నాను... కానీ నీ ముఖం చూసి వాడిని వదిలేస్తున్నానని అంటాడు శివన్నారాయణ. వెంటనే శ్రీధర్‌తో మాట్లాడి ఏం చేయాలో ఆలోచించు అని దశరథతో చెబుతాడు పెద్దాయన. మీకు చెడు చేయాలని అనుకున్నవాళ్లకి కూడా మంచే చేయాలని గొప్ప మనసు మీకుందని దాస్ అంటాడు. గండం గడిచినందుకు జ్యోత్స్న, పారులు ఊపిరి పీల్చుకుంటారు. నేను పక్కనే ఉన్నాను.. వద్దు అని అంటున్నా నిజం చెప్పొద్దని ఆపుతున్నా అసలు నిజం పెద్దాయనకే చెప్పాలని ఎందుకు అనుకుంటున్నావని దాస్‌పై కార్తీక్ మండిపడతాడు. తాత వేరే బాధలో ఉండి నీ మాటల్ని సరిగా పట్టించుకోలేదు.. లేదంటే దీపే నీ మనవరాలని నువ్వు చెప్పేలా చేసేవాడని అంటాడు కార్తీక్.
దీప ఎవరో తెలియాలని కోరుకున్నది నేను కాదు.. మా అమ్మ అని దాస్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. సుమిత్ర వదినను బతికించాలంటే అసలైన వారసురాలు ఉండాలి కదా? జ్యోత్స్న దశరథ అన్నయ్య కూతురు కాదన్న నిజం బయటకు రాకూడదంటే అసలైన కూతురిని వెతికి తీసుకురమ్మని మా అమ్మ నాతో చెప్పిందని అంటాడు దాస్. శివన్నారాయణ గారి మనవరాలు జ్యోత్స్నే అని నీకు తెలుసు, నాకు తెలుసు, దీపకి తెలుసు, జ్యోత్స్నకి తెలుసు.. కానీ మా అమ్మకి తెలియదు కదా? అని దాస్ అంటాడు. నువ్వు వచ్చావని పారుతో మాట్లాడుతున్నావని దీపే చెప్పిందని అంటాడు కార్తీక్. సుమిత్ర వదిన బతకాలంటే నిజం చెప్పాలని దాస్ అంటాడు.. కానీ చెప్పే విధానం ఇది కాదని చెబుతాడు కార్తీక్.
అత్తకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం అత్తకే ఇప్పటి వరకు తెలియదు. దానిని చెప్పే ధైర్యం ఇంట్లో వాళ్లకి లేదు. దానిని పాజిటివ్‌గా తీసుకునేంత ధైర్యం ఇంట్లో వాళ్లకి లేదు. నేను నీ కూతురిని కాదని జ్యోత్స్న చెప్పలేదు.. నేనే కూతురిని అని దీప చెప్పలేదు. బోన్‌మారో ట్రీట్‌మెంట్ చేయాలంటే దీపతోనే సాధ్యమని అంటాడు కార్తీక్. అప్పుడు దీపే కూతురని చెప్పాలి కదా? అని అంటాడు దాస్. దానికి సమయం సందర్భం రావాలని చెబుతాడు కార్తీక్. ఎప్పుడు ఏం చేయాలో నాకంటే నీకు బాగా తెలుసు... అనవసరంగా తొందరపడ్డానని కార్తీక్‌కి క్షమాపణలు చెబుతాడు దాస్. మా అమ్మకి ఏదో ఒక అబద్ధం చెబుతానని వెళ్లిపోతాడు. దాస్, కార్తీక్‌లు ఏం మాట్లాడుకున్నారో అర్ధం కాక పైనుంచి చూస్తుంది జ్యోత్స్న.
కాశీని విడిపించి ఇంటికి తీసుకొస్తాడు శ్రీధర్. భర్తని చూడగానే కోపంతో రగిలిపోతుంది స్వప్న. కాశీని గుమ్మంలోనే ఆగమంటూ మండిపడుతుంది. ఈ మనిషిని మనింటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఈ మనిషిని ఎందుకు విడుదల చేయించావని ఫైర్ అవుతుంది. ఎన్నిసార్లు సరిద్దుకునే అవకాశం ఇస్తావని సీరియస్ అవుతుంది. నువ్వు మంచోడివి కాబట్టే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టాడు. నువ్వు తప్పు చేశావని సాక్ష్యం చెప్పాడు. ఇతనిని ఇంట్లో పెట్టుకోవడమే నువ్వు చేసిన అతిపెద్ద తప్పు.. అక్కడితో వదిలేయకుండా పీఏగా పెట్టుకున్నావు, అన్నింటికి ఒకేసారి కృతజ్ఞత చూపించాడని నానామాటలు అంటుంది స్వప్న.
కాశీ చేసింది తప్పుకాదు.. మోసం, ద్రోహమని అంటుంది స్వప్న. ఒక మనిషిని ఇన్నిసార్లు క్షమించాలని లేదు కదా అని అంటుంది. అయితే నువ్వు నా కొడుక్కి ఏ శిక్ష వేయాలని అనుకుంటున్నావో వేయమని అంటాడు దాస్. ఇలాంటి వాళ్లకి ఒక్కటే శిక్ష... విడాకులు తీసుకోవడం అని స్వప్న చెప్పగానే అంతా షాక్ అవుతారు. ఈ మోసగాడితో నేను కలిసి బతకలేనని స్వప్న అనగా... నువ్వు మాత్రం నన్ను అర్ధం చేసుకున్నావా? అని ప్రశ్నిస్తాడు కాశీ. అందుకేనా వెళ్లి జ్యోత్స్నతో చేతులు కలిపావని స్వప్న అనగా.. దాస్ షాక్ అవుతాడు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని కూతురికి వార్నింగ్ ఇస్తాడు శ్రీధర్. ఈ మనిషి ఈ ఇంట్లో ఉంటే నేను మా అన్నయ్య ఇంటికి పోతానని తేల్చిచెబుతుంది స్వప్న.
కన్న కొడుకులా చూసుకున్న మామగారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి... భార్య నమ్మకాన్ని నిలువునా ముంచేసిన వ్యక్తి... ఇలాంటి మనిషిని ఎందుకు క్షమించాలని నిలదీస్తుంది స్వప్న. నువ్వు చెప్పినట్లుగానే వెళ్లిపోతాను, నా విలువ ఏంటో నీకు తర్వాత అర్ధమవుతుందని కోపంగా వెళ్లిపోతాడు కాశీ. మీరు క్షమించినా నేను అతనిని క్షమించనని వెళ్లిపోతుంది స్వప్న. చేసుకున్న పాపం ఇలా నన్ను వెంటాడుతోంది. ఒక ఆడదానిని నేను మోసం చేసినందుకు నా కూతురిని మరొకడు మోసం చేశాడని అంటాడు శ్రీధర్. మరోవైపు... నేను చెప్పేవరకు నువ్వు మా పుట్టింటికి వెళ్లొద్దని కాంచన అనడంతో దీప షాక్ అవుతుంది. ఆ ఇంట్లో వాళ్ల పరిస్ధితులు, మనుషులు బాలేదు... నన్నేం అనలేక, నా కొడుకుని ఏం చేయలేక ఈ కోపమంతా నీ మీద చూపిస్తుందని కాంచన హెచ్చరిస్తుంది.
అందరూ బాగున్నప్పుడు వెళ్లొద్దని అన్నా.. మీ మాట వినేదానిని. కానీ ఇప్పుడు ఆ ఇంటికి నా అవసరం ఉందని నేను వెళ్లాల్సిందేనని చెబుతుంది దీప. నువ్వు ఏమైనా ఆ ఇంటికి వారసురాలివా? లేదా సుమిత్ర వదిన నీ కన్నతల్లి అనుకుంటున్నావా? అని నిలదీస్తుంది కాంచన. సుమిత్రమ్మ నా కన్నతల్లే... ఆమెకు ఆరోగ్యం బాలేదని తెలిసినప్పటి నుంచి ఆ ఇంట్లోవాళ్లు ఏం తినడం లేదు, తాగడం లేదని అంటుంది దీప. అన్నం పెట్టిన మనుషుల్ని, ఆశీర్వదించిన చేతుల్ని నేను మరిచిపోనని చెబుతుంది దీప. ఇంతలో శౌర్య వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తుంది.. ఏదో రుణం తీర్చుకుంటానని అంటోంది.. అంటే ఏంటని ప్రశ్నిస్తుంది. మా అమ్మకి హెల్త్ బాలేదు కాబట్టి ఆమెను చూసుకోవడం రుణం తీర్చుకోవడం అంటాడు. అయితే ఈసారి నువ్వు ఉల్లిపాయలు కోసినప్పుడు సాయం చేసి నీ రుణం తీర్చుకుంటానని అంటుంది శౌర్య. ఈ పోలిక దీపకి, సుమిత్ర వదినకి సరిపోవడం లేదని కాంచన అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











